My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, September 13, 2009

అందం చూడవయా...


ఇప్పుడంటే చంద్రుడి అసలు స్వరూపం తెలిసిపోయి కాస్త వెనక్కు తగ్గారుగాని, పూర్వకాలంలో అందం ప్రసక్తి వచ్చేసరికి కవులంతా చంద్రుడితో పోలిక తెచ్చేవారు. పసిపిల్లవాడైతే 'చందురుని మించు అందమొలికించు బుజ్జిపాపాయి'. అదే ప్రియురాలు అయితే 'చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా...' అన్న ధోరణిలో పొగడ్తలు, 'ఇందువదన కుందరదన...' అంటూ ప్రణయగీతాలు! అందమైన స్త్రీ ముఖానికి పోలిక విషయంలో చంద్రుడి తరవాతి స్థానం పద్మాలది. అలా వర్ణించిన కవుల్లో నన్నెచోడుడు అద్వితీయుడు. హేమంతరుతువులో దట్టమైన మంచు కారణంగా పద్మాలన్నీ అంతరించిపోయాయి. కొలను మధ్యలో ఒకేఒక్కటి కనిపిస్తోంది. అదైనా- పద్మాల జాతి అంతరించి పోకుండా నిలపడంకోసం సరోవరమే విత్తనంలా ఒక్కదాన్ని దాచిపెట్టి ఉంచిందేమో అన్నట్లుగా ఉంది- అన్నాడు కుమారసంభవంలో! ఇంతకీ అది పద్మంకాదు- శివుడికోసం చన్నీటి సరస్సులో పీకలోతు మునిగి తీవ్రంగా తపస్సు చేస్తున్న పార్వతీదేవి ముఖం! మెడవరకూ దేహమంతా నీటిలో మునిగి ఉండగా పైకి కనపడుతున్న పార్వతి మొహం పద్మంలా ఉందన్నది అసలు విషయం. ఉత్ప్రేక్ష అలంకారానికి ఇది ఉదాత్తమైన ఉదాహరణ. అందమైన కళ్ళనూ పద్మాలతో పోల్చే ఆనవాయితీ ఉండేది. శ్రీమహావిష్ణువును పుండరీకాక్షుడు అనడం పరిపాటి. పుండరీకమంటే ఎర్రకలువ. తెల్లకలువను ఉత్పలం అంటారు. ఎర్రకలువ రేకుల అంచుల్లో మెరుపులాంటి ఎర్రని ఛాయ ఉంటుంది. విష్ణువు కనుకొలకుల్లోనూ ఎర్రని జీరలుంటాయి. ఈ ఎరుపు పురుషుడికి భాగ్య చిహ్నం. లక్ష్మీదేవి కళ్ళు తేటగా స్వచ్ఛంగా ఉంటాయి కనుక అవి ఉత్పలాలు. శరదృతువులో యోగనిద్ర నుంచి ఆ పురాణ దంపతులు మేలుకొని కళ్ళు తెరవగానే కలువలూ తామరలూ ఒకేసారి వికసించాయని నన్నెచోడుడు చమత్కరించాడు. శరత్కాలంలో ఆ రెండూ పూస్తాయి కదా మరి...

అందమంటే నిజానికి స్త్రీదే! ప్రతి అవయవంలోనూ అందం తొంగిచూడటం, ప్రతి కదలికలోనూ సొగసు తొణికిసలాడటం స్త్రీలకు సహజం. అందువల్లనే మన కవులు స్త్రీల అంగాంగాలను నఖశిఖపర్యంతం వర్ణిస్తూ వచ్చారు. మగువలను ఆకట్టుకోవడానికి పురుషుడికి అదొక సాధనంగానూ చెప్పారు. సత్యభామ అలకను మాన్పడానికి నల్లత్రాచులా మెలికలు తిరిగిన ఆమె పొడవైన శిరోజాలను పొగడుతూ 'అరాళకుంతలా' అని కృష్ణుడు సంబోధించాడని నందితిమ్మన చెప్పాడు. నుదురును అయితే అర్ధచంద్రుడితో పోలుస్తారు. సుభద్ర 'నెన్నుదురును- అరచందమామను ఏలినదొరగా నెన్నుదురు(ఎంపికచేస్తారు)' అని చేమకూర కవి రెండర్థాల ప్రయోగాన్ని విసిరాడు. ఇక కనురెప్పలైతే తుమ్మెద రెక్కలు. (ఆ సోగకనుల రెప్పలలో తుమ్మెదలాడేనా... కృష్ణశాస్త్రి) నాసికకు నాగేటిచాలుతోను, సంపెంగ పూలతోనూ పోలిక. నాగలికి అడుగుభాగాన ఉబ్బెత్తుగా ఉండి మొనదేరిన ఇనుపకర్రును కోటేరు అంటారు. కోటేరులాంటి ముక్కుతో నాయిక యువకుల హృదయక్షేత్రాలను దున్ని వలపులు పండిస్తోందన్నాడు తెనాలి రామకృష్ణుడు. ముక్కుకొన కాసింత పైకి తొంగిచూస్తే- అది అచ్చం సంపెంగరేకే అంటారు కవులు. ఇక అధరాల విషయానికి వస్తే వాటిని బంధూక పుష్పాలతో పోల్చారు. వాటికే మంకెన పూలని మరోపేరు. ఎర్రగా మృదువుగా ఉండి, మకరందాన్ని చిప్పిల్లుతూ ఉంటాయి. మగువల పెదవులూ అంతేగా! కనుక మంకెనలతో పోలిక. కాస్త కిందకి దిగితేకంఠం. దానికి శంఖంతో పోలిక. మరికాస్త దిగువకు వస్తే పట్టపగ్గాలు లేని అందాలు. 'కడు హెచ్చుకొప్పు... దానిన్‌ గడవన్‌ చనుదోయి హెచ్చు... 'కటి' అన్నిటికిన్‌ కడుహెచ్చు...' అంటూ వాటి వాటి ఔన్నత్యాలను వర్ణించిన చేమకూర వేంకట కవి- 'నడుమే పసలేదుగాని నారీమణికిన్‌' అని తేల్చాడు చివరిలో. కొప్పు వక్షోజాలు పిరుదులు అంత ఘనంగా ఉండే పడతికి- ఉందాలేదా అన్నట్లుగా నడుము నాసిగా ఉండటమే నిజానికి గొప్ప అందం.

'కవులు చమత్కారులు... వారివి అతిశయోక్తులు... కవిత్వం అంటేనే అబద్ధ'మని తిరుపతి వేంకటకవులు ఏనాడో చెప్పారు. 'కవులు వర్ణించే అందాలు మాకెక్కడివి?' అని నేటి స్త్రీలు నిరాశపడవలసిన పనిలేదంటున్నారు- సామాజిక శాస్త్రవేత్తలు. ప్రబంధ గ్రంథాల అందాలు స్త్రీలలో కనుమరుగు కావడంలేదు సరికదా, రెట్టింపు అవుతున్నాయని రెట్టించి మరీ చెబుతున్నారు. మనిషి పరిణామక్రమంలో ఆధునిక మహిళ క్రమంగా అద్భుత సౌందర్యరాశిగా రూపొందుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. హెల్సింకీ విశ్వవిద్యాలయానికి చెందిన మార్కస్‌ జోకెలా బృందం నాలుగు దశాబ్దాలుగా వేలమంది స్త్రీ, పురుషులపై నిర్వహించిన అధ్యయనంలో- పడతుల్లో అందం క్రమేపీ పెరుగుతోందని రుజువైంది. అందగత్తెలకు ఎక్కువగా ఆడపిల్లలే పుట్టి, వారు మరింత అందంగా తయారవుతున్నారట. అందగత్తెల పోటీల్లో ఒక్కరినే తేల్చి చెప్పడం అందుకే పెద్ద సమస్యగా మారి- చిరునవ్వుల చెలి, బికినీల భామ, జఘనాల జాణ అంటూ వివిధ విభాగాలు మొదలయ్యాయి. ప్రాకృత గాథల్లో హాలుడు ఒక సొగసైన సంగతి చెబుతూ 'ఈ రమణి సోయగాలలో మొదట దేనిపై కన్నుపడితే దానిమీదే కన్నార్పనీయకుండా చూపు స్థిరపడిపోతోంది... అందాలన్నింటినీ మొత్తంగా పరామర్శించడం ఎప్పటికీ కుదిరేలా లేదు' అన్నాడు. అలా అన్నింటా అతిలోక సౌందర్యం ఉట్టిపడుతూ అతివలు కళ్ళకు అడ్డం పడుతుంటే ఒక్కరినే ఎంచుకోవడం కష్టమే మరి! అందుకే పోటీల్లో అన్ని విభాగాలు పుట్టుకొచ్చాయి అనుకోవాలి.
(ఈనాడు, సంపాదకీయం, ౦౨:౦౮:౨౦౦౯)
________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home