సర్పసాయం
''ప్రతి మనిషిలోను ఓ లేడి, పులి, నక్క, గాడిద దాగి ఉంటాయి. వాటి ప్రభావంవల్లే మనిషి రకరకాలుగా ప్రవర్తిస్తుంటాడు'' అని చమత్కరించాడో ఆంగ్ల రచయిత. మనుషుల స్వభావాలను కాచి వడబోసి అలా అన్నాడో లేదో తెలియదు కాని, ఆయనన్న మాటల్లో నిజం లేకపోలేదు.
మనుషులతో సన్నిహితంగా ఉండేవి, మనుషులకు అనేక విధాలుగా తోడ్పడేవి జంతువులు, పక్షులు వంటివే. సేద్యం చేయాలంటే గతంలో బసవన్నలు కాడి కదిపితేనే పని జరిగి పంటలు చేతికొచ్చేవి. దూర ప్రయాణాలు చేయాలంటే గుర్రానికి కళ్ళెం బిగించాల్సి వచ్చేది. విశ్వాసానికి, తోడుకు మారుపేరు శునక రాజులు, రాణులే. ఇన్ని రకాలుగా సేవచేస్తున్నా మానవుడు మాత్రం వాటిని చిన్నచూపు చూస్తూనే ఉన్నాడు.
''నిజానికి మనకంటే అవే నయం. మనిషి క్రూరజంతువని పాపం వాటికి భయం. నడిచే కాళ్ల సంఖ్యలోనే తప్ప నడకలో ప్రవర్తనలో పెద్ద తేడా లేదు కదా, ఆకలి పేరుతో అవీ అవినీతి పేరుతో మనమూ గడ్డితినే సామాన్య ధర్మం ఉభయులకూ ఉంది కదా'' అంటూ మానవ నైజాన్ని విమర్శించాడు కుందుర్తి ఓ వచన కవితలో.
''కొత్తగా కుక్కను కొన్నావట... కొంపదీసి అది కొత్తవాళ్ళను చూస్తే కరవదు కదా?'' అని అడిగాడు అయోమయం. ''అది తెలుసుకుందామనేగా నిన్ను మా ఇంటికి తీసుకువెళుతున్నది'' అన్నాడు స్నేహితుడు.
వాన రాకడా ప్రాణం పోకడా తెలియవని సామెత. మనుషుల సంగతేమో కాని- జంతువులు, పక్షులు వాన రాకడను ముందే పసిగట్టగలవని శాస్త్రజ్ఞులు లోగడే నిర్ధారించేశారు. ''జంతువులు నీళ్ళల్లో దిగి నిలిచినప్పుడు, మెట్ట కప్పలు కూసినప్పుడు, చిన్నచిన్న చేపలు ఎగిరి పడుతున్నప్పుడు, తామరల పుప్పొడిలో తొండ పొర్లాడినప్పుడు, అన్ని పంటలూ బాగా పండేటట్లు వాన పడుతుంది'' అని పద్నాలుగో శతాబ్దానికి చెందిన దోనయామాత్యుడు రాశాడు. ఇటువంటి భావాన్నే శ్రీనాథ మహాకవి తన హరవిలాస కావ్యంలో వెల్లడించాడు. ''తూనిగలాడజొచ్చె, దివి ధూళి భ్రమింపగ జొచ్చె బిచ్చుకల్, మానక యుబ్బి గబ్బులుగు మాటికి మాటికి గ్రోల్చె గొమ్మపై'' అంటూ కనపడుతున్న సూచనలను బట్టి, ''వానయవశ్యమింక బహు వాసరముల్ జడివట్టు'' అనే నిశ్చయానికొచ్చారట కాంచీపుర వాసులు. వారనుకున్నట్లే కంచిలో ఇరవైఒక్క రోజులు జడివాన ఎడతెరిపి లేకుండా కురిసినట్లు శ్రీనాథ కవి తన కావ్యంలో రాశాడు. రాబోయే వాననే కాదు... పడబోయే పిడుగుల్నీ, ముంచుకొస్తున్న తుపాన్లను కొన్ని జంతువులు, పక్షులు, సరీసృపాలు ముందే పసిగడతాయని, అటువంటి సమయంలో వాటి ప్రవర్తన వింతగా ఉంటుందని శాస్త్ర పరిజ్ఞానం కలిగిన పండితులు శలవిచ్చారు.
పాములను చూసి మనుషులు సహజంగానే భయపడతారు. కొందరు పాములను దేవతలుగా భావించి పూజలు చేయటమూ కద్దు. నాగులచవితి పండుగ రోజున సర్పాలకు పూజలు చేసి నైవేద్యాలు పెట్టే ఆచారం మనదేశంలో ఉంది. ''నాగుల్ల చవితికి నాగేంద్ర నీకు, పొట్టనిండా పాలు పోసేము తండ్రీ'' అని విన్నవించుకొని, ''చీకటిలోన నీ శిరసు తొక్కేము, కసిదీర మమ్మల్ని కాటెయ్యబోకు'' అంటూ నాగదేవతలను వేడుకోవటం తెలిసిందే. సర్పాలు మనకు చేసే మేళ్ళు ఇంకా ఉన్నాయని, అవి భూకంపాలను ముందే కనిపెట్టగలవని ఇప్పుడు చైనా శాస్త్రజ్ఞులు అంటున్నారు.
కొన్ని ప్రకృతి వైపరీత్యాలను మనుషులకంటే జంతుజాలమే ముందుగా పసిగట్టగలదని శాస్త్రజ్ఞులు చాలాకాలంగా అంటూనే ఉన్నారు. భూకంపాలు వచ్చే సూచనలను పాములు ముందుగానే కనిపెట్టగలవని చైనాలోని శాస్త్రజ్ఞులు ఇప్పుడు కొత్తగా చెబుతున్నారు. 120 కిలోమీటర్ల దూరంలో సంభవించే భూ ప్రకంపనలను మూడు నుంచి ఐదు రోజుల ముందుగానే పాములు పసిగట్టగలవని చైనాలోని నానింగ్‌లో భూకంప కేంద్ర డైరెక్టర్ జియాంగ్ వెసాంగ్ అంటున్నారు. ఆ సమయంలో పాముల ప్రవర్తన వింతగా ఉంటుందంటున్నారు. భూకంపం వచ్చే సూచనలు తెలియగానే పాములు ఆందోళనతో అటూఇటూ పరిగెడతాయి. అలా ముందూ వెనకా చూసుకోకుండా పాకడంలో తలకు రాళ్ళవంటివి తగిలినా పట్టించుకోవు. కాబట్టి పాములపై నిఘా వేసి వాటి ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తున్నట్లయితే భూకంపం వచ్చే ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. అలా తెలుసుకొని తగు ముందు జాగ్రత్త చర్యలతో భూకంప నష్టాలను చాలావరకు తగ్గించుకోవచ్చని శాస్త్రజ్ఞుల భావన. సర్పాల వ్యవహార శైలిని పసిగట్టే యంత్రాలను పాముల పెంపక కేంద్రంలో ఏర్పాటుచేశారు. ఆధునిక పరిజ్ఞానం అందించిన అవగాహననూ జోడించి భూకంపం రాబోయే ప్రమాదాన్ని ముందే తెలుసుకోవచ్చని నానింగ్‌లోని భూకంప కేంద్ర శాస్త్రజ్ఞులు అంటున్నారు. మన దేశంలో కోళ్ళ పెంపక కేంద్రాలున్నట్లే దక్షిణ చైనాలో పాములను పెంచే కేంద్రాలుంటాయి. వందలాది పాములను అక్కడి రైతులు పెంచుతుంటారు. అటువంటి కేంద్రాల్లో శాస్త్రజ్ఞులు వీడియో కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలను అమర్చారు. ''ప్రకృతిలోని జీవులన్నిటికంటె పాములకే భూకంపాన్ని పసిగట్టే సామర్థ్యం ఎక్కువ. ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని భూకంపం వచ్చే సూచనలను ముందుగానే తెలుసుకొని జాగ్రత్తపడవచ్చు. పాములను చూసి వూరికే భయపడటం కాక కొన్ని మంచి పనులకూ వాటిని ఉపయోగించుకోవచ్చని గ్రహించాలి'' అంటున్నారు చైనాలోని నానింగ్ భూకంప కేంద్ర శాస్త్రజ్ఞులు!
(Eenaadu, editorial, 07:01:2007)
---------------------------------------------------------------
Labels: Animals/ telugu