కుబేరుడికైనా
కుచేలుడికైనా క్షుద్బాధ ఒక్కటే. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని పెద్దలన్నదీ
అందుకే. లోకంలో బాధలు అనేకమున్నా, కవిహృదయం ఏనాడో తేటతెల్లం చేసినట్లు
'దురంత దుఃఖకర ఆకలిబాధ భరింప అశక్య'మన్నది ప్రత్యక్షర సత్యం.
మనిషికే కాదు, సృష్టిలో ప్రతిప్రాణికీ ఆకలిదప్పులూ తిండితిప్పలూ తప్పవు.
'ఆకలి కష్టము మిక్కిలి ఎక్కువ' అని చిలకమర్తి చెప్పినా, 'ఆకొన్న కూడె అమృతము'
అంటూ సుమతీ శతకకర్త చాటినా- సారాంశమొకటే, అన్నం ప్రాధాన్యం లెక్కకట్టలేనిది.
'అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను/మృగజాతికెవ్వడు మేతబెట్టె/వన
చరాదులకు భోజనమెవ్వడిప్పించె?' అని కవిగళం గుప్పించే ప్రశ్నలకొచ్చే
జవాబుల్లో ఆస్తిక నాస్తిక తేడాలుండొచ్చు. మనిషి ఆకలి తీర్చే నాథుడెవరన్నప్పుడు
వచ్చే సమాధానం- సాటి మనిషే! 'తల్లి పెట్టు తియ్య తాయిలములన్నియు తోటి బాలకులకు
పంచిపెట్టిన' ఆర్ద్రహృదయుడు బాల గౌతముడు. 'ఉపకారము తలచని
కఠినాత్ముడు ఉండి వ్యర్థము, మదిలో/ చపలత వీడక వ్రతములు తపములు
జేయుట వ్యర్థము' అన్న హితోక్తి అర్థపరమార్థాలు గ్రహించి వ్యవహరించే
మానవుడే మాధవుడన్నది సర్వజన సమ్మతం. అరణ్యవాసకాలంలో ధర్మజుడు
తనవెంట ఉన్నవారి భోజనార్థం సూర్యభగవానుణ్ని ప్రార్థించి అక్షయపాత్ర
సంపాదించాడు. ఎంత వడ్డించినా ఇంకా నిండుకుండలా ఉన్నందునే, అది ఎందరెందరి
ఆకలినో రోజూ తీర్చగలిగేది. అక్షయగుణ సంపన్నత ఆ పాత్రలో ఉందా, లేక
ధర్మరాజు ధర్మబుద్ధిలోనే అది ఉందా అన్నదొక్కటే కీలకం. 'ఖ్యాతి చేకూరు,
దీనులకు అన్నదానమిడు పుణ్యప్రాణికిన్' అని పలికిన ప్రౌఢకవి మల్లన మాటనే
బాటగా మలచుకుంటే, మానవజన్మకు అంతకుమించిన సార్థకత వేరొకటి ఉండదు!
ఉపకారబుద్ధికి
ప్రకృతే ప్రతీక. 'తరువులతి రస భార గురుత గాంచు/ నింగి వ్రేలుచు
నమృతమొసంగు మేఘు/ డుద్ధతులు గారు బుధులు సమృద్ధిచేత/
జగతి నుపకర్తలకు నిది సహజగుణము' అన్నట్లు ప్రకృతిమాతే సమర్పణశీలతకు
నిదర్శనం. పండ్ల బరువుతో వంగే చెట్ల కొమ్మలకు చేతికి అందుబాటులో ఉండటం
తెలుసు. గగనసీమలో షికారుచేసే మేఘాలకు వర్షించటమే తెలుసు. తోటివారికి
ఇవ్వటంలోని సంతృప్తి, సంతోషం మనసునిండా ఉన్నప్పుడు మానవుడూ అంతే.
పోషక సమృద్ధమైన గంజిని దారిపక్క కాలువపాలు చేయటంలో మానవత లేదు.
ఆ వృథాను అరికట్టడంతో పాటు, అన్నమూ జతచేర్చి ఆర్తులకింత అందించటంలోని
ధన్యతా అంతా ఇంతా కాదు. జాషువా కవినేత్రం తిలకించిన భారతంలో 'ప్రతిమల
పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు' వారెందరో ఉన్నారు. 'దుఃఖితమతులైన
పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్పని'వారి తత్వమే భాగ్యవిహీనత్వమన్న
ఆయన వాదం సంపూర్ణ హేతుబద్ధం. కాస్తంత తిండి దొరక్క అల్లాడిపోయిన
దుర్భర అనుభవం నాడు గుణనిధికి ఎదురైంది. చేతికందిన ఆహారం నోటిదాకా
చేరని వైనాన్ని తలచుకుని కుమిలిపోయిన దీనదశ అతడిది. 'అన్నం అమృత రూప'మని
శ్రుతులు, 'పరమాత్మ స్వరూప'మని స్మృతులు చాటాయి. అన్నపూర్ణగా ఆరాధించి,
'సుఖీభవ'గా ఆశీర్వదించి భారతీయతను వేనోళ్ల కీర్తించిన ఘనచరితా
మనకుంది. 'దానమునకు అధికమైన ధర్మము కలదే' అని హరిభట్టు,
'కరమున నిత్యాన్నదానము సురుచిర భూషణము' అంటూ భర్తృహరి ప్రస్తుతించిందీ
దానగుణశీలతనే. దానమివ్వనివాడు ధన్యుడు కాడని, కాలేడని స్పష్టీకరించిన
సుద్దులూ చాలా ఉన్నాయి మనకు. అన్నీ ఉన్నా ఎన్నో తెలిసినా, ఎక్కడో ఏ మూలనో- ఇవ్వటానికి
చేతులురాని వైనం, ఉన్నదాన్ని తెలిసో తెలియకో వృథాచేసే నైజం దాపురించింది.
స్థానికమో ప్రాంతీయమో జాతీయమో కాదు... ఈ పెనుజాడ్యం ప్రపంచవ్యాప్తం!
'వృథా చేయబోకు,
జన్మము సదా రాదు నీకు' అని తెలిసినవారున్నా అన్నార్తులకు లభిస్తున్న ఉపశమనం
కొంతే. మాటలూ చేతలకు అంతరాలున్నచోట 'కాగితమ్ము లిచట కరిపించువారు
శి/క్షింపబడుదు' రని లిఖించి పెద్ద/కాగితమ్ము గోడకంటించె దొరగారు' తరహా
వ్యవహార సరళీ ప్రమాదమే. చెప్పింది చేయటం, చేసిందే చెప్పటం సమర్థ శక్తివనరుగా
ఉత్తమ ఫలితాలనిస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్న భావన, బాధ్యతాయుత
వర్తన ఇళ్లు, భోజనశాలలు, విందులు, ఉత్సవాల్లో వెల్లివిరియాల్సి ఉంది. 'ఎంత
తింటావో అంతే వడ్డించుకో... తిన్నంత తిని, మిగిలిందంతా పారేసే అలవాటు మానుకో'
అంటూ అవ్వలూ తాతయ్యలూ, అమ్మానాన్నలు చెప్పే మాట ఇప్పుడు ఎంతమందికి చెవికెక్కుతుంది?
భోజనవేళ విధివిధానాలు, నియమనిబంధనలు ఉన్నట్టే వృథాను పరిహరించాలన్నదీ
ఓ విధానం, నిబంధన. 'కాంతి శాంతి సుఖమ్ము భాగ్యమ్ము నొసగు/ బహువిధారిష్టముల
భస్మీపటలమొనర్చు' జీవితమే జీవితం. అది సకల వృథాల నివారణ, సర్వవనరుల
సద్వినియోగంతోనే పరిపూర్ణమవుతుంది. విశ్వమంతటా అనునిత్యమూ లక్షల
టన్నుల ఆహారపదార్థాలు వృథా అవుతున్నాయి. దేశదేశానా ఒకవంక ఆకలికేకలు
మిన్నంటుతుంటే, మరోవైపున వ్యధార్తుల కంట రక్తాశ్రువులు చిందిస్తూ
అన్నపానీయాల వృథా విచ్చలవిడిగా సాగుతోంది. తగినన్ని రవాణావసతులు
లేక కొంత, గోదాముల్లో అస్తవ్యస్త పరిస్థితుల కారణంగా మరికొంత- దాపురించిన
దుస్థితి ఇది. ఎక్కువగా వడ్డించుకొని చివరికి కుప్పతొట్లలో పారేసే పంచభక్ష్య
పరమాన్నాల తీరు మరింత బాధాకరం. పొలం నుంచి పళ్లెంలోకి, అక్కడినుంచి
నోటికి చేరేలోగా ఎంతెంత వృథా! వీటన్నింటితో కోట్లమంది నిరుపేదల కడుపు
నింపవచ్చని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక ఈమధ్యే వెల్లడించింది.
ఐరోపా సంఘం ప్రకటించిన 'ఆహార వృథా వ్యతిరేక సంవత్సరం' ముగింపు
దశకు చేరుకుంది. నేటికీ దురవస్థ మారటం లేదంటే- 'నరుడి నెత్తిమీద
రుద్దిన దరిద్రం/ అది ఎప్పుడో కట్ట తెగే సముద్రం' అన్న కవి హెచ్చరికకు రూపం
వస్తున్నట్లేగా!
(ఈనాడు, 15:12:2013)
___________________
Labels: India/Telugu, Life/telugu, Religion, Telugu/ culture, The earth/ Telugu
0 Comments:
Post a Comment
<< Home