'కాల్'మికులారా... ఏకంకండి!
'ప్రపంచ కార్మికులారా! ఏకం కండి' అంటూ కార్ల్ మార్క్స్ ఎప్పుడో పిలిస్తే, ఈమధ్యే మన దేశంలో సీపీఎం కార్మిక విభాగం సీఐటీయూ మరో అడుగు ముందుకేసి తాజా ట్రెండ్‌కు తగ్గట్టు బీపీఓ 'కాల్'మికులారా, చలో మీరంతా ఏకం కండి... పోరాడితే పోయేది మీ కష్టాల్ కన్నీళ్లే అంటూ ఇప్పుడు కొత్త 'కాల్' వినిపించి మార్కులు కొట్టేసే యత్నం మొదలెట్టింది. దానికితగ్గట్టే దేశంలో తొలిసారిగా కాల్ సెంటర్ ఉద్యోగుల కోసం కోల్‌కతాలో ట్రేడ్ యూనియన్‌కు ప్రాణం పోసి, దానికి ఐటీ సర్వీసెస్ అసోసియేషన్ అని నామకరణం పెట్టి బారసాల కూడా జరిపించేసింది.
కాల్ సెంటర్లలో ఉద్యోగాలు ఈమధ్యన హాట్ టాపిక్కులైపోయాయి. చూసి రమ్మంటే 'కాల్'చేసి వస్తారని పేరున్న వీరిలో 20 శాతం మంది తమ జీవిత భాగస్వాములు బీపీఓల్లో ఉద్యోగం చేయడానికి ససేమిరా ఇష్టపడడం లేదు. కేవలం పది శాతం మంది ఇందులో పది కాలాలు పాటు పని చేయాలనుకుంటుండగా మిగిలిన తొంభై శాతం మంది 'జాబు జాబంటావు జాబు నీదంటావు నీ జాబు ఎక్కడే చిలుకా' అనే అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇతర ఉద్యోగాలకు నిచ్చెనలు వేసుకుంటున్నారు. ఉన్న సంస్థలో ఎక్కువ మంది ఏడాదికి మించి పని చేయడంలేదు.
బీపీఓ ఉద్యోగుల్లో అరవై శాతం మంది వరకు మహిళలు ఉండడంతో ఆఫీసులోనూ, బయటా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అంతా దృష్టి సారిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో బెంగళూరులో ఓకాల్ సెంటర్ ఉద్యోగిని డ్రైవర్ చేతిలో అత్యాచారానికి, ఆ తరువాత హత్యకు గురికావడం, ఈ సంవత్సరంలో మరో ఉద్యోగినిని ప్రియుడే కాలయముడై కాటేయడంతో కలవరం ఎక్కువయింది. ఈ ఉద్యోగుల్లో డబ్బు వస్తుందన్న మాటే గానీ గుండె నిమిషానికి 172 సార్లు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుందని అనుభవజ్ఞులు చెప్తున్నారు. డ్యూటీ అయ్యాక ఇంటికి చేరేంతవరకు భయాందోళనలతో కాలం గడపాల్సి వస్తోందని స్వయానా మహిళా ఉద్యోగులే అంటున్నారు. దీంతో వారిని ఇళ్ల వద్ద దిగబెట్టేందుకు డ్రైవర్లుగా ఆడవారినే నియమిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మెరుపులా మెరిసింది. దీనిమీద అధ్యయనమూ జరిగింది. మహిళల చేతికి స్టీరింగ్ ఇవ్వడమే సబబు అని తేలింది. దేశం మొత్తంమీద 5 వేల మంది క్యాబ్ డ్రైవర్లు అవసరమని తెలియడంతో 'ఊయలలూపే చేతులు ఉర్విని ఏలుతాయి, కార్లనూ నడుపుతాయి' అనుకోక తప్పదు. మహిళా డ్రైవర్లకు శిక్షణ మొదలైంది. ఇందులో మన రాష్ట్రమే ముందుంది. మూణ్నెల్ల పాటు శిక్షణ పొందగానే వీరు స్టీరింగ్ లీడర్లు అవుతారు. మహిళా ఉద్యోగుల కోసం క్యాబ్‌లలో మహిళా గార్డులను కూడా నియమించడానికి సన్నాహాలు సాగుతున్నాయి.
పదే పదే షిఫ్టులు మారడం, నిర్విరామంగా టెలిఫోన్ కాల్స్‌కు జవాబులు చెప్పాల్సిరావడం, వీటిలో అనేక మంది క్లయింట్ల దురుసు కాల్స్, తిండి తిప్పలు నియమబద్ధంగా ఉండకపోవడం వంటి వాటితో ఒత్తిడి పెరిగి అనేక శారీరక రుగ్మతలతో కాల్‌సెంటర్ల సిబ్బంది సతమతం అవుతున్నారు(ట). 'బాస్'ను అదుపు చేయడమే ఇందుకు మార్గమని తీర్మానిస్తున్నారు. బాస్‌లు తిట్టే తిట్లన్నీ పడాలనే రూలేమీ లేదని, తమ రైట్లను రైట్‌ఫుల్‌గా వినియోగించుకొనే అవకాశాలూ ఉండాలని కలసికట్టుగా కష్టాలకు ఎదురొడ్డుదాం అన్న 'కాల్'తో కదం తొక్కుతున్న
'వీరినెవ్వరాపరీవేళ వీరి ధాటికోపలేరీవేళ' అని సంతసించి, పదండి ముందుకు పదండి... అంటూ వారిని ఎంకరేజ్ చేద్దామా!
- ఫన్‌కర్, Eenadu, 26:11:2006
-------------------------------------------------------------------------------------------
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home