My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, January 19, 2008

విప్లవ శ్రీశ్రీ ప్రేమ కవిత్వం

''క్రిష్ణశాస్త్రి తన బాధను అందరిలో పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధనూ తనలో పలికిస్తాడు.
క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ'' - ఇది చలం మహాప్రస్థానానికి ఇచ్చిన యోగ్యతా పత్రం సారాంశం.
చలం శ్రీశ్రీని పొగడడం బాగుందిగానీ కృష్ణశాస్త్రిని వేలెత్తి చూపడమెందుకు? ప్రేమ కవిత్వం రాసినందుకేగా కృష్ణశాస్త్రి మాట పడింది. శ్రీశ్రీ మాత్రం ప్రేమ కవిత్వం రాయలేదా? ఎందుకు రాయగూడదు. విప్లవకారులు ప్రేమించకూడదు. ప్రేమికులు విప్లవ కవిత్వం రాయకూడదా? విప్లవమూ ప్రేమ రెండూ విరుద్ధమైన విషయాలేం కాదే: శ్రీశ్రీ ప్రేమగీతాలు చూస్తే ఇలాగే అనిపిస్తుంది.
''నీ తలపున రేకులు పూస్తే
నా వలపున బాకులు దూస్తే
మరణానికి ప్రాణం పోస్తాం
స్వర్గానికి నిచ్చెనవేస్తాం'' అంటారు. ఆమె హసనానికి రాణి అట: ఆయనకేమో వ్యసనానికి బానిస అట!
''నీ మోవికి కావినినేనై
నా భావికి దేవివి నీవై
నీ కంకణ నిక్వాణంలో
నా జీవన నిర్మాణంలో-
ఆనందం ఆర్ణవమైతే
అనురాగం అంబరమైతే -
ప్రపంచమును పరిహసిస్తాం
భవిష్యమును పరిపాలిస్తాం''
అంటారు శ్రీశ్రీ. ఈ గేయం రాసినందువల్ల శ్రీశ్రీ విప్లవతత్వం ఏమైనా దెబ్బతిన్నదా? శ్రీశ్రీయే, స్వయంగా 'వెన్నెల పేరెత్తితే చాలు వెర్రెత్తిపోతుంది మనస్సు' అని కూడా అన్నారు.
విప్లవమూ, ప్రేమా ఢీకొంటే వచ్చే కవిత్వం కాస్త వెరైటీగా ఉంటుంది. దానికీ శ్రీశ్రీ రాసిన 'మంచి ముత్యాల సరాలు' అనే గీతమే ఉదాహరణం.
ఇందులో ఆయన
ఎర్రశాలువ కప్పుకొని మా ఇంటికొచ్చిందొక రివాల్వర్‌
బాధలో బెంజైన్‌ సీసా
ప్రేమలో డైమాన్‌ రాణీ అని రాశారు.
ఆ ప్రేయసి కూడా సామాన్యమైన వనితకాదు.. చిచ్చర పిడుగు.
'నన్ను తిట్టిన తిట్లతోనే
మల్లెపూవుల మాలకట్టెను
నాకు వ్రాసిన ప్రేమ లేఖలు
పోస్టు చేయుట మానివేసెను' అని రాశాను.
పోస్టు చేయుట మానివేసెను' అని రాశారు. పోస్టు చేయడం మానబట్టి సరిపోయింది. కొంపతీసి పోస్టుచేసి ఉంటే శ్రీశ్రీ ఇలా కవిత్వం రాయగలిగేవాడా?
శ్రీశ్రీ విప్లవ గీతాల్లో ఎంత స్పెషలిస్టో ప్రేమగీతాల్లో అంత కంటె ఎక్కువ స్పెషలిస్టు. జేమ్స్‌ జాయిస్‌కు ఇమిటేషన్‌గా రాసిన ఈ ప్రేమ గీతం చూద్దాం.
''ప్రేమ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది
ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది
ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమచే
ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది''
అంటూ ప్రేమ మయమైన గీతం రాశారు.
ప్రేమికులకు శ్రీశ్రీ బోలెడు ఉదాహరణలు కూడా ఇస్తారు.
''నర్సు కొత్త డాక్టర్‌ను ప్రేమిస్తుంది
14 నం. కనిష్టీబు మేరీకెల్లీని
ప్రేమిస్తాడు
హంటర్‌వాలా హంటర్‌వాలీని ప్రేమిస్తాడు
మనవాళ్లయ్య వాళ్ల వాళ్లమ్మను
ప్రేమిస్తాడు
సరోజాబాయి సైకిలు మీద వచ్చిన
కుర్రాణ్ని ప్రేమిస్తుంది''
అంటూ పెద్ద చిట్టా విప్పుతాడు. చివరకు 'భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు' అని ముక్తాయింపు ఇస్తాడు.
ఇవన్నీ చూస్తుంటే ప్రేమ ఎవరికీ అస్పృశ్యం కాదని అనిపించడంలో వింతేముంది?
- శంకరనారాయణ
(Eenadu, Saahityam
http://www.eenadu.net/sahithyam/display.asp?url=maha295.htm )
______________________________________

Labels:

వివేకానంద మాటలు

''జీవితంలో అందమైన మలుపు ఇది. బతుకును పూలతేరుగా పేర్చుకున్నా ముళ్లబాటగా మలుచుకున్నా పునాది పడేది ఇక్కడే. బడి గడపలు దాటి కాలేజీ గేటులోకి అడుగిడే మధుర క్షణాల నుంచి సమాజంలో ఓ వ్యక్తిగా మనకంటూ గుర్తింపును సాధించే వరకూ ఎన్నో మలుపులు... మరెన్నో మార్పులు. నా ఆశలన్నీ యువతరం పైనే. వారే ఆశయ సాధకులు'' అనే స్వామి వివేకానంద మాటలు యువతకు ఎప్పటికీ ఆచరణీయాలే. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉండాలనే ఆయన యువత కోసం ఎన్నో 'ఆయుధాలు... నైపుణ్యాలు' సూచించారు. వాటిల్లో కొన్ని మీకోసం.

* అందరూ నేర్చుకోవాల్సిన తొలి పాఠం ఒకటుంది. ఎవరినీ నిందించకండి. ఎవరి పైనా నెపం వేయకండి. దేనికైనా మీరే కారకులని గుర్తించండి. అదే నిజం. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.

* ఇది గ్రహించండి. అతి జాగ్రత్తగా ఉండేవాళ్ళే ఆపదలో పడతారు. గౌరవాన్ని కోల్పోతామని భయపడేవాళ్ళే అవమానానికి గురవుతారు. నష్టాలకు బెదిరిపోయే వాళ్ళే అన్నీ కోల్పోతారు.

* మనని అజ్ఞానులుగా మార్చేది ఎవరు? మనమే. మన చేతులతో మనమే కళ్ళు మూసేసుకుని అంతా చీకటిగా ఉందని ఏడుస్తున్నాం.

* ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే జీవితం చేసుకోండి. దాని గురించే ఆలోచించండి. కలలు కనండి. దానిపైనే బతకండి. మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలో ప్రతి భాగమూ ఆ లక్ష్యంతో నిండిపోనివ్వండి. అదే విజయానికి దారి.

* ప్రేమ... డబ్బు జ్ఞానం.. చదువు... దేనికోసమైనా సరే అదే లక్ష్యంగా తపన పడేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుం పట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.

* ఆత్మవిశ్వాసం లేకపోవడం క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తులు జీవితాలను నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మ విశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకంలేనివాడు నాస్తికుడనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడన్నది ఆధునిక మతం.

* అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం... ఇవే మనకు కావాలి. వీటితోనే మనం ఏదైనా సాధించగలం. వెనక్కి చూడకండి. ముందంజ వేయండి.

* ఎవరికో బానిసలా కాకుండా యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అదే నిన్ను యజమానిని చేస్తుంది.

* మనస్సు, శరీరం రెండూ దృఢంగా ఉండాలి. ఉక్కు నరాలూ, ఇనుప కండరాలూ కావాలి. మేథస్సుకు చదువులా... శరీరానికి వ్యాయామం అవసరం. నిజానికి ఓ గంట పూజ చేసేకన్నా ఫుట్‌బాల్‌ ఆడటం మంచిది. బలమే జీవితం. బలహీనతే మరణం.

* వెళ్లండి ఎక్కడెక్కడ క్షామం, ఉత్పాతాలు చెలరేగుతున్నాయో అలాంటి ప్రతి ప్రదేశానికీ వెళ్లండి. మీ సేవలతో బాధితులకు ఉపశమనాన్నివ్వండి. వ్యథను తుడిచిపెట్టే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో మహా అయితే మనం చనిపోవచ్చు. కానీ ఆ మరణంకూడా మహోత్కృష్టమైనది. కూడగట్టాల్సింది సహాయం... కలహం కాదు.కోరుకోవాల్సింది సృజన... విధ్వంసం కాదు. కావాల్సింది శాంతి, సమన్వయం. సంఘర్షణ కాదు.
(Eenadu, 12:01:2008)
______________________________________

Labels: ,

అవినీతి-రాజనీతి

- శంకరనారాయణ

''కామిగాక మోక్షగామియు కాడయా విశ్వదాభిరామ వినురవేమ!'' అన్న వేమన్న 'అవినీతిపరుడుగాక నీతిపరుడు కాలేడయా' అన్న ఒక్క ముక్క గనక అని ఉంటే మన పాలకులు ఆయనకు (సంస్కరణ) బ్రహ్మరథం పట్టి ఉండేవాళ్లు. వూరూరా ఆయనకు గుళ్లూ గోపురాలు కట్టించేవాళ్లు. 'చెక్కు' భజనలు చేసేవాళ్లు. అయితే, అంత 'అదృష్టం' వేమనకు దక్కలేదు. అయినా మన నాయకులు వేమన చెప్పిన మాటను కాస్త మార్చి 'తినగ' తినగ 'స్కాము' తీయనుండు అంటున్నారు. ఎప్పటికప్పుడు 'అవినీతి బ్రహ్మోత్సవాలు' జరిపిస్తూ 'ఆదర్శం'లోకి 'అడుగు'వేస్తున్నారు.

ఇందుకు గిరీశమే స్ఫూర్తి. ''యిన్ఫెంట్‌ మారేజీలు అయితేనేగాని, యంగ్‌విడోజ్‌ వుండరు. విడోజ్‌ వుంటేనేగాని విడో మారియేజ్‌ రిఫారమ్‌కి అవకాశం వుండదు గదా! సివిలిజేషన్కల్లా నిగ్గు విడోమారియేజ్‌ అయినప్పుడు, యిన్ఫెంట్‌ మారేజీల్లేకపోతే సివిలిజేషన్‌ హాల్టవుతుంది. మరి ముందుకు అడుగుపెట్టలేదు. గనక తప్పకుండా యిన్ఫెంట్‌ మారియేజ్‌ చేయవలసిందే'' అంటాడు గిరీశం. ఆ లెక్కన అవినీతే లేకపోతే అవినీతి నిర్మూలన ఎలా జరుగుతుంది? 'తిన్నది' ఎలా అరుగుతుంది? తక్కువ 'తిన్న'వారెవరూ ఉండకూడదన్న సదాశయంతో 'చేతి'కి ఎముకలేకుండా 'సంత'ర్పణలు సాగుతున్నాయి.

వనభోజనాలు ఒక్క కార్తీకమాసంలోనే జరిగితే ఎవరైనా ఎంత తినగలరు? అందుకే మహానాయకుల చేతి చలువతో ఏడాదిలో అన్ని మాసాల్లోనూ, అన్ని మోసాల్లోనూ 'ధన భోజనాలు' పుష్కలంగా జరుగుతున్నాయి. 'జేబు నిండా డబ్బు... కంటినిండా నిద్ర' అనేది 'నోటికి నోరు శాతం' అమలు అయిపోతున్నది!

అలాగని, మాంసం తిన్నంతమాత్రాన ఎముకలు మెళ్లో వేసుకోవాలని ఎక్కడన్నా ఉందా? ముడుపులు ముట్టినంతమాత్రాన మాటల్లోనూ మడి కట్టుకోకూడదని ఎవడు చెప్పాడు? అందువల్ల 'నేత' బీరకాయలు, 'నీతి బీరకాయలు' బ్రహ్మాండంగా పుట్టుకొస్తున్నాయి.

'అవినీతి అంతర్జాతీయ సమస్య' అని ఇందిరమ్మే చెప్పారు. అప్పటికన్నా ఇందిరమ్మరాజ్యం ఇప్పుడే ఎక్కువ వెలిగిపోతోంది! 'తిన్నవాడికి తిన్నంత మహాదేవా!' అంటున్నారు. అయినా 'సంత'ర్జాతీయ సమస్యలను ఎవరేం చేయగలరు? ధృతరాష్ట్ర పాలకుల్లా చూస్తూ ఊరుకోవలసిందేనంటే ఎంత అవమానకరం!

ఎన్నో సమస్యలను పరిష్కరించిన గిరీశమే ఇందులోనూ పాలకులకు ఓ బాట చూపించాడు! దాంతో ఏలినవారు 'నినద భీషణ శంఖము దేవదత్తమే' అంటున్నారు. అవినీతి కనబడితే తోలు వలిచేస్తాం అని బెదిరిస్తున్నారు. సర్వ'శిక్షా'భినయాలను కళ్లకు కట్టినట్టు ప్రదర్శిస్తున్నారు.

''మంత్రాలకు చింతకాయలు రాలతాయా? తిట్లకు అవినీతి మటుమాయమైపోతుందా?'' అని గిట్టనివాళ్లు అంటుంటే ఆ మాటలు 'చెవులూ'రించడం లేదు. 'ఎంతదాకానో ఎందుకు? మీ చుట్టుపక్కల, చుట్టపక్కాల అక్రమ సంపాదనకు పొగబెడితేచాలు అవినీతి దయ్యం దెబ్బకు పారిపోతుంద'ని ప్రతిపక్షాలవాళ్లు ఎద్దేవా చేస్తుంటే, 'దీపం చుట్టూ చీకటి ఉండడం సహజమేగా' అని అధికారపక్ష పౌరాణికులు 'అరికథలు' వినిపిస్తున్నారు. ఇది నిజమే. అవినీతి అంతం తాతలనాటి పతకం. 'అవినీతి సొంతం' ఇప్పటి నేతల పథకం. 'అవినీతి సొంతం' వల్ల తమకు చెడ్డపేరు వచ్చినా ఇతరులకు మంచి పేరు వస్తుంది. ఇదికూడా ప్రజాసేవే.

అధికారుల గోల అధికారులది. అవినీతి విషయంలో 'రాజ'నీతి చిత్రంగా ఉందని వారు వాపోతున్నారు. నేతల అవినీతిపై పెదవివిప్పని మారాజులు అధికారుల మీదికిమాత్రం ఒంటికాలిమీద లేస్తున్నారని, ఇదికూడా 'విభజించి పాలించు' సూత్రమేనని విమర్శిస్తున్నారు. నాయకుల ఆజ్ఞ లేకుండా ఫైలయినా కదులుతుందా? కళ్లు మూసుకుని ఫైళ్లమీద సంతకం పెట్టిననాడే ఈ విషయం గుర్తొచ్చి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేదా? అని ప్రశ్నిస్తున్నారు. చివరికి 'బలి పశువులం మేమా?' అని నిలదీస్తున్నారు.

వీటి సంగతేమయినా ప్రభువుల 'విత్తశుద్ధి'ని శంకించడానికి వీల్లేదు. అవినీతిని సజీవంగా పట్టి ఇచ్చిన ఉద్యోగులకు 30 శాతం ప్రోత్సాహక వేతనాన్ని ఇస్తామని అధినాయకులు ఊరిస్తున్నారు. ఎంత జీతం ఇస్తేమాత్రం ఏం లాభం? అవినీతిని పట్టుకున్నవారు లంచం తీసుకున్నా దానిని వారు ఒప్పుకొంటే వదిలెయ్యాలంటూ చట్టం చేయాలని కొంతమంది 'నొక్కేసి' వక్కాణిస్తున్నారు. ఒక అవినీతిపరుణ్ని ఇంకో అవినీతిపరుడు మాత్రమే పట్టుకోగలడు కాబట్టే దొంగ చేతికే తాళాలిచ్చినట్టు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. పైగా 'అవినీతిపరులు ఎంతటివారయినా వదలొద్దు' అని సాక్షాత్తూ ప్రభుత్వాధినేతే చెబుతుంటే అవినీతిపరులయిన అధికారులు పులకించిపోతున్నారు. 'అందుకేగదా సార్‌! అవినీతిపరులు ఎంతటివారయినా, వారిని మేము వదలకుండా వాళ్లచుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దక్షిణలు పుచ్చుకుంటున్నాం. అందువల్ల అవినీతిలో గుత్తాధిపత్యం తగ్గిపోయి వికేంద్రీకరణ జరుగుతుంది! అవినీతి పలచన కావడానికి మంది ఎక్కువ కావడమే కదా మార్గం'' అంటున్నారు.

ప్రభువులు గమనించని విషయం ఒకటుంది. అన్నిటికన్నా పారదర్శకతకు పెద్దపీట వేయడం ముఖ్యం. అవినీతి జరక్కపోతే దర్యాప్తు ఉండదు. దర్యాప్తు జరగకపోతే పారదర్శకత ఉండదు. కాబట్టి... అన్నీ తెలిసినవాళ్లకు ఇంతకుమించి ఏం చెప్పగలం?
(Eenadu, 04:01:2008)
________________________________

Labels: