My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, September 05, 2009

దణ్నం దశగుణం భవేత్‌!


- కర్లపాలెం హనుమంతరావు
'గుడ్‌ మార్నింగ్‌ ఇండియా!' అంటుంది పొద్దున్నే ఎఫ్‌ఎమ్‌ రేడియో. 'వందేమాతరం' అని పాడుతుంది అంతకు ముందుగానే ఆకాశవాణి. ఏ పనినైనా 'ఓనమశ్శివాయ!' అంటూ ప్రారంభించడం మన సనాతనాచారం. సంధ్యావందనం చేయనిదే దినచర్య ఆరంభించేవాళ్ళు కాదు మన పూర్వీకులు! 'వన్దేమన్దారు మన్దారమన్దిరానన్దకన్దలమ్‌' అంటూ ఆది శంకరులు కనకధారాస్తవం ఆలపించగానే కనకవర్షం కురిసిందని ఓ గాథ. సరస్వతీ నమస్తుభ్యమ్‌ అన్నా, అస్సలాం లేకుం అన్నా, సత్‌శ్రీఅకాల్‌ అన్నా, ఆమెన్‌ అన్నా... అన్నీ ఆ భగవానుడికి వివిధ రూపాల్లో భక్తుడు చేసే నమస్కారాలే గదా!

ఏ పుట్టలో ఏ పాముందోనని చెట్టుకూ పుట్టకూ కూడా నమస్కారాలు చేస్తుంటాం మనం. రోడ్డుకు నమస్కారం చేశాడో కవి. ఈ దండాన్ని కనిపెట్టిన వాడెవడోగానీ గడుసు పిండమే... వాడికో దండం!

అణుబాంబులు, ఆ బాంబులూ ఈ బాంబులూ అంటూ అగ్రరాజ్యాలు ఊరికే హడావుడి చేసేస్తుంటాయిగానీ- నమస్కార బాణాన్ని మించిన ఆయుధం ప్రపంచం మొత్తంలో ఏదీ లేదు. ఇంగ్లిషువాడు హలో అన్నా, చైనావాడు లెయ్‌వో అన్నా, జపానువాడు ముక్కు పట్టుకుని ముందుకు వంగి ముక్కినా, జర్మనీవాడు కుడిచెయ్యి గాల్లోకెత్తి ఊపినా, కాంగోవాడు మాంబో అన్నా, ఫ్రెంచివాడు శాల్యూట్‌ కొట్టినా, ఇంగ్లాండ్‌వాడు టోపీ గాల్లోకెత్తి చూపెట్టినా... అవన్నీ ఎదుటివాడిని పడగొట్టడానికి ప్రయోగించే శక్తిమంతమైన ఆయుధాలే!

మన దేశంలోనే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నమస్కారాలు చేస్తుంటారు. రాజస్థాన్‌లో 'రాంరాం' అంటే, గుజరాత్‌లో 'కెమ్‌చె' అంటారు. బెంగాల్లో నమష్కార్‌ అంటే తమిళనాట 'వణక్కం' అంటారు. చేతులు కలుపుకోవటం, గుప్పెట్లు గుద్దుకోవటం 'హాయ్‌ ఫై' చెప్పుకోవటం ఈతరం కుర్రకారు నమస్కారం. ఈ మధ్యే ప్రసిద్ధికెక్కిన రెహమాన్‌ 'జయహో' కూడా ప్రపంచానికి మనదేశం పెట్టే కొత్తరకం నమస్కారమే! నమస్కారం మన సంస్కారం. ఉత్తరాది వైపైతే పెద్దవాళ్ళ పాదాలకు వంగొంగి నమస్కారాలు పెట్టాలి. నడుముకు మంచి వ్యాయామం.

ఈ దండాలు పెట్టడంలో తెలుగువాడేమీ తీసిపోలేదు. 'దండమయా విశ్వంభర, దండమయా పుండరీక దళనేత్రహరీ, దండమయా కరుణానిధి దండమయా నీకునెపుడు దండము కృష్ణా!' అంటూ ఆ దేవుడిమీద అదేపనిగా ఐదేసిసార్లు దండ ప్రయోగాలెందుకు చేశాడో తెలుసాండీ? దండమనేదాన్ని ఇలా వచ్చి అలా ఒకసారి పెట్టేసి పోయేదానికన్నా పదేపదే ప్రయోగిస్తూ ఉండాలి. అదీ పనున్నప్పుడే కాదు సుమా... ఎప్పుడూ సంధిస్తూంటేనే ఏ పనైనా సజావుగా సాగేదని ధ్వనించడానికన్నమాట. వేడిమీదున్న వాడిని చల్లబరచేదీ, విడిపోదామనుకునేవాళ్ళను కలపగలిగేదీ కూడా ఈ నమస్కారమే సార్‌! మొన్నటి ఎన్నికల్లో అమ్మలక్కలకు అందరికన్నా ఎక్కువగా దండాలు పెట్టాడు గనకనే మన సీయం మళ్ళీ సీయం కాగలిగాడని ఓ వర్గం అభిప్రాయం.

అన్ని దండాలూ ఒకేలా ఉండవు. 'దండం దశ గుణం భవేత్‌' అని సంస్కృతంలో అన్నది ఈ దండాన్ని గురించి కాకపోయినా, దీనికీ వర్తిస్తుంది. రెండు చేతులూ జోడించి గుండెల మీద పెట్టుకుంటే పెద్దలకు పెట్టినట్లు, నెత్తిమీద పెట్టుకుంటే దేవుడికి పెట్టినట్లు. నుదురు నేలను తాకినట్లు వంగితే అల్లాకు పెట్టినట్లు. మోకాలి మీద వంగితే బుద్ధ భగవానుడికి పెట్టినట్లు. క్రాసు చేసుకుంటే యేసుకు పెట్టినట్లు. తలొంచుకుని మౌనంగా నిలబడితే చనిపోయినవారి ఆత్మలకు పెట్టినట్లు. భజన చేస్తూ ఎగిరెగిరి పెడితే గిడిగీలు పెట్టినట్లు. గోత్రనామాలు చెబుతూ పెడితే ఏటికోళ్ళు.... బొక్కబోర్లా పెడితే సాష్టాంగ ప్రణామాలు, పొర్లుతూ పెడితే పొర్లుదండాలు... ఇవికాక ఇంకా టెంకణాలు, జాగిలీలు, గొబ్బిళ్ళు- అబ్బో... సూర్య నమస్కారాలకన్నా ఎక్కువే లెక్క తేలతాయి ఈ నమస్కారాలు! ఇన్ని దండాలుండంగా ఎందుకో మనిషి మరి 'దండా'నే ఎక్కువ నమ్ముకుంటున్నాడు?!

దండాలు పెడితే లాభమా లేదా అనే మీమాంస మాట అటుంచి, అసలు పెట్టకపోతే అసలుకే మోసం వచ్చే సందర్భాలు మనబోటి మామూలు మనుషుల జీవితాల్లో మాటిమాటికీ వస్తుంటాయి. పనిలో మనమెంత తలమునకలుగాఉన్నా పైఅధికారి కనపడగానే లేచి విష్‌ చేయకపోతే మనపని ఫినిష్‌! అందుకే అనేది- ఉద్యోగులకు నమస్కారం అనేది తప్పనిసరిగా అభ్యాసం చేయాల్సిన యోగం. ఈ హస్తకళలో ప్రావీణ్యం సంపాదించినవాడిని దండకారణ్యంలో పారేసినా 'దండు'కుని మరీ తిరిగి రాగలడు. దండాలు స్వామీ అంటే, ముందు నీ తండ్రి బాకీ తీర్చు అనేవాళ్ళూ ఉంటారు. తస్మాత్‌ జాగ్రత్త!

ఈ గజిబిజీ కాలంలో ఎవరూ మనవంక తిరిగి చేతులు జోడించకపోతుంటే చేతులు ముడుచుకు కూర్చో కూడదు. తగిన భక్తులు సమకూరిందాకా మనకాళ్ళకు మనమే మొక్కుకుంటూ ఉండాలి. దాన్నే రాజకీయం అంటారు. మన వీపు వైపు మనమే నమస్కారం చేసుకోలేం గనక. మీరు ఎదుటివాడికి 'నమామి' చెబితే ఎదుటివాడు మీకు 'ప్రణమామ్యహం' అనాలనే ఏర్పాటూ చేసుకోవచ్చు. దీన్నే రాజకీయాల్లో పొత్తులంటారు.

మంత్రాలకు చింతకాయలకు రాలకపోవచ్చేమోగానీ- నమస్కారాలకు పురస్కారాలు దక్కే ఆస్కారాలు పుష్కలంగా ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ఒక దండం వంద దండల పెట్టు. అతి వినయం ధూర్త లక్షణమనే మాట ఈ కాలానికి అతికే సామెత కాదు. నమ్మకంగా నమస్కారాలు పెట్టుకుంటూ పోతే ఏనాటికైనా ప్రధానమైన ఏ మంత్రిపదవో, మళ్ళీ మాట్లాడితే... మరోసారీ అదే పదవీ దక్కే అవకాశాలు... ఉన్నాయిగదా! అందుకేనేమో ఆ త్యాగరాజస్వామి 'ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు' అని ముందుగానే దండాల మీదే ఎత్తుకున్నాడు.

నిద్రలేచినప్పటినుంచీ నిద్రపోయేదాకా మనం ఎదుటివాడివంక వేలెత్తి చూపించటానికి ఉపయోగించే శక్తిని దండాలు పెట్టటం వైపు మళ్ళించగలిగితే- దేశంలో ఇంత అశాంతి, అరాచకం ప్రబలి ఉండేవి కాదు. సైనికులు, పోలీసులు- తుపాకులకూ తూటాలకూ పెట్టే ఖర్చును ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు అన్నాడు ఓ సంస్కర్త. ఇన్ని తెలిసీ మరి ఈ మధ్య ఓ ప్రజా ప్రతినిధి, బ్యాంకు ఉద్యోగి మధ్య రుణాల విషయంలో పెద్ద రణమే జరిగింది. చెరొక దండం పెట్టేసుకుంటే సమస్య మొదట్లోనే పరిష్కారమైపోయేది కదా!
(ఈనాడు, ౦౫:౦౯:౨౦౦౯)
_____________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home