My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, February 11, 2007

ఈ పుస్తకాలు హాట్‌ కేకులు

వ్యాపార, వాణిజ్య రంగాల్లో విడుదలయ్యే పుస్తకాలు తక్కువే అయినప్పటికీ వాటికుండే పాఠకాదరణ మాత్రం ఎక్కువే. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఓ పది వాణిజ్య రంగ పుస్తకాల వివరాలు:


1. ద వరల్డ్‌ ఈజ్‌ ఫ్లాట్‌ (The world is flat)
రచయిత: థామస్‌ ఎల్‌ ఫ్రీడ్‌మన్‌
ప్రచురణ కర్త: పెంగ్విన్‌ బుక్స్‌
ధర: రూ. 495

2. ద గ్రేట్‌నెస్‌ గైడ్‌ (The Greatness guide)
రచయిత: రాబిన్‌ శర్మ
ప్రచురణ కర్త: జైకో పబ్లిషింగ్‌
ధర: రూ. 175

3. ఫ్రీకనామిక్స్‌ (Freakonomics)
రచయితలు: స్టీవెన్‌ డి లెవిట్‌, స్టీఫెన్‌ జె డబ్నర్‌
ప్రచురణ కర్త: అలెన్‌ లేన్‌
ధర: రూ. 250

4. ద అండర్‌కవర్‌ ఎకనామిస్ట్‌ (The undercover economist)
రచయిత: టిమ్‌ హార్‌ఫోర్డ్‌
ప్రచురణ కర్త: టైమ్‌ వార్నర్‌
ధర: రూ. 505

5. ద మార్కెటింగ్‌ వైట్‌బుక్‌ 2006 (The marketing whitebook2006)
ప్రచురణ కర్త: బిజినెస్‌ వరల్డ్‌
ధర: రూ. 350

6. ద7 హేబిట్స్‌ ఆఫ్‌ హైలీ ఎఫెక్టివ్‌ పీపుల్‌ (The 7 habits of highly effective people)
రచయిత: స్టీఫెన్‌ ఆర్‌ కోవె
ప్రచురణ కర్త: సైమన్‌ & షూస్టర్‌
ధర: రూ. 375

7. ద గోల్‌ (The goal)
రచయితలు: ఎలియహు ఎం గోల్డ్‌రాట్‌, జెఫ్‌ కాక్స్‌
ప్రచురణ కర్త: ప్రొడక్టివిటీ ప్రెస్‌
ధర: రూ. 395 8. విన్నింగ్‌
రచయితలు: జాక్‌ వెల్చ్‌, సుజీ వెల్చ్‌
ప్రచురణ కర్త: హార్పర్‌ కొల్లిన్స్‌
ధర: రూ. 640


9.
స్టాక్‌ మార్కెట్‌ బుక్‌ (Stock market book)
ప్రచురణ కర్త: దలాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌
ధర: రూ. 399

10. వన్‌ అప్‌ ఆన్‌ వాల్‌స్ట్రీట్‌ (One up on wallstreet)
రచయితలు: పీటర్‌ లించ్‌, జాన్‌ రాత్‌చైల్డ్‌
ప్రచురణ కర్త: ఫైర్‌సైడ్‌
ధర: రూ. 415
(Eenadu,11:o2:2007)
----------------------------------------------------------

Labels: ,

'ఏ బడ్జెటు మాటున ఏ భారము దాగెనో'


'ఏ బడ్జెటు మాటున ఏ భారము దాగెనో'అని దేశ ప్రజ దిగాలుతో గుండె దిటవుతో చేసుకునే రోజులు మళ్లీ రానే వచ్చాయ్‌! జీవితంలో జెట్‌ స్పీడుతో దూసుకువెళ్తున్న వాళ్లు కూడా బడ్జెట్‌ స్పీడుతో ఆలోచించాల్సిన ఘడియలివి.
ఎప్పుడూ సుందరీమణులనే కలల్లోకి ఆహ్వానించే వాళ్లకు సైతం బడ్జెట్‌ వేళ ఫైనాన్స్‌ మినిస్టర్‌ కలలో కనపడి హలో అంటాడు! మామూలు రోజుల్లో కొందరికే రక్తపోటు ఉంటే అదిగో బడ్జెట్‌ అన్న మాట వినపడగానే చాలా మందికి బీపీ అమాంతం పెరిగిపోతుంది. బడ్జెట్‌ ప్రజంటేషన్‌ అంటే బీపీనే అని ఇంగ్లిషులో 'పొడి'చేసి ఇకిలించేవాళ్లు లేకపోలేదులెండి. పన్నులు పెరుగుతాయేమోనన్న తలపుల్లో 'నిను వీడని 'పీడ'ను నేనే' అన్న పాట మార్మోగిపోతుంటుంది. అయినా, అదే పనిగా ఎడాపెడా పన్నులు వేయడానికి ఆర్థిక మంత్రులు అమాయకులు కాదు! వారు 'నోట్‌'లో 'వేలు' వేసుకొని ఏమీ ఉండరు. ఎన్నికలు జరగనున్నాయనుకుంటేనే వారి 'హవా'భావాల్లో మార్పు ఉంటుంది. అయినా విత్తమంత్రుల లెక్కలు విత్తమంత్రులవి. 'పన్నులు పెంచి పాపాల భైరవులం మేమెందుకు కావాలి' అనే ఉద్దేశంతో బడ్జెట్‌కు ముందో వెనకో 'పన్నుకు పన్ను' సిద్ధాంతాన్ని ఓ కళగా అమలుపరిచేసి, చట్ట సభల్లో విమర్శల తాకిడి నుంచి తప్పించుకోజూస్తున్న అమాత్య వర్యులు ఉంటున్నారు. ఎన్నికలయ్యాక 'జండూ బామ్‌' అవసరమైనట్టు బడ్జెట్‌ రూపొందించే వారే... కనుచూపు మేరలో ఎన్నికలు కనబడుతుంటే మహాప్రభువులు అంటూ జనానికి 'ఫ్రెండూ'బామ్‌ రాసే కృషి చేస్తారు.

చెట్టులో ప్రాణం ఉందని కనుగొన్న జగదీశ్‌ చంద్రబోస్‌ 'బడ్జెట్‌'కు కూడా ప్రాణం ఉందని ఒక్క ముక్క చెప్పి ఉంటే ఆర్థిక వేత్తలంతా 'మా జేసీబోసుకు మంగళారతులు' ఇచ్చేవాళ్లు. న్యూటన్‌ ఇప్పుడు బతికి ఉంటే బడ్జెట్‌ ఆకర్షణ శక్తి ముందు భూమ్యాకర్షణ శక్తి బలాదూర్‌ అనేవాడు. సెల్‌ (ఫోన్‌) మొదలుకొని డీసెల్‌ వరకు విత్త మంత్రి కరుణాకటాక్షాల కోసం చేతులు కట్టుకు నిలబడి మేము 'ప్రెజెంట్‌ సార్‌' అంటుంటాయి. అందరికీ పొగ పంచిపెట్టే ధూమపాన ప్రియులకే పొగబెట్టే శక్తి ఆర్థిక మంత్రిది. ఇది గ్రహించబట్టే సిగ'రేట్లు' పెరిగే లోపు ఇంట్లో స్టాకు పెంచుకోవాలని దమ్ముప్రియులు ఆరాటపడతారు. ఆదాయపు పన్ను ఎగవేయదల్చుకున్న వాళ్లూ, తప్పనిసరిగా కట్టదల్చుకున్న వాళ్లూ ఒక్కుమ్మడిగా ట్యాక్స్‌ పెరిగిపోతుందేమోనని కలవరపడుతుంటారు. 'బండి' కొనదల్చుకున్నవాళ్లు ఎఫ్‌ఎం రివర్స్‌ గేర్‌లో వెళ్తే ఎలాగని కంగారు పడతారు. తాము ఎక్కదల్చుకున్న బండి ఏడాది కాలం లేటు అవుతుందేమోనని కంప్యూటర్‌ జాతకచక్రం వేయించుకొంటారు. కొన్నేళ్లుగా ఆర్థిక మంత్రుల వరస చూస్తుంటే 'ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ని చూస్తే పెట్ట బుద్ధవుతుంది... వ్యవసాయాన్ని చూస్తే మొట్టబుద్ధవుతుంది' అనే కొత్త సామెతను కనిపెట్టినట్టున్నారు. బడ్జెటుకు ముందు కంప్యూటర్‌ కూడా 'ఇక్కడ కంప్యూటర్‌ జాతక చక్రం వేయబడును' అన్న బోర్డు కనబడితే చాలు అక్కడ వాలిపోయి 'నా ధర ఎలా ఉంటుందో జాతకం చెప్పు స్వామీ' అని ల్యాప్‌'టాప్‌' లెవెల్లో అంటుంది. ఆర్థిక మంత్రి చూపు పడే అన్ని సరకుల పరిస్థితీ దాదాపుగా ఇదే. ఇదివరకటి 'స్థానిక పన్నులు అదనం' మాదిరిగా ఈమధ్య జాతీయ స్థాయి సెస్సులు షరా మామూలయ్యాయి.

బడ్జెట్‌ లీలలపై ఎవరి గోల వారిది. ఆర్చేదీ తీర్చేదీ మంత్రి ఒక్కరే. అయినా

లోటు లేనిది ఒక్క 'లోటు'కే
(ఇంటి) బడ్జెట్‌ పెరుగుట పెరుగుట కొరకే...!
- ఫన్‌కర
(Eenadu,11:02:2007)
---------------------------------------------------------

Labels:

దేశమంటే మనుషులోయ్‌...

'దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌-' అన్నారు మహాకవి గురజాడ. ఏ దేశప్రగతి అయినా ఆ దేశపు జనాభాపైనే ఆధారపడి ఉంటుంది. కర్షకులు నాగళ్లుపట్టి ఏరువాక సాగిస్తేనే పంటలు పుష్కలంగా పండుతాయి. దేశంలో కరవు ఏర్పడకుండా ఉంటుంది. కార్మికులు తమ స్వేదం చిందిస్తూ యంత్రభూతాల కోరలు తోమి వాటిని నడిపిస్తేనే పారిశ్రామికాభివృద్ధి జరిగి సిరులు మూటలు కడతాయి. ఉపాధ్యాయులు చక్కగా బోధిస్తేనే చదువు, లోకజ్ఞానం అబ్బి బాలలు బాధ్యతగల పౌరులుగా పెరిగి దేశాభ్యుదయానికి తమవంతు కృషిచేస్తారు. ఈ విధంగా ఏ దేశ భవిష్యత్తయినా ఆ దేశ ప్రజల శక్తిసామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. ''సంఘమందు పుట్టి సంఘమందు పెరుగు సంఘజీవి కాడె సభ్య నరుడు, సంఘవృద్ధి లేక స్వాభివృద్ధియు లేదు-'' అన్నారు నార్లవారు. అయితే మితం తప్పితే హితం తప్పుతుంది అన్న సూక్తి జనాభా విషయంలోను వర్తిస్తుంది. ప్రస్తుతం ప్రపంచం అధిక జనాభాతో సమస్యలనెదుర్కొంటోందంటున్నారు. ఈ విషయంలో అన్ని దేశాల పరిస్థితీ ఒక్కలాగ లేదు. కొన్ని దేశాలు అధిక జనాభాతో సతమతమవుతుంటే, మరికొన్ని దేశాలు జనాభా తక్కువై బాధపడుతున్నాయి. జనాభా ఎక్కువగా ఉన్న దేశాలవారు కుటుంబ నియంత్రణ పద్ధతులు పెంపు చేయాలని చూస్తుంటే జనాభా తక్కువగా ఉన్న జపాన్‌, జర్మనీవంటి కొన్ని పాశ్చాత్య దేశాలు జననాల రేటు ఎలా వృద్ధి చేయటమా అని తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి.

జనాభా ఎక్కువయినా తక్కువయినా ఏ దేశపు ప్రత్యేకత దానికే ఉంటుంది. మన దేశంలో పెళ్లికాని అమ్మాయిలను ''శీఘ్రమేవ కల్యాణప్రాప్తిరస్తు'' అనీ, పెళ్ళయిన పడతులను ''పుత్రపౌత్రాభివృద్ధిరస్తు'' అని దీవించటం పరిపాటి. సంతానం కలగనివారు గుళ్ళూ గోపురాలనేకాక మంత్రాలను, మంత్రాల స్వాములనూ ఆశ్రయించటమూ తరచుగా జరుగుతున్నదే. పిల్లలున్న ఇంటి కళే వేరు. పిల్లలు తమ అల్లరితో, హఠంలతో ప్రాణాలను విసిగిస్తున్నా సంతానాపేక్ష మాత్రం తగ్గదు ఎవరికైనా. ''అమ్మా నువ్వు ఎగ్జిబిషన్‌లో ఆరు కప్పుల పింగీణీ టీ సెట్టు కొనుక్కున్నావు కదా-'' అని అడిగింది ఆరేళ్ళ సుపుత్రిక. ''అవును. ఆ సంగతెందుకిప్పుడు?-'' అంది తల్లి. ''మరేం లేదు, ఆ ఆరు కప్పుల టీ సెట్టును పది కప్పుల టీ సెట్టు చేశాడు తమ్ముడు!-'' అంటూ చల్లగా చెప్పింది సుపుత్రి. తిని కూర్చునేవారు ఎక్కువై పనిచేసేవారు తక్కువైపోతున్న వింత సమస్యతో కొట్టుమిట్టాడుతోంది జపాన్‌ దేశం. ఆ దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతూ జననాల రేటు తగ్గిపోతూ ఉండటంవల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పెన్షన్‌తో కాలం వెళ్ళబుచ్చే వయోవృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోతుండగా పిల్లల కేరింతలు మాత్రం వినపడడంలేదు. ప్రపంచంలోని మిగతా దేశాలు అధిక జనాభాతో సతమతమై పోతుండగా జపాన్‌, జర్మనీవంటి దేశాలు మాత్రం జనాభాలేమి సమస్యతో బాధపడుతున్నాయి. జపాన్‌లో జననాల రేటు బాగా పడిపోవటానికి ఆలస్యంగా చేసుకుంటున్న పెళ్ళిళ్ళు ఒక కారణం కాగా అక్కడి యువతులు పిల్లలను కనటానికి అంతగా సుముఖంగా లేకపోవటం మరో కారణం. అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖవారు విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం 1988 సంవత్సరంలో జపాన్‌ యువతులు 25 లేక 26 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి వివాహానికి సిద్ధపడుతుండగా 2004 సంవత్సరం వచ్చేసరికి 27 లేక 28 సంవత్సరాలు వచ్చినా పెళ్ళిమాటే తలపెట్టటంలేదని తేలింది. వివాహితులైన యువతులూ సంతానవతులు కావటానికి ఇష్టపడటంలేదు. దానికి కారణం పిల్లలను పెంచటం భారీ ఖర్చుతో కూడిన కార్యక్రమం అనే ఉద్దేశం అక్కడి ప్రజలలో పెరిగిపోవటం. శిశు సంరక్షణను చేపట్టే సంస్థల కొరతవల్ల ఉద్యోగినులకు తమ పిల్లల ఆలనాపాలనా చూసుకోవటం కష్టసాధ్యంగా పరిణమిస్తోంది.

జపాన్‌ యువతులు మాతృత్వంపట్ల మోజు చూపటంలేదు. దాంతో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితులలో జనాభా మరీ పల్చబడితే రాబోయే ముప్పును గ్రహించిన జపాన్‌ ప్రభుత్వం- ప్రజలలో వివాహం పట్ల ఆసక్తిని సంతానాపేక్షను వృద్ధి చేయాలనే సదుద్దేశంతో కొన్ని చర్యలను తీసుకోవటం మొదలుపెట్టింది. అందులో భాగంగానే వివాహాలు కుదిర్చే సంస్థలవారు తమ సంస్థల కార్యకలాపాలను గురించి టెలివిజన్‌లో ప్రకటనలు ఇచ్చుకోవచ్చన్నారు. లోగడ మ్యారేజి బ్యూరోలు పత్రికలలో ప్రకటనలిచ్చుకోవచ్చు కాని టెలివిజన్‌లో ప్రచారం చేసుకోకూడదనే నిబంధన ఉండేది. టి.వి. ప్రభావమే ప్రజలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడా నిబంధనను సడలించి టి.విలోను మ్యారేజిబ్యూరోల వారు ప్రకటనలు ఇచ్చుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఈ వెసులుబాటువల్ల వివాహం చేసుకొనేవారి సంఖ్య పెరిగి, జననాల రేటూ వృద్ధి పొంది కొత్త మొహాల కేరింతలతో జపాన్‌ దేశం కళకళలాడిపోగలదని ప్రభుత్వం వారు భావిస్తున్నారు. జర్మనీవారూ తమ దేశ జనాభాను అభివృద్ధిపరుచుకోవాలనే ఉద్దేశంతో మహిళా ఉద్యోగినులకు ఏకంగా ఒక సంవత్సరంపాటు ప్రసూతి సెలవును మంజూరు చేస్తున్నారు. లోగడ ఆరువారాలు మాత్రమే ప్రసూతి సెలవు ఉండేది. ఇప్పుడా సెలవును ఒక్కసారే సంవత్సరానికి పెంచేశారు. అంతేకాక తల్లులయిన ఉద్యోగినుల భర్తలకూ రెండు నెలలపాటు పితృత్వ సెలవునూ మంజూరు చేస్తున్నారు. పన్ను రాయితీ వగైరాలు ఉండనే ఉన్నాయి. ఈ ప్రోత్సాహకాలన్నిటివల్లా జర్మనీ, జపాన్‌ దేశాలు జనాభా కరవు అన్నమాట లేకుండా పుష్కలంగా మానవవదనాలతో వెలిగిపోగలవని ఆ దేశాలవారు భావిస్తున్నారు. వారి ఆశయాలు ఫలిస్తాయనే ఆశిద్దాం!
(Eenadu,11:02:2007)
------------------------------------------------------

Labels:

పుట్టుకతోనే మంచీచెడు


"నేర్చుకోవడంతో కాదు;
స్వాభావికంగానే వివేచన
నిర్ణయం అంతఃప్రేరణదే
అబద్ధమాడడం తప్పు...
దొంగతనం చేయడం తప్పు...
ఎవర్నైనా చంపడం తప్పు..."
...అనడంలో మనకెవరికీ భిన్నాభిప్రాయం ఉండదు. అవునా? అందుకే మనం ఇలాంటి మంచి మాటల్ని పిల్లలకు చెబుతుంటాం. నీతి కథలు బోధిస్తుంటాం. ఏది మంచో, ఏది చెడో... నేర్పిస్తేనే తెలుస్తుందని మనం అనుకుంటాం. ఇది నిజమేనా? నేర్పిస్తేనే 'నీతి' అబ్బుతుందా? అసలు ఇది తప్పు, ఇది ఒప్పు అని మనం ఎలా నిర్ణయానికి రాగలుగుతాం? విభిన్న భాషల్లో, సమాజాల్లో, వాతావరణాల్లో పెరిగిన వారికి మంచి, చెడుల విషయంలో విభిన్న అభిప్రాయాలుంటాయా? ప్రసిద్ధ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మార్క్‌ హౌజర్‌ అనే ప్రొఫెసర్‌ దీనిపై పరిశోధన చేసి ఆసక్తికరమైన విశేషాలు వెల్లడించారు. ఏది తప్పో, ఏది ఒప్పో మనం నేర్చుకుంటాం అనడం కన్నా, ఆ ఇంగిత జ్ఞానం (కామన్‌ సెన్స్‌) పుట్టుకతోనే మనలో ఉంటుందని ఆయన తేల్చారు. దీన్నే తార్కికంగా వివరిస్తూ 'నైతిక హృదయాలు (మోరల్‌ మైండ్స్‌)' అనే పుస్తకం రాశారు. పుట్టాక ఊపిరి పీల్చడాన్ని మనకెవరూ నేర్పరు. పీల్చాలని చెప్పరు కూడా. అయినా మనం ఊపిరి పీల్చడం ప్రారంభిస్తాం. అంతఃప్రేరణే దీనికి కారణం. మంచి చెడుల్ని తేల్చే ఇంగితజ్ఞానం కూడా ఇలాగే బాల్యంలోనే మనుషుల్లో బలంగా నాటుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతం బాటలోనే లక్షలాది ఏళ్లుగా ఈ అంతఃప్రేరణ మన మనసుల్లో జీర్ణించుకు పోయిందని, క్రమంగా ఎదుగుతూ వస్తోందని వివరించారు. నైతికతకు సంబంధించి ఏదైనా ఒక ప్రశ్న వేసినపుడు, క్లిష్టమైనదైనా, అది మంచో, చెడో వెంటనే చెప్పేస్తాం. అందులోనూ ఎక్కువమంది చెప్పే అభిప్రాయాలు ఏకీభవిస్తాయి. దీనికి కారణం.. మనుషుల్లో సహజంగా ఉండే వివేచనే అని ఆయన విశ్లేషించారు. ''పిల్లలు పూర్తిగా ఖాళీ మెదడుతో పుట్టరు. భాషకు సంబంధించిన మౌలిక వ్యాకరణం వారిలో పుట్టేనాటికే ఉంటుంది. దాని ఆధారంగానే వారు భాషను నేర్చుకోగలుగుతారు. విభిన్న భాషలకు విభిన్న వ్యాకరణాలు ఉంటాయని కదా అని ప్రశ్నించవచ్చు. భాషేదైనా, దాన్ని నేర్చుకునేందుకు మౌలిక వ్యాకరణం ఒకటే. దాని ఆధారంగానే పిల్లల మెదడులో వాక్య సమీకరణాలు వృద్ధి చెందుతాయి'' అని ప్రసిద్ధ విద్యావేత్త నోమ్‌ చామ్‌స్కీ గతంలో ప్రతిపాదించారు. నీతికి సంబంధించి కూడా మన మనసుల్లో పుట్టుక నాటికే, అసంకల్పిత వ్యాకరణం ఏర్పడి ఉందనీ, దాని ఆధారంగానే మనం మంచి చెడులపై ఏకాభిప్రాయంతో ప్రతిస్పందిస్తున్నామనీ హౌజర్‌ తెలిపారు. పరిశోధనలో భాగంగా ఆయన రెండు సన్నివేశాలను ఉపయోగించారు. అవి...

రైలు మార్గంపైకి వెళ్తే...
పక్కపక్కనే రెండు రైలు మార్గాలున్నాయి. ఒకదానిపై ఐదుగురు వ్యక్తులు నడుస్తున్నారు. వారి వెనకే వేగంగా ట్రాలీ వస్తోంది. బ్రేకుతో ఆపలేని పరిస్థితి. అది అలాగే ముందుకు వెళ్తే ఆ అయిదుగురూ ప్రాణాలు కోల్పోతారు. వారిని కాపాడాలంటే రెండేరెండు మార్గాలున్నాయి.

ఒకటి... ట్రాలీని పక్కనున్న పట్టాలపైకి మళ్లించే వీలుంది. కానీ దానిపై ఒక పాదచారి ఉన్నాడు. ట్రాలీ కిందపడి అతడు చనిపోతాడు. కానీ ఆ ఐదుగురూ బతుకుతారు.

రెండు... ఏదైనా పెద్ద వస్తువును అడ్డంవేస్తే ట్రాలీని ఆపొచ్చు. పట్టాల పక్కనే ఒక స్థూలకాయుడు నిలబడి ఉన్నాడు. అతడు పట్టాలపై అడ్డంగా పడితే ట్రాలీ అగుతుంది. కానీ అతడు చనిపోతాడు. ఐదుగురు బతుకుతారు.

ఏది అనుసరణీయం? ఏ మార్గం మంచిది? ఏది చెడ్డది? మీరైతే ఏం చెబుతారు? ఆలోచించండి.

ఎక్కువ మంది మొదటిదానికే ఓటేశారు. ట్రాలీని పక్కనున్న పట్టాలపైకి మళ్లించడమే సరైందని, అదే నీతిమంతమనీ అభిప్రాయపడ్డారు. స్థూలకాయుడిని పట్టాలపైకి నెట్టడం సరికాదని స్పష్టంచేశారు. నిజానికి రెండు సన్నివేశాల్లోనూ, లెక్క సమానం. ఒక వ్యక్తి చనిపోతే ఐదుగురు బతుకుతారు. అనివార్యమైన ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించడమే రెండింటిలోనూ అంతరార్థం. అయినా మొదటిదే సరైనదని, రెండోది తప్పని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఎందుకీ ఏకీభావం? ''వారి ప్రతిస్పందన స్వాభావికమైనది. గణాంకాల తర్కాన్ని, పట్టించుకోకుండా వారిలోని అసంకల్పిత సహజ అంతఃప్రేరణ ఈ నిర్ణయం తీసుకుంది. భాషా, సామాజిక, ప్రాంతీయ, వయో భేదాలకు అతీతంగా ఇది వ్యక్తమైంది. అంటే వారు జన్మతః తమలో ఉన్న సార్వజనీన నైతిక వ్యాకరణాన్ని అనుసరించారన్న మాట'' అని విశ్లేషించారు హౌజర్‌.

ఆసుపత్రిలోకి ప్రవేశిస్తే..
అదో ఆసుపత్రి. నర్సు వేగంగా డాక్టర్‌ వద్దకు పరుగెత్తుకుని వచ్చింది. ''సర్‌. ప్రమాదంలో గాయపడిన ఐదుగురు వ్యక్తుల్ని ఆసుపత్రికి తెచ్చారు. ఒకరికి గుండె, ఇద్దరికి కిడ్నీలు, ఇంకొకరికి ఊపిరితిత్తి, వేరొకరికి కాలేయం దెబ్బతిన్నాయి. తక్షణం మారిస్తేనే బతుకుతారు. కానీ వారికిచ్చేందుకు అవయవాలు మన ఆసుపత్రిలో లేవు'' అని చెప్పింది. డాక్టర్‌ అయోమయంగా చూశాడు. ''సర్‌, రక్తమిచ్చేందుకు ఒక నిరుపేద యువకుడు మన ఆసుపత్రికి వచ్చి కూర్చున్నాడు. అతడి బ్లడ్‌గ్రూపు, బాధితులదీ ఒకటే. అతడి అవయవాలను తీసి వీరికి అమరిస్తే ఈ ఐదుగురూ బతుకుతారు. కానీ ఆ యువకుడు చనిపోతాడు..'' అని చెప్పింది నర్స్‌.

మీరే డాక్టరైతే ఏమంటారు? సరే అంటారా? ఎక్కువమంది అది తప్పన్నారు. ఐదుగురూ బతకకపోయినా పర్లేదుగానీ, ఆ యువకుడి అవయవాల్ని వారికి అమర్చడం సరికాదన్నారు.

రైలు మార్గం సన్నివేశంలో, ఐదుగురిని రక్షించడం కోసం పాదచారిని బలిపెట్టడం మంచిదేనన్న వారు, ఇప్పుడు మాత్రం ఐదుగురిని బతికించడం కోసం నిరుపేద యువకుడిని చంపడం తప్పన్నారు. అక్కడా ఇక్కడా లెక్క సమానం. ఐదు ప్రాణాలకు ఒక ప్రాణం. అక్కడా ఇక్కడా సమాధానం చెప్పింది వాళ్లే. కానీ జవాబు విభిన్నం. అక్కడ ఒప్పైంది ఇక్కడ తప్పైంది. ఎందుకీ తేడా? ''ఎలాగైనా నష్టం జరుగుతుంది అన్నపుడు, అది తక్కువగా ఉండేట్టు చూసి, ఎక్కువ మంచికి దారితీసేలా చేయడంలో తప్పులేదు. కానీ ఎక్కువ మంచి కోసమని, కావాలని తక్కువ నష్టానికి పాల్పడడం మాత్రం సరికాదు'' అన్నదే మానవ నైతిక హృదయం ఇచ్చే తీర్పు అని హౌజర్‌ విశ్లేషించారు. అత్యధికులు ఏకాభిప్రాయంతో ఇవే సమాధానాలివ్వడం ఆశ్చర్యకరమేగాక, మనిషిలో స్వాభావిక నీతికి నిదర్శనమని కూడా ఆయన చెప్పారు. అయితే దీన్ని ఇప్పుడే నిర్ధారించలేమనీ, ఇదొక ప్రతిపాదిత చర్చమాత్రమేననీ తెలిపారు.
(Eenaadu,11:02:2007)
--------------------------------------------------

Labels: