కుటుంబ బలం
భారతదేశం ఈ ప్రపంచానికి సగర్వంగా ప్రదర్శించగల ఆదర్శాల్లో ముఖ్యమైనది- కుటుంబవ్యవస్థ. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్ప అనుసరణ యోగ్యమైనదని గుర్తింపు పొందింది. ఇల్లనగా, కుటుంబమనగా- భారతీయ సంస్కృతికి మూలస్తంభాలై నిలిచాయి. పాశ్చాత్యుల దృష్టిలో ఇల్లంటే కేవలం బస, ఒక విశ్రాంతి మందిరం. మనకు ఇల్లంటే గృహస్థు ధర్మ నిర్వహణకు వీలైన కేంద్రం, ఒక ఆలయం. అలాగే కుటుంబమంటే వారికి వ్యక్తుల సమూహం. మనకేమో తీయని అనుబంధాల సమాహారం, ఆత్మీయతల కోవెల. అందుకే మన ఇళ్ళలో చుట్టరికంతోనే పలకరింపులు తప్ప, పేర్లతో పిలుపులు సాధారణంగా వినపడవు. కేవలం మనుషులే కాదు, పిల్లామేకా, చెట్టూచేమా, పశువూపక్షీ... అన్నీ మనకు మానవ పరివారంలో భాగమే. పాశ్చాత్యులు తమ పిల్లలకు అమ్మానాన్నలనే ఇవ్వగలరు. మన కుటుంబ వ్యవస్థ- బామ్మలనీ, తాతయ్యలనీ, మావయ్యలనీ, బాబయ్యలనీ, అత్తయ్యలనీ, పిన్నిలనీ ... ఇంకా బుజ్జిబుజ్జి తువ్వాయిల్నీ, పెరట్లో పచ్చని చెట్లనీ, వాటి తొర్రల్లో పిట్టల్నీ కుటుంబంలో భాగంగా బహూకరిస్తుంది. ఆడుకొమ్మని అప్పగిస్తుంది. బహువిధ సావాసాన్ని ప్రోత్సహిస్తుంది. ఇన్నిరకాల అనుబంధాల నడుమ, విలువైన మమతానురాగాల మధ్య అపురూపంగా పెరిగిన పిల్లవాడు- మంచి యోగ్యమైన పౌరుడవుతాడు. సమాజానికి సాయపడతాడు. తనకు, తనవారికి పేరుతెస్తాడు. ఒంటరితనాన్ని, భద్రతారాహిత్యాన్ని దగ్గరకు రానివ్వకుండా, పిల్లల్ని మన కుటుంబవ్యవస్థ చైతన్యవంతంగా తీర్చిదిద్దుతుంది. బాల్యంలో లాలనగా, విద్యార్థి దశలో క్రమశిక్షణగా, పదహారేళ్ళు వచ్చేసరికి స్నేహితుడిగా, పిల్లల్ని ఎలా సాకాలో మనకు పెద్దలు నూరిపోశారు. వివిధ రంగాల్లోని విజేతల్నీ, పోటీ పరీక్షల్లో ఉత్తమశ్రేణి వారినీ ఆరాతీస్తే- వారి వెనుక గొప్పదన్నుగా నిలిచిన పటిష్ఠ కుటుంబవ్యవస్థతో మనకు పరిచయం ఏర్పడుతుంది. నిర్జీవమైన యంత్రాల మధ్య పెరగడానికి, సజీవమైన బాంధవ్యాల మధ్య పెరగడానికీ తేడా ఎంతటిదో బోధపడుతుంది.
నిజానికి ఏ పిల్లవాడూ పుడుతూనే పండితుడు కాడు. సక్రమమైన పెంపకంవల్ల గడితేరి, లెక్కల్లో మనిషి అవుతాడు- మాతాపితృ కృతాభ్యాసో గణితామేతి బాలకః నగర్భ చ్యుతి మాత్రేణ పుత్రో భవతి పండితః అని మన పెద్దలు హితవు పలికారు. పెంపకం పట్ల శ్రద్ధ వహించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు. కొన్నేళ్ళ క్రితం పసిపిల్లవాణ్ని తోడేళ్ళు ఎత్తుకుపోయిన ఉదంతం చాలామందికి గుర్తుండే ఉంటుంది. పది, పన్నెండేళ్ళపాటు వాటితోనే బతికిన ఆ పిల్లవాడికి మొరగడం తప్పిస్తే- మాటలు రాలేదు. ఆహారం, ప్రవర్తన అన్నింటా తోడేళ్ళ పోలికలే గోచరించాయి. పెంపకం ప్రభావం ఎంత బలంగా ఉంటుందో దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజుల్లో- ఎన్నో కుటుంబాల్లో పిల్లల్ని వారి మానాన వారిని వదిలేసి, తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళవలసి వస్తోంది. వారి సంరక్షణపట్ల అవసరమైనంత శ్రద్ధ చూపలేకపోతున్నామని, సమయం కేటాయించలేక పోతున్నామని, మనసులో ఎక్కడో దోషభావన పేరుకుంటుంది. అందుకే చాలామంది తీరిక దొరగ్గానే- ఖరీదైన బొమ్మలు కొనితెచ్చి పిల్లల ముందు పరిచి, మితిమీరిన ప్రేమను ఒలకబోస్తారు. అతిగా ముద్దుచేస్తారు. పిల్లలు దీన్ని తేలిగ్గా గుర్తించగలరన్న విషయం మనం మరచిపోకూడదు.వారికి కావలసింది కీ ఇచ్చే బొమ్మకాదు- ముద్దిచ్చే అమ్మ! అమ్మానాన్నల స్పర్శలోని యాంత్రికతను వారు చటుక్కున గ్రహిస్తారు. గారం చూపరాని వయసులో తల్లిదండ్రుల అతిగారం మూలంగా పిల్లలు చెడిపోతారు. వారి బాల్యాన్ని పెద్దలు అపహరించకుండా ఉండటమే దీనికి పరిష్కారం. పరిష్కార మార్గాలను, పెంపకంలోని కిటుకులను వినడానికి ఎందరికో తీరిక లేదు. ఉన్నా చెప్పేందుకు పెద్దలూ లేరు. వాళ్ళను ఎప్పుడో వృద్ధాశ్రమాలకు తరలించేశాం కదా!
నిరుపహతి స్థలంబు, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడెము... ఆత్మకు ఇంపైన భోజనము... అంటూ కవిత్వం వికసించడానికి అనువైన పరిస్థితులను పెద్దన ఏకరువు పెట్టాడు. పిల్లల్లో వికాసానికి, కుటుంబంలో ఎలాంటి అనుకూల పరిస్థితులుండాలో బ్రిటన్ పరిశోధకులు ఇటీవల ప్రకటించారు. కుటుంబసభ్యులతో చక్కని బాంధవ్యాలు వాటిలో ప్రధానమైనది. ట్యూషన్లు పెట్టించడం, పిల్లల్ని చదువుకొమ్మని రాపాడించడంకన్నా కుటుంబసభ్యులంతా రోజూ కలిసి కూర్చుని భోంచేయగలిగితే- వారు తప్పక రాణిస్తారు చూడండి అంటున్నారు. ఎక్కువ కాలం తల్లిదండ్రులతో కలిసి జీవించే పిల్లలు మానసికంగా బలిష్ఠంగా ఉంటున్నారు. పరీక్షల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. కుటుంబమనేది వారికిస్తున్న మానసిక స్త్థెర్యం ఇంతా అంతా కాదు- అని ఇరవైవేలమందిని అధ్యయనం చేసిన బృందం తేల్చిచెప్పింది. వంటకు రుచి- వడ్డించే చేతిని బట్టి ఉంటుందనేవారు పెద్దలు. హాయిగా నవ్వుకుంటూ అందరూ కలిసి రుచులు పంచుకుంటూ భోజనం చెయ్యడం- కుటుంబంలోని అన్యోన్యతకు చిహ్నం. అలాంటి కుటుంబాన్ని పిల్లలకు కానుక చేయగలిగితే వారిలో వికాసం అద్భుత స్థాయిలో ఉంటుంది- అని ది టైమ్స్ పత్రిక ప్రకటించింది. పెరుగుమీద మీగడ కోసం, కూరలో జీడిపప్పు పలుకుల కోసం, అప్పడాల కోసం- అన్నదమ్ములతో, అక్కాచెల్లెళ్లతో వాదులాడటం, అమ్మ తాను త్యాగంచేసి తన కంచంలోవి మనకు పంచిఇవ్వడం... మన చిన్నతనాల్లోని సంబరాల్నీ, సందళ్ళనీ, అల్లర్లనీ- మనం మన పిల్లల్లో ఇప్పుడు చూడగలుగుతున్నామా? మంచి కుటుంబాన్ని వారికి మనం ఇవ్వగలుగుతున్నామా? ఏమో!
(ఈనాడు, సంపాదకీయం, 13:07:2008)
____________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home