నిద్ర అవస్థ

నిద్ర బహురూపి. కొద్దిసేపు నడుంవాల్చి చిన్న కునుకు తీయడం నుంచి; ఎంత గట్టిగా పిలిచినా, ఎన్ని పిడుగులు పడినా ఒళ్లు తెలియనంతగా తలగడ మంత్రాన్ని వదలకుండా వల్లెవేస్తూనే ఉండటం వరకు- ఆ ప్రక్రియ చిన్నెలెన్నో! కునికిపాట్లకైనా, మాగన్నుకైనా, గాఢనిద్రకైనా స్థలకాలాదుల పట్టింపులు ఉండవు. కంటిమీది బరువు దించుకునేందుకు విశ్రమించే స్థలం కటిక నేలైనా ఆ క్షణాన అది చల్లని చంద్రశాలేననిపిస్తుంది. పరచుకున్నది పాత చింకిచాపే కావచ్చు, ఆ సమయాన అది మెత్తని తివాచీలానే కనిపిస్తుంది. నిద్ర సుఖమెరుగదన్నది నిజమే అయినా, సుఖాల్ని త్యాగం చేయటానికి ఏళ్ల తరబడి నిద్రనే ఆవాహన చేసినవారూ ఉన్నారు. అన్నా వదినలను సేవించుకుంటూ తన భర్త లక్ష్మణస్వామి వనవాసం గడిపిన పద్నాలుగేళ్లూ ఆయన ఎడబాటును మరిచిపోవడానికి ఊర్మిళ నిద్రలోనే గడిపింది. రావణ వధానంతరం అయోధ్యకు తిరిగి వచ్చిన తరవాతా ఆయన ఊర్మిళను చూడబోలేదు. ఆ మాటే చెబుతూ, తాము అరణ్యవాసానికి బయలుదేరిన 'నాడు మొదలుగ శయ్యపై కనుమూసి నాతి పవళించున్నదీ/ ఇకనైన యానతిచ్చీ తమ్ముణ్ని యిందుముఖి కడకంపుడీ' అని సీతమ్మవారు రాముణ్ని కోరిందన్నది జాను తెలుగులోని ఓ జానపదం. విరహబాధను మరచిపోవడానికి ఆ విధంగా ఓ సాధనమైన నిదురే- మనసైనవారి తలపుల్లో మునిగిపోయేవారి కంటికి దూరమయ్యే సందర్భాలూ ఉంటాయి. తన ప్రణయిని రుక్మిణిని తలచుకుంటూ శ్రీకృష్ణుడు నిద్రలేని రాత్రిళ్లు గడిపాడట. ఆమె పంపిన పరిణయ సందేశాన్ని అందుకుంటూ- 'కన్నియ మీద నా తలపు గాఢము; కూరుకురాదు రేయి నాకెన్నడు' అంటూ సాక్షాత్తు ఆ పరమాత్ముడే వాపోయాడంటే- నిదురలేమి రాత్రులతో గడుపుతున్న నేటి కుర్రకారు ప్రేమికుల గురించి ఇక చెప్పేదేముంది?!
నిద్ర ఎలా ఉండాలో చెబుతూ 'సాధారణమైన చప్పుళ్లకు, కేకలకు, పిలుపులకు మెలకువ రాకూడదు' అని చిలకమర్తివారు చమత్కరించారు. ఆ స్థాయిలో కాకపోయినా, కనీసం ఆరోగ్యానికి భరోసా ఇచ్చేంత నిద్ర అవసరం. మనిషికి కుంభకర్ణ నిద్రా మంచిది కాదు, కోడినిద్రా పనికిరాదు. కంటినిండా నిద్ర లేకపోవడం అనేక అనర్థాలకు హేతువవుతోంది. ఆధునిక జీవనంలో ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న మార్పులు సమాజ వికాసానికి దోహదపడుతున్న మాట నిజమే. అదేసమయంలో అవి మనుషుల చుట్టూ సమస్యల వలయాల్నీ సృష్టిస్తున్నాయి. పెరిగిన ఉద్యోగావకాశాలతోపాటే, ఉద్యోగ జీవితాల్లో ఒత్తిళ్లూ అధికమయ్యాయి. అంతర్జాలం అవతరణ- వెలుపలి ప్రపంచంతో ఎల్లలను చెరిపివేసినా, ఇళ్లల్లో మాత్రం ఏకాంతద్వీపాల్ని సృష్టిస్తోంది. విధి నిర్వహణలో ఒత్తిళ్లు పెరగడం, ఐపాడ్‌లు, కంప్యూటర్ల వంటివాటి వాడకం మితిమీరిపోవడం- నేటి యువతరానికి నిద్రను దూరం చేస్తున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఉద్యోగస్తులైన యువతీయువకులు పని ఒత్తిళ్ల కారణంగా రాత్రిళ్లు చాలాసేపు మేలుకొని ఉండటం వారి నిద్రలేమికి కారణం. అలా తక్కువపడిన నిద్రను వారాంతపు సెలవుదినాల్లో విశ్రమించడం ద్వారా భర్తీ చేసుకోవచ్చునన్నది వారి అభిప్రాయం. వారు అలా భావించడం సరికాదని, నిద్రలేమి వల్ల దీర్ఘకాలంలో- ఆకలి తగ్గిపోవడం, మానసిక ఆందోళనలు అధికం కావడం, గుండెపోటు వచ్చే ప్రమాదం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐప్యాడ్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల వంటివాటిని పడకగది ఛాయలకైనా రానీయకుండా, రోజుకు కనీసం ఏడెనిమిది గంటలు తప్పనిసరిగా నిద్రపోవడం- వారు సూచిస్తున్న తరుణోపాయం. పాటించాల్సింది నిద్రాదేవతను నిర్లక్ష్యం చేస్తున్నవారే!
(ఈనాడు, సంపాదకీయం, ౧౮:౦౪:౨౦౧౦)
____________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home