అట్ల తదియ
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
భారతదేశం కర్మభూమి. కర్మల వెనుక పరమాత్మోపాసన లక్ష్యంగా ఉంటుంది. పురుషులకు జపతపాల్లా స్త్రీలకు నోములు, వ్రతాలు రూపొందాయి. మంచి భర్తను ఆశిస్తూ, మాంగల్య సంరక్షణమే ధ్యేయంగా, భర్త పరిపూర్ణానురాగాన్ని, సత్సంతానాన్ని కోరుతూ మహిళలు ఆచరించడానికి ఎన్నో వ్రతాలను, నోములను నిర్దేశించారు.
'అష్టాదశ వర్ణాలకు అట్ల తదియ' అని తెనుగునాట జనశృతి. ''అట్ల తద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్'' అంటూ- శ్రవణానందంగా, హాస్య స్ఫోరకంగా తెలుగు సీమ పల్లెపట్టుల్లో పాటల సందడి, యువతుల కోలాహలం, ఉయ్యాలలూగడం వెరసి అట్ల తదియ వేడుక.
ఆరోగ్యవంతుడైన, యువకుడైన భర్తకోసం ఆడపిల్లలు పట్టే నోము 'అట్ల తదియ'. వివాహితలు కూడా భర్త ఆరోగ్యం కోసం పెళ్త్లెన పదేళ్ల వరకూ ఈ నోము నోచడం కద్దు.
ఆశ్వియుజ బహుళ తదియనాడు రాత్రి నాల్గవ ఝామునే నిద్రలేచి యువతులు అభ్యంగన స్నానం ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వేకువ వేళ ఉల్లి వేసిన గోంగూర పులుసు, పెరుగన్నం తినడం ఆచారం. గోరింటాకు పెట్టుకోవడం కొన్నిచోట్ల కనిపిస్తుంది. పగలంతా కఠిన ఉపవాసం ఉండి చంద్ర దర్శనమయ్యాక శుచిస్నాతలై, అట్లు వేసి గౌరీ దేవికి పది అట్లు నైవేద్యం పెట్టి భోజనం చేస్తారు. ఒకముత్త్తెదువుకు పది అట్లు వాయనం ఇస్తారు. వివాహితులు ఈ విధంగా పది సంవత్సరాలు నోము నోచి తదుపరి ఉద్యాపన చేసుకుంటారు. పదిమంది ముత్త్తెదువులకు పదేసి అట్లు, ఒక నల్లపూసల కోవ, లక్కజోళ్లు, రవికెలగుడ్డ, తాంబూలం, దక్షిణ, వాయనం ఇచ్చి ఆశీర్వచనం పొందడం సంప్రదాయం.
ఈ నోమును ఉమాచంద్రోదయ వ్రతమని, చంద్రోదయ గౌరీవ్రతమని అంటారు. చంద్రుడు ఈ వ్రతాధిపతి. చంద్రుడు ఔషధీపతి గనుక ఆరోగ్యవంతుడైన భర్తకోసం చంద్రోదయం చూసి వ్రతం పూర్తిచేయడం విశేషం.
అట్ల తదియ
యువకుడు, ఆరోగ్యవంతుడు భర్తగా లభించాలని 'సునామ' అనే రాకుమార్తె తోటి యువతులతో కలిసి అట్ల తదియ నోము పట్టింది. ఉపవాసంవల్ల నీరసించి ఆమె సొమ్మ సిల్లింది. దీంతో ఆమె సోదరులు కంగారుపడ్డారు. చంద్రోదయం చూసేవరకు భోజనం చేయరాదనే నియమం ఉండటంతో చేరువలో ఉన్న చింతచెట్టుకు అద్దాన్ని కట్టి, దానికి ఎదురుగా వరికుప్పను తగుల బెట్టి, చెల్లెల్ని లేపి అద్దంలో కనిపించే మంట చూపించి చంద్రోదయమైందని నమ్మించారు. ఆమె తృప్తిచెంది భోజనం చేసింది. తన తోటివారికి పడుచు భర్తలు లభించినా సునామకు ఆరోగ్యవంతుడు, యువకుడు భర్తగా లభించలేదు. ఎన్ని సంబంధాలు చూసినా యౌవ్వనులు కుదరడం లేదు. తన సోదరులు వయసు మళ్లినవానితో తన వివాహం జరిపిస్తారనే భయంతో రాకుమార్తె అడవిలోకి పారిపోయి మర్రిచెట్టు కింద పార్వతీ ధ్యానం చేస్తూ కూర్చుంది. పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహించి ఆమె నోము భంగమైన విషయం చెప్పి మళ్లీ నియమంగా నోము ఆచరించమంటారు. సునామ శ్రద్ధగా 'అట్ల తదియ' నోము ఆచరించి అందగాడైన యువకుని పతిగా పొందింది.
బీజంలో వృక్ష గుణాలన్నీ గర్భితమై ఉన్నట్లు, సత్యం, ధర్మం, శౌచం, నీతి, ఆరోగ్యం, మోక్షం మొదలైన సంప్రదాయ భావనలన్నీ ఈ నోములు, వ్రతాల్లో అంతర్భూతమై ఉన్నాయి. ఇందులో నిగూఢమైనది వితరణ వ్రతం. ధనధాన్యాలు, వస్త్రాలు, ఫలపుష్పాలు, ఆహార పదార్థాలు ఇతరులకు అందజేయడం అనే సద్భావన కూడా ఇందులో ఉంది.
(Eenadu, 28:10:2007)
____________________________
Labels: Telugu/ culture
0 Comments:
Post a Comment
<< Home