My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, September 05, 2009

ఆచార్యదేవోభవ!


నేడు ఉపాధ్యాయ దినోత్సవం
- కర్లపాలెం హనుమంతరావు

'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా. యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు.

రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది. అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నాడు.

గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా
చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు. క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు. కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా.

మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు. పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది!

నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు.ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు. బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది. 'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

గురువులు అష్టవిధాలు.
అక్షరాభ్యాసం చేయించినవాడు, గాయత్రి ఉపదేశించినవాడు, వేదాధ్యయనం చేయించినవాడు, శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు, పురోగతి కోరేవాడు, మతాది సంప్రదాయాన్ని నేర్పేవాడు, మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు, మోక్షమార్గాన్ని చూపించేవాడు
అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు. దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.
(ఈనాడు, ౦౫:౦౯:౨౦౦౯)
____________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home