'తెలుగుదనం '
తెలుగువాడు అనగానే జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డిగారి గేయం గుర్తుకు రాకమానదు.
శాతవాహునుల వంశాన పుట్టినవాడు
కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు
పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతమ్ము
పెద్దగద్దెలనేలి పేరుకెక్కినవాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.
పంచకట్టుటలో ప్రపంచాన మొనగాడు
కండువా లేనిదే గడపదాటని వాడు
పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ
గోంగూర కోసమై గుటకలేసేవాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.
నేల నల్దెసల డేరాలు నాటినవాడు
అన్ని మూసలలోన అట్టె ఒదిగిన వాడు
"ఏ దేశమేగినా ఎందుకాలిడినా"
ఆవకాయ వియోగ మసలెసైపని వాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.
మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు
భాయి భాయి అన్న చేయి కలిపేవాడు
తిక్కరేగిందంటె డొక్క చీల్చేవాడు
చిక్కులెరుగని వాడు చిత్తాన పసివాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.
తెలుగువారు తమ వేషభాషలు, సంస్కృతీ సంప్రదాయాలు, అచార వ్యవహారాలు, ఒక్కటేమిటి, అన్నింటా క్రమక్రమంగా 'తెలుగుదనం ' కోల్పోతున్నారనే విమర్శ ఈ మధ్య సర్వత్రా వినబడుతున్నది. మిగతా అందరు తమ సంస్కృతిని,అచార వ్యవహారాలను నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తుండగా ఒక్క తెలుగువారి విషయం లోనే ఇలా ఎందుకు జరుగుతున్నది? ఇది అందరు తీవ్రంగా ఆలోచిచవలసిన విషయం.
అంతకంటే ముందు అచ్చ తెలుగుదనం అంటే , ఎలా ఉంటుందో ఈ తరం వారు తెలుసుకోవలసిన అవసరం ఉంది.ఒకప్పుడు తెలుగువారి ఇళ్ళల్లో అడుగడుగునా, అణువణువునా తెలుగుదనం ఉట్టిపడుతుండేది. క్రమంగా పాశ్చాత్య సంస్కృతి ప్రభావం తెలుగువారిపై ఇతోధికంగా పెరిగిపొవడంతొ తెలుగుదనం అడుగంటి పోవడం ప్రారంభం అయింది.
ఈ నేపథ్యంలో తెలుగిళ్ళు, తెలుగింటి సంప్రదాయాలు , తెలుగువారి వేషభాషలు, తెలుగు వంటలు, తెలుగింటి మర్యాదలు, తెలుగువారి పలకరింపులు, అచ్చ తెలుగు తిట్లు, దీవెనలు, తెలుగువారి ఆచార వ్యవహారాలు ఎలా వుండేవో తెలుసుకుందాం.
తెలుగిళ్ళు, వాకిళ్ళు
తెలుగిళ్ళు, వాకిళ్ళు, ముంగిళ్ళు ఎప్పుడూ కళకళలాడుతూ పండగ వాతావరణంలో వుండటం ఒకప్పుడు సంప్రదాయంగా వుండేది. తెలుగిళ్ళు, వాకిళ్ళు నిత్యం అలంకరణలతో శోభాయమానంగా వుండేవి.ఇంటికి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ వుండేది. ప్రహరీ గోడకు వెదురుతోనో, కొయ్యలతోనో ఒక తడిక ద్వారం వుంటుంది. ప్రహరీగోడ వెంబడి నీడనిచ్చే పెద్ద పెద్ద చెట్లు వుంటాయి. కొబ్బరి చెట్లు తప్పనిసరి.కొబ్బరాకుల పలకరింపు లేనిదే తెలుగువారికి తెల్లవారదు. కొందరు వేప, మామిడి చెట్లు కూడా వేసుకునేవారు.
వీటికితోడు ముంగిట్లో పూలమొక్కలు, పెరట్లో చిన్న చిన్న కూరగాయల మొక్కలు, ఫల వృక్షాలు వుండేవి. ముంగిట్లో మందారం, నందివర్ధనం మొక్కలు వేసేవారు. ఈ రెండు రకాల పువ్వులు పూజకు విరివిగా ఉపయోగపడతాయి. పందిళ్ళు వేసి, మల్లె, సన్నజాజి తీగలు పాకించేవారు. దీంతో ముంగిలి అంతా ఉద్యానవనంలా కళకళలాడుతూ లోనికి అడుగు పెట్టగానే చల్లగా, హాయిగా సువాసనలతో స్వాగతం చెపుతున్నట్టు అనిపిస్తుంది.
వాకిట్లో ఒక పక్కగ ఇత్తడి గంగాళంలో నీళ్ళు, ఇత్తడి చెంబు వుంటాయి. వాకిట్లోనే కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలన్నమాట. ఇళ్ళు నేరుగా గదులతో మొదలుకావు. ముందుగా ఇంటికి ఇరువైపులా ఎర్రమట్టితో అలికి, ముగ్గులు పెట్టిన అరుగులు వుంటాయి. అరుగులు లేనిదే తెలుగింటికి సొగసు రాదు.
ఇంటికి ముందు ఒక విశాలమైన చావిడి ఉంటుంది. ఇది తలుపులు లేకుండా ఖాళీగ వుంటుంది. ఇది పిల్లలు ఆడుకోడానికి, మూటలు, సరుకులు దించుకోడానికి ఉపయోగపడే స్థలం. ఇది దాటితే సింహద్వారం,లేదా తలవాకిలి వుంటుంది. దీనికి పెద్ద పెద్ద గుమ్మాలు, దేవుళ్ళ బొమ్మలు, పువ్వులు, లతలు చెక్కిన పెద్ద తలుపు వుంటాయి. గడపలకు పసుపు కుంకుమలు అలంకరించి, గుమ్మాలకు తోరణాలు కట్టి వుంటాయి.
లోపల మొదటగా వుండే పెద్ద గదిలో దూలాల నుంచి పెద్ద ఇనుపగొలుసులతో వేలాడదీసిన ఉయ్యాలబల్ల వుంటుంది. ఇది లేనిదే ఇంటికి నిండుతనం రాదు. పిల్లలు ఎక్కి ఊగటానికి, పెద్దవాళ్ళు నిద్రపోవడానికి అనువైనది ఈ ఉయ్యాల బల్ల. మిగతా గదులు ఎవరి అవసరాన్ని, స్తోమతను బట్టి ఏర్పాటు చేసుకుంటారు. పూజగది మాత్రం ఒకటి తప్పనిసరిగ వుంటుంది.
ఇక పెరట్లో నీడనిచ్చే పెద్ద చెట్లతోపాటూ చిన్న చిన్న కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు వుంటాయి. ఒక కరివేపాకు చెట్టు తప్పనిసరిగా వేసుకుంటారు. నిమ్మచెట్లు వగైరా వుంటాయి. పెరట్లో ఒక చేదబావి వుంటుంది. ఈ బావికి గిలక వుండి, పెద్ద చేంతాడు, చేంతాడుకు ఒక బొక్కెన వుంటాయి.
పెరటి గుమ్మానికి ఎదురుగా తులసి కోట వుంటుంది. తులసి కోటకు చుట్టూ కొందరు అరుగు వేసుకుంటారు. సాయంత్రం వేళల ఇది కూర్చోడానికి హాయిగ వుంటుంది. తలవాకిలికి ఇరువైపులా, తులసికోటకూ- ముక్కోణపు ఆకారంలో గూళ్ళు వుంటాయి.ఇందులో సంధ్య దీపం పెడతారు.
పూజలు పునస్కారాలు
తెలుగిళ్ళు, పూజలు పునస్కారాలకు పెట్టింది పేరు. నాస్తికత్వం అంతగా ఉండేది కాదు. భగవంతుణ్ణి నమ్మేవారు. ఫండగ రోజుల్లోలాగానే ప్రతిరోజు తప్పనిసరిగా పెద్ద ఎత్తున పూజలు చేసేవారు. వృద్ధులకు పూజలు, అచారవ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. పూజ చేయనిదే పచ్చి మంచినీళ్ళయినా ముట్టని ఆచార సంపన్నులు వుండేవారు. మడి, తడి, కట్టుబాట్లు అధికంగా వుంటాయి. కొందరికి వుండేవికావు. దేవతార్చనలు, సుప్రభాతాలు,అష్టోత్తరాలు సాగేవి. సోమవారం, శుక్రవారాలలో పూజలు కొంచం పెద్ద ఎత్తున వుండేవి. ఇక పర్వదినాల్లో అయితే చెప్పనక్కర్లేదు.విశేషంగా భారి ఎత్తున పూజలు చేస్తారు. దేవుడి గదినీ, దేవుళ్ళ మంటపాలను విశేషంగా అలంకరిస్తారు. దేవుళ్ళ విగ్రహాలను తళతళలాడేలా తోమి వుంచుతారు. దేవుళ్ళ పటాలకంటే విగ్రహపూజ అధికంగా ఉండేది. పూజకోసం పంచపాత్ర, ఉద్ధరిణ, గంట, హారతి పళ్ళేలు, పూల సజ్జలు, పసుపుకుంకుమల గిన్నెలు, కలశం చెంబులు, వెండిబిందెలు, పానకం బిందెలు, పూల పళ్ళాలు వగైరా వుంటాయి.
పండుగలు
పండుగలను మనం ఇంకా మరచిపోనందుకు సంతోషించాలి. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పండగలు వుండేది తెలుగువారికేనంటే అతిశయోక్తి కాదు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, ఉగాది, శ్రీరామనవమి,గోకులాష్టమి, వినాయక చవితి, దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి(దసరా),బోనాల పండుగ, నరక చతుర్దశి, దీపావళి సాధారణంగా పెద్దేత్తున జరుపుకొనే పర్వదినాలు. మహాశివరాత్రి, వైకుంఠ ఏకాదశి, రథ సప్తమి, హనుమజ్జయంతి, వ్యాసపూర్ణిమ, మాఘపూర్ణిమ, వరలక్ష్మీవ్రతం, పోలాల అమావాశ్య, అత్లతద్ది, నాగుల చవితి, కార్తీకపూర్ణిమ, క్షీరాబ్దిద్వాదశి, సుబ్రమణ్యషష్టిలాంటివెన్నో పర్వదినాలున్నాయి. అయితే ఇందులో చాలా పండుగలను మనం దాదాపు మర్చేపోయాము. గుర్తున్నా ఆచరించేవారు లేరు. అసలు వీటి ప్రాధాన్యం ఏమిటో, చరిత్ర ఏమిటో, వీటిని ఎలా ఆచరించాలో కూడా చాలామందికి తెలియదు. శలవు వస్తేనే పండగలను గుర్తిస్తున్నారు. శలవులేని పండుగలు మరుగున పడిపోతున్నాయి. అయితే పత్రికాముఖంగానైనా వీటిని గురించి తెలుసుకోవడం అవసరం.
సంస్కారాలూ సంప్రదాయాలు
బారసాల, అన్నప్రాసన, నామకరణాలు, సీమంతాలు, గృహప్రవేశాలను కూడా సంప్రదాయంగా, కళాత్మకంగా నిండయిన తెలుగుదనంతో చేసుకోవడం తెలుగువారి ప్రత్యేకత.
పెండ్లి అంటే తెలుగువారింట పెద్ద సందడి.పెళ్ళిలో ముఖ్యాంశాలు- పెండ్లి చూపులు, చిన లగ్నాలు(నిశ్చితార్థం), తరలి వెళ్ళడం, విడిది, వరపూజ, బాసికా ధారణ, అడ్డుతెర, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్యధారణ, అక్షితలు, తలంబ్రాలు, పాణిగ్రహణం, సప్తపది, తొలిస్పర్శ (బొటనవేలు తొక్కియ్యడం) , మూడు ముళ్ళెయ్యదం, నాతిచరామి ప్రమాణం, అరుంధతీ నక్షత్ర దర్శనం, అంపకాలు, మూడు నిద్రలు, బట్టలివ్వడం (శోభన కార్యక్రమం) మొదలైనవి.
వంటలు, పిండివంటలు
తెలుగువారి పిండివంటలకు చాల ప్రత్యేకతలున్నాయి. ఇవి వ్యాపార దృక్పథంతో కాక కుటుంబ సభ్యులు అంతా కలిసి కూర్చుని తినడానికి, బంధుమిత్రులకు పంచడానికి, ప్రత్యేకంగా పర్వదినాల్లో తయారుచేసి, దేవునికి నైవేద్యం పెట్టడానికి ఉద్దేశించినివి. తెలుగు వారు నవకాయ పిండివంటలు చేస్తారు.
తీపి పిండివంటల్లో లడ్డు,రవ్వలడ్డు, తొక్కుడులడ్డు, పూర్ణాలు, బొబ్బట్లు, కజ్జికాయలు, సున్నుండలు, కాజాలు, పోళీలు, పరమాన్నం, గవ్వలు, అరిసెలు, పూతరేకులు, చలిమిడి, చిమ్మిలి, బూరెలు మొదలైనవి తెలుగువారి ప్రత్యేకమైన తీపి వంటలు.
తీరుతీరుగా ప్రతిరోజు కారపూస, చేగోడీలు,జంతికలు, చక్కిలాలు, పునుగులు, ఉండ్రాళ్ళు, పాలకాయలు, ఆవడలు, బజ్జీలు, పకోడీలు, కారబూంది, గారెలు, గట్టివడలు, పులిహోర, దద్దోజనం మొదలైనవి వున్నాయి.
తీరుతీరుగా ప్రతిరోజూ పలురకాల వంటకాలు, అధరువులు చేసుకొని తినడంలో తెలుగువారిని మించినవారు లేరు. ఒకప్పుడు తెలుగింట భోజనాలు అంటే ప్రతిరోజూ పండగ వాతావరణాని తలపింప చేసేవి. గుత్తివంకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, కొబ్బరి పచ్చడి, పులుసు, చారు, రోటి పచ్చళ్ళు, మిరపతొక్కు, చిత్రాన్నం, దప్పళం, కాకరపులుసు, వడియాలు, అప్పడాలు, ఒరుగులు, చింతకాయ పచ్చడి, పనసపొట్టు కూర, అరటిపువ్వు కూర, కంది పెసర పొడులు, పెరుగు పచ్చళ్ళు, ఊరగాయలు, నిల్వపచ్చళ్ళు- ఇవన్నీ తెలుగు ఇంట నిత్య వంటకాలు. పంక్తిభోజనాల వంటకాలు వేరుగా వుంటాయి.
తెలుగింటి ఆటలు
తెలుగిళ్ళలో పిల్లలలతోపాటూ పెద్దలు కూడా సరదాగా రకరకాల ఆటలు ఆడుకుంటుంటారు.
పిల్లల ఆడే ఆటల్లో గుజ్జనగూళ్ళు, బొమ్మలపెళ్ళిల్లు, కొయ్యబొమ్మలు, లక్కపిడతల ఆటలు, బుజబుజరేకులు, దాగుడుమూతలు, కూర్చుంటే కుర్రు మొదలైన ఆటలు ఆడుకుంటారు.
వయసులో ఉన్న అమ్మాయిలు చెమ్మచెక్కలు,కోలాటాలు, అట్లతదియ ఆటలు, ఉయ్యాలాటాలు,బుజబుజరేకులు, కుందుళ్ళు, తలబిళ్ళాటాలు
చేతిబిళ్ళాటాలు,దాగుడుమూతలు,గళ్ళాటలు ఆడుతుంటారు.
ఇక మధ్యవయసు స్త్రీలు వామన గుంటలు, గచ్చకాయలు, చింతపిక్కలు, అష్టాచెమ్మ, గవ్వలు, పులికట్ట,దోయాలు, పచ్చీసాటలు, పాచికలు, పావులాటలు అడుకునేవాళ్ళు. ఈఆటలకోసం గచ్చకాయలు, గుండ్రని రాళ్ళు, గవ్వలు, చింతగింజలు, చింతపిక్కలు, పాచికలు, వామన గుంటల పీటలు ప్రత్యేకంగా తెచ్చుకునేవాళ్ళు.
అచ్చ తెలుగు తిట్లు
తెలుగు తిట్లకు ప్రత్యేకతలున్నాయి. తెలుగువారి అచ్చతెలుగు తిట్లు కొన్ని ఆగ్రహం కాక నవ్వు తెప్పుస్తుంటాయి. కొన్ని ముద్దుగా, మురిపెంగా వుంటాయి. శుంఠ, అప్రాచ్యుడు, మొద్దురాచ్చిప్ప, బఢవ, వెధవాయి, చవటాయి, సన్నాసి, వాజమ్మ, ముద్దపప్పు, బడుద్ధాయి, అవతారం, నంగనాచి, సన్నసి, వాజమ్మ, ముద్దపప్పు, బడుద్ధాయి, నాలిముచ్చు, కుర్రకుంక, వెర్రిమాలోకం, చవట సన్నాసి లాంటి అచ్చ తెనుగు తిట్లు ప్రతి తెలుగింటా ప్రతిధ్వనిస్తుంటాయి.
నిజానికి అవి తిట్లు కాదు. దీవెనలే. "నేతి గారెలు వేడివేడిగా తింటాడనుకొంటే ఈ సన్నాసి ఎటు వెళ్ళడో?" అని బామ్మగారు దిగులులుపడుతుంది. మడికటుకొన్నాను. నన్ను అంటుకోకురా భడవా." అని అమ్మమ్మ ముద్దుగా కోప్పడుతుంది. "మా బడుద్ధాయి ఎంత బాగా పాడతాడో" అని తాతగారు మురిసిపోతారు. అలా!
తెలుగువారి లోగిళ్ళలో వాడే ప్రత్యేక తెలుగు పదాలు
తెలుగువారి లోగిళ్ళలో ప్రత్యేక పదాలు అలవోకగా వాడుతుంటారు.
అవి- దీపం పెద్దది చేయడం (దీపం తీసేయడం), తాళిబొట్టు పెరగడం(దారం తెగడం), కొంగు మాయడం (వాకిట వుండడం), కాలు మడుచుకోవడం (మూత్ర విసర్జనకు వెళ్ళడం), చుట్టం వచ్చాడు (కొత్తల్లుడు రావడం), వెళ్ళిరండి, వీళ్ళొస్తా, దయచేయండి మొదలైనవి.
తెలుగువారి ఆభరణాలు
కలిగినంతలో నాలుగు రకాల ఆభరణాలు చేయించుకోవడం తెలుగింట ఆనవాయితీగా వుండేది. తెలుగు ఆడపడుచులకు ఏడువారాల నగలు వుండేవి. కమ్మలు, దుద్దులు, జూకాలు, జుంకీలు, మాటీలు, చెంపసరాలు, ముక్కుపుడక, బేసరి, బులాకీ, నాగారం, పాంజేబులు, తోడాలు, జడకుప్పెలు, జడబిళ్ళలు, సూర్యవంక, చంద్రవంక, గాజులు, ఉంగరాలు, చామంతి బిళ్ళలు, దండకడియాలు, ఒంకీలు, వడ్డాణాలు, చంద్రహారం, కాసులపేరు,రుద్రాక్ష తావళాలు, ముత్యాల గొలుసులు, పెండేరాలు, పతకాలు, కొప్పుగొలుసులు, లక్కాకు పూసలు మొదలైన ఆభరణాలన్నీ ఒకాప్పుడు తెలిగిళ్ళల్లో విపరీతంగా ధరించేవారు. చిన్నపిల్లలు, కన్నెపిల్లలు, ముత్తయిదువులు, వృద్ధమహిళలు, యవ్వనంలోని పురుషులు, వృద్ధులు వేరు వేరు రకాల ఆభరణాలను ధరించేవారు.
పురుషులు చెవులకు పోగులు, మెడలో రుద్రాక్ష దండలు, కాళ్ళకు కడియాలు వుండేవి. చేతులకు కొందరు కంకణాలు ధరించేవారు. నుదుట గంధం, కుంకుమ, విభూతి బొట్లు తప్పనిసరిగా ధరించేవారు.
ఉడుపులు
ఆడపిల్లలు పట్టులంగాలు, పావడాలు, రవికెలు, పైటలు ధరించేవారు. స్త్రీలకు ఎన్నోరకాల చీరలు, రవికెలు అందుబాటులో వుండేవి.
పురుషులు పలురకాల ధోవతులు, పంచలు, చొక్కాలు, జుబ్బాలు, ఉత్తరీయాలు, కండువాలు, తలపాగాలు కూడా ధరించేవారు.
ఆచార వ్యవహారాలు
తెలుగిళ్ళలో అచారవ్యవహారాలు, పట్టింపులు అధికంగా వుంటాయి. ఇంట్లోకి వచ్చేముందు ఆరుబయట పాదరక్షలు వదలి, కాళ్ళు కడుక్కొని రావాలి. శుక్రవారాలు స్త్రీలు పసుపురాసుకుని , నూనె అంటుకొని తలస్నానం చేయాలి. గడపలకు పసుపు కుంకుమలు అలంకరించాలి. ప్రతిరోజూ సంధ్య దీపం వెలిగించి నమస్కరించాలి. పండుగనాదు నలుగు పెట్టుకుని స్నానం చేయాలి.
రోటిపైన కూర్చోకూడదు. గడపమీద నిలబడి తుమ్మకూడదు. రోలును బోర్లించ కూడదు. దీపం పెట్టే సంధ్యాసమయంలో భోజనం చేయకూడదు. ఆషాడమాసంలో అత్తాకోడళ్ళు, నూతన వధూవరులు ఒకే ఇంట్లో వుండకూడదు. నూనె బదిలివ్వకూడదు. ఉప్పు, నూనె, ఇనుపవస్తువులు చేతిలో వేయకూడదు. ఇలాంటివి ఇంక ఎన్నో!
ఈ ఆచార వ్యవహరాలను ఏ కొద్దిమందో మాత్రం ఇప్పటికీ ఆచరిస్తున్నారు.
తెలుగువారి కళలు
పద్యపఠనాలు, శతకసాహిత్యాలు, అవధానాలు తెలుగువారి ప్రత్యేకతలు. తోలుబొమ్మలాటలు, హరికథలు, బుర్రకథలు, జోలపాటలు, తుమ్మెదపదాలు, వీధిభాగవతాలు, గంగిరెద్దుల ఆటలు, తెలుగువారికే చెల్లు. కూచిపూడి నృత్యాలు, భరత నాట్యాలు, అంధ్ర నాట్యాలు, జానపద నృత్యాలు, పేరిణి, తాండవం, భామాకలాపం, కోయ నృత్యాలు, యక్షగానాలు తెలుగువారి కళల్లో కొన్ని.
తెలుగువారు ఏపని చేసిన తెలుగుదనం ఉట్టిపడేలా చేయడం ఒకప్పుడు ఆనవాయితీగా వుండేది. తెలుగుజాతికి గర్వకారణమైన తెలుగుదనాన్ని పునరుద్ధరించుకోవడం మనందరి బాధ్యత.
('తెలుగుదనం ' జంధ్యాల భారతి, ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 10/04/2003 మరియు
'మన వారసత్వం ' రచన, సేకరణ: దాక్టర్ వెలగా వెంకటప్పయ్య, సందకుడ్:దాక్టర్ బాబు ఆర్. వడ్లమూడి[మే, 2003] )
_________________________________________________________________
Labels: Telugu/ culture