My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, July 02, 2007

అక్షయ సుఖం

- డాక్టర్‌ సంధ్యావందనం లక్ష్మీదేవి


సుఖం రెండు రకాలు- తాత్కాలికం, శాశ్వతం. లోకంలో మనం వస్తువులు, పదార్థాల ద్వారా అనుభవించేది తాత్కాలిక సుఖం. ఆధ్యాత్మిక, తాత్విక చింతన ద్వారా అనుభవించేది శాశ్వత సుఖం.
శాశ్వత సుఖం బాహ్య వస్తువుల్లో లభించదు. అది అంతరంగంలోనే ఉంటుంది. సామాన్య వ్యక్తికి ఆ రహస్యం బోధపడదు. వివేకవంతుడు ''సుఖమక్షయ మశ్నుతే''-
నశించని సుఖాన్ని పొందుతాడు. దానినే శాస్త్రభాషలో అక్షయ సుఖమన్నారు.
గాఢనిద్రలో బాహ్య వస్తువుల్ని మరచి, సంకల్పాల్ని వదిలి జీవుడు అంతులేని సుఖాన్ని పొందుతాడు. ఆ సమయంలో ఏ దుఃఖంగానీ, బాధగానీ స్మరణకు రావు. గాఢనిద్రలోనే జీవుడికి ఇంత సుఖం లభిస్తే జ్ఞాన స్థితిలో, సమాధి స్థితిలో మరెంత సుఖం లభిస్తుందో ఊహించుకోవాలి. అనంతమైన ఆత్మసుఖం కోసం అల్ప సుఖాలను జీవుడు త్యజించాల్సి వస్తుంది. దానినే విషయ విరక్తి అంటారు. ఇంద్రియాలను జయించాలి. మనో నిగ్రహాన్ని సాధించాలి. కామక్రోధాదుల వేగాన్ని అణచివేయాలి. జీవిత కాలం అతి స్వల్పం. తెలుసుకోవాల్సిన ధర్మాలెన్నో ఉన్నాయి. ఆచరించాల్సినవి అనేకాలున్నాయి. అంతరాయాలు బహు విధాలు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనిషి ఎంత తొందరగా లక్ష్యాన్ని సాధిస్తే అంత మంచిది. మృత్యువు కబళించేందుకు పక్కనే ఉంది. వార్ధక్య రోగాలు మీద పడుతున్నాయి. వాటివల్ల అపకారం కలగకముందే, మృత్యువు సమీపించకముందే, ఇంద్రియాలు శక్తిహీనం కాకముందే అక్షయమైన ఆత్మానంద సుఖాన్ని మనిషి అనుభవించాలి.

శక్నోతి హైవయః సోడుం ప్రాక్బరీ రవి మోక్షణాత్‌|
కామక్రోధాద్భవం వేగం సంయుక్తస్స సుఖీనరః||

ఈ మానవ జన్మలో
అరిషడ్వర్గాలను నిగ్రహించి, శమదమాది సాధనలను అభ్యసించినవారికి మాత్రమే పరమార్థ సుఖం లభిస్తుందని మహాత్ములు చెబుతారు. భగవంతుడు ఆధ్యాత్మ సుఖ ప్రాప్తికై రాజమార్గాన్ని చూపించాడు. కోరికలను తగ్గించుకోవాలి. ఆశలను విడనాడాలి. విషయ సుఖాలను త్యజించాలి. భోగాభిలాషను దూరం చేసుకోవాలి. అసూయను, రాగద్వేషాలను అణచివేయాలి. అప్పుడే ప్రతి మనిషికీ ఆత్మానంద రూపమైన అక్షయ సుఖం సంప్రాప్తమవుతుందని మహర్షులన్నారు.

ఒక వర్తకుడు కొంత డబ్బుతో యాత్ర చేస్తున్నాడు. మార్గమధ్యంలో సత్రంలో, దేవాలయంలో విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాడు. వర్తకుని వద్ద ఉన్న డబ్బు మూటను చూసి, దొంగకు దాన్ని దొంగిలించాలనే దుర్బుద్ధి పుట్టింది. స్నేహితుని వలె నటిస్తూ అతనితో కలిసి యాత్ర చేస్తున్నాడు.

ఒక రోజు ఇద్దరూ సత్రం గదిలో పడుకున్నారు. వర్తకుడు గాఢ నిద్రలో ఉన్నాడు. కపట మిత్రుడు డబ్బు కోసం గదంతా వెదికాడు. కానీ డబ్బు కనిపించలేదు. మరుసటి రోజు స్నేహితునితో మాట్లాడుతూ మాటల సందర్భంలో 'రాత్రి మీ డబ్బు మూట ఎక్కడ దాచారు?' అని అడిగాడు. వర్తకుడు వెంటనే 'నీ దిండు కిందే దాచాన'ని జవాబిచ్చాడు. కపట మిత్రుడు ఆశ్చర్యపోయాడు. దొంగ అన్నిచోట్లా వెతికాడు కానీ, తన దిండు కింద చూడనే లేదు.

అట్లాగే
మనిషీ బ్రహ్మానంద రాశిని తన హృదయంలోనే ఉంచుకొని ప్రపంచమంతా ఆనందం కోసం వెదుకుతున్నాడు. కానీ తనలో వెదకడం లేదు. పరిపూర్ణమైన సుఖం తనలోనే ఉంది. మనస్సును నిగ్రహించాలి. నిర్మలంగా ఉంచాలి. అంతర్ముఖుడైన ఆ పరబ్రహ్మ ద్వారా సాధకుడు అక్షయ సుఖాన్ని అనుభవించాలి.
(Eenadu,02:07:2007)
-----------------------------------------------------------

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home