My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, April 06, 2008

రామానాయుడుకి వెంకయ్య పురస్కారం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే:
శతాధిక చిత్రాలను నిర్మించిన డి.రామానాయుడుని 2006 సంవత్సరానికిగాను రఘుపతి వెంకయ్య పురస్కారం వరించింది. గుమ్మడి వెంకటేశ్వరరావు, పి.సాంబశివరావు, కె.సి.శేఖర్‌బాబులతో కూడిన త్రిసభ్య కమిటీ సోమవారం పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డును ఏప్రిల్‌లో నిర్వహించే నంది అవార్డుల ప్రదానోత్సవంలో అందిస్తారు. 1936 జూన్‌ 6న ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో జన్మించిన రామానాయుడు
'రాముడు-భీముడు' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. నిర్మాతగా, స్టూడియో యజమానిగా, ల్యాబ్‌లకు అధిపతిగా, పంపిణీదారుగా పరిశ్రమలకు సేవలను అందించారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడం, ఒరియా, మరాఠీ, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో చిత్రాలను నిర్మించినందుకుగానూ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో ఆయన పేరు నమోదైంది.
(Eenadu, 01:04:2008)

=========================

Labels: ,

వహీదాకు ఎన్టీఆర్‌ అవార్డు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే:
ప్రముఖ హిందీ నటి వహీదా రెహమాన్‌.. 2006 సంవత్సరానికిగాను ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏప్రిల్‌లో నిర్వహించే నంది అవార్డు ప్రదానోత్సవంలోనే వహీదాకు ఈ పురస్కారాన్ని అందజేస్తామని చలనచిత్రాభివృద్ధి సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వేడుకలోనే 2003, 04, 05లకుగానూ ఎన్టీఆర్‌ పురస్కారాన్ని అందుకున్న కృష్ణ, ఇళయరాజా, అంబరీష్‌లను సత్కరించనున్నారు. రూ.5లక్షల నగదు, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. హైదరాబాద్‌కు చెందిన వహీదా తెలుగులో 'జయసింహ'లో ఎన్టీఆర్‌ సరసన నటించారు. 'రోజులు మారాయి'లో ఆమె నర్తించిన 'ఏరువాక సాగారో..' పాట ఇప్పటికీ ఆంధ్రులకు ఇష్టమైనదే! మన భాషలో 'బంగారు కలలు', 'సింహాసనం', 'చుక్కల్లో చంద్రుడు' చిత్రాల్లోనూ ఆమె నటించారు. 'ప్యాసా', 'కాగజ్‌ కె పూల్‌', 'రేష్మా అండ్‌ షెహర్‌', 'చౌదువీ కా చాంద్‌', 'గైడ్‌', 'నీల్‌కమల్‌', 'రంగ్‌ దె బసంతి'.. లాంటి పలు చిత్రాలు వహీదాకు ఎంతో గుర్తింపును తీసుకొచ్చాయి. తిలక్‌, జయసుధ, ఎ.సూర్యనారాయణలతో కూడిన కమిటీ వహీదాను ఎన్టీఆర్‌ పురస్కారానికి ఎంపికచేసింది.
(Eenadu, 01:03:2008)
=============================

Labels: ,

మానవత్వం పరిమళించిన వేళ...

తన దగ్గరున్నదంతా దానంచేసి, నిశ్చింతగా నిలబడ్డాడు రంతిదేవుడు. కొద్దిగా మంచినీరు తప్ప, తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఆయన దగ్గరికి ఒక పరమ దీనుడు వచ్చి, చేయిచాచి అర్థించాడు. అప్పుడు రంతిదేవుడు అన్నాడు, ''అన్నము లేదు... కొన్ని మధురాంబువులున్నవి... త్రావుమన్న! రావన్న!... శరీరధారులకు ఆపద వచ్చిన, వారి ఆపదల్‌ క్రన్నన మాన్పి... వారికి సుఖంబులు సేయుటకన్న నొండు మేలున్నదె!... కష్టంలో ఉన్నవాడిని వెంటనే ఆదుకోవడం కన్నా ఈ లోకంలో గొప్ప మేలు మరొకటి లేదు. ఈ తీయని జలాలు తాగి, ప్రాణాలు నిలబెట్టుకో'' అంటూ మిగిలిన మంచినీళ్ళను కూడా యాచకుడికి ఇచ్చేశాడు. మానవత్వానికి పరమోదాహరణగా భాగవతంలో కీర్తిపొందాడు. మానవుడి అసలు తత్వం- మానవత్వం! మానవత్వాన్ని కోల్పోవడమంటే మనిషి తన సహజత్వాన్ని కోల్పోవడమని అర్థం. కలి ప్రభావం కారణంగా మనిషి స్వభావం మారుతుందని భాగవతం హెచ్చరించింది. స్నేహపూరంబుతో ప్రకాశించి, మించె... మానవులు నిల్పికొన్న సమాజదీపము... అది చెదరి... చింది... పంకిలమయినది... అని రాయప్రోలు భయపడినట్లే జరుగుతోంది. కుల, మత, ప్రాంతీయాది విభేదాలతో కొంతకాలంగా సమాజం మానవత్వాన్ని పూర్తిగా మరచిపోతోంది. 'మానవత్వం పరిమళించే మంచిమనిషికి స్వాగతం...' అంటూ కవులు మంచిమనిషి కోసం అన్వేషించవలసిన దుస్థితి దాపురించింది. ''అశ్రువులందే సుందర హాసమున్నదని తెలిపెను... తొలిప్రొద్దున మంచు బిందువులు రాల్చెడు మల్లెపువ్వు...' అంటూ కన్నీటిని తుడిచి, ఓదార్చే మంచితనపు పరిమళాలను ఈ జాతి ఆశిస్తూ వచ్చింది. ప్రార్థనలు చేసే పెదవులకన్నా సహాయపడే చేతులు మిన్న అంటూ సాయంచేసే చేతులకోసం ఎదురుచూస్తూ వచ్చింది.

... మతమే మానవ జీవితమ్ము... చివురింపంగా వసంతమ్ము... అంటాడు- మధునాపంతులవారు చిత్రించిన రాజరాజనరేంద్రుడు. మనిషి జీవితంలోకి మతం అనేది వసంతంలా ప్రవేశించాలన్నది సహృదయ భావన. ఉపబృంహణం అంటే విత్తునుంచి మొలకెత్తడం. మతం అనే విత్తనంలోంచి మానవత్వం ఉపబృంహణం కావాలని పెద్దలు ఆశించారు. ఆధ్యాత్మిక ప్రగతికి పునాదిగా నిలిచి వ్యక్తిగతంగానూ, సమాజ పురోగతికి తోడ్పడటం ద్వారా సామాజికంగానూ- మతం దోహదం చేయాలని ఆకాక్షించారు. సూది కలపడానికి పుట్టింది, జతచేయడమే దాని ధర్మం. కత్తెర విడదీయడానికి పుట్టింది, ఒకటిని రెండు చేస్తుంది. మతం విషయం వచ్చేసరికి అది సూదితో పోలికకు సరితూగుతుంది. మతం మనిషిని మనిషిని జతచేయడానికి పుట్టింది. మధ్యలో, కొంతమంది స్వార్థపరుల చేతుల్లో దుర్వినియోగం అయిన సందర్భాలు ఉన్నా- మొత్తమ్మీద మతం ఏదైనా మంచితనాన్నే ప్రబోధించింది. మానవత్వాన్నే ప్రశంసించింది. అలా కానినాడు మతం తన ప్రాధాన్యం కోల్పోతుందని సామాజిక శాస్త్రవేత్తలు ఏనాడో అంచనావేశారు. మతములన్నియు మాసిపోవును... మంచియన్నది నిలిచి వెలుగును... అని ఊహించారు. మఠములోన నున్న మతములన్నియుకోసి... ఘటములోన నున్న ఘనుని తెలిసి... ఘనత నిల్పువాడు ఘనతర యోగిరా... అంటూ స్వయంగా యోగి అయిన వేమన మతాతీతమైన యౌగిక స్థితిని నిర్వచించాడు. ఆధ్యాత్మికత అనేది మతంకన్నా ప్రయోజనకరమైందని పెద్దలు గ్రహించారు. మతాన్నుంచి ఛాందసాన్ని వేరుచేస్తే అది ఆధ్యాత్మికతకు దగ్గరవుతుందని భావించారు. సూర్యుడికేసి నడిస్తే నీడలు వాటంతటవే వెనక్కి మళ్లినట్లు, మతాలు బోధించే మంచివైపు నడిస్తే- మతమౌఢ్యాలు వెనకబడతాయని విశ్లేషించారు. అది సరికొత్త ఆధ్యాత్మిక మార్గమవుతుందని లోకంలో రాబోయే మార్పులను గుర్తించారు. అటువంటి జ్ఞానపథాన్ని మనసులో భావిస్తూ, తద్వారా మానవుడిలో కలిగే పరివర్తనను ఊహిస్తూ, ఆ తరహా మంచిమనుషులతో కూడిన సమాజాన్ని స్వాగతిస్తూ- మన కవులెందరో అభ్యుదయ గీతాలు ఆలపించారు.

ఇటీవలి ఒక సంఘటన వింటే ఆ ఆశలు ఫలించాయనిపిస్తున్నది. మతంకన్నా మానవత్వం చాలా విలువైనదని నిరూపించే ఈ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలో జరిగింది. హరేకృష్ణ భాంజా అనే హిందువుకు, మహమ్మద్‌ సయ్యద్‌ అనే ముస్లిం సోదరుడికి మూత్రపిండాలు బాగా చెడిపోయాయి. వారి భార్యలు తమ అవయవాలను దానం చెయ్యడానికి ముందుకొచ్చినా, భార్యాభర్తల బ్లడ్‌ గ్రూపులు కలవకపోవడంతో వైద్యులు నిరాశచెందారు. మంజులాబెన్‌ కిడ్నీ ఆస్పత్రికి చెందిన దీపక్‌శంకర్‌రాయ్‌ అనే వైద్య నిపుణుడు ఒక విశేషాన్ని గుర్తించారు. హరేకృష్ణ భార్య కిడ్నీ మహమ్మద్‌ సయ్యద్‌కీ, సయ్యద్‌ భార్య మూత్రపిండం హరేకృష్ణకీ మార్పిడి చేయడానికి అనుకూలంగా ఉన్నాయని ఆయన గమనించారు. దీంతో డాక్టర్‌ దీపక్‌ రంగంలోకి దిగి ఆ రెండు కుటుంబాలను సమావేశపరచారు. ఒకరికొకరు సాయపడేలా ఒప్పించారు. త్యాగాజ్జగతి పూజ్యంతే పశు పాషాణ పాదపాః... త్యాగం అనే ఒక సుగుణం కారణంగా లోకంలో పశువులు, రాళ్లు, చెట్లు సైతం పూజలందుకుంటాయన్న ప్రాచీనసూక్తి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు స్త్రీల త్యాగగుణం, మంచితనం ఇద్దరు పురుషులకు జీవదానం చేశాయి. విభిన్న మతాలకు చెందిన రెండు కుటుంబాల పరస్పర సదవగాహన, మానవతావిలువల పరిరక్షణ సంకల్పం- ఆ రెండు కుటుంబాల్లోనూ సంతోషాన్ని నింపాయి. సంకల్పం మంచిదైతే భగవంతుడు సహకరిస్తాడన్నట్లుగా ఈ మధ్యనే జరిగిన ఆ ఇద్దరి మూత్రపిండ మార్పిడి శస్త్ర చికిత్సలూ విజయవంతమయ్యాయి. కథ సుఖాంతమైంది. మొత్తం ప్రణాళికను దిగ్విజయంగా పూర్తిచేసిన డాక్టర్‌ దీపక్‌ శంకర్‌రాయ్‌- ఇదంతా దేవుడి దయ, వారి సమస్యలకు సరైన సమయంలో పరిష్కారం లభించిందని ముక్తాయించడం ఈ ఉదంతానికి కొసమెరుపు!
(Enadu, 02:03:2008)
===============================


Labels: