My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, September 15, 2009

ఇంటిపోరు

చెప్పులోని రాయి చెవిలోన జోరీగ... కంటిలోని నలుసు కాలి ముల్లు... ఇంటిలోని పోరు ఇంతింతకాదయా... అన్నాడు యోగి వేమన. గృహహింస అనేది స్త్రీలకే పరిమితం కాదని, లోకంలో భార్యాబాధితులూ ఎక్కువేనని గ్రహించిన విజ్ఞుడాయన. ఎటొచ్చీ పురుషులు అంతగా బయటపడరు. ఈ విషయంలో లోకం తీరూ చిత్రమైనదే! భర్త హింసిస్తున్నాడంటే 'అయ్యోపాపం' అంటూ సానుభూతి చూపిస్తుంది గాని, భార్య కొడుతోందంటే మాత్రం లోకానికి అది వినోదం. గజని చిత్రంలో అంధుణ్ని రోడ్డు దాటిస్తున్న అసిన్‌ దారిలో మొగుణ్ని కొట్టే భార్యను చూపిస్తూ పకపక నవ్వుతుంది. అదీ లోకం తీరు! వియ్యానికి వ్యతిరేక పదం కయ్యం. అయినదానికీ కానిదానికీ కయ్యానికి కాలుదువ్వే ఇల్లాలిని గయ్యాళి అంటారు. గయ్యాళి భార్యలు భర్తలకు నరకం చూపిస్తారు. నరకహింసల గురించి పురాణాల్లో చెప్పగా విని, నరకంలో ఉద్యోగాలకు భార్యలనే తీసుకుంటారు కాబోలు అనుకున్నాడొక భార్యాబాధితుడు. జైమినీ భారతంలో ఉద్దాలకుడి భార్య చండిక పరమగయ్యాళి. భర్త ఏం చెబితే దానికి సరిగ్గా వ్యతిరేకంగా చేయడం ఆమె నైజం. ఉద్దాలకుడు దానికో ఉపాయాన్ని ఆలోచించాడు. తండ్రి తద్దినంనాడు భార్యను స్నానం చేయకుండా అశుచివై వంట చేసి పెట్టమన్నాడు. దానికి విరుద్ధంగా ఆవిడ వేకువనే లేచి తలారా స్నానంచేసి మడిగా వండి వార్చింది. చివరికంటా తన పాచిక పారేసరికి ఉద్దాలకుడు ఉప్పొంగిపోయి, ఆ మైకంలో 'పారణం జాగ్రత్త' అన్నాడు. అంతే! చండిక వెంటనే దాన్ని పెంటమీద పారేసింది. ఉద్దాలకుడు కోపం తట్టుకోలేక 'వింధ్యాటవిలో రాయివై పడుండు' అని భార్యను శపించాడు.

శపించడం రాని భార్యాబాధితులు శాపనార్థాలతో సరిపెడతారు. రాముణ్ని అడవికి పంపిందని కైకను దశరథుడు ఎన్నో శాపనార్థాలు పెట్టాడు. అవీ తెలియని సోక్రటీస్‌ లాంటివాళ్లూ ఉంటారు. గయ్యాళి భార్యలు పెట్టే బాధలను పంటిబిగువన సహిస్తారు. దెబ్బలు తిన్నవాడు భోరున ఏడిస్తే కొట్టినవాడికి అదో తృప్తి. సోక్రటీస్‌ నిర్లిప్తత చూసి ఒళ్ళు మండిన ఇల్లాలు తిట్టితిట్టి చివరికి భర్తపై భళ్ళున నీళ్ళు గుమ్మరించింది. అప్పటికీ సోక్రటీస్‌కు కోపం రాలేదు సరికదా, 'అంతగా ఉరిమిన మేఘం ఆ మాత్రం వర్షించడం సహజమే కదా!' అన్నాడు. ఇదే సిద్ధాంతాన్ని జీవితాంతం పాటించిన ఒకాయన తన భార్య అంత్యక్రియలు ముగించి ఇల్లు చేరుతూనే ఉరుములు మెరుపులతో హోరున వర్షం కురవడం చూసి 'అబ్బో మా ఆవిడ అప్పుడే అక్కడికి చేరుకుంది' అని గాఢంగా నిట్టూర్చాడు. గయ్యాళి గురుపత్ని పట్ల గురువు చూపించే మెతకవైఖరి నచ్చక శిష్యుడు 'విద్యలపై ఇంతటి గట్టి పట్టు సాధించారుగాని ఆవిడపై అదుపు సాధించలేకపోయారేమి?' అని ప్రశ్నించాడు. 'నీకూ పెళ్ళయి, అనుభవం వచ్చాక తెలుస్తుంది' అన్నాడు గురువు. ఖర్మకాలి శిష్యుడికీ మరో గయ్యాళే భార్యగా వచ్చింది. ఓరోజు తమ ఇంటికి గురువు భోజనానికి వస్తున్నాడని ముందే భార్య కాళ్ళపైపడి శిష్యుడు ఒక ఒప్పందం కుదిర్చాడు. ఆ ఒక్కరోజు తానెంత అధికారం చలాయించినా, నోటికొచ్చినట్లు తిట్టినా పట్టించుకోరాదని ప్రాధేయపడ్డాడు. ఏ కళనుందో ఆవిడ దానికి ఒప్పుకొంది. అయితే తిట్లు వందకు మించరాదని షరతు పెట్టింది. భార్యను బండతిట్లు తిట్టడంలో లభించే అలౌకిక అద్భుత ఆనందం తొలిసారిగా రుచి చూస్తున్నాడేమో- శిష్యుడు లెక్క మరిచిపోయాడు. తిట్లు వంద దాటేశాయి. మరుగుతున్న పులుసుకుండ అతని నెత్తిన ఫెళ్ళుమని పగిలింది. సంస్కృతంలో ఇది ప్రసిద్ధమైన చాటువు. అంతా చూశాక గురువు 'నా నెత్తినా ఇలా ఎన్నో కుండలు పగిలాయి కాని... పగలగొట్టిన కుండకు ఖరీదు కట్టి 'ఇస్తావా చస్తావా' అని ఎదురుపేచీకి దిగడం మాత్రం- నీ భార్యకే చెల్లిందిరా అబ్బాయ్‌' అనడం కొసమెరుపు.

మనిషి మెదడుపై గట్టిగా పరిశోధనలు చేసిన డాక్టర్‌ రోజర్‌స్పెర్రీ కుడి ఎడమ భాగాల గురించి వివరించాడు. ఎడమ భాగం- కార్యశీలి, కుడి మెదడు- స్వప్నశీలి. ఆ రెంటినీ 'కార్పస్‌ కెల్లోసమ్‌' అనే నరాల సముదాయం సమన్వయం చేస్తోందని ఆయన సిద్ధాంతీకరించాడు. ఆ రెండింటి ప్రవృత్తులు, ఆలోచనలు, ప్రేరణలు, స్వభావాలు వేరువేరని నిరూపించాడు. ఏది ఎక్కువ ప్రభావశీలమైందో- మనిషి ఆ రకంగా రూపొందుతాడన్నది దాని సారాంశం. 'యుకెన్‌ హీల్‌ యువర్‌ లైఫ్‌' రచయిత లూయీ హే 'నీ ఆలోచనల ప్రతిబింబమే నీవు' అన్న ప్రతిపాదనకు స్పెర్రీ సిద్ధాంతం ప్రేరణగా చెబుతారు. స్త్రీ పురుష ప్రకృతులనేవి మెదడులోని కుడి ఎడమ భాగాల్లాంటివి. వాటిలో వైరుధ్యం సహజం! మెదడులో భాగాలను కార్పస్‌ కెల్లోసమ్‌ సమన్వయం చేసినట్లు, ఆలుమగల మధ్య వైరుధ్యాన్ని మాంగల్యబంధం సమన్వయిస్తుంది. మెదడులో సమన్వయం కుదిరితే, వ్యక్తిత్వానికి పరిపూర్ణత దక్కుతుంది. మాంగల్యబంధానికి విలువ లభిస్తే, దాంపత్య జీవితానికి శోభ చేకూరుతుంది. భారతీయ వివాహ వ్యవస్థకు మాంగల్యబంధమే పునాది. మెదడులోని కుడి ఎడమ భాగాల్లో ఏదీ ఎక్కువకాదు, ఏదీ తక్కువకాదు. దేని పాత్ర దానిదే. ఆలుమగల విషయమూ అంతే! 'నేను అధికం' అనుకోవడం వల్లే పేచీ. ఆధిక్య భావనే ఘర్షణకు కారణమై గృహహింసకు నాంది అవుతుంది. దీన్ని అర్థం చేసుకున్న దంపతులు ధన్యులు. వారి కాపురం అనురాగ గోపురం అవుతుంది. లేదంటే, కలహాల స్థావరం అవుతుంది. 'ఇన్నాళ్ళూ స్త్రీల వాదనే విన్నారు, ఇప్పుడు మా గోడు వినండి' అని భార్యాబాధితుల సంఘ ప్రతినిధులు కోరుతున్నారు. దేశ స్వాతంత్య్రం రోజున సిమ్లాలో సమావేశమై వారంతా బాధిత భర్తల స్వేచ్ఛ గౌరవాల విషయం చర్చించబోతున్నారు. 'పురుషులపై క్రమంగా పెరిగిపోతున్న హింస విషయం లోకానికి ఎలుగెత్తి చాటాలన్నది మా లక్ష్యం' అంటున్నారు నిర్వాహకులు. సుమారు 30వేలమంది సమావేశమై సిమ్లాలో ఏం తీర్మానించబోతున్నారో చూద్దాం!
(ఈనాడు, సంపాదకీయం, 09:08:2009)
___________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home