ప్రభాత భేరి
అందం, ఆనందదాయకం ప్రభాతం. తెలతెలవారుతున్న వేళ గరికిపాటి దర్శించినట్టు 'కాల మహా స్వరూపునకు కమ్మని స్వాగతమీయ, పక్షి బృం/దాల ప్రపంచమునకు పతాకము నూపగ' నిద్రలేవడం ఓ మహానుభూతి. దివినీ భువినీ ఏకంచేసే ఆ రవికిరణాలే ప్రకృతికి అలంకరణాలు. అరుణారుణ అవతరణలూ జనతా జాగరణలూ అవే. పగలంతా అలసిసొలసిన సమస్త ప్రాణికోటీ రాత్రయ్యేసరికి నిద్రలోకి జారుకుంటుంది. తెల్లవారేలోగా మేలుకుంటేనే అనుదిన జీవన ప్రక్రియ సజావుగా మొదలైనట్టు. మరి నిద్రాముద్ర అంత సులువుగా వదులుతుందా? పడుకున్నదే తడవుగా పగలూ రాత్రీ తేడా లేకుండా ఆవరించే కలల నిద్ర మరో తరహా. పగటి నిద్ర ఎటువంటి అనుభవాన్నిచ్చినా, రోజువారీ పనికి అది చేటన్నది పెద్దలమాట. 'కాంతిప్రియా తేజోమయా త్రిలోక దీపా ప్రణవ స్వరూపా' అని కవి గాయక వైతాళికులంతా స్తుతించే దినకరుడి స్పర్శ అత్యంత ఉత్తేజకారకం. ఆ కిరణ స్ఫురణ అయినా రాకుండా నిద్రాదేవి ఆవహించినట్టు మొద్దునిద్ర పోవడమంటే అదెంతో నిర్భాగ్యమే. అతి నిద్రాలోలత ఎంత అనర్థమో భీముడంతటివాడికి ఆనాడే బహు ఘాటుగా చెప్పాడు బావ కృష్ణుడు. 'పరమార్థం గానలేక వ్యర్థంగా చెడతాడు' అనడంలోనే చురుకూ చరుపూ ఉన్నాయి.
బండనిద్ర అనడంతోనే కుంభకర్ణుడే గుర్తుకొస్తాడు. 'అవమాన ముద్రకు ప్రథమ కారణం నిద్ర' అన్నారు శ్రీనాథ మహాకవి. అదెంత దుఃఖహేతువో ఉదాహరణ సహితంగా వివరించారు మరో కవి జక్కన. ఎప్పుడూ మనిషికి ఆరోగ్యమూ భాగ్యమూ తగినంత నిద్ర మాత్రమే. ప్రకృతి ప్రసాదితమైన ఆ వరాన్ని సవ్యంగా వినియోగించుకోవడం అతనిలోనే ఉంది. సూర్యోదయానికి ముందే అమృత ఘడియల్లో కళ్లు తెరవడం పరమ విశిష్టం. రామచంద్రుణ్ని ప్రభాత సమయానికే నిద్రలేపిన గురుదేవుడు బోధించిందీ 'ఉత్తిష్ఠ' ప్రత్యేకతనే. బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకుంటే కలిగే ఉన్నతి, సత్వగుణ సంపత్తి, పవిత్రత, శక్తిసంపన్నత అంతటినీ శుశ్రుతాది మహానుభావులూ అధర్వణ వేదవిజ్ఞాన మహనీయులూ ఆనాడే చాటారు. సుఖసంతోషాల చిరునామా- నిద్రించడంలో కాదు, నిద్రనుంచి లేవడంలోనే ఉంది. 'సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ' అంటూ సాగే స్తోత్రగీతానికి ధ్వని సహకారం వినిపించేది జీవన గడియారంలోనే! నిద్రాహారాలు ఎంత సహజసిద్ధమో నిద్రనుంచి లేచి జరిపే జీవప్రక్రియలూ అంతే సహజాలుగా రూపొందినప్పుడు, అదే ఉత్తమోత్తమం. లక్ష్మణ సతీమణి వూర్మిళాదేవి సుదీర్ఘకాల నిద్రకు అర్థం, అంతరార్థం ఉన్నాయి. నాడూ నేడూ కొందరు యోగనిద్ర పాటించడంలోనూ విశేషాలూ విలక్షణతలూ కనిపిస్తున్నాయి. అంతేకానీ, ఇప్పుడు కొంతమంది పిన్నలూ పెద్దలూ బారెడు పొద్దెక్కితే కానీ కళ్లు తెరవకపోవడంలో అర్థమేముంటుంది? పరమార్థం ఎక్కడుంటుంది? జీవితంలోని పలు కీలక నిర్ణయాలు సుప్రభాతంలో తీసుకున్నవేనని జాతిపిత బాపూజీ ప్రకటించినా; ఆ వేళ మేలుకోవడమే ఆలోచనలో స్పష్టత, ఆచరణలో పటిష్ఠతకు మూలమని అమెరికా రాజ్యాంగ పితామహుడు జెఫర్‌సన్ వెల్లడించినా ప్రధాన ఆధారం- మెలకువ.
తెల్లవారుజామునే లేచి, కళ్లు విప్పార్చి చూడాలే కానీ... ఎన్నెన్ని సౌందర్యాలు! చెవులు రిక్కించి వినాలే కానీ, విందులందించేలా ఎన్నెన్నో మాధుర్యాలు! వేటూరి పలవరించిన 'కోకిల గీతం, తుమ్మెద నాదం/ గలగల సాగే సెలగానం/ ఘుమఘుమలాడే సుమరాగం' ఇతరులందరికీ ఎదురుకాకున్నా, ఆ సరిసమాన అనుభూతులు తనువును, మనసును ఉల్లాసమయం చేయవూ? ఎవరో పిలిస్తేనో, ఏ శబ్దమో వినిపిస్తేనో మేలుకోవడం కాదు. నిద్రించినా, లేచినా ప్రకృతితో మమేకమైనట్టే ఉండాలి. ఎవరికి వారే తమకు తామే లేచి కళాత్మక రీతిని ఆస్వాదిస్తే, ప్రతి ఉదయమూ సుమధురమే. ఉదయాన్నే నిద్రలేవడం ఆరంభంలో దుర్లభంగా అనిపించినా- క్రమక్రమంగా ఏకాగ్రత, ప్రశాంతత సొంతమవుతాయి. అదొక సమయపాలన, స్వయం క్రమశిక్షణ. 'మేలుకోవడంలో ఏ రోజైనా కాస్తంత ఆలస్యమైతే అదోలా అనిపిస్తుంది, నన్ను వదిలేసి ఈ ప్రపంచమంతా పని మొదలెట్టిందని సిగ్గేస్తుంది' అన్న లోకమాన్య బాలగంగాధర తిలక్ ప్రత్యేకించి నేటితరానికి తక్షణ స్ఫూర్తిదాత. 'పొద్దున్నే పక్షులు సైతం లేచి గూళ్లు వదిలి పరుగులు తీస్తుంటే, మనుషులమైన మనం లేవలేమా?' అనే జ్ఞానబోధ తిరుప్పావైలోనూ కనిపిస్తుంది. బాధ్యతాయుత పాలనగా, కర్తవ్యభరిత నిర్వహణగా అంతా ముందుకు సాగినప్పుడు శ్రీశ్రీ అన్నట్టు 'మేలుకోవడం జీవధర్మం/మేలుకొలపడం జీవన సూత్రం'. అదే అందిపుచ్చుకొన్నట్టు, ఉత్తరప్రదేశ్ యువ విద్యార్థి ఒకరు విభిన్న మోత గడియారం కనిపెట్టారు. నిర్ణీత సమయానికే గణగణలాడే ఆ పరికరాన్ని మీటనొక్కి ఆపాలనుకుంటే కుదరదు! మీద చేయిపడిన తక్షణమే 'జివ్వు'మనిపించి, విద్యుదాఘాత అనుభవాన్ని కలిగిస్తుందది! ఆ తాకిడికి నిద్రమత్తంతా ఒక్కసారిగా మటుమాయమై, చటుక్కున లేచి కూర్చుంటారు ఎవరైనా. అప్పటికప్పుడే చకచకా దినచర్యకు ఉపక్రమించి, చదువుకూ శిక్షణకూ సిద్ధమైపోతారు కూడా. విద్యార్థులనే కాదు... ఇతర జీవనరంగాలవారినీ 'మేలుకోండి, గమ్యం చేరేదాకా ఆగకండి' అని ఉత్సాహపరచే అలాంటి పరికరాలే ఇక ముందుముందు వెలుగు కిరణాలన్నమాట!
(ఈనాడు, సంపాదకీయం , 27:01:2013)
_____________________________________
Labels: Life/telugu