My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, June 04, 2010

నారీ.. నోరు విప్పాలి!


చెప్పాలనుకున్నదాన్ని ఎటువంటి తడబాటు లేకుండా, సూటిగా వ్యక్తం చేయడం నిజంగా కళే. కొంతమంది మగువలు తమవారి ముందు గుక్కతిప్పుకోకుండా మాట్లాడేస్తుంటారు. కానీ ఇతరుల ముందు నోరు పెగలదు. చిన్నపాటి సదస్సుల్లో, కార్యాలయంలో సహోద్యోగుల మధ్య విషయాలను వివరించాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిపడతారు. వాక్చాతుర్యాన్ని పెంపొందించుకోవాలనుకున్న వనితలూ... ఓసారి ఇవి చదవండి.

* అభిరుచి :
ఎవరికి ఏ అంశంలో ఆసక్తి ఉంటుందో ఆ విషయాలను స్పష్టంగా మాట్లాడగలరు. కొంతమంది రాజకీయాల గురించి బాగా మాట్లాడితే, మరికొందరు పిల్లల పెంపకం, అందం, క్రీడలు.. తమకు నచ్చిన రంగం గురించి బాగా సంభాషించగలుగుతారు. తమ అభిరుచికి అద్దంపట్టే విషయాలను గుర్తించి, ఎప్పటికప్పుడు విషయసేకరణ చేసుకోవడం ఉత్తమం.

* అవగాహన :
పలు విషయాలపై పట్టున్నట్టే అనిపిస్తుంది. కానీ తీరా నలుగురిలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు లోతుగా ప్రస్తావించలేరు. అందరికీ తెలిసిన పైపై మాటలు చెప్పి ఆగిపోతుంటారు. అందుకే ఆ రంగంలో మరింత అవగాహనను పెంచుకోవాలి. క్షుణ్ణంగా తెలిసుంటే ఆత్మస్త్థెర్యంతో ప్రసంగించగలరు. కొత్త విషయాలను చెప్పగలిగినప్పుడు ఎదుటి వారూ చెవిచ్చి ఆలకిస్తారు.

* శ్రోతల్ని గమనించాలి :
ఎవరి ముందు మాట్లాడుతున్నారో గుర్తెరగాలి. వాళ్ల ఇష్టాయిష్టాలు... ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు? సాంకేతికంగా వారి పరిజ్ఞానం ఎంత? మాట్లాడుతున్న అంశాన్ని ఎంత వరకు అవగాహన చేసుకోగలరు? వంటి పలు అంశాలను గ్రహించగలిగితే దానికి తగ్గట్టు సన్నద్ధమవడం తేలిక.

* రాసుకుంటే.. :
సదస్సుల్లో పత్ర సమర్పణ లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు వీలైతే మొత్తం వ్యాసాన్ని రాసుకుని చదువుకోవచ్చు. ముఖ్యాంశాలను రాసుకోవడం వల్లా ఉపయోగం ఉంటుంది. ఇలా చేస్తే చెప్పాలనుకున్న విషయాన్ని మర్చిపోయే ప్రమాదం ఉండదు. మన ముందున్న వ్యక్తుల్ని చూసి తడబడి అసలు విషయాన్ని మర్చిపోతామన్న చింత దూరం.

* తర్ఫీదు :
మనసులో ఎన్ని విధాల అనుకున్నా ఆ భావాలను స్పష్టంగా పలకగలగాలి. ప్రసంగించాల్సిన విసయాన్ని ముందు రోజు ఒకటికి నాలుగు సార్లు అద్దం ముందు చెప్పుకొంటే మంచిది. సన్నిహితుల ముందు చెప్పినా ఫలితం ఉంటుంది. వారి సలహాలను కూడా స్వీకరించవచ్చు.

* సంసిద్ధత :
ఇన్నిరకాలుగా సంసిద్ధులైన తర్వాత ఇంకా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. వక్తృత్వ అంశమూ తెలుసు. శ్రోతల మనసూ తెలుసుకున్నప్పుడు భయమెందుకు? ధైర్యంగా మాట్లాడగలమన్న భావనను మనసులో ఒకటికి నాలుగు మార్లు మననం చేసుకుంటే చాలు.

* హావభావాలు :
నిటారుగా నిలబడి పాఠం అప్పగించేసినట్టు మాట్లాడటం ఎప్పుడూ అందగించదు. హావభావాలు ముఖ్యం. మనం ఏం చెబుతున్నామన్నది కొన్ని సార్లు చేతుల కదలిక, ముఖ కవళికలు ద్వారా కూడా వ్యక్తం చేయగలుగుతారు. అలాగని చేతుల్లో కాగితాలుంచుకుని వాటిని అటు ఇటూ కదిలిస్తూ మాట్లాడితే మైక్‌ ముందు చప్పుడై ఇబ్బందిగా ఉంటుంది. ఎదురుగా పోడియం ఉంటే దాని మీద చేతులు ఆన్చి మాట్లాడితే ఉత్తమం.

* చిరునవ్వు :
చిరునవ్వును మించిన ఆభరణం ఉండదంటారు. తీసుకున్న అంశాన్ని గురించి లోతుగా, ప్రభావితంగా మాట్లాడుతున్నా ముఖం మీద ప్రశాంతత, చిరునవ్వులను చెక్కుచెదరనీయకూడదు. సంతాప సభల్లో చిరునవ్వులు పనికిరావు. సమయానుకూల ప్రవర్తన మెప్పిస్తుంది.

* అతి వద్దు :
కొంతమంది ఎదురుగా ఉన్న ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి ఏవో చిన్నపాటి జోకులు చెబుతుంటారు. కానీ కొన్ని మరీ పేలవంగా ఉండి ఎదుటివారికి నవ్వు తెప్పించవు. సరికదా 'కుళ్లు జోకు' అని విమర్శలకు తావిస్తాయి. అందుకే వీలైనంత వరకు సున్నితమైన హాస్యాన్ని పండించే చమక్కులను ఎంచుకోవాలి.

* అర్థవంతంగా :
'నా ధోరణి ఇంతే' అన్నతత్వం ఏ సమయంలోనూ సరికాదు. విషయాన్ని ఎంత సూక్ష్మంగా గ్రహించినా, చక్కటి తర్ఫీదు ఎలాగూ ఉందని మురిసిపోయినా, ఎదుటివారి నాడిని పట్టుకోగలమన్న ధీమా ఉన్నప్పటికీ... మనం చెప్పదలచుకున్న విషయాన్ని అర్థవంతంగా చెప్పకపోతే... వక్తృత్వం ఎదుటివారి మస్తిష్కంలో ఆలోచనను రేకెత్తించకపోతే మీరు చేసిన మొత్తం ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరేనన్నది అక్షర సత్యం. అందుకే అర్థవంతంగా ప్రసంగించగలిగితే చాలు.
(ఈనాడు, వసుంధర, ౦౩:౦౬:౨౦౧౦)
___________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home