1350- సంబురాల తెలంగాణ!
సుమారు నాలుగు కోట్ల స్వరతంత్రులతో కోటి రతనాల వీణ సంబురాల సరిగమలు పలుకుతున్న వేళ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణవాదుల దశాబ్దాల కల ఫలించబోతోంది. రాష్ట్రపతి మొహరు పడటమే తరువాయి, దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణ తళుకులీననుంది. లక్షా 14వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 3.52కోట్ల(2011 జనాభా లెక్కల ప్రకారం) జనాభాతో తెలంగాణ దేశంలో పదకొండో అతిపెద్ద రాష్ట్రంగా అవతరిస్తోంది. మిగిలిన ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణపరంగా నాలుగో స్థానంనుంచి ఆరోస్థానానికి, జనసంఖ్య పరంగా అయిదునుంచి పదోస్థానానికి పరిమితం కానుంది. 'అయిదున్నర దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండు చరిత్రను, తాము సాగించిన విస్తృతస్థాయి సంప్రతింపులను పరిగణనలోకి తీసుకొని ముందడుగేశా'మని నిరుడు జులై చివరివారంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించినప్పటినుంచి, నేటిదాకా విభజన ప్రక్రియ అంతా- ఉద్విగ్నత, ఆవేశోద్రేకాల సమ్మిళితంగానే సాగింది. దేశంలోనే మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా యాభై ఏడేళ్లక్రితం ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ విభజన అంశం ఎంత సున్నితమైనదో 2009 డిసెంబరులోనే కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలిసివచ్చింది. పార్టీలు సైతం ప్రాంతాలవారీగా చీలిపోయిన విపత్కర వాతావరణంలోని భావోద్విగ్న తీవ్రతలను గుర్తించి- ఈ ఆరున్నర నెలల కాలావధిలో సర్వామోద పరిష్కారానికి కాంగ్రెస్ ప్రయత్నించి ఉండాల్సింది. ఆ పని చెయ్యని హస్తం పార్టీ అధిష్ఠానం- 2006లోనే ప్రత్యేక తెలంగాణకు 'సై' అన్న భాజపానూ విశ్వాసంలోకి తీసుకోలేకపోయింది. పర్యవసానమే, పార్లమెంటులో విభజన బిల్లు ప్రవేశపెట్టడం నుంచి రాజ్యసభలో ఆమోదం పొందేదాకా అనుక్షణం ఎడతెగని ఉత్కంఠ; అయిదు కోట్లమంది ప్రయోజనాల్ని అసలేమాత్రం పట్టించుకోలేదంటూ సీమాంధ్రుల్లో తీవ్ర భయాందోళన. 'తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి' అన్నట్లు కేంద్ర సర్కారు అడుగడుగునా అప్రజాస్వామికంగా వ్యవహరించిందనడంలో మరోమాట లేదు. విపక్షాల అభ్యంతరాలన్నీ ఎగువ సభలో వీగిపోయిన నేపథ్యంలో, నవతెలంగాణ శిశూదయాన్ని స్వాగతించాలిప్పుడు!
వేర్వేరు పరగణాల్లో ఉన్న తెలుగువారంతా ఒక్కతాటిమీదకు వచ్చితీరాలన్న సమైక్య భావకాంక్షకు ఫలశ్రుతి- ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. ఇప్పుడు తెలంగాణ వేర్పాటుకూ అలుపెరుగని ప్రజాందోళనే కారణం. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పెద్దమనుషుల ఒప్పందం ప్రాతిపదిక అయింది. కాకతీయుల కాలంలో కలిసి ఉన్న ఆంధ్రులు మళ్ళీ భారత రిపబ్లిక్‌లో ఏకమయ్యారన్న ఆనందానుభూతుల్ని అంతలోనే ఆవిరి చేసేలా ఒప్పందాల ఉల్లంఘనలు తెలంగాణవాదుల్లో అపనమ్మకాన్ని పెంచాయి. సమైక్య రాష్ట్రం ఏర్పడిన పదమూడేళ్లకే వేర్పాటువాదం రాజుకోవడానికి పాలకుల తప్పిదాలే పుణ్యం కట్టుకొన్నాయి. 1973లో ప్రధానిగా ఇందిర ప్రతిపాదించిన ఆరుసూత్రాల పథకం అమలు సైతం వివాదగ్రస్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ కూర్పు బేషరతు కాదని, విద్యా ఉద్యోగాలు పారిశ్రామిక ప్రగతి సేద్యరంగం వంటివాటన్నింటా తమకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందన్న ఆక్రోశం తెలంగాణ వేర్పాటు కాంక్షలకు ఎరువవుతూ వచ్చిందని తెరాస సిద్ధాంతకర్తగా జయశంకర్ లోగడే స్పష్టీకరించారు. పదమూడేళ్ల క్రితం తెలంగాణ సాధనే లక్ష్యంగా తెరాస స్థాపించిన బక్కమనిషి కేసీఆర్ ఉక్కు సంకల్ప దీక్షా దక్షతలతో ప్రజాకాంక్షకు ఉద్యమ రూపమిచ్చి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో శ్రేణుల్ని కదం తొక్కించారు. నాలుగున్నర దశాబ్దాల క్రితం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసినప్పుడు కూడా సమైక్యవాదం వినిపించిన సీనియర్ రాజకీయవేత్త చెన్నమనేని రాజేశ్వరరావు ప్రత్యేక తెలంగాణ అవసరం ఎందుకొచ్చిందో తెలుగుదేశం తరఫున సాగించిన అధ్యయనంలో వివరించారు. వైఎస్ పాలన, అర్ధశతాబ్ది ప్రత్యేక తెలంగాణ వాదనను రెట్టింపు చేసిందని, భూముల్ని తెగనమ్మడం, 'సెజ్'ల దోపిడి, నదీజలాల తరలింపు తదితర ఏకపక్ష నిర్ణయాలు తెలంగాణ ప్రజల్ని ప్రత్యేకబాట పట్టిస్తున్నాయని ఆరేళ్లక్రితమే వాస్తవాన్ని వెల్లడించారు. తెలంగాణ ప్రజల మనసుల్లో తాము విచక్షణకు, దాష్టీకానికి గురి అవుతున్నామన్న భావన తీవ్రమైన ఆవేశకావేషాల దశకు చేరుకుందని, ప్రత్యేక తెలంగాణ డిమాండు పూర్తిగా అన్యాయమైనదేమీ కాదని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ స్పష్టీకరించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానించిన పక్షంలో భిన్న ప్రాంతాలవారి భయాలు ఆందోళనల్ని పరిగణనలోకి తీసుకొని వారికి భరోసా కల్పించాలనీ సూచించింది. ఆ భరోసాల అంశంలోనే కేంద్రప్రభుత్వం దాగుడుమూతలు, లేనిపోని వైమనస్యాలను పెంచాయని చెప్పక తప్పదు!
ఒక జాతి కట్టుబాటును మతంకన్నా ఎక్కువగా భాష శాసిస్తుందని, అందుకు తానే ఉదాహరణ అనీ ఉపఖండంలో భాషాప్రయుక్త దేశంగా బంగ్లాదేశ్ చాటింది. బంగ్లాదేశ్ విజ్ఞప్తి మేరకు ప్రతి ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని 'యునెస్కో' నిర్వహిస్తోంది. ఈసారి మాతృభాషా దినోత్సవం నాటికి ఆంధ్రప్రదేశ్ విభజన మరో గుణపాఠం నేర్పుతోంది. ఓ జాతి కట్టుబాటుకు భాషా ప్రాతిపదిక ఒక్కటే సరిపోదని, అంతకుమించి అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కాంక్షలకు గొడుగుపట్టే సుపరిపాలన మరెంతో అవసరమనీ పాలకులు తెలుసుకోవాలి. 'సంబంధిత అన్ని వర్గాలతోనూ తగిన చర్చలు, ఏకాభిప్రాయ సాధన, సరైన సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు పరిశీలన' అన్నవి 2004లో తొలి యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలోని ముఖ్యాంశాలు. తొమ్మిదిన్నరేళ్ల కాలహరణం తరవాత, పదహారో సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళే 'సరైన సమయం' అంటూ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణకు హడావుడి చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం- రెండుపక్కలా కడ నిమిషందాకా ఉద్విగ్న వాతావరణాన్ని పెంచి పోషించింది. రాష్ట్రంలో, దేశంలో ప్రధాన పార్టీలన్నీ ఏదో ఒక దశలో తెలంగాణకు అనుకూలత చాటాయి. వాటి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని ముందడుగేస్తే అసలు గొడవన్నదే లేకపోయేది. మూడు ప్రాంతాల మధ్య సామరస్యంగా సయోధ్య సాధించగలిగితే విభజన చేయవచ్చని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీయే సూచించింది. ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉండే సుహృద్భావానికి ప్రోది చెయ్యాల్సిన కేంద్రప్రభుత్వం బాధ్యతారహితంగా ప్రవర్తించింది. పాలకుల రాజకీయ పాచికలు పెంచిన మనస్పర్ధల్ని పక్కన పెట్టి, ఇరువైపులా తెలుగువారి ఔన్నత్యం మరింతగా పరిమళించాల్సిన తరుణమిది. నీటి వనరుల పంపిణీ, విద్యుత్, ఉద్యోగులు, ఉమ్మడి రాజధానిలో కలసి పదేళ్లు పనిచేయడం వంటి అనేకాంశాల్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వాల మధ్య సౌహార్దపూర్వక సంప్రతింపులు తప్పనిసరి. విభజన క్రమంలో భేదాభిప్రాయాల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొంటూ సముజ్జ్వల భవిత నిర్మాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెట్టపట్టాలు కట్టి సాగాలి!
(సంపాదకీయం, ఈనాడు, 21:02:2014)
__________________________________
Labels: Events, Hyderabad, India/Telugu, Indians/ Telugu, Life/telugu, Personality, Places, Telugu language, Telugu/ culture
0 Comments:
Post a Comment
<< Home