My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, December 15, 2009

దాతలే విధాతలు

కల్పాంతంలో ప్రళయం సంభవించి సర్వం జలమయమైపోయి ద్వాదశ సూర్యులు, కొత్త చంద్రులూ ఉదయించడాన్ని మత్స్యపురాణం మహాద్భుతంగా వర్ణించింది. యోగనిద్రనుంచి లేచిన పరబ్రహ్మ పునఃసృష్టికోసం నీటిని మధించి రెండు బుడగలను సృష్టిస్తే అందులో ఒకటి ఆకాశం, రెండోది భూమి! ఎన్ని అవాంతరాలొచ్చిపడినా సృష్టిక్రమం ఆగదనే ఆశావాదం వరకు ఈ కథ నీతిపాఠాన్ని తీసుకోవాలి. వేళకు వర్షాలు పడి పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఏటా గోపాలురు ఇంద్రపూజ చేసేవారు. ఆ యేడు కృష్ణయ్య మాట విని గోవర్ధనగిరిని కొలిచినందుకు దేవరాజు కోపించి వ్రేపల్లెపైన విపరీతమైన వానలు కురిపించాడు. అప్పుడుకూడా ఇప్పుడు మొన్న మనరాష్ట్రంలోని ఆరుజిల్లాల జనం 'నిడు జడిదాకి యెందు జననేరక యాకట గ్రుస్సి'నట్లు అల్లాడారని ఎర్రన హరివంశంలో వర్ణిస్తాడు. 'యింతలోన జగముల్‌ పోజేసెనో, ధాతయెయ్యది, దిక్కెక్కడ, సొత్తు యెవ్విధమునం బ్రాణంబు రక్షించుకోలొదవున్‌... దైవమ!' అంటూ సర్వం కోల్పోయి నిర్వాసితులైన ఆబాలగోపాలాన్ని ఆ బాలగోపాలుడు గిరినెత్తి ఉద్ధరించినట్లు- ఇప్పుడూ మంచిగంధం వంటి మనసున్న మారాజులు ఆదుకునేందుకు ముందుకు దూసుకొస్తున్నారు. ఆనందమే. అదికాదు ఇప్పటి అసలు సమస్య- 'అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దురితోపశమనం, పావనం, శుభకరమ్‌' అని మనం కొలిచే గంగమ్మ ఇంతగా గంగవెర్రులెత్తిపోవటానికి వెనకున్న అసలు కారణాలేమిటనేదే సందేహం. అత్త ఏదో నింద వేసిందని అలిగి 'వనములను దాటి/ వెన్నెల బయలుదాటి/ తోగులను దాటి/ దుర్గమాద్రులను దాటి/ పులుల యడుగుల నడుగుల కలుపుకొనుచు పథాంతరాల మీదికి వరదలుగా పారింద'ని చెప్పుకొని సర్దుకుపోవటానికి ఇదేమీ విశ్వనాథవారి 'కిన్నెరసాని' కథ కాదు కదా!

వరద అంటే వారం వర్జ్యం చూసుకుని వచ్చి పలకరించి పోయే చుట్టంకాదు. కరకట్ట తెగిందంటే బడినీ, గుడినీ, పంచాయతీ కార్యాలయాన్నీ, గొడ్డునూ గోదనూ, గడ్డివాములనూ, గాదెకింద దాచిన గింజనూ, బావినీళ్ళనూ, మంచాలనూ కంచాలనూ, ఏమరుపాటుతో ఉంటే చంటిపిల్లాడినీ, మూడుకాళ్ళ ముసలాళ్ళనీ ముంచేసిపోతుంది. బందిపోటులాగా నీటిపోటు మనింటి కప్పుమీదకే మనల్ని గెంటేస్తుంది. సొంతూరి పొలిమేరలనుంచే మనల్ని తరిమేస్తుంది. కంటిముందే ఇంటిగోడలు నీటిలో పడి కరిగిపోతుంటే, ఒంటి రక్తాన్ని చెమటగా మార్చి పెంచుకున్న పంటచేను ఏడడుగుల నీటి అడుగున ఎక్కడుందో జాడతెలియని దుర్భర దుస్థితి! ఓ ఆధునిక కవి ఆవేదన పడినట్లు 'చుట్టూతా ఉప్పు సముద్రం... మనస్సులోనూ దుఃఖసముద్రం... జీవనాన్నే మింగేసే జీవనది... అక్కడెక్కడో ఆనకట్టలు పగిలాయో లేదోగానీ ముందిక్కడ మనిషి గుండె ముక్కలైంది'. నిజం. చంటిబిడ్డతో ఇంటి పైకప్పు మీదికెక్కి కూర్చున్న ఇంటిఇల్లాలు, మిట్టమీద కట్టుబట్టలతో నిలువు గుడ్లేసుకుని నిలబడ్డ సంసారి, నడిరేవులో తిరగబడ్డ పడవ కొయ్యను పట్టుకుని వేలాడే గంగపుత్రులు, నిలువుదోపిడికి నిలువుటద్దంగా నిలబడిన ఆ వ్యధార్తుల అందరి గుండెల్లోనూ ఇప్పుడు అంతులేని విషాదం. ఈ సర్వనాశనానికి అసలైన కారణం ఒక్కటే- చెకొవ్‌ చెప్పినట్లు 'విచక్షణ, సృజన ఉండి కూడా మనిషి ప్రకృతిని వికృతం చేయపూనుకోవటమే'! విపత్తు దాపురించాక కనీస మానవతాధర్మంగా ఇప్పుడు ఔదార్యం వరదలెత్తాలి. లోకంలో మనుషులు రకరకాలు. రెండు చేతులతో దోచుకుని దాచుకునేవారున్నట్లే దాచుకున్నదాన్ని రెండుచేతులా దోచిపెట్టేవారూ ఉన్నారు. అలాంటివారి అవసరమే ఇప్పుడెక్కువ బాధిత హృదయాలకు!

దానం చేసేవాళ్లు అమరత్వాన్ని పొందుతారంటుంది రుగ్వేదం. దీర్ఘాయుష్షుకోసం మైకేల్‌ జాక్సన్‌లాగా ప్రత్యేకంగా ప్రాణవాయువు గది కట్టించుకోనక్కర్లేదు. బిల్‌గేట్స్‌ మాదిరి బిలియన్సు పెట్టి బీదాబిక్కీ అందరికీ సేవచేసే స్థోమత అందరికీ ఉండదు. దిక్కు మొక్కూలేని వాడికొక్క పూట డొక్కనిండా తిండిపెడితే చాలు- వాడి కడుపునిండిన తేనుపే మనకు 'దీర్ఘాయుష్మాన్‌ భవ!' అనే దీవెన. వంద ఉంటే పది, పది ఉంటే ఒక్క రూపాయి- అదీ లేకుంటే, ఆదరంగా ఒక చిరునవ్వు, అవసరమైనప్పుడు ఓ ఓదార్పు. మనస్ఫూర్తిగా ఓ పలకరింపు... ఏదైనాసరే ఆ సమయానికి అవసరమనిపించే, మన తాహతుకు మించని చేయూత... ఇచ్చి చూడు. ఇచ్చుటలో ఉన్న ఆ హాయి ఎంత వెచ్చంగా ఉంటుందో తెలిసి వస్తుంది! ప్రేమ అనేది దేశ కాలాలకు అతీతంగా కాసే పండు. ఎవరైనా కోసుకోవచ్చు. ఎంతమందికైనా పంచవచ్చు. 'పంచేకొద్దీ పెరిగేదీ, పంచదారకన్నా మధురమైనదీ- అవసరానికెవరినైనా ఆదుకోవాలనుకునే ఉదారభావనే' అంటారు మదర్‌ థెరెసా. ఎవరికీ ఏమీ కాకుండా పెరిగి వెళ్లిపోవటంకన్నా పెనువిషాదం మనిషి జీవితంలో మరేదీ ఉండదు. దానంవల్ల ఎవడూ దరిద్రుడు కాడు. పర్సు ఖాళీ అయినకొద్దీ మనసు ఆనందంతో నిడిపోతుంది. నీటిని దాచుకునే సముద్రంకన్నా దానం చేసే మేఘాలే ఎప్పుడూ ఎత్తులో ఉంటాయి. దానగుణంగల వృక్షం పండ్లు ఇవ్వలేని వేసవిలోనూ నీడనిచ్చి తృప్తిపడుతుంది. స్వయం ప్రకాశం లేకపోయినా సూర్యకిరణాలను వెన్నెలలాగే పంచే చంద్రుడిని అందరూ ప్రేమగా చందమామా అని పిలుచుకుంటారు. అడవిలో, యుద్ధంలో, నిద్రలో, నీటిలో, నిప్పుమీద, ఒంటరితనంలో ఒంటిమీద స్పృహలేనప్పుడూ మన పుణ్యమే మనల్ని రక్షిస్తుందని అదర్వణవేదం చెబుతుంది. పరోపకారానికి మించిన పుణ్యం లేదంటుంది పంచతంత్రం. ఈ చేత్తో సంపాదించి ఆ చేత్తో ఇవ్వడానికేగా దేవుడు మనకు రెండు చేతులు ఇచ్చింది!
(ఈనాడు, సంపాదకీయం , ౧౧:౧౦:౨౦౦౯)
______________________________


Labels:

Monday, December 14, 2009

X'mas greetings from Tiger Woods and Elin


(an email forward)

___________________________________

Labels: