వ్యక్తిత్వానికి
నిలువుటద్దంగా, హుందాతనానికి నిదర్శనంగా భాసించే చీరకట్టుతోనే
లలనల అందచందాలకు ఇనుమడింపు. ప్రకృతి సౌందర్యాన్నీ ఆకృతి ప్రత్యేకతనీ
మేళవించిన ముదితల అలంకరణ 'అరవిచ్చిన విరజాజుల/ చిరునవ్వుల కలికి సిగ్గు
సింగారమ్ముల్/ సరికొత్త చీర మడతల/ మరుగున చెరలాడ' ప్రతి చూపరి
హృదినీ రాగరంజితం చేస్తుంది. వేల వత్సరాల చరితను తనలో ఇముడ్చుకొన్న
రెండక్షరాల 'చీర' భారతీయ విలక్షణతకే కాక సంప్రదాయ వస్త్రవిశిష్టతకూ
సిసలైన ఉదాహరణ. కవి భావన ఉప్పొంగినట్లు 'భారత అంగనామణి శభాషని
మెచ్చెడు సంప్రదాయ మొ/ప్పారగ కుంకుమాంకిత శుభావహమౌ వదనారవిందమై/
చీరను గట్టి లక్ష్మీకళ జిల్కుచు' నయనానందకరంగా ఆకట్టుకుంటాయి
కట్టూబొట్టూ! సింధు నాగరికతలో, గ్రీకు-రోమనులనాటి వేషధారణలో,
అజంతాది శిల్పకళాకృతుల్లో ప్రతిఫలించిన చీరల వన్నెచిన్నెలు వూహకైనా
అందేవి కావు. పురాణయుగాల నార చీర నుంచి అత్యాధునిక కాల వస్త్రప్రపంచందాకా
మార్పుచేర్పులు అనేకం చోటు చేసుకున్నాయి. ఇంటా బైటా, నిలయాలూ ఆలయాలూ,
పండుగలూ వేడుకలూ, విందులూ విహారాలూ, సంస్థలూ సంఘాల కార్యక్రమాల్లో
చీర సొగసు చూడతరమా? ధరించినవారినీ దర్శించినవారినీ ఒకేరకంగా
మెరిపించి మురిపించే చీరకట్టు వాస్తవానికో కళ, శాస్త్రం. 'పాద పంకజములకు
పారాణి అద్దేటి సరిగంచు నిగనిగల చక్కదనం/ నెన్నడుము చుట్టుకొని నెమలి
వన్నెలు జిల్కు రంగైన నడికట్టు రాచ ఠీవి'- ఆ సోయగాలకు అదనపు ఆకర్షణలు.
కాంత పైట జిలుగు, కుచ్చిళ్ల కులుకు సొబగు అంతగా మైమరపిస్తుంటే
ప్రియకాంతుడికి ఆ భామ అయస్కాంతం కావడంలో వింతేముంది?
'సంజ వెలుంగులో
పసిడి చాయల ఖద్దరు చీరగట్టి' సఖుని ఎదుట సరాగాలు ఆలపించిందో సుందరాంగి.
'కొప్పున మల్లెపూలు, జడ కుప్పెలు, బంగరు పట్టుచీర'తో విభుని అలరించిందో
భార్యామణి. అమందానంద కందళిత హృదయారవిందుడైన పతిదేవుడు
ఆ కులుకు మిటారి తళుకులొలుకు పయ్యెద నీడన సేదతీరకుండా ఉంటాడా?
'అందెనైతే గదా అరవింద ముఖి! నిన్ను చేరి నీ పదసేవ చేయుచుందు/ కోకనైతే
గదా కోమలి! నీ ఘన జఘనోరు సౌందర్య సరణి గందు' అని ముద్దుపళని
కావ్యపురుషుడు పడిన తపనే ఇక్కడా పునరావృతమవుతుంది. విభిన్న
సందర్భంలో- నాయిక చిలిపి కయ్యానికి దిగేసరికి, తటాలున ఆ చీర అంచుల్ని
చేతపట్టి తన వైపు తిప్పుకోబోయాడు నాయకుడు. 'అబ్బ ఉండండీ' అంటూ
తప్పించుకొనే యత్నంచేసిన ఆ కోమలాంగి విసురుపాటు వేళలోనే ఒంటిమీది
అద్దాలచీర మరీ మిలమిలలాడింది. 'పోతన చరిత్రము' నాయకురాలు కట్టిన
తెలి పట్టు పట్టపు ఉడుపు విజయకేతనంలా రెపరెపలాడిందట. ఆ మనోహరి
చీర చెంగావి అంచులు అతిలోక రసవంతాలైన వసంతాలనే చిత్రించాయి. వలపుల
రేరాణి పువ్వులాంటి తెల్లచీర కట్టుకుని, పాదాలకు పారాణి అలంకరించుకొని
కదిలొస్తుంటే 'కలహంస చలన విలాస లాస్యమా' అనిపించింది ఒకానొక నాయకాగ్రణికి!
మనసూ మమతా కలబోసిన ఏ కల(ల)నేత అయినా రసాధిదేవతకు సిరిజోతే
అవుతుంది మరి. వధువుకు ఒడికట్టు బియ్యమిచ్చేది, వరుడితో కొంగుముడి
బిగించేదీ చీరతోనే. ఆడపిల్లను అత్తవారింటికి పంపుతూ 'రస ప్రసార
రుచిర ప్రసరంబుగ' కన్నవారు అందించే చీరసారెలు ఆ ఇంతి మనోబలాన్ని
ఇంతింతలు చేస్తాయి. చీర అంచు కుచ్చిళ్లు తళతళలాడటమే వనితలకు
కళకళ. ముంగాళ్లమీదుగా జీరాడే పరికిణీలతో గలగల తిరగటం అమ్మాయిల
పర్వదినోత్సాహానికి సూచిక. పానుగంటి పుటల్లో వినిపించే గాజుల గలగల, అందెల
ఝుణఝుణలే కావు; కనిపించే బనారసు కోకలు, బరంపురం పీతాంబరాలూ
బహు రమ్యాలు. గద్వాల చీరలు కట్టుకున్నవారంతా కదలాడే తారలంటోంది సాంస్కృతిక
గీతిక. వర్ణవైవిధ్యాల వలువలతో ఒంటికి సొంపు, కంటికి ఇంపు ఉంటుందంటుంది
హృదయభావ వీచిక. క్లుప్తంగా చెప్పాలంటే- చీర నారీభూషణం!
'చెంగావి చీరలు
కొంగులు చెంగున/ జారంగ రంగైన నవమోహనాంగీ' అని వినవస్తుంటే పులకించని
మది ఉండదు. నిండైన చీరకట్టు గొప్పతనమైనా, జిలుగు పైట నీడలోని
పరవశమైనా, ఓణీ పరికిణీల పరవళ్లయినా... వేటికవే ప్రత్యేకం.
'వీరాంగనలైనచో నడుములన్ బిగచుట్టి పరాక్రమంబు లెస్సం కురిపించు
చీరలు' మహిళామణుల సహజ వనరులు. పల్లె పొలాల గట్లమీద పడుచుల
కట్టు వేరు. పరిణయ తరుణాన పట్టుచీరల రెపరెపలది మరో తీరు. సింగారం
దారంగా, అందాల రంగులే అద్దకంగా వెలసే నేత చీరలది ఇంకొక రీతి. మగ్గాలమీద
నేసే వస్త్రాల్లో రంగు హంగులతో పాటు పనిమంతుల కళాచాతుర్యమూ కలబోసి
ఉంటుంది. ఆ గ్రామీణ నైపుణ్యాన్ని గమనించటమంటే, అనల్ప శిల్పసౌందర్యాన్ని
సాంతం సొంతం చేసుకున్నట్లే. ఉక్కపోతలో వింజామర అయ్యేదీ, చలీ వానా
ఎండల్లో తల రక్షణ ఇచ్చేదీ చీరకొంగే. చీరనే మెత్తటి బొంతగా చేసి,
బుజ్జితల్లినో చిన్నితండ్రినో బజ్జోపెడుతుంది తల్లి. 'చీర ఉయ్యాలలోని చిన్ని
శిశువు... తల్లిజోలకు హాయిగా ఉల్లమలర' విశ్రమించడమూ సహజమే. ఆ
పసిపాపే కాస్తంత పెద్దయ్యాక 'తనకంటె పొడుగు చీరను/ తన మేనికి
చుట్టుకొనుచు, తన చేతులకున్/ కొనలందక కలతపడేటి' సన్నివేశం
నేత్రపర్వం. పుత్తడిబొమ్మ పట్టుచీర కడితే 'నీ కట్టుబడికి తరించేను
పట్టుపురుగు జన్మ' అన్న చలనచిత్ర కవి వర్ణనా అత్యంత ఉల్లాసభరితం.
సప్తవర్ణ తోరణాలుగా వెల్లివిరిసే చీరలతోనే అందాలూ ఆనందాలూ. కనువిందుచేసే
ఆ ఇంద్రధనువులు ఎక్కడో గగనంలో కాదు, ఇక్కడే గృహసీమల్లోనే ప్రభవించటం
సదా రమణీయం, బహుధా మననీయం.
(ఈనాడు, 26:01:2014)
________________________
Labels: India/Telugu, Liesure/Telugu, Life/telugu, Telugu/ culture
0 Comments:
Post a Comment
<< Home