వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోయాను గగనానికి!
తెలుగు సినిమా పాటను పరవళ్లు తొక్కించిన కలం ఆగిపోయింది
ప్రముఖ గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి హైదరాబాద్‌లో శనివారం(22:05:2010) రాత్రి తొమ్మిది గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. వేటూరికి భార్య సీతామహాలక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆయన వూపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. మూడు రోజుల కిందట గ్యాస్ట్రిక్ సమస్య అంటూ ఏషియన్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించి ఇతర సమస్యలున్నాయని చెప్పడంతో శుక్రవారం రాత్రి కేర్ ఆసుపత్రిలో చేరారు. వూపిరితిత్తుల్లో తీవ్రంగా రక్తస్రావం జరగడంతో శనివారం రాత్రి ఆయన కన్నుమూశారు.
వేటూరి స్వస్థలం కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి. ప్రముఖ కవి వేటూరి ప్రభాకరశాస్త్రి సోదరుడి కుమారుడు సుందరరామమూర్తి. 1950లో ఆయన మద్రాసు గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివే రోజుల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది. సుందరరామమూర్తి తొలినాళ్లలో నటుడు కావాలని ఆశపడ్డారు. తరవాత రచనవైపు దృష్టిపెట్టారు. బెజవాడలో బియ్యే పూర్తిచేశాక మరోసారి మద్రాసు వెళ్లారు. ఆయన, నటుడు కైకాల సత్యనారాయణ పక్కపక్క గదుల్లో ఉండేవారు. ముక్త్యాల రాజా సిఫార్సుపై వేటూరి 'ఆంధ్రప్రభ'లో ఉపసంపాదకుడిగా చేరారు. 1956 నుంచి పదహారేళ్లపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఆయన పాత్రికేయ జీవితంలో చిరస్మరణీయ ఘట్టం... శ్రీశైలం ప్రాజెక్టుకి పునాదిరాయి వేసినప్పుడు రిపోర్టింగ్ చేయడం. ఆయన రోజు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఉపన్యాసాన్ని వార్తగా అందించిన విధానం ప్రతి ఒక్కరి మెప్పూ పొందింది. ఏళ్లు గడిచినా వేటూరికి నెహ్రూ ఉపన్యాసమంతా గుర్తుండేది. తరవాతి రోజుల్లో ఆంధ్రప్రభ వారపత్రికకు సినిమా ఎడిటర్‌గా పని చేశారు.
ఎన్టీఆర్ ప్రోత్సాహంతో...
తెలుగు సినిమా పాట నిస్తేజంగా ఉన్న సమయంలో చిత్రసీమలో అడుగుపెట్టారు వేటూరి. ఆయన రాసిన 'సిరికాకుళం చిన్నది' అనే సంగీత రూపకం అప్పట్లో ఆలిండియా రేడియోలో ప్రసారమైంది. ఈ రూపకం ఎందరో ప్రముఖుల్ని ఆకట్టుకొంది. అలా వేటూరి రచనపై ఆకర్షితులైన వారిలో నాటి అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఒకరు. ఆయన ప్రోత్సాహంతోనే వేటూరిలోని గీత రచయిత 'దీక్ష' చిత్రం కోసం కలం విదిల్చారు. 'నిన్న రాతిరి కలలో...' అనే పాట రాశారు. అది రికార్డు కాలేదు. కె.విశ్వనాథ్ 'ఓ సీత కథ' కోసం రాసిన పాటే తొలి గీతంగా చెప్పుకోవాలి. 'భారతనారీ చరితము... మధుర కథాభరితము...' అనే గీతాన్ని కేవీ మహదేవన్ స్వర సారథ్యంలో రాశారు. పి.లీల గానం చేశారు. వేటూరి గీత రచయితగా తొలి అడుగులు వేసే సమయంలో ఎన్టీఆర్, కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు అండగా నిలిచారు. అందుకే పలు సందర్భాల్లో 'వాళ్లు నాకు త్రిమూర్తులు' అనేవారు వేటూరి. గీత రచయితగా ప్రవేశించిన మూడేళ్ల కాల వ్యవధిలోనే యావత్ చిత్రసీమనూ తనవైపు తిప్పుకోగలిగారు. 'సిరిసిరిమువ్వ'లో 'ఝుమ్మంది నాదం... సయ్యంది పాదం', 'సీతామాలక్ష్మి'లో 'సీతాలు సింగారం...', 'శంకరాభరణం'లోని అన్ని గీతాలూ కావ్య గౌరవంతో అలరారాయి. అలాగే 'అడవి రాముడు'లో 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను...'లాంటి అల్లరి పాటే కాదు 'మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ' లాంటి భావస్ఫోరకమైన గీతాన్నీ అందించారు. అటు కావ్యగౌరవం ఉన్న పాటలే కాదు కమర్షియల్‌గా ఈలలు వేయించే గీతాలూ వేటూరి నుంచి వచ్చాయి. పద్నాలుగుసార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలు అందుకున్నారాయన. ఉషాకిరణ్ మూవీస్ వారి 'ప్రతిఘటన'లో రాసిన 'ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో...' గీతానికి వేటూరి తప్పకుండా జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకుంటారని ఆశించారు. కానీ దక్కలేదు. 'మాతృదేవోభవ'లో 'రాలిపోయే పువ్వా...' గీతానికి జాతీయ గౌరవం దక్కింది. వేటూరి ఆ తరాన్నే కాదు ఈ తరాన్నీ ఉర్రూతలూగించారు. ఇటీవల వచ్చిన 'వరుడు'లో 'అయిదు రోజుల పెళ్లి' గీతం యువతరం సెల్‌ఫోన్లలో రింగ్‌టోన్‌గా, కాలర్ ట్యూన్‌గా వినిపిస్తోందంటే వేటూరి కలం ఎంతటి ప్రభావం చూపిస్తుందో అర్థమవుతుంది. తెలుగు పాటను లాలించి పాలించి శాసించిన వేటూరి మన మధ్య లేకపోయినా ఆయన పాటను తెలుగు శ్రోతల హృదయాల్లో మోగుతూనే ఉంటాయి.
- హైదరాబాద్, న్యూస్‌టుడే
__________________________________________
కోమల గీతాల కవి కోయిల... ఎద లోయలో శాశ్వతంగా నిదరోయింది.
కూచిపూడి నడకనీ, కూనలమ్మ కులుకునీ శ్రుతి కలిపి...
విశ్వనాథ పలుకునీ విరుల తేనె చిలుకునీ కలగలిపి... కిన్నెరసాని చేత వెన్నెల పైట వేయించిన కలం... రాలిపోయిన పువ్వులో మౌనరాగమై... వాలిపోయిన పొద్దులో వివర్ణమై... హంసల దీవిలో కృష్ణమ్మలా అనంతసాగరంలో లీనమైపోయింది.
కవితా సరస్వతి పద రాజీవాన్ని చేరు నిర్వాణసోపానాలను అధిరోహిస్తూ... తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిపోయింది. వేటూరి శకం ముగిసిన మమతలు వేయిగ పెనవేసిన ఆ తీయని గీతాంజలి మల్లెలైపూస్తూనే ఉంటుంది. వెన్నెలై కాస్తూనే ఉంటుంది.
వేల పాటల తేనె వూట... కొత్త పుంతలు తొక్కిన తెలుగు పాట - వేటూరి సుందరరామమూర్తి సినిమా పాట! అంగారాన్నీ, శృంగారాన్నీ అలవోకగా కురిపించగల కలం వేటూరిది. తెలుగు సినీ గీతానికొస్తే సీనియర్ సముద్రాల, పింగళి, మల్లాది నుంచి ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ, దాశరథి, సినారెల వరకూ ఒక్కొక్కరిదీ ఒక్కొక్కొ ప్రత్యేక బాణీ అయితే ఆ మహామహుల బాణీల బాణాలను తన తూనీరంలో ఇముడ్చుకున్న పాట యోధుడు మన సుందరరాముడు. తలచూసే ముగ్గు బుట్ట తలపు మాత్రం భావాల పుట్ట. పద్నాలుగు సార్లు నంది పురస్కారాలు అందుకొని తెలుగు పాటకు నందీశ్వరుడయ్యారు.
వేటూరి కలంలోని పాటల పరవళ్లకు దూకుతున్న జలపాతం జంకుతుంది. వెండి తెర ఆకాశాన్ని ఆ కలం తన సిరాతో నీలంగా అలికి, భావాల వానవిల్లును పరిచింది. ఆ కలం రాయని పాట లేదు. ఆ కలాన్ని పాడని గళం లేదు. తెలుగు సినిమా పాటను చంకనెత్తుకుని చందమామను, చక్కిలిగింతల చెక్కిలి భామను, చండ్ర నిప్పుల ఉద్యమాలను, సంకీర్తనల సంగతులనూ పరిచయం చేసి తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించింది.
నిజానికి వేటూరి సుందరరామమూర్తి తెలుగు చిత్రసీమలోకి సినిమా పాట పరిస్థితి విచిత్రంగా ఉంది. సినిమా పాటా అంటూ జాలిపడే పరిస్థితి. ఆయన తొలి పాటకు కలం విదిలుస్తూనే కావ్యగౌరవం కల్పించే యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. 'భారతనారీ చరితము...' అనే 'ఓ సీత కథ'లోని ఆయన తొలి పాట నిజంగా పాటేనా?.. పాటంటే పాట కాదు... అది హరి కథ. కానీ ఆ రచనకు సినిమా పరిశ్రమ వాహ్! అని పులకించింది. నాటి నుంచి ఎన్టీ రామారావు, కె.విశ్వనాథ్, రాఘవేంద్రరావు లాంటి సినీ ప్రముఖులు ఇచ్చిన ప్రోత్సాహంతో వడివడిగా అడుగులు వేశారు. 'ఓ సీత కథ' తరవాత సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సీతామాలక్ష్మి, అడవి రాముడు, యమగోల లాంటి చిత్రాలతో యావత్ తెలుగు చిత్రసీమనీ తన వైపు తిప్పుకొన్నారు.
ఆ కలానికి ఎన్ని పాళీలో...
వేటూరి పాటల తీరుని పరిశీలించినవాళ్లు ఆయన కలానికి ఎన్ని పాళీలో అనుకోవల్సిందే! శంకరా నాద శరీరా..., 'శివ శివ శంకర', 'ఝుమ్మంది నాదం', 'ఏ కులమూ నీదంటే...' లాంటి సాహితీ విలువలతో అలరారే గీతాలూ ఆ కలం నుంచి వచ్చినవే. 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను..', 'ఆకుచాటు పిందె తడిసె...' లాంటి అల్లరి, శృంగార గీతాలూ ఆ కలమే రాసింది. వేటూరి పాటను ఎంతగా పొగిడినవాళ్లు ఉన్నారో... విమర్శలు గుప్పించినవాళ్లూ ఉన్నారు. బూతు రాస్తున్నారని దుయ్యబట్టారు. ఓ సినిమాలో ఆయన రాసిన పాటలో ఒక చోట 'జాకెట్లో జాబిల్లి...' అని ఉంటుంది. దీనిపై వేటూరి ఘాటుగా వివరణ ఇచ్చారు ''నేను రాసింది 'చీకట్లో జాబిల్లి...' ఓ కొంటె సహాయ దర్శకుడు చీకట్లోని జాకెట్లో అని మార్చాడు. వేటూరి బూతే రాయాలి అనుకొంటే జాకెట్లో రెండు... అని రాయగలడు''.
ఏ తరానికైనా...
విశ్వనాథ్, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావుల తరవాత ఎక్కువగా ఆయన జంధ్యాల లాంటి దర్శకులతో కలిసిపోయారు. ఆయన కేవలం కొందరితోనే అని కాకుండా అన్ని వయసులవాళ్లతోనూ, అందరు నిర్మాతలతోనూ కలుపుగోలుగా ఉండేవారు. వేటూరికి సహాయకుడిగా కీరవాణి కొన్నాళ్లు సహాయకుడిగా ఉన్నారు. ఇటీవల రెండు వందల చిత్రాలు పూర్తయిన సమయంలో నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు కీరవాణి ''రెండు వందల సినిమాలు పూర్తయ్యాయి అనే మాట గుర్తుకొస్తే వేటూరిగారిచ్చిన రెండు వందల రూపాయలు గుర్తుకొస్తున్నాయి. నేను ఆయన దగ్గర ఉన్న సమయంలో ఖర్చులకు అప్పుడప్పుడూ రెండు వందలు ఇస్తుండేవారు'' అన్నారు. స్వరకర్త కల్యాణి మాలిక్ మాటల్లోనే చెప్పాలంటే ''వేటూరిగారిది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు''. అందుకే నవతరం దర్శకులకీ ఆయన ప్రీతిపాత్రమైన గేయ రచయిత. ప్రముఖ దర్శకులు మణిరత్నం తన ప్రతి చిత్రానికీ వేటూరితోనే పాటలు రాయించుకొనేవారు. గుణశేఖర్, శేఖర్ కమ్ముల తదితర దర్శకులు ఆయన గురువుతో సమానం.
వేగం ఆయనకే సొంతం
గీత రచయితలు పాట కోసం రోజుల తరబడి సమయం తీసుకొంటారనే అపప్రథ ఉంది. ముఖ్యంగా ఆత్రేయ లాంటివాళ్లని ఉదాహరణలుగా చెబుతారు. వేటూరి అందుకు భిన్నంగా వేగంగా పాటను రాసి ఇవ్వడం ఆయనకే చెల్లు. శంకరాభరణంలోని పాటల్ని ఎవరూ మరచిపోలేరు. అందులో పాటలు తక్కువ సమయంలోనే రాసి ఇచ్చారు.
పాట ఎలా ఉండాలి?
పాట ఎలా ఉండాలనే విషయంలో వేటూరి ఎంతో స్పష్టమైన వివరణ ఇచ్చేవారు. ''పాటంటే మాటలు కాదు. నేను విశృంఖల పద ప్రయోగం చేసినా అది పాటకు తగిన విషయం లేనప్పుడు, శబ్దాశ్రయం, వస్తువాశ్రయం లేనప్పుడు, భావ ప్రగల్భానికి అవకాశం లేనప్పుడు మాత్రమే పదాలతో ఆడుకున్నాను. ఒక శూన్యాన్ని దాటవలసి వచ్చినప్పుడు శబ్ద సేతువుల్ని నిర్మించుకున్నాను. అదే విధంగా చాలా విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు శబ్దాలయాలు కట్టి అందులో ప్రతిమలుగా ఆ సన్నివేశ శిల్పాల్ని ప్రతిష్టించాను. ప్రతి పదానికీ సన్నివేశాన్ని మోసే శక్తి ఉండాలి. ప్రతి అక్షరాన్నీ తన గవాక్షంలోంచి అనంత విశ్వాన్ని దర్శించగలిగేబీజ శక్తి ఉండాలి'' అన్నారు.
ప్రముఖుల సంతాపం
తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతవరకూ వేటూరి ఉంటారని ముఖ్యమంత్రి రోశయ్య పేర్కొన్నారు. వేటూరి మృతి పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేటూరి మృతికి సంతాపం తెలిపినవారిలో తెదేపా అధినేత చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ప్రరాపా అధినేత చిరంజీవి తదితరులున్నారు.
________________________________
* శంకరా నాద శరీరా - శంకరాభరణం
* మనిషై పుట్టినవాడు - అడవిరాముడు
* కిరాతార్జునీయం - భక్తకన్నప్ప
* శివ శివ శంకర - భక్తకన్నప్ప
* ఝుమ్మంది నాదం - సిరిసిరిమువ్వ
* ఏ కులము నీదంటే - సప్తపది
* నవమినాటి వెన్నెల నేను - శివరంజని
* నిన్నటిదాకా శిలనైన - మేఘసందేశం
* ఈ దుర్యోధన దుశ్శాసన - ప్రతిఘటన
* రాగం తీసే కోయిలా - నాగమల్లి
* సిరిమల్లెనీవే - పంతులమ్మ
* వేదం అణువణువున నాదం - సాగరసంగమం
* మిన్నేటి సూర్యుడు - సీతాకోకచిలుక
* ఆమనిపాడవే - గీతాంజలి
* అబ్బనీ తీయని దెబ్బ - జగదేకవీరుడు అతిలోకసుందరి
* యమహానగరి - చూడాలనివుంది
* ఈ పాదం ఇలలోన - మయూరి
* తెలుగుపదానికి జన్మదినం - అన్నమయ్య
* సొగసుచూడతరమా - మిస్టర్‌పెళ్లాం
* వేణువై వచ్చాను - మాతృదేవోభవ
* అయిదు రోజుల పెళ్లి - వరుడు
(ఈనాడు, సినిమా, ౨౩:౦౫:౨౦౧౦)
______________________________