("ఫిడేలు రాగాల డజన్","కయిత నా దయిత","పఠాభి పంచాంగమ్" మొ.కొన్ని పుస్తకాలను, "పెళ్ళినాటి ప్రమాణాలు", "సంస్కార"(కన్నడం)సినిమాలను మనకు జ్ఞపకాలుగా మిగిల్చి తిక్కవరపు పట్టాభి రామ రెడ్డి గారు 06-05-2006 న పరమపదించారు.)
------------------------------------------------------
"నాకు విచిత్రంబగు భావాలు కలవు
నా కన్నులందు టెలిస్కోపులు
మయిక్రాస్కోపులున్నవి.
నా యీ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తోపద్యాల్ నడుముల్ విరగదంతాను
చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని
చాల దండిస్తాను
ఇంగ్లీషు భాషా భాండారంలోనుండి
బందిపోటుంజేసి కావల్సిన
మాటల్ను దోస్తాను
నా యిష్టం వచ్చినట్లు జేస్తాను
అనుసరిస్తాను నవీనపంథా,
కానీభావ కవిన్మాత్రము కాన్నే: నేనహంభావ కవిని."- పట్టాభి.
-------------------------------------------------------
కొన్ని పఠాభి పన్నులు(puns)~:
"తీసినా వేసినా బాధ కల్పించునవి పన్నులు."
'ఉద్యోగులలో రెండు రకాల వారున్నారు
చేసేవారు కొందరు
కాజేసే వారు కొందరు.'
'ఈనాడు అంతా తారుమారు,
ఆశలు మన్ను ముట్టినవి,
ధరలు మిన్ను ముట్టినవి.'
'వెలయాలు చాల ప్రియము,
ఆలు చాల సరసము.'
'సధవ-తలిరుబోడి
విధవ-తలబోడి.'
'సారాయి త్రాగినవాడు
షరాయి వీడిపోతున్నా తాను
వయిస్రాయి ననుకొంటాడు.'
'పాపం చేయకుండా గర్భం దాల్చింది
క్రీస్తుమాత మరియమ్మ
గర్భం దాల్చకుండా పాపం జేయాలని
కొందరు సుందరీమణుల కోరిక.'
'సంఘ మర్మం- ఒకని కూతురు
మరొకనికి పెండ్లాము
వేరొకనికి తల్లి కూడాను.'
'చాలామంది నీతివంతులుగ వుండటం
చాలినంత దైర్యం లేకపోబట్టి
అవినీతికి అతి సాహసం కావాలి.'
'పంట పండించటంలో పూజ్యమైనా
కోతలు కోయడంలో మొనగాడు.'
'ప్రపంచములోని అభ్యుదయం
చాల పాళ్ళు సంశయాత్ముల వల్ల సమకూరినదే.'
'నిరాశకన్ననూ దురాశ మంచిది.'
'తమిళదేశస్తులు గలభా చేయడం తక్కువ
ఇంతకూ వారి భాష 'అరవం'గదూ.'
'నీవు కూర్చునట్టి డబ్బు ఇతర్ల పాలు
నిజానికి నీవు ఖర్చించునదే నీది.'
'కేంద్ర ప్రభుత్వంలో చాలా
డిల్లీ డాలీయింగు.'
'రష్యన్లకు నిండా తాగడం 'వాడ్క'.'
'సినిమా వ్యాపారం బ్రహ్మాండమైన లాటరీ
అదృష్టం ఉన్నవాడు 'వాసన్'.
లేనివాడు ఉపవాసన్.'
'ముండ మోయుటకన్న
బండ మోయుట మేలు.'
"స్త్రీకి శృంగారవంతమ్ము చీర,అని
సుమతి అంటాడు
చీర లేకున్న స్త్రీ మరీ శృంగారవంతమంటాను."
"గాందీమహాత్ములు ఒకే ఒక్కరు
బ్రాందీ మహాత్ములు మటుకు పెక్కురు."
"ఈ కాలం విద్యార్థులలోన
శాస్త్ర విజ్ఞానానికి చాలా ప్రాముఖ్యం
అందులో మరిన్నీ కామశాస్త్ర విజ్ఞానం."
'పదవి కోరను నేను
నేను కోరేది పెదవి."
"పాశ్చాత్య సంఘం~: తన స్నేహితులంతా తన భార్యను, తాను తన స్నేహితుల భార్యను కామించుటకు వీలున్న విధానము."
'ఎయిర్ హోస్టెస్ = విమానవతి."
'బాగుపడాలన్న
భయం వద్దు భక్తి వద్దు."
'స్కిన్ డాక్టర్ల వద్దకు పోవటం పొరబాటు
చర్మం వలిచేస్తారు."
"కాంచనం, కాంత, కాదంబరి అనేవి
జగత్తులో ముక్కాలు
మిగిలింది నేను."
"హరి సేవవల్ల స్వర్గప్రాప్తి సందిగ్ధము
మనోహరి సేవవవల్ల
భూలోకమే స్వర్గతుల్యము."
"నిత్యమూ నాకు ఆలు
బహువచనంగానే ఇష్టము."
"కులతత్వము ఖిలానికి హేతువు
కుల హీనులదే భవిష్యత్తు."
"విధవకు గుడితీసి కొమ్ములు పెట్టేట్లు
చేశారు వీరేశలింగంగారు."
"మనస్సును స్వాదీన మందుంచుట సులభమే నాకు
దేహాన్ని స్వాధీనమందుంచుట కష్టాతి కష్టమగు కార్యము."
"కాంతల జయించుట ద్వివిధంబు
1.అందినచో జుట్టి పట్టి కిందకు రమ్ము
2.అందనిచో కాళ్ళు పట్టి పయికి లెమ్ము."
"చెరకు చనుటకన్నను
చెరకు తినుట సులభము."
"ముడి విప్పిన కోక శాస్త్రము
సులభంగా బోధ పడుతుంది."
"పణ్యాంగన పుణ్యానికి వస్తుందా, పాపం."
"మరుని కయ్యానికి మడతి కాలు
దువ్వినాడు మనోహరుడు."
"కాంతతో ప్రశాంత జీవితం దుష్కరము
కాంతవినా ప్రశాంత జీవితం దుస్సాధ్యము."
"కాముకి మనసు 'మెత్త'మనసు."
"నరలోకమునకు 'క' ప్రత్యయం చేరుటవల్ల నరకలోకం ఏర్పడుతుంది అంతేగాని వేరే నరకలోకం లేదు."
"జారత్వం ఎక్కువై వాని జన్మ శ్రుతిమించి రోగాన పడింది."
"రాగము వల్ల ప్రణయమువిరాగము వల్ల ప్రణవము."
"ఉద్యోగం పురుష లక్షణంనిరుద్యోగం మహాపురుష లక్షణం."
"తలంబ్రాలు కాదుఅది తలన్ వ్రాలు."
"దంతి కన్న వదంతి పెద్దది."
"దగ్గుకు పరుష స్వరూపమునే క్షయ అంటారు."
"నిలకడగా నీరు త్రాగుట కన్నా పరుగెడుతూ బీరు త్రాగుట కొందరికిష్టం."
"వధూవరులకు చదువుకన్నా చదివింపు లెక్కువగా ఉన్నవి."
"చనిపోయిన వాని నామస్మరణం కన్న వాని వీలునామస్మరణం చేస్తుంటారు బంధు మిత్రులు."
'పెళ్ళి కావలసిన ఆడ పిల్లలకుపరధ్యానము కాదు 'వర'ధ్యాన మెక్కువ."
"సామాన్యులనే మాన్యులుగా తలంచు పద్దతి డెమోక్రసి."
"విప్పుటకు వీలుకానిది ప్రేముడి."
"నరుల సమరుల కావించునవే మరులు."
"వారనారి యింటికి చాలా 'రూక'పోకలు జరుగుతాయి."
"గ్రామాలు గరిక ప్రడేశాలే గాని,నాగరిక ప్రదేశాలు కావు."
"ఉత్తమాంగం అని పేరేకానిచాల మందికి ఉత్త అంగం మటుకేను."
'ఈ నాడు స్టాకు బ్రోకరు వద్దకు, రేపు పాన్ బ్రోకరు వద్దకు."
"చుక్కెదురు కావడం మంచిది కాదు కాని,చక్కని చుక్కెదురు కావడం అదృష్టమే."
"రామ రాజ్యం కాదు నేను కోరేది,నేను కోరేది విరామ రాజ్యం."
"ఇంతి నడుము పూజ్యము."
"చీట్లాడువారికి, క్రైస్తవులకు ఏసు దయ ఉండాలి."
"ఈనాడు సబ్బుకన్నా నున్నగా జారిపోతూన్నది డబ్బు."
"ప్రపంచంలో 'పయికాలు' ఉన్నవానిదే పయిచేయి."
--------------------------------------------------