భారతీయ సంస్కృతికి మూలకందాలు మూడు గ్రంథాలు. వాల్మీకి
వ్యాసమహర్షుల విరచితాలు రామాయణ భారత భాగవతాలు. తొలి రెండూ ఆంధ్రావనికి
అందాయి. భాగవతంమీదే ఎవరిచూపూ పడలేదు. చూపుపడినా చేయిసాచే సాహసం ఏ కవీ
చేయలేదు! హయగ్రీవ బ్రహ్మవిద్యగా నామాంతరం ఉన్న భాగవతం కవిత్వ కార్కశ్యానికి
పరాకాష్ఠ కావడమూ కారణం కావచ్చు. ఆ మహాభాగవత ఫలం ఒక తెలుగు చిలుక కోసం
మీదుకట్టీ ఉండవచ్చు. వీరశైవాన్ని ప్రచారం చేసిన సోమనాథుని 'పాలుకుర్తి'కి
చెయ్యిచాస్తే అందే దూరంలో ఉన్న బమ్మెర గూటిలో ఉంది ఆ చిలుక. పేరు పోతరాజు.
భోగినీ దండకాన్ని ఒక రాచవలరాజు వీనులకు విందుగా వినిపించిన రాసిక్యానుభవం
అప్పటికే ఆ శుకరాజు సొంతం. ఆ 'శుకముఖ సుధాద్రవం'గా భాగవతం అందటం తెలుగువారు
చేసుకున్న అదృష్టం. సంస్కృత భాగవతం పారాయణం నిరంతరాయంగా సాగే రోజుల్లో ఏ
దివ్యక్షణాన పోతన్నకు శ్రీమన్నారాయణ ప్రపంచాన్ని వివరించాలన్న కుతూహలం
రేగిందో! పనిగట్టుకొని ఒక నిండుపున్నమి రాత్రి గోదావరీనది సైకతాన మహేశ్వర
ధ్యానానికని సాగడమేమిటి! కాంతాసమేతుడైన ఓ రాజముఖ్యుడు కనిపించి 'భవబంధ
విముక్తి' మార్గంగా భాగవతాన్ని తెలుగు చేయమని పురమాయించటమేమిటి! అది
శ్రీరామచంద్రమూర్తి ఆనగా పోతన భావించడమేమిటి! చరిత్రకు అందని సంఘటనల
వాస్తవావాస్తవాలను నిర్ధారించడం కష్టం కానీ... 'శూలికైన దమ్మి చూలికైన'
తెలిసి పలుకుట కష్టమైన భాగవతాన్ని 'అందరూ' మెచ్చే విధంగా బమ్మెర పోతన
తెలుగు చేయడం మాత్రం ఏ చరిత్రా కాదనలేని సత్యం. అది, తెలుగు భాష చేసుకున్న
పుణ్యం!
భాగవతం తెలుగుసేతే ఒక విశేషమైతే... భాగవతంలోని విశేషాలు
ఇంకెన్నో! కమ్మని కావ్యాన్ని ఏ ప్రభువుకో అంకితమిచ్చి వెయ్యిన్నూట పదహార్లు
సంభావనగా పుచ్చుకొమ్మని ఒత్తిళ్లు వచ్చే ఉంటాయి. పోతరాజు అంతపనీ
చేస్తాడేమోనన్న భీతితో కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడలు కవిగారి ఇంటి
గడపన చేరి 'కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ' ఏడ్చిందట. 'నిను నా కటికిం
కొనిపోయి యల్ల క/ ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము'మని భారతికి
పోతన బాస చేశాడట. రాజుల్ని కాదనడానికి ఎంత సాహసం కావాలీ! ప్రారంభంనుంచీ
బమ్మెర పోతనది ప్రత్యేక మార్గమే. రామచంద్రుని ఆనతో చేస్తున్నానన్న రచన
ఆరంభంలోనే పోతన సంప్రదాయానికి విరుద్ధంగా నాలుగు ఉత్పలమాలలతో
శ్రీకృష్ణుడికి షష్ఠ్యంతాలు సమర్పించాడు. కృష్ణ చరిత్ర మధ్యలో శ్రీరామ కథను
విస్తారంగా చెప్పి ఆ లోటును పూడ్చుకున్నాడు. వీరశైవ మతానుయాయి అయిన కేసన
వంశాన పుట్టీ పరమ భాగవతోత్తముడిగా రూపాంతరం చెందిన విచిత్ర చరిత్ర
పోతరాజుది. అర్థంలేని నిషేధాలను ధిక్కరించడంలో పోతన్నది ఎప్పుడూ ముందు
వరసే. లాక్షణిక ధిక్కారం చేసి వేశ్యయే కావ్యనాయికగా తెలుగులో 'భోగినీ
దండకం' రాసి కొత్త ఒరవడి పెట్టిన సృజనకారుడు పోతరాజు. సంప్రదాయ లక్షణంగా
వస్తున్న కుకవి నింద చేయనేలేదు. శబ్దాలంకార ప్రియుడేకానీ... వ్యర్థ
పదప్రయోగాలకు, అపస్వరాల లౌల్యానికీ పోతన బద్ధ విరోధి. సంస్కృత
సమాసభూయిష్ఠమైన రచనలను ఒక వర్గంవారు ఆదరించేవారు. అచ్చ తెనుగు రాతలను
మెచ్చుకునే విజ్ఞులు మరికొందరు. మధ్యేమార్గంగా అందరినీ మెప్పించే శైలిని
స్వీకరించి తెలుగు భాగవతాన్ని పండిత పామర శిరోధార్యంగా మలచిన లౌకిక అలౌకిక
యోగి పోతన- పోతపోసిన ప్రజాకవి.
పోతనగారి మహాశివుడు హాలాహలం
మింగబోతున్నా పక్కనే ఉన్న సర్వమంగళ వారించదు. జగత్కల్యాణం ఆ జగన్మాత
లక్ష్యం. సంప్రదాయానుసారం గొల్లలు చేసే ఇంద్రయాగాన్ని ప్రశ్నించి 'కానలు,
కొండలు, పసుల గాదిలివేల్పులు గొల్లవారికిన్' అంటూ ప్రకృతిపూజ అవసరాన్ని
ప్రతిపాదిస్తాడు శ్రీకృష్ణుడు. గీతలో చెప్పిన కర్మయోగ ఆవశ్యకతను
ప్రజోపయోగంగా మలచడం ఆ నాయకుడి లక్షణం. కాళింది మడుగులో పడ్డ బిడ్డను
తలచుకొని ఎర్రన్న సృజించిన యశోదమ్మ ఎడాపెడా ఏడిస్తే... పోతన్న సృష్టించిన
తల్లిమాత్రం 'తండ్రీ! నీవు సర్పదష్టుండవైయున్న నిచట మాకు ప్రభువు
లెవ్వరింక' అని రోదిస్తుంది. బిడ్డ క్షేమంకన్నా ముందు ప్రజల యోగక్షేమాల
చింత ఆ తల్లిది. బాల ప్రహ్లాదుడు జాతి లక్షణానికి విరుద్ధంగా హరిభక్తిలో
పడినప్పుడు హిరణ్యకశ్యపుడిలోని తండ్రి స్వజాతి రక్షణ గురించే
బెంబేలుపడతాడు. శ్రీకైవల్య సిద్ధికని శ్రీకారం చుట్టిన భాగవత రచనలో పోతన
అడుగడుగునా తపించింది కేవలం మోక్షప్రాప్తి మార్గాలకోసమే కాదు. తనసృష్టి-
తనచుట్టూ ఉన్న లౌకిక లోకానికీ ఒక చక్కని సత్వదృష్టినీ కలిగించాలన్న తపన
పోతనది. అడుగడుగునా పాఠకుల గుండెను తడుముతూ, తడుపుతూ సాగింది కనుకనే
శ్రీమదాంధ్ర మహాభాగవతం కాలపరీక్షకు ఎదురు నిలిచి తెలుగువారి గుండెల్లో
మతాలకతీతంగా నిలబడింది. భాగవతం ప్రజాదరణకు కేవలం భక్తి ప్రభావమే కాదు-
మంద్ర గంభీర గమనంగల శైలీకారణమే! 'పోతన భాగవతం సహజధారా విలసితం, ఓజః ప్రసాద
గుణోజ్జ్వలితం' అంటారు వామపక్ష భావాభిమాని అయిన ఆరుద్ర! భాగవతంలోని వివిధ
ఘట్టాలు, పలుకుబడులు, పద్యాలు తెలుగుజాతి జీవనంలో నీళ్లలో పాలుగా
కలగలిసిపోయాయి. కరుణశ్రీ అన్నట్లు 'అచ్చపు జుంటి తేనియల, నైందవ బింబ
సుధారసాల గో/ ర్వెచ్చని పాలమీగడల, విచ్చెడి కన్నె గులాబి మొగ్గలన్/
మచ్చరికించు మధుర మంజుల మోహన ముగ్ధ శైలి'ని తెలుగు మనసులకు రుచి చూపించిన
సుకవి పోతన. అలాంటి కారణజన్ముణ్ని కన్న తెలుగుతల్లి ధన్యచరితే కదా!
(14:10:2012, ఈనాడు )
__________________________
Labels: Telugu language, Telugu literature