రాధామాధవం
ఎనిమిదిమంది దేవేరులకు నల్లనయ్య శ్రీవారు. పదహారువేలమంది గోపకాంతలకూ ప్రియవిభుడు. ఆ చల్లని దేవర నామం స్మరించగానే దాని సరసన చప్పున స్ఫురించే పేరు మాత్రం రాధమ్మదే తప్ప- ముజ్జగాలనూ తన బొజ్జలో ఇముడ్చుకున్న ఆ అయ్య బరువును భక్తితో ఒకేఒక్క తులసిదళాన్ని తక్కెడలో ఉంచి తూచిన రుక్మిణిదీ కాదు; ముద్దుమురిపాల్లో, ముచ్చట్లలో తేలించి రక్తితో ఆయనను తన కొంగున కట్టుకున్న సత్యభామామణిదీ కాదు! కృష్ణస్వామి ఇంటిపేరే రాధ అన్నట్లుగా- తనను, తన సైదోడును ఈలోకం నిత్యం రాధాకృష్ణులుగానే కీర్తించేంత ఖ్యాతీ రాధాదేవి సొంతమే. 'గోపజనములందు, గోపికలందును/ సకల జంతువులందు సంచరించు...' ఆ సర్వాంతర్యామి పేరుతో తన పేరు అలా పెనవేసుకుపోవడానికి ఆమె ఏ నోము నోచెనో, తపమేమి చేసెనో అనిపిస్తుంది. రాధామాధవీయం ఎప్పటికీ రమణీయమే, స్మరణీయమే. మధురానగరిలో యమునా తీరాన ఇసుకతిన్నెల మీద వెన్నెల రాత్రుల్లోన గోపికలతో నల్లని దేవుడు సాగించిన రసరమ్య రాసలీలలపై కతలెన్నో, కవితలెన్నో, కావ్యాలెన్నో, చిత్రాలెన్నో. 'నారీ నారీ నడుమ మురారి/ హరికీ హరికీ నడుమ వయారి' వలయాలు వలయాలుగా తిరుగుతూ సాగిన కేళీగోపాలం- మహనీయుల కృతుల్లో కృష్ణలీలాతరంగిణియైు ఓలలాడించింది. గీతగోవిందమై అలరించింది. వర్ణరంజిత చిత్రమై ఎదఎదలో రంగవల్లులద్దింది. స్వరలహరియైు గుండెగుండెపై పన్నీటి జల్లులు చిలకరించింది. గోవిందుడు అందరివాడే. కానీ, 'గోపాలునకెంతమంది గోపికలున్నా/ గుండెలోన నెలకొన్న రాధ ఒక్కతే'ననిపించేంతగా తన అనురాగాన్ని ఆయన రాధమ్మపైనే కురిపించాడట. ఇక రాధ- మాధవ నిలయమైన తన హృదయమే కృష్ణ ప్రేమాలయం అనిపించేంత ప్రణయరాగ సుధ!
నవరసాలలో శిఖరస్థానం శృంగారానిదే. అలాగే, భారతీయ సాహిత్యంలో- శృంగార రసాధిదేవతలైన నాయికా నాయకులుగా కవుల అగ్రతాంబూలం అందుకున్నదీ రాధాకృష్ణులే. వారి అనురాగ రాగాలే పదాలై పల్లవించి ప్రవహించిన ప్రణయభావనలు, ప్రభవించిన ప్రేమగీతాలు ఎన్నో! కృష్ణుడికి రాధ మేనత్త అనీ అంటారు. 'అల్లుడికి అత్తాశ' అనే సామెతను నిజం చేయడానికా అన్నట్లు- నోరూరించే వెన్నముద్దలు రాధత్త బుగ్గల్లా ఉన్నాయని మురిసిపోయేవాడట అల్లరి బాలకృష్ణుడు ఆ పిన్న వయసులోనే! చిన్ననాటినుంచే వారిరువురి నడుమ మరుగుగా మరుని ముచ్చట్లు చాలానే నడిచాయని ప్రతీతి. అది నిజమో, కల్పనో కానీ- రమ్యాక్షర రూపాన్ని సంతరించుకున్న ఆ మురిపాలన్నీ రసజ్ఞులకు మనోజ్ఞమైనవే. 'పచ్చకప్పురపు వాసనల తాంబూలపు మోవి రాధ మోవిపయి మోపి'న గోపాలుణ్ని శ్రీనాథ మహాకవి ప్రస్తుతిస్తే- కృష్ణుడి చెక్కిలి నొక్కి ముద్దిడిన మిటారి రాధను కవయిత్రి ముద్దుపళని తన ప్రబంధం 'రాధికా సాంత్వనం'లో చిత్రించింది. ఆ 'ముద్దు' ముచ్చట వెనక నడిచిన గ్రంథం ఎంతో ఉంది. ఇళాదేవికి, కృష్ణుడికి స్వయంగా దగ్గరుండి పెళ్లి జరిపించినది రాధాదేవే. ఆ తరవాత ఆమే- 'సొమ్ములియ్యవచ్చు, సమ్మందమియవచ్చు/ ఇయ్యరాని ప్రాణమియ్యవచ్చు/ తనదు విభుని వేరు తరుణి చేతికినిచ్చి/ తాళవశమె యెట్టిదానికైన...' అని కృష్ణుని ఎడబాటుకు ఎంతో పరితపించింది. ఇళ మోజులో పడి ఆయన తనను పట్టించుకోలేదని కోపించింది. చాలా రోజులు అత్తవారింట్లో గడిపి తిరిగివచ్చిన కృష్ణుడు- పరిపరివిధాల అనునయించి, ఆఖరికి పాదాల మీద పడిన తరవాతనే రాధిక కినుక వీడింది. కనికరించింది. అలక మానింది. ఆయనకు ముద్దును అనుగ్రహించింది. అదీ, ఆ రసవత్కావ్య ఇతివృత్తం!
భారతీయుల దృష్టిలో- అవధుల్లేని ఆరాధనకూ, అవ్యాజమైన అనురాగానికీ, అలౌకిక ప్రణయానికీ, మధుర భక్తికీ, మాధుర్యమైన రక్తికీ రాధాకృష్ణులు ప్రతీకలు. వారి అనుబంధంపై భిన్న వాదనలూ ఉన్నాయి. భాగవతం ప్రకారం- చిన్నతనాన కృష్ణుడితో ఆడుతూ, పాడుతూ గడిపిన గోపకాంతల్లో రాధ కూడా ఒక గోపిక, అంతే. ఆ తరవాతి కాలంలో జయదేవుడు రూపకల్పన చేసిన గీతగోవిందం- రాధాకృష్ణుల్ని భక్తహృదయపీఠంపై ప్రతిష్ఠించింది. కృష్ణభగవానుని ఆత్మశక్తి రాధేనన్నది వైష్ణవ మతానుయాయుల నమ్మిక. వారివురూ సహజీవనం సాగించారన్నది సత్యదూరమని కొందరి విశ్వాసం. రాధను స్వయంవరంలో కృష్ణుడు పెళ్లాడటం- చింతలపూడి ఎల్లన్న కావ్య కథావస్తువు! పురాణాల్లో ప్రక్షిప్తాలుండటం పాతకథే. స్వకపోల కల్పనా చాతుర్యం చాటుకోవడానికి కవులు పౌరాణిక పాత్రల చుట్టూ కల్పిత కథలు, గాథలు అల్లడమూ కొత్త కాదు. సహజీవనంపైనో, జీవన సాహచర్యంపైనో వాటినే ప్రామాణికంగా తీసుకోవడం తగదు. రాధాకృష్ణులు భార్యాభర్తలై మనుగడ సాగించారా, లేక పెళ్లి చేసుకోకుండా సహజీవన యాత్రను తమ జీవితపంథాగా ఎంచుకున్నారా అనే సంగతిని పక్కనపెడితే- వారూ సీతారాముల వలె, శివపార్వతుల వలె భారతీయులకు పూజనీయులే. పెళ్లికిముందు శృంగారకేళి తప్పు కాదని తీర్పునిస్తూ, ఆ సందర్భంగా 'రాధాకృష్ణులదీ సహజీవనమే కదా' అని సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇక్కడి ప్రజానీకంలో అత్యధికులకు రుచించకపోవడానికి కారణం అదే.
(ఈనాడు, సంపాదకీయం, ౦౪:౦౪:౨౦౧౦)
____________________________
Labels: Life/telugu, Religion/telugu, Telugu literature
0 Comments:
Post a Comment
<< Home