పెళ్లి కళ
కల్యాణోత్సవాలు ఎప్పుడూ కనులపండువే. అంతరంగాన్ని సంతోషతరంగితం చేసేవే. వరపూజ నుంచి వధువు అంపకాల వరకు ప్రతి ఘట్టంలోనూ పండుగ సందడి ప్రతిధ్వనిస్తుంటుంది. అలనాడు జనకరాజర్షి తన కుమార్తె మైథిలిని శ్రీరామునికి ఇచ్చి కన్యాదానం చేసిన కమనీయ సన్నివేశం- తెలుగునాట ఏ పెళ్లివేడుకలోనైనా పాణిగ్రహణ సమయాన ఇప్పటికీ వైభవంగా పునరావిష్కృతమవుతూనే ఉంటుంది. యుక్తవయసులోని ప్రతి ఆడకూతురూ ఓ జానకీదేవే! ఆ బంగారును వరుడికి కన్యాదానం చేసేవేళ ప్రతి తల్లీతండ్రీ జనకరాజర్షి దంపతులే! ఆ క్షణాన- బాధ్యతను నిర్వర్తించామన్న సంతోషంలో జలజల రాలే ఆనందబాష్పాలతో వారి మనసులు తేలికపడతాయి. అదేసమయంలో, తమ సొత్తు ఎప్పటికీ వేరే ఇంటి సొంత సొమ్మయిపోతోందన్న బెంగలో పెల్లుబికే దుఃఖాశ్రువులతో వారి హృదయాలు బరువెక్కుతాయి. పసికూనగా ఉన్నప్పటినుంచీ, పెళ్లీడు వచ్చేదాకా ప్రాణమొక ఎత్తుగా పెంచుకున్న చేతులతోనే తమ గారాలపట్టిని ఓ అయ్యచేతిలో పెట్టేటప్పుడు, ఏకకాలంలో ఆ విధంగా స్పందించే అమ్మానాన్నల గుండెతడి ఏ భాష్యానికీ అందనిదే. కౌసల్యకు సీతను అప్పగిస్తూ 'కోడలు మీ సొమ్ము, కొడుకు మీ సొమ్ము/... మా బాల మీ బాలగా చూడవలెను' అంటూ వియ్యపురాలిని జనకుని పత్ని అర్థించింది. ఆమెకు ధైర్యం చెబుతూ 'అదియేల ఆ మాటనానతిచ్చేరు/ ఆలాగే మాకొక్క ఆడపడుచుంది/ దశరథుల కూతురు శాంతమహదేవి...' అంటూ కౌసల్యామాత 'మీ సీత మా శాంత సమముగానుండు' అని వదినగారికి అభయమిచ్చింది. కూతురూ, కోడలూ సమానమేనన్న ధర్మాన్ని ప్రబోధిస్తున్న ఆ జానపదం సమాజానికంతటికీ జ్ఞానపథమే.
భవబంధాలకు అతీతుడైన రుషిలాంటివాడు కనుక జనకమహారాజు- అల్లుడి వెంట అమ్మాయిని పంపించే సమయాన నిశ్చలంగా ఉండగలిగాడేమోకానీ, సగటు మనుషులకు అంతటి నిబ్బరం అసాధ్యం. అలాంటి తండ్రి శివయ్య ఆర్తికి అక్షరరూపమిచ్చారు సత్యం శంకరమంచి ఓ కథలో. 'తన గుండె, తన ప్రాణం, తన నెత్తురు, తన రెండు కళ్లు'గా పెంచుకున్న కూతురు పెళ్లయి అత్తారింటికి వెళ్తుంటే- తన ఇంటినే ఎవరో నిలువునా దోచుకుపోతున్నట్లనిపించి తల్లడిల్లిపోయాడతను. మగపెళ్లివారి బృందం ఊరి పొలిమేరలు దాటాక బండి ఆపించి, అల్లుణ్ని పిలిచి పక్కకి తీసుకెళ్లాడు. తన చిట్టితల్లి తెలియక ఏదైనా తప్పు చేసినప్పుడు తిట్టాలనో, కొట్టాలనో అల్లుడికి అనిపిస్తే 'కాకితో కబురంపు, వాలిపోతాను. నీ కోపం తీరేదాకా నన్ను తిట్టు... నీ కసి పోయేదాకా నన్ను కొట్టు... బాబ్బాబు... తమలపాకులాంటిదయ్యా నా తల్లి' అంటూ బావురుమన్నాడు. తాను గుండెలమీద ఆడించి పెంచుకున్న ఆడపిల్లను; అప్పటివరకు తనదైన సామ్రాజ్యంలో యువరాణిగా పెరిగిన ఆడపిల్లను అల్లుడికి ధారపోసి, అత్తారింటికి పంపించేవేళ ప్రతి అయ్యలోనూ మనకు ఆ శివయ్య కనిపిస్తాడు. కూతుర్ని పెనిమిటి సరిగా చూసుకుంటాడో, లేదోనని ఆడపిల్లల తల్లిదండ్రులు దిగులుపడినట్లే- అప్పటిదాకా తమ చాటున పెరిగిన తనయుణ్ని కొత్తగా వచ్చిన కోడలుపిల్ల తన కొంగున కట్టేసుకుంటుందేమోనని మగపిల్లడి అమ్మానాన్నలు ఆందోళన చెందడమూ లోకసహజమే. 'విభుడు మన్నించెనని విర్రవీగకుమీ/ అత్తమామలకెల్ల అడుగుదాటకుమీ...' అన్న పుట్టింటివారి హితబోధే- మగడింటిలో తన నడవడికకు దిక్సూచి అయినప్పుడు ఆ ఆడపిల్లకు అత్తామామలూ అమ్మానాన్నలవుతారు.
ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి జోరుగా సాగుతోంది. కాబోయే జంటలను ఆహ్వానిస్తూ పీటలు పరుస్తోంది. చెట్టపట్టాలుగా వారు జీవనప్రస్థానాన్ని ప్రారంభించడానికి నాంది పలుకుతోంది. ఒంటరితనానికి వారిచేత వీడ్కోలు చెప్పించడానికి సూత్రధారిత్వం వహిస్తోంది. ధర్మార్థ కామ మోక్షాల సాధనలో కలసిమెలసి మనుగడ సాగిస్తామంటూ ప్రమాణపూర్వకంగా వారు ప్రవేశించబోయే గృహస్థాశ్రమానికి స్వాగత తోరణాలు కడుతోంది. మంచిరోజును ఎంచుకుని, సుముహూర్తాన్ని చూసుకుని శుభకార్యాలను నిర్వహించడం భారతీయుల జీవన విధానంలో ఓ భాగం. వివాహాల విషయంలో వారు మరీ కచ్చితంగా పాటించేది ఆ సంప్రదాయాన్నే. తమ పిల్లలను ఒకింటివారిని చేయడానికి వారు మంచి ముహూర్తం కోసం తహతహలాడుతుంటారు. మంటపాల అలంకరణ నుంచి, విందు భోజనాల వడ్డనల దాకా ఇప్పుడు అన్నింటా కాంట్రాక్టు పద్ధతులే. కాలమాన పరిస్థితులతో పాటు అనూచానంగా వస్తున్న ఆచార వ్యవహారాలూ మారిపోతున్న ఈ రోజుల్లో అటువంటి ఏర్పాట్లను తప్పు పట్టలేం. వాటివల్ల పెళ్లి కళకు వచ్చే లోటేమీ ఉండదు. రంగురంగుల కాగితపు గోలీలెన్ని కలగలిపినా, వన్నె తగ్గని పసుపు పచ్చని తలంబ్రాల మిసిమిలా- వివాహ సంప్రదాయాలు కాంతులీనుతూనే ఉంటాయి.
(ఈనాడు, సంపాదకీయం, ౧౧:౦౪:౨౦౧౦)
_____________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home