తెలుగు ఆత్మకథా వైభవం
తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలకు ఆద్యుడైన కందుకూరి వీరేశలింగం పంతులు ఆత్మకథకూ బాటలు పరిచి, 'స్వీయచరిత్రము' వెలువరించారు. 1911లో తొలిభాగం, ఆ తర్వాత నాలుగేళ్లకు రెండో భాగం అచ్చయ్యాయి. 'ఈ స్వీయచరిత్రము నందు వీరేశలింగ మహాశయుని జీవిత కథయేగాక యా కాలమందలి యాచారములు, కట్టుబాటులు, న్యాయస్థానములు వ్యవహారములు, దేశస్థితి వెుదలైనవెన్నో తేటతెల్లముగఁ దెలియును. అందుచేత నిది ఆంధ్రదేశము యెుక్క సాంఘిక చరిత్రమని చెప్పవచ్చును' అంటారు ఆ పుస్తకం గురించి చిలకమర్తి లక్ష్మీనరసింహం. కందుకూరి బాటలో నడిచి, సంఘసంస్కర్తగా, గ్రంథకర్తగా ప్రసిద్ధులైన చిలకమర్తి కూడా తన ఆత్మకథను 'స్వీయచరిత్రము' పేరుతో రాశారు.
పోరాట నేపథ్యం ఉన్నవాళ్లు ఆత్మకథలకు ఎక్కువగా శ్రీకారం చుట్టారనిపిస్తుంది. గదర్ పార్టీ యోధుడు దరిశి చెంచయ్య 'నేనూ నా దేశం', దాశరథి కృష్ణమాచార్య 'యాత్రాస్మృతి', ఆయన సోదరుడు దాశరథి రంగాచార్య 'జీవనయానం', కాళోజీ నారాయణరావు 'నా గొడవ' పేరొందిన ఆత్మకథలే. తన అంత్యక్రియలు ఎలా జరగాలో కూడా వివరంగా రాసిపెట్టిన రావి నారాయణరెడ్డి 'నా జీవనపథంలో' స్వాంతంత్య్రానంతరం తెలంగాణ పోరాట కొనసాగింపు విషయమై కమ్యూనిస్టుల మధ్య ఏర్పడిన విభేదాలను చక్కగా వెల్లడిస్తుంది. నల్లా నరిసింహులు 'తెలంగాణ సాయుధపోరాటం- నా అనుభవాలు' ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పనిచేసిన ఓ వీరుడి కథను తలపిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడు, సేవాగ్రామ్‌లో గాంధీజీతోపాటు రెండేళ్లు గడిపిన ఎం.ఎస్.రాజలింగం 'స్వీయచరిత్రము', 'బాపు-నేను' పుస్తకాలు రాశారు.
ఉద్యమాలతో సంబంధం లేకుండా రచనలో ఉన్న మాధుర్యాన్ని బట్టి తిరుమల రామచంద్ర 'హంపీ నుంచి హరప్పా దాకా', శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 'అనుభవాలు జ్ఞాపకాలు' గొప్ప ఆత్మకథలుగా పేరొందాయి. ఆత్మ చరిత్రాత్మ చరిత్రాత్మక నవలగా తన 'అనంతం' వెలువరించారు మహాకవి శ్రీశ్రీ. 'ఆత్మకథను, స్వీయచరిత్రగా రాసుకున్న తెలుగువాళ్ల సంఖ్య పూర్వం చాలా తక్కువ. ఇప్పుడు చాలా ఎక్కువ. సంస్కృత కవులు ఆత్మస్తుతీ పరనిందలకు పాల్పడలేదు గాని తెలుగు కవులు కుకవినింద మానలేదు... ఇదంతా కాలప్రభావం కావచ్చు. పూర్వ మార్గాన్ని అనుసరించటానికే ప్రయత్నిస్తాను' అని చెప్పుకున్న బూదరాజు రాధాకృష్ణ 'విన్నంత కన్నంత' రాసుకున్నారు. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు 'నా జీవితయాత్ర', రాష్ట్ర తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు 'నా జీవిత కథ', రాష్ట్ర తొలి రాజకీయ కార్టూనిస్ట్ రాంభట్ల కృష్ణమూర్తి 'సొంత కథ', రచయిత వేగుంట వోహన్‌ప్రసాద్ 'బతికిన క్షణాలు' పేర్లతో ఆత్మకథలు విడుదలచేశారు.
'ఆత్మచరితము' వెలువరించిన ఏడిదము సత్యవతి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన తొలి తెలుగు మహిళ. దీని రచనా కాలం 1934. మతం, సంఘం, దురాచారాలను నిరసించి, హేతుబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తిన వ్యక్తిగా ఆమెకు పేరుంది. నటి భానుమతి 'నాలో నేను' అంటూ తన గురించి చెప్పుకున్నారు. ఇంకా సినీ కళాకారుల్లో ధూళిపాల, పద్మనాభం, డి.వి.నరసరాజు విడుదల చేశారు. '...నా జీవితంలో పాఠకులకు ఆసక్తికరం కాని విషయాలు- ఘట్టాలు- చాలా వుంటాయ్. అవన్నీ వ్రాసి- వాళ్లను విసిగించడం ఏం న్యాయం? విసిగిస్తే- వాళ్లు తిట్టరు- కొట్టరు! పుస్తకం మూసేసి- అవతల పెడతారు!... అందువల్ల... అనవసర విషయాలు వదిలేసి చదివేవాళ్లకు- ఆసక్తికరమని నాకు అనిపించినవి మాత్రమే వ్రాయదల్చుకున్నాను' అన్నారు నరసరాజు.(Eenadu, 28:10:2007)
___________________________
Labels: Books, Telugu literature/ books
0 Comments:
Post a Comment
<< Home