శునకభోగం
''జీవహింస మానండి జీవుల మీవలె ప్రేమించండి'' అని ఓ తత్వం బోధిస్తుంది. మనుషులు మిగతా ప్రాణికోటికన్నా అధికులన్న మాట ఎంత వాస్తవమో, ఇతర ప్రాణుల సహాయ సహకారాలు లేకుండా మానవుడు మనుగడ సాగించలేడన్నదీ అంతే యథార్థం. నాగరికత ఇంతగా ప్రబలని రోజుల్లో మనుషులకు ఇతర ప్రాణులతో సన్నిహితత్వం ఎక్కువగా ఉండేది. కోడికూతతో కాని పల్లెసీమల్లో తెల్లవారేది కాదు. కవ్వపు చప్పుళ్ల నేపథ్యంలో కుక్కలు, పిల్లుల షికార్లు మొదలయ్యేవి. మెడలో చిరుగంటలు గణగణమని మోగుతుంటే బసవన్నలు పొలాలకు బయలుదేరేవి. బసవలకు, పాడిపశువులకు రకరకాల పేర్లుపెట్టి రైతు యువకులు ముద్దుముద్దుగా పిలుచుకునేవారు. అటు చుక్కపొడిచి ఇటు తెల్లవారగానే ఇల్లాళ్లు పాలు పితకటానికి తయారై- ''సురభి ధేనువరావె, సుందరిరావె, పాలవెల్లిరావె పాంచాలిరావె, త్రిపురసుందరి రావె తియ్యమామిడిరావె'' అంటూ గోమాతలను ఆప్యాయంగా పిలిచేవారని ఓ జానపద గీతంలో వర్ణించారు. గతంలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు తలపెట్టినప్పుడు కాబోయే వియ్యాలవారింట్లో ఎలుకల, పిల్లుల సంచారం అధికంగా ఉందా లేదా అని పరీక్షించేవారు. అలా ఉంటే వారింట్లో పాడిపంటలకు లోటులేదని గ్రహించి సంబంధం ఖాయం చేసుకొనేవారు. పూర్వం రాజకుమార్తెలు చిలుకలను, గోరువంకలను పెంచుకుంటే ఇప్పటివారు కుక్కపిల్లలను పెంచుకోవడంపై ఎక్కువ మోజు చూపుతున్నారు.
ఆ అమ్మడు బోలెడంత డబ్బుపోసి కొత్తగా ఓ బొచ్చుకుక్కను కొని తీసుకొచ్చింది. దాన్ని చూడటానికి రమ్మని తన బాయ్ ఫ్రెండును ఆహ్వానించింది. ''చూశావా మోహన్- ఎంత బాగుందో.. దగ్గరకెళ్లి పలకరించు'' అంది. ''కుక్క బాగానే ఉంది. దగ్గరకెళ్లమంటున్నావు. కొంపతీసి కొత్తవాళ్లను చూసి కరవదు కదా...'' అన్నాడు మోహన్. ''అది తెలుసుకుందామనేగా నిన్ను వెళ్లమంటున్నది'' అంది అమ్మడు చల్లగా.
తోటి ప్రాణులను పెంచుకుంటూ ముద్దుచేస్తున్నా, వాటిని చిన్నబుచ్చుతూ వ్యాఖ్యానాలు చేయటమూ మనుషులకు అలవాటే. ఆ అలవాటువల్లే- ''గాడిదకెందుకురా గంధంబు వాసన, కుక్కకెందుకు కుచ్చుల జీను...'' వంటి సామెతలు పుట్టుకొచ్చాయి. ''అందువల్ల ఆ జీవాలకు పోయిన పరువేం లేదు. ఆ సామెతలు సృష్టించినవారి బుద్ధే బయటపడింది'' అని జంతుప్రేమికులు వాదిస్తుంటారు. ''ఎవ్వరి గుణములు ఏమన్న మానవు... చక్క చేయరాదు కుక్కతోక...'' అన్నాడో శతకకారుడు. మా తోకల సంగతి మీకెందుకు, ముందు మీ బుద్ధులు సరి చేసుకోండి చాలు- అంటూ శునకాలు భౌభౌమంటూ కయ్యానికి దిగితే ఆయనేమంటాడో తెలియదు. సుమతీ శతకకారుడైతే ఏకంగా శునకాలను కనకపు సింహాసనాలపై కూర్చోపెట్టినా వాటి వెనుకటి గుణాలు మానుకోవని ఎద్దేవా చేశాడు. ''మనుషులు మాత్రం మానుకుంటున్నారా? అధికార సింహాసనాలపై కూర్చుంటున్నా గడ్డి తినటం మానుకుంటున్నారా, చెప్పులు కొరకటం మానేస్తున్నారా...'' అని కుక్కలు కొక్కిరిస్తే ఆయనేం సమాధానమివ్వగలడు? నేరాలను పసిగట్టడంలో శిక్షణ పొందిన శునకాల సహాయం పోలీసులు తీసుకోవడం పరిపాటి. పరమ శివుడంతటివాడు చెంచువేషంలో వేటకు బయలుదేరినప్పుడు నాలుగు వేదాలను నాలుగు జాగిలాలుగా మార్చి తీసుకువెళ్ళాడంటారు.
పాశ్చాత్య దేశాల్లో పెంపుడు కుక్కలేని ఇల్లు ఉండదంటే ఆశ్చర్యం లేదు. వాటిని ఖరీదైన దుస్తులతో, నగలతో అలంకరించటం కుక్కలకు ఫ్యాషన్‌షోలు నిర్వహించటం వంటి కార్యక్రమాలూ అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్సువంటి దేశాల్లో షరా మామూలు. జపాన్ వారికీ కుక్కలంటే మక్కువ ఎక్కువే. ఇప్పుడు కొత్తగా సరాది కార్పొరేషన్ అనే సంస్థ జపాన్‌లో కుక్కలకోసం ప్రత్యేకంగా ఓ వృద్ధాశ్రమాన్ని నెలకొల్పింది. ప్రపంచంలోకెల్లా జపాన్‌లోనే వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంది. రోజురోజుకు వీరిసంఖ్య పెరిగిపోతోంది. 2055 నాటికి జపాన్ జనాభాలో 40 శాతానికిపైగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులే ఉంటారని అంచనా. పెంపుడు జంతువుల ఆలనాపాలనా చూసుకోవడం వృద్ధులైన యజమానులకు కష్టతరమైన కార్యంగా పరిణమిస్తోంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగ వ్యాపకాల్లో తలమునకలై పోతుండటంతో ఇళ్లదగ్గర కుక్కల సంరక్షణను చూసేవారు లేక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనుషులకు వృద్ధాశ్రమాలు కొత్తేమీ కాదు. అటువంటి సౌకర్యమే కుక్కలకు ఎందుకు కలిగించకూడదు అనే ఆలోచన సరాది కార్పొరేషన్‌కు చెందిన నానా ఉచిడా బుర్రలో మెరిసింది. దాన్ని వెంటనే కార్యరూపంలోకి తెచ్చి, ఉత్తర టోక్యోలోని నాసు ప్రాంతంలో ప్రత్యేకంగా ఓ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఆశ్రమంలో కుక్కలకు సకల సౌకర్యాలు కలిగిస్తూ తమ యజమానులకు దూరంగా ఉంటున్నామనే బెంగ వాటికి కలగకుండా చేస్తున్నాడు. యజమానులు అప్పుడప్పుడూ వచ్చి తమ కుక్కలను చూసి పలకరించి ముద్దుచేసి పోవచ్చు. నిర్వహణ ఖర్చులకింద ఒక్కో కుక్కకు నెలకు లక్ష యెన్‌లను వసూలు చేస్తున్నా యజమానులు లెక్కచేయటంలేదు. వృద్ధాప్యంలోను తమ కుక్కలు కులాసాగా ఉండాలనే కాంక్ష ఈ ఆశ్రమంవల్ల తీరుతోందని వారు సంతోషిస్తున్నారు. పెంపుడు జీవాలకో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయడం జపాన్‌లో ఇదే మొదటిసారి అయినప్పటికీ మనదేశంలో అటువంటి కేంద్రాన్ని చెన్నైకి చెందిన అశోక్ చాలాకాలం క్రితమే ప్రారంభించాడు. ఆయన నడుపుతున్న కేంద్రంలో కుక్కలే కాక కొన్ని పిల్లులూ ఆశ్రయం పొందుతున్నాయి. కేరళ ప్రభుత్వమూ వయసు మళ్లిన ఏనుగుల సంరక్షణకోసం ఓ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఇవన్నీ వింటుంటే మూగజీవాలకూ దశతిరిగే రోజులొచ్చాయనిపించడంలేదూ...
(Eenadu,08:07:2007)
__________________________________
Labels: Animals/ telugu
0 Comments:
Post a Comment
<< Home