సర్వేజీవా సుఖినోభవంతు
జంతుజాలాల్లోని ఈ విశిష్టతలవల్లే భారతీయులు చెట్టుమీది పిట్టనీ, పుట్టలోని పామునీ దేవతా స్వరూపాలుగా సంభావించి కొలిచేది. ఆవును సాక్షాత్ గోమాత స్వరూపంగా కరుణశ్రీ వంటి కవులు భావించి కీర్తించింది ఈ దైవీయ భావనతోనే. జాంబ పురాణం ప్రకారం అనంత కాలాల కిందటే జన్మించిన మూలపురుషుడు జాంబవంతుడు. కన్నబిడ్డ డొక్కలను కొలిమిగా, చర్మాన్ని తిత్తిగా, హస్తాలను పట్టుతెరలుగా, బొటనవేళ్లను ఉలులుగా మలచి విశ్వకర్మకే పరికరాలను సమకూర్చిన నిపుణుడు ఆయన. భూదేవికి వరాహపురాణం వినిపించిన మేధావి ఆదివరాహమూర్తి. సామవేదాన్ని గానంగా వినిపించిన మహాముని శుకుడు. భోజరాజీయంలోని గోవు అభిజ్ఞాన శాకుంతలంలోని కణ్వమహర్షితో సమానమైన ప్రతిభా విశేషాలతో తన చిన్నిదూడకు సుద్దులు చెబుతుంది. రఘునాథ నాయకుడి 'నలచరిత్ర' హంస కథానాయకుడి చేతజిక్కినప్పుడు చెప్పే 'సంసార ధర్మాలు' పండితుల పలుకులకు తీసిపోనివి. నలదమయంతుల మధ్య రాయబారం నడిపి వారి ప్రేమను పండించిన పెళ్ళిపెద్ద అది. శృంగారం మదన శివాలు తొక్కి నాయిక పరకీయగ మారే ప్రమాదాన్ని గ్రహించి రాత్రికో మడతపేచీ కథ చొప్పున చెప్పుకొస్తూ మగడు ఇల్లు చేరినదాకా ఇంటి పరువును, ఇంతి పరువును గుట్టుగా కాపాడిన చతుర, కదిరీపతి 'శుకసప్తతి' చిలుక. రాబర్ట్ బ్రూస్ వంటి మహారాజుకే పాఠాలు చెప్పిన సాలెపురుగులోని యంత్రరహిత నూలు నిర్మాణ కౌశలం అద్భుతం. 'ఈశ్వరశక్తి నీ కడుపులోనే లీలమై యుండునో' అంటూ జాషువా వంటి మహాకవుల మన్ననలందుకున్న జంతుజాలాల విశేషాలు ఎంత చెప్పుకొన్నా సశేషాలే!
మనిషి తన తోటి మనిషిని చిన్నబుచ్చడానికి జంతువులతో పోల్చడం ఎంతవరకు సమంజసం? 'బూడిద బుంగవై యొడలు పొడిమి దప్పి మొగంబు వెల్లనై/ వాడల వాడలం దిరిగి వచ్చెడు వారలు చొచ్చొచోయనన్/ గోడల గొందులందొదిగి కూయుచు నుండెడు' వారిని శ్రీనాథుడంతటి మహా పండితుడు గాడిదలని తూలనాడటం తగునా? పిల్లిమీద, ఎలుకమీద పెట్టి తిట్టే అన్యాపదేశాలు సాహిత్యంలో అలంకారాలు- అన్నంత వరకైతే సరిపుచ్చుకోవచ్చు. కానీ, చిన్నజీవులపట్ల పెద్దమనసు కలిగి ఉండటం బుద్ధిమంతుల లక్షణం. తీయని పదాల రామా రామా యటంచు/ తీయ తీయగా రాగాలు తీయుచున్న/ కమ్మకైతల క్రొమ్మావి కొమ్మమీది' ఆదికవి వాల్మీకిని మనం 'కోకిలస్వామి'గా కొలుచుకుంటున్నాం. కర్ణాటక రాజ్యాధిపతులు ఒకప్పుడు 'ధరణీ వరాహ'మనే బిరుదును గొప్ప గౌరవంగా ధరించేవారు. నృత్య విశేషాలను మయూర భంగిమలతోను, చురుకు వేగాన్ని అశ్వతేజంతోను, సునిశితమైన వినికిడిని పాము చెవులతోను, సూక్ష్మదృష్టిని విహంగవీక్షణంతోను సరిపోల్చుకొని సంబరపడే మనిషి సాటి జీవాన్ని అల్పదృష్టితో చూడటం సృష్టిదోషం. విష్ణుశర్మ పంచతంత్రంలో జంతుపాత్రలు అందించే నీతిచంద్రికలు మనిషి మనసులో ముసిరి ఉన్న చీకట్లను పారదోలేవి. విశ్వాసానికి శ్వపతి(కుక్క), శుచి-శుభ్రతలకు మార్జాలం, బృందస్ఫూర్తికి పిపీలక సందోహం, ఐక్యతకు కాకిమూక, సమానత్వ భావనకు వానరజాతి... మనసు తెరచుకుని ఉండాలేగానీ క్రిమికీటకాలనుంచి పశుపక్ష్యాదులదాకా సర్వజీవావళి మనిషి పాలిట పరమ గురువులే. సాధు హృదయంతో చేరదీయడమొక్కటే మనం చేయవలసిన సత్కార్యం. మైమీ విశ్వవిద్యాలయం, సెయింట్ లూయీ విశ్వవిద్యాలయం జంతువులను పెంచి పోషించేవారిమీద చేసిన ప్రయోగాల ఫలితం ప్రకారం- అది మానవ జాతికే ప్రయోజనకరం. పెంపుడు జంతువుల యజమానుల్లో ఆత్మవిశ్వాసం, ఆరోగ్యవంతమైన శరీరం, కలుపుగోలుతనం, సామాజిక స్పృహ, నిర్భయత్వం- జంతుజాలాలకు దూరంగా ఉండేవారిలోకన్నా ఇరవైశాతం అధికంగా ఉంటాయని పరిశోధన బృంద నాయకుడు అలెన్ ఆర్ మెక్కానిల్ చెబుతున్నారు. ఆసుపత్రులకు దూరంగా ఉండాలంటే సాటి జీవాలకు చేరువ కావడమే దగ్గరి దారి!
Labels: Animals/ telugu