'సారీ' సరాగం
సీతారాములవలె ఉన్నారనిపించే దంపతుల అచ్చట్లూ ముచ్చట్లలోనైనా, చిలకా గోరింకల్లా తోచే భావి జంటల సరసాలూ సరదాల్లోనైనా- అడపాదడపా కోపాలు, తాపాలు చుట్టపుచూపులా తొంగిచూస్తుంటేనే ముద్దూ మురిపెమూనూ.'కోపమొకటె ఆమె లోపమందును గాని/ అదియె లేనిదె ఆమెకు అందమేది?' అని నాథుడు మురిసిపోవచ్చు. తన కినుకలోనూ సౌందర్యాన్నే ఆరాధిస్తూ 'అలిగినను నిన్ను విడిపోగలన నేను? కోపమైయుందు నీ కంటి కొనలనంటి-' అని అతగాడు విన్నవించుకుంటే, అరమొగ్గల్లా విచ్చుకున్న ఆమె పెదవి వంపుల్లో తొణికిన చిరునవ్వుల జిలుగులు విద్యుత్‌కాంతుల్ని తలపిస్తాయి. అంతవరకు అంటిపెట్టుకున్న అలకలు తెరమరుగవుతాయి. 'ఆలుమగల లడాయి/ అంతమొందిన రేయి/ అనుపమానపు హాయి-' అన్న కూనలమ్మ పద కూజితాలు వినిపిస్తాయి. అలక సార్వకాలీనమైనది. దానికి దివారాత్రాలనే భేదం ఉండదు. అలకది సర్వ సమానత్వ సిద్ధాంతం. దానికి ఆడ, మగ అనే తేడా లేదు. ఆ ప్రక్రియలో ఒకరికొకరు ఏమాత్రం తీసిపోనివారే అయినా- అలక వహించడంలో ఆడవాళ్లే ఓ మెట్టు పైన ఉంటారన్నది కవులు, రచయితల సూత్రీకరణ. అందాన్ని ఇనుమడింపజేసే అలకే మగువల ఆయుధమనీ వారు కవిత్వీకరించాక, అలా- 'కత్తి చేతలేక కదనమ్ము జరిపెడి/ ఇంతికెవ్వడు అసువులీయకుండు'ననిపించడంలో వింతేముంటుంది!
అలక ఎన్నో వగలు చిందిస్తుంది. మరెన్నో వయ్యారాలూ ఒలికిస్తుంది. తొలుత మూగనోము. పిదప మూతి విరుపు. పిమ్మట సనసన్నగా సన్నాయినొక్కులు. అటుపై చినచిన్నగా రుసరుసలు. ఆ తరవాత కొదికొద్దిగా సాధింపులు. ఆ చిన్నెలన్నీ కాసేపు అలాఅలా సాగిపోయాక... బుజ్జగింపులు, బతిమాలడాలు, వరదానాలు, ఆ దరిమిలా కిలకిలలు, కలకలలతో అలక ఆనాటికి అటకెక్కడం- దాంపత్య జీవనశోభలోని సొబగు. అలకబూని తనవాణ్ని 'రవంత వేపుకు తిని, తగుమాత్రం కంట తడిబెట్టి, గడ్డంపట్టి బతిమాలించుకుని, చేతిలో చేయి వేయించుకోవాలని- జన్మంటూ ఎత్తి ఆడపుట్టుక పుట్టినాక ఉండదుట్రా నాయనా?' అన్నది ఓ కథలోని పాత్ర నోట వినిపించిన మల్లాది రామకృష్ణ'శాస్త్రీయ' వాణి! నెయ్యపు కినుకల వెనుకగల ఆకాంక్షను అర్థంచేసుకుని, అలిగిన చెలిని అనునయించే వేళ తాను కాస్త తగ్గాల్సివచ్చినా- దాన్ని చెలికాడు నామోషీగా భావించడం భావ్యంకాదు. తనపై ఆగ్రహించిన దేవేరి సత్యభామను ప్రసన్నం చేసుకోవడానికి సాక్షాత్తు శ్రీకృష్ణుడంతటివాడు 'భవదీయ దాసుడ'నని ఆమెకు మనవి చేసుకున్నాడు. తలవంచి ఆమె మృదుకోమల పల్లవ పాదద్వయానికి మొక్కాడు. వామపాదంతో ఆమె తాచినా అది తనకు 'మన్ననయ' అని గొప్పగా చాటుకున్నాడు. స్వర్గంనుంచి పారిజాత వృక్షాన్ని పెకలించి తెచ్చి, ఆమె ఉద్యానవనంలో ప్రతిష్ఠించి మాట నిలబెట్టుకున్నాడు. అనునయ కళకు నల్లనయ్య అలా దిద్దిన మెరుగులు ముచ్చటగొల్పేవే. తన అలకను తీర్చడానికి చేసిన బాసల్ని చెల్లించకుండా చెంతచేరే సఖుణ్ని- నాటి సత్యభామామణి మాదిరే, నేటి భామామణీ సహించదు. 'దబ్బులన్నియు దెలిసికొంటిని తప్పు బాసలు సేయకూ/ మబ్బు దేరెడి కన్నుగవతో మాటిమాటికి డాయకూ/ ఉబ్బు చేసుక తత్తరంబున నొడలిపై జెయి వేయకూ...'
సాంసారిక జీవితంలో భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడూ అపోహలు, అపార్థాలు తలెత్తడం సర్వసాధారణం. కలతలు రేగడం, కలహాలు చోటుచేసుకోవడం సహజం. కోపాలు రావడం, అవి కయ్యాలుగా మారడం పరిపాటి. ఒక్కోసారి అల్పమైన కారణాలూ, అర్థంపర్థం లేని వివాదాలూ అటువంటి విపరిణామాలకు దారితీయడమూ కద్దు. అలాంటి సందర్భాల్లోనే దంపతుల్లో సంయమనం, సానుకూల దృక్పథం, సదాలోచన, సదవగాహన అవసరం. లోపం ఎవరిలో ఉందన్నదానితో నిమిత్తం లేకుండా తమ తప్పును కాయమని జీవితభాగస్వామిని కోరడం నేరమూ కాదు, అందుకు మొహమాటమూ అడ్డురాకూడదు. తప్పు తమదే అయినా- స్వాభిమానంతోనో, పురుషాధిక్య భావజాల ప్రభావం వల్లనో మగవాళ్లు తమ భార్యలను అలా అర్థించకపోవడం ఇక్కడి సమాజ లక్షణం.

(ఈనాడు, సంపాదకీయం, ౨౫:౦౪:౨౦౧౦)
__________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home