విశ్వజననికి వందనం
'మామూలు వూహలతో మహత్వాన్ని కొలవలేము' అన్నాడు శ్రీశ్రీ. అవును... మిన్ను అంచుల్ని ముట్టిన ఒక మానవీయ విరాణ్మూర్తిని మూరలతో కొలవలేము, చేతులు ముడుచుకుపోతాయి! పదచిత్రాలతో రూపుకట్టలేం, మాటలు అశక్తమవుతాయి. విశేషణాలు మౌనాన్ని ఆశ్రయిస్తాయి. ఉపమానాలు తెల్లమొహం వేస్తాయి. కృతజ్ఞత నిండిన హృదయంతో తప్ప, ముకుళిత హస్తాలతో ఆరాధనాపూర్వకంగా నమస్కరించడం తప్ప- అటువంటి మహానుభావుల్ని మెదడుతో కొలవలేం. పడికట్టు కొలమానాలు వేటికీ అందనంత ఎత్తున నిలిచిన అలాంటి మహనీయుల సరసన మదర్ థెరెసాది విశిష్ట స్థానం. భగవంతుని గుండె కంపనను- విచ్చి మ్రోసిన తన గొంతుకతో లోకానికి చాటిన మానవతా మహాశిఖరం థెరెసా. ఏగ్నెస్ గొంజా బొజాక్సియుగా కన్ను తెరచిన తనకు యుగొస్లావియాలో పొత్తిళ్లు పరచిన స్కోపెజ్ గ్రామం ఎక్కడ... పద్దెనిమిదో ఏటనే మత సన్యాసినీ దీక్ష స్వీకరించిన తాను కర్తవ్య నిర్వహణకు కాలుమోపిన ఇండియాలోని కలకత్తా నగరమెక్కడ?! ఇంతటి సుదూర ప్రస్థానానికి థెరెసాకు దారిచూపిన దీపమైనది ఏ రాగబంధం, ఏ ప్రేమపాశం?! ప్రాంతం వేరు... భాషలు వేరు... సంస్కృతులు భిన్నం... అయితేనేం, ఆపద్బాంధవులకోసం ఎదురుచూసే మనుషులు ఎక్కడైనా ఒక్కటే. పేదరికానికి ప్రాంతం లేదు. అనాథలపట్ల ప్రేమ వ్యక్తీకరణకు భాషతో పని ఉండదు. సేవానిరతికి సంస్కృతులు అడ్డుకట్ట వేయలేవు. దీనజనోద్ధరణకు కలకత్తాలోని మిషనరీలు అప్పటికే సాగిస్తున్న కృషి తనను ఆకర్షించడం థెరెసా ఇంతదూరం రావడానికి కారణం. ఆమె- దైన్యంతో, వేదనతో అలమటిస్తున్నవారి కన్నీళ్లు తుడిచింది. వారిని అక్కున చేర్చుకొంది. 'చేయినందించి గుండెకు చేర్చి/ సేదతీర్చు తల్లి కడుపులోని తీపి నీవు' అనిపించేంత కరుణార్ద్ర హృదయంతో తమను ఆదరించిన ఆమెలో వారికి- దైవమిచ్చిన అమ్మ సాక్షాత్కరించింది.
తల్లులు ప్రత్యక్ష దైవాలు. ప్రతి స్త్రీమూర్తిదీ మాతృహృదయమే. తాను కొలిచే వేలుపు సాక్షాత్తు శివయ్యకు తల్లి లేదని భక్తురాలు బెజ్జ మహాదేవి ఎంతగానో బెంగటిల్లింది. పరమేశ్వరుడికే 'తల్లియున్న విషంబు ద్రావనేలిచ్చు/... తల్లి పాములనేల ధరియింపనిచ్చు/ తల్లి బుచ్చునె భువి వల్లకాటికిని' అంటూ పరిపరివిధాల వాపోయింది. తాను పూజించే దైవం- ఆలనాపాలనా ఎరుగని బిడ్డడిలా అగుపించి ఆ భక్తురాలు అంతగా తల్లడిల్లడం స్వ, పరభేదాలకు, పేగుబంధాలకు అతీతమైన తల్లి మనసుకు తార్కాణం. ఈ లోకాన ఎవరికీ పట్టని వ్యథార్తుల్లో; సమాజం వెలివేసిన వ్యాధిగ్రస్తుల్లో; ఎవ్వరూ పట్టించుకోని బాధాసర్పదష్టుల్లో; ఆఖరి ఘడియల్లో సైతం ఆదరణకు నోచుకోని అభాగ్యులూ అనాథల్లో; బతుకూ భవిష్యత్తూ శూన్యమై దిక్కులు చూస్తున్న దీనుల్లో- జ్వరమొచ్చిన దేవుణ్ని దర్శించిన మాతృహృదయం మదర్ థెరిసాది! ఆమె జాతిపరంగా అల్బేనియన్... మత విశ్వాసాల రీత్యా క్యాథలిక్ నన్... త్రికరణశుద్ధిగా నిర్వర్తించిన మనోధర్మం దరిద్రనారాయణుల సేవ... అందుకు తన కర్మక్షేత్రంగా ఎంచుకున్న నేల ఇండియా... ఈ దేశ పౌరురాలిగా- ఈ లోకంలోని అభాగ్య మానవాళికి ఆపన్నహస్తమందించేందుకు యావత్ ప్రపంచాన్ని తన కార్యరంగంగా మార్చుకున్న విశ్వ మానిసి ఆమె. మదర్ థెరెసా జగజ్జననిగా జోతలందుకుంటున్నది అందుకే. ఆమె శతజయంతి సందర్భమిది.
'దేవుడెచటో దాగెనంటూ/ కొండకోనల వెతుకులాడేవేలా?/ కన్ను తెరిచిన కానబడడో/ మనిషిమాత్రుడి యందు లేడో!' అన్నాడు వైతాళికుడు గురజాడ. దీనజనావళి సేవే దేవుని సేవ అని మనసా వాచా కర్మణా విశ్వసించిన థెరెసా- ఆ భగవంతుణ్ని సందర్శించింది అటువంటి మానవమాత్రుల్లోనే. సమాజం చీదరించుకునే కుష్ఠురోగుల్లో, అయినవారు సైతం దూరంగా ఉంచే కలరా వ్యాధిగ్రస్తుల్లో, అవసానదశలో ఉన్న అనాథల్లో- తనకు జీసస్ దర్శనమవుతోందని, వారిని సేవించడమే తన విధ్యుక్తధర్మమన్న దైవప్రబోధం వినపడుతోందన్నది ఆమె వినమ్రవాణి. 'గుండెపైని సిలువ, తలపైని నెలవంక/ మనసులోన ప్రణవమంత్ర దీప్తి' అన్నట్లుగా- వివిధ మతాలు, విభిన్న సంస్కృతులు, అనేక భాషలకు చెందినవారి సహజీవన వని భారత్. కులమతాలకు, జాతివర్గాలకు అతీతంగా మదర్ అందించిన సేవలనూ మతం రంగుటద్దాల్లోనుంచి చూస్తూ- మతమార్పిడులను ఆమె ప్రోత్సహిస్తున్నారన్న అభాండాలు వేసినవారూ లేకపోలేదు. 'అవును, మారుస్తున్నాను. ఒక హిందువు మరింత మంచి హిందువుగా, ఒక ముస్లిం మరింత మంచి ముస్లిముగా, ఒక సిక్కు మరింత మంచి సిక్కుగా నడుచుకొనేలా మారుస్తున్నాను' అన్నది ఆమె జవాబు! జాతులకు, మతాలకు అతీతంగా రాజ్యాధినేతలు మదర్ ఎదుట ప్రణమిల్లారు. జాతులు, మతాలు, వర్ణాలకు అతీతంగా వివిధ దేశాలు అక్కడి అత్యున్నత అవార్డులతో ఆమెను సత్కరించి తమను తాము గౌరవించుకున్నాయి. అంతర్జాతీయంగా సమున్నత పురస్కారమైన నోబెల్ శాంతి బహుమతిని పేదల తరఫున తాను స్వీకరిస్తున్నట్లు థెరెసా ప్రకటించడం- సమస్త నిరుపేదలపట్ల ఆమె వాత్సల్యానికి నిలువుటద్దం. మనదేశ అత్యున్నత అవార్డు భారతరత్న పురస్కారాన్ని 'సకల మతాల ప్రతినిధి'గా స్వీకరించడం- లౌకికతత్వానికి ఆమె పట్టిన నీరాజనం. మదర్ థెరెసా అంటే- మానవ రూపాన కదలివచ్చిన కరుణ, చల్లని వీవనలాంటి ఓ సాంత్వన వచనం, ఓ ఆత్మీయతా సుగంధం. సేవా పథగాములకు ఆమె నిత్యస్ఫూర్తి. విశ్వమానవాళికి ఆమె మాతృమూర్తి. శతజయంతి వేళ ఆ అమ్మకు నమోవాకాలు!
(ఈనాడు, సంపాదకీయం, ౨౯:౦౮:౨౦౧౦)
__________________________
Labels: Personality, Religion/personality/telugu