My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, May 17, 2010

'సారీ' సరాగం

సీతారాములవలె ఉన్నారనిపించే దంపతుల అచ్చట్లూ ముచ్చట్లలోనైనా, చిలకా గోరింకల్లా తోచే భావి జంటల సరసాలూ సరదాల్లోనైనా- అడపాదడపా కోపాలు, తాపాలు చుట్టపుచూపులా తొంగిచూస్తుంటేనే ముద్దూ మురిపెమూనూ.'కోపమొకటె ఆమె లోపమందును గాని/ అదియె లేనిదె ఆమెకు అందమేది?' అని నాథుడు మురిసిపోవచ్చు. తన కినుకలోనూ సౌందర్యాన్నే ఆరాధిస్తూ 'అలిగినను నిన్ను విడిపోగలన నేను? కోపమైయుందు నీ కంటి కొనలనంటి-' అని అతగాడు విన్నవించుకుంటే, అరమొగ్గల్లా విచ్చుకున్న ఆమె పెదవి వంపుల్లో తొణికిన చిరునవ్వుల జిలుగులు విద్యుత్‌కాంతుల్ని తలపిస్తాయి. అంతవరకు అంటిపెట్టుకున్న అలకలు తెరమరుగవుతాయి. 'ఆలుమగల లడాయి/ అంతమొందిన రేయి/ అనుపమానపు హాయి-' అన్న కూనలమ్మ పద కూజితాలు వినిపిస్తాయి. అలక సార్వకాలీనమైనది. దానికి దివారాత్రాలనే భేదం ఉండదు. అలకది సర్వ సమానత్వ సిద్ధాంతం. దానికి ఆడ, మగ అనే తేడా లేదు. ఆ ప్రక్రియలో ఒకరికొకరు ఏమాత్రం తీసిపోనివారే అయినా- అలక వహించడంలో ఆడవాళ్లే ఓ మెట్టు పైన ఉంటారన్నది కవులు, రచయితల సూత్రీకరణ. అందాన్ని ఇనుమడింపజేసే అలకే మగువల ఆయుధమనీ వారు కవిత్వీకరించాక, అలా- 'కత్తి చేతలేక కదనమ్ము జరిపెడి/ ఇంతికెవ్వడు అసువులీయకుండు'ననిపించడంలో వింతేముంటుంది!

అలక ఎన్నో వగలు చిందిస్తుంది. మరెన్నో వయ్యారాలూ ఒలికిస్తుంది. తొలుత మూగనోము. పిదప మూతి విరుపు. పిమ్మట సనసన్నగా సన్నాయినొక్కులు. అటుపై చినచిన్నగా రుసరుసలు. ఆ తరవాత కొదికొద్దిగా సాధింపులు. ఆ చిన్నెలన్నీ కాసేపు అలాఅలా సాగిపోయాక... బుజ్జగింపులు, బతిమాలడాలు, వరదానాలు, ఆ దరిమిలా కిలకిలలు, కలకలలతో అలక ఆనాటికి అటకెక్కడం- దాంపత్య జీవనశోభలోని సొబగు. అలకబూని తనవాణ్ని 'రవంత వేపుకు తిని, తగుమాత్రం కంట తడిబెట్టి, గడ్డంపట్టి బతిమాలించుకుని, చేతిలో చేయి వేయించుకోవాలని- జన్మంటూ ఎత్తి ఆడపుట్టుక పుట్టినాక ఉండదుట్రా నాయనా?' అన్నది ఓ కథలోని పాత్ర నోట వినిపించిన మల్లాది రామకృష్ణ'శాస్త్రీయ' వాణి! నెయ్యపు కినుకల వెనుకగల ఆకాంక్షను అర్థంచేసుకుని, అలిగిన చెలిని అనునయించే వేళ తాను కాస్త తగ్గాల్సివచ్చినా- దాన్ని చెలికాడు నామోషీగా భావించడం భావ్యంకాదు. తనపై ఆగ్రహించిన దేవేరి సత్యభామను ప్రసన్నం చేసుకోవడానికి సాక్షాత్తు శ్రీకృష్ణుడంతటివాడు 'భవదీయ దాసుడ'నని ఆమెకు మనవి చేసుకున్నాడు. తలవంచి ఆమె మృదుకోమల పల్లవ పాదద్వయానికి మొక్కాడు. వామపాదంతో ఆమె తాచినా అది తనకు 'మన్ననయ' అని గొప్పగా చాటుకున్నాడు. స్వర్గంనుంచి పారిజాత వృక్షాన్ని పెకలించి తెచ్చి, ఆమె ఉద్యానవనంలో ప్రతిష్ఠించి మాట నిలబెట్టుకున్నాడు. అనునయ కళకు నల్లనయ్య అలా దిద్దిన మెరుగులు ముచ్చటగొల్పేవే. తన అలకను తీర్చడానికి చేసిన బాసల్ని చెల్లించకుండా చెంతచేరే సఖుణ్ని- నాటి సత్యభామామణి మాదిరే, నేటి భామామణీ సహించదు. 'దబ్బులన్నియు దెలిసికొంటిని తప్పు బాసలు సేయకూ/ మబ్బు దేరెడి కన్నుగవతో మాటిమాటికి డాయకూ/ ఉబ్బు చేసుక తత్తరంబున నొడలిపై జెయి వేయకూ...'

సాంసారిక జీవితంలో భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడూ అపోహలు, అపార్థాలు తలెత్తడం సర్వసాధారణం. కలతలు రేగడం, కలహాలు చోటుచేసుకోవడం సహజం. కోపాలు రావడం, అవి కయ్యాలుగా మారడం పరిపాటి. ఒక్కోసారి అల్పమైన కారణాలూ, అర్థంపర్థం లేని వివాదాలూ అటువంటి విపరిణామాలకు దారితీయడమూ కద్దు. అలాంటి సందర్భాల్లోనే దంపతుల్లో సంయమనం, సానుకూల దృక్పథం, సదాలోచన, సదవగాహన అవసరం. లోపం ఎవరిలో ఉందన్నదానితో నిమిత్తం లేకుండా తమ తప్పును కాయమని జీవితభాగస్వామిని కోరడం నేరమూ కాదు, అందుకు మొహమాటమూ అడ్డురాకూడదు. తప్పు తమదే అయినా- స్వాభిమానంతోనో, పురుషాధిక్య భావజాల ప్రభావం వల్లనో మగవాళ్లు తమ భార్యలను అలా అర్థించకపోవడం ఇక్కడి సమాజ లక్షణం.
తప్పు తనవైపు ఉన్నప్పుడు ఎటువంటి భేషజాలకు పోకుండా భార్యకు భర్త ఒక్కసారి 'సారీ' చెబితే అది- ఆమెకు కొత్త జవసత్వాలు చేకూర్చే దివ్యౌషధంలా పనిచేస్తుందని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. భర్త వ్యవహార సరళితో మనసు గాయపడిన భార్య మానసికంగా చాలా ఒత్తిడికి లోనవుతుందని, 'సారీ' అంటూ అతను చెప్పే రెండక్షరాల మాట ఆమెకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని వారు అంటున్నారు. అంతేకాదు, 'నన్ను మన్నించు' అంటూ అతడు ఊరడింపుగా అనే ఒక్క పలుకువల్ల ఆమె రక్తపోటు ఇరవైశాతం వేగంతో సాధారణ స్థితికి చేరుకుంటుందని వారి అధ్యయనంలో తేలడం- 'సారీ'యే ఇంపు ఇక సముదాయింపులకు అనడానికి తిరుగులేని నిదర్శనం. ఆ రెండక్షరాల మంత్రజపంతో తన జీవిత సహచరిని లాలిస్తూ... 'వలపు కావలె నీకు, నాకును- కలహములను త్యజింతము/ సౌఖ్యమైనను, దుఃఖమైనను- సమముగా రుచి చూతము' అన్న కవివాక్కుకు పట్టం కట్టాల్సింది ఆమె ప్రియవిభుడే!
(ఈనాడు, సంపాదకీయం, ౨౫:౦౪:౨౦౧౦)
__________________________________

Labels:

నిద్ర అవస్థ

నిద్రాదేవి ఒడిలో సేదతీరే వేళ- బాల్యంలో అమ్మ పాడిన లాలిపాట గాలి తరగల మీదుగా తేలియాడుతూ వచ్చి, చెవి దగ్గర గుసగుసలాడుతున్న అనుభూతి! చిన్ననాటి అమ్మ చేతి ఆత్మీయస్పర్శ పూలరేకుల మెత్తదనాన్ని మోసుకుంటూ తెచ్చి- ఒళ్లంతా మృదువుగా నిమురుతున్న భావన! దైనందిన జీవితంలోని కష్టాల్ని, కలతల్ని తాత్కాలికంగానైనా మరపించి- అలసిన శరీరానికి కాసింత సాంత్వనను చేకూర్చే సుషుప్తిలో ఉన్నంతసేపూ, పసితనాన అమ్మ కప్పిన చీరకొంగు చాటున బజ్జొని ఉన్న జ్ఞాపకం! ఇన్ని అనుభవాల సౌరభాన్ని మనం అజ్ఞాతంగా ఆఘ్రాణించగలగడం, నిద్ర ప్రసాదించిన వరం. ఆగర్భ శ్రీమంతులనైనా, అధోజగత్‌ జనావళినైనా సమాదరణతో కరుణించేది నిద్రాదేవతే. ప్రకృతిమాత సర్వసమత్వ దృష్టి అది. 'నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే/ అండనే బంటు నిద్ర అదియునొకటే'నంటూ- చక్రవర్తికైనా, చాకిరీ చేసేవాడికైనా నిద్రా సుఖానుభూతి ఒక్కరీతిగానే ఉంటుందన్న సార్వకాలీన సత్యాన్ని ఏనాడో చాటాడు అన్నమయ్య. సామాన్యులే కాదు, సృష్టి స్థితి లయకారులైన దేవుళ్లూ వారి దేవేరులూ కూడా నిద్రాసక్తులే. తిరువేంకటాధిపుని ఏకాంతసేవలో తెల్లవారేంతవరకు గడిపిన అలమేల్మంగమ్మ సింగార సోయగానికి అక్షరరూపమిస్తూ- 'నిగనిగని మోముపై నెరులు గెలకుల చెదర/ పగలైన దాక చెలి పవళించెను' అని వర్ణించాడు పదకవితా పితామహుడు. తన సంగీతార్ణవంలోని స్వరతరంగాలపై ఉయ్యాలలూగవయ్యా అంటూ శ్రీరామచంద్రునికి జోల పాడిన మహద్భాగ్యం త్యాగరాజస్వామిది. '... మీగడ వెన్నపాలు తాగింతు లాలీ- శయ్యపైని మల్లెపూలు పరతు లాలీ/... కాచి సేవింతు లాలీ- శేషతల్పమునూచి పాడుదు లాలీ-' అని భక్తితో జోకొట్టడమేకాదు, 'మము పాలింపగ మరలా లేవయ్యా' అనీ ఆర్తితో తన దైవాన్ని వేడుకున్నాడు. 'సౌజన్య విబుధగణ రాజాదులెల్ల, నిను పూజింప గాచినారీ జగము పాలింప, మేలుకోవయ్య మమ్మేలుకో రామా- మేలైన సీతాసమేత నా భాగ్యమా' అని దాశరథికి మేలుకొలుపుల గీతార్చన చేశాడు ఆ వాగ్గేయకారుడు.

నిద్ర బహురూపి. కొద్దిసేపు నడుంవాల్చి చిన్న కునుకు తీయడం నుంచి; ఎంత గట్టిగా పిలిచినా, ఎన్ని పిడుగులు పడినా ఒళ్లు తెలియనంతగా తలగడ మంత్రాన్ని వదలకుండా వల్లెవేస్తూనే ఉండటం వరకు- ఆ ప్రక్రియ చిన్నెలెన్నో! కునికిపాట్లకైనా, మాగన్నుకైనా, గాఢనిద్రకైనా స్థలకాలాదుల పట్టింపులు ఉండవు. కంటిమీది బరువు దించుకునేందుకు విశ్రమించే స్థలం కటిక నేలైనా ఆ క్షణాన అది చల్లని చంద్రశాలేననిపిస్తుంది. పరచుకున్నది పాత చింకిచాపే కావచ్చు, ఆ సమయాన అది మెత్తని తివాచీలానే కనిపిస్తుంది. నిద్ర సుఖమెరుగదన్నది నిజమే అయినా, సుఖాల్ని త్యాగం చేయటానికి ఏళ్ల తరబడి నిద్రనే ఆవాహన చేసినవారూ ఉన్నారు. అన్నా వదినలను సేవించుకుంటూ తన భర్త లక్ష్మణస్వామి వనవాసం గడిపిన పద్నాలుగేళ్లూ ఆయన ఎడబాటును మరిచిపోవడానికి ఊర్మిళ నిద్రలోనే గడిపింది. రావణ వధానంతరం అయోధ్యకు తిరిగి వచ్చిన తరవాతా ఆయన ఊర్మిళను చూడబోలేదు. ఆ మాటే చెబుతూ, తాము అరణ్యవాసానికి బయలుదేరిన 'నాడు మొదలుగ శయ్యపై కనుమూసి నాతి పవళించున్నదీ/ ఇకనైన యానతిచ్చీ తమ్ముణ్ని యిందుముఖి కడకంపుడీ' అని సీతమ్మవారు రాముణ్ని కోరిందన్నది జాను తెలుగులోని ఓ జానపదం. విరహబాధను మరచిపోవడానికి ఆ విధంగా ఓ సాధనమైన నిదురే- మనసైనవారి తలపుల్లో మునిగిపోయేవారి కంటికి దూరమయ్యే సందర్భాలూ ఉంటాయి. తన ప్రణయిని రుక్మిణిని తలచుకుంటూ శ్రీకృష్ణుడు నిద్రలేని రాత్రిళ్లు గడిపాడట. ఆమె పంపిన పరిణయ సందేశాన్ని అందుకుంటూ- 'కన్నియ మీద నా తలపు గాఢము; కూరుకురాదు రేయి నాకెన్నడు' అంటూ సాక్షాత్తు ఆ పరమాత్ముడే వాపోయాడంటే- నిదురలేమి రాత్రులతో గడుపుతున్న నేటి కుర్రకారు ప్రేమికుల గురించి ఇక చెప్పేదేముంది?!

నిద్ర ఎలా ఉండాలో చెబుతూ 'సాధారణమైన చప్పుళ్లకు, కేకలకు, పిలుపులకు మెలకువ రాకూడదు' అని చిలకమర్తివారు చమత్కరించారు. ఆ స్థాయిలో కాకపోయినా, కనీసం ఆరోగ్యానికి భరోసా ఇచ్చేంత నిద్ర అవసరం. మనిషికి కుంభకర్ణ నిద్రా మంచిది కాదు, కోడినిద్రా పనికిరాదు. కంటినిండా నిద్ర లేకపోవడం అనేక అనర్థాలకు హేతువవుతోంది. ఆధునిక జీవనంలో ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న మార్పులు సమాజ వికాసానికి దోహదపడుతున్న మాట నిజమే. అదేసమయంలో అవి మనుషుల చుట్టూ సమస్యల వలయాల్నీ సృష్టిస్తున్నాయి. పెరిగిన ఉద్యోగావకాశాలతోపాటే, ఉద్యోగ జీవితాల్లో ఒత్తిళ్లూ అధికమయ్యాయి. అంతర్జాలం అవతరణ- వెలుపలి ప్రపంచంతో ఎల్లలను చెరిపివేసినా, ఇళ్లల్లో మాత్రం ఏకాంతద్వీపాల్ని సృష్టిస్తోంది. విధి నిర్వహణలో ఒత్తిళ్లు పెరగడం, ఐపాడ్‌లు, కంప్యూటర్ల వంటివాటి వాడకం మితిమీరిపోవడం- నేటి యువతరానికి నిద్రను దూరం చేస్తున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఉద్యోగస్తులైన యువతీయువకులు పని ఒత్తిళ్ల కారణంగా రాత్రిళ్లు చాలాసేపు మేలుకొని ఉండటం వారి నిద్రలేమికి కారణం. అలా తక్కువపడిన నిద్రను వారాంతపు సెలవుదినాల్లో విశ్రమించడం ద్వారా భర్తీ చేసుకోవచ్చునన్నది వారి అభిప్రాయం. వారు అలా భావించడం సరికాదని, నిద్రలేమి వల్ల దీర్ఘకాలంలో- ఆకలి తగ్గిపోవడం, మానసిక ఆందోళనలు అధికం కావడం, గుండెపోటు వచ్చే ప్రమాదం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐప్యాడ్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల వంటివాటిని పడకగది ఛాయలకైనా రానీయకుండా, రోజుకు కనీసం ఏడెనిమిది గంటలు తప్పనిసరిగా నిద్రపోవడం- వారు సూచిస్తున్న తరుణోపాయం. పాటించాల్సింది నిద్రాదేవతను నిర్లక్ష్యం చేస్తున్నవారే!
(ఈనాడు, సంపాదకీయం, ౧౮:౦౪:౨౦౧౦)
____________________________

Labels:

పెళ్లి కళ

కల్యాణోత్సవాలు ఎప్పుడూ కనులపండువే. అంతరంగాన్ని సంతోషతరంగితం చేసేవే. వరపూజ నుంచి వధువు అంపకాల వరకు ప్రతి ఘట్టంలోనూ పండుగ సందడి ప్రతిధ్వనిస్తుంటుంది. అలనాడు జనకరాజర్షి తన కుమార్తె మైథిలిని శ్రీరామునికి ఇచ్చి కన్యాదానం చేసిన కమనీయ సన్నివేశం- తెలుగునాట ఏ పెళ్లివేడుకలోనైనా పాణిగ్రహణ సమయాన ఇప్పటికీ వైభవంగా పునరావిష్కృతమవుతూనే ఉంటుంది. యుక్తవయసులోని ప్రతి ఆడకూతురూ ఓ జానకీదేవే! ఆ బంగారును వరుడికి కన్యాదానం చేసేవేళ ప్రతి తల్లీతండ్రీ జనకరాజర్షి దంపతులే! ఆ క్షణాన- బాధ్యతను నిర్వర్తించామన్న సంతోషంలో జలజల రాలే ఆనందబాష్పాలతో వారి మనసులు తేలికపడతాయి. అదేసమయంలో, తమ సొత్తు ఎప్పటికీ వేరే ఇంటి సొంత సొమ్మయిపోతోందన్న బెంగలో పెల్లుబికే దుఃఖాశ్రువులతో వారి హృదయాలు బరువెక్కుతాయి. పసికూనగా ఉన్నప్పటినుంచీ, పెళ్లీడు వచ్చేదాకా ప్రాణమొక ఎత్తుగా పెంచుకున్న చేతులతోనే తమ గారాలపట్టిని ఓ అయ్యచేతిలో పెట్టేటప్పుడు, ఏకకాలంలో ఆ విధంగా స్పందించే అమ్మానాన్నల గుండెతడి ఏ భాష్యానికీ అందనిదే. కౌసల్యకు సీతను అప్పగిస్తూ 'కోడలు మీ సొమ్ము, కొడుకు మీ సొమ్ము/... మా బాల మీ బాలగా చూడవలెను' అంటూ వియ్యపురాలిని జనకుని పత్ని అర్థించింది. ఆమెకు ధైర్యం చెబుతూ 'అదియేల ఆ మాటనానతిచ్చేరు/ ఆలాగే మాకొక్క ఆడపడుచుంది/ దశరథుల కూతురు శాంతమహదేవి...' అంటూ కౌసల్యామాత 'మీ సీత మా శాంత సమముగానుండు' అని వదినగారికి అభయమిచ్చింది. కూతురూ, కోడలూ సమానమేనన్న ధర్మాన్ని ప్రబోధిస్తున్న ఆ జానపదం సమాజానికంతటికీ జ్ఞానపథమే.

భవబంధాలకు అతీతుడైన రుషిలాంటివాడు కనుక జనకమహారాజు- అల్లుడి వెంట అమ్మాయిని పంపించే సమయాన నిశ్చలంగా ఉండగలిగాడేమోకానీ, సగటు మనుషులకు అంతటి నిబ్బరం అసాధ్యం. అలాంటి తండ్రి శివయ్య ఆర్తికి అక్షరరూపమిచ్చారు సత్యం శంకరమంచి ఓ కథలో. 'తన గుండె, తన ప్రాణం, తన నెత్తురు, తన రెండు కళ్లు'గా పెంచుకున్న కూతురు పెళ్లయి అత్తారింటికి వెళ్తుంటే- తన ఇంటినే ఎవరో నిలువునా దోచుకుపోతున్నట్లనిపించి తల్లడిల్లిపోయాడతను. మగపెళ్లివారి బృందం ఊరి పొలిమేరలు దాటాక బండి ఆపించి, అల్లుణ్ని పిలిచి పక్కకి తీసుకెళ్లాడు. తన చిట్టితల్లి తెలియక ఏదైనా తప్పు చేసినప్పుడు తిట్టాలనో, కొట్టాలనో అల్లుడికి అనిపిస్తే 'కాకితో కబురంపు, వాలిపోతాను. నీ కోపం తీరేదాకా నన్ను తిట్టు... నీ కసి పోయేదాకా నన్ను కొట్టు... బాబ్బాబు... తమలపాకులాంటిదయ్యా నా తల్లి' అంటూ బావురుమన్నాడు. తాను గుండెలమీద ఆడించి పెంచుకున్న ఆడపిల్లను; అప్పటివరకు తనదైన సామ్రాజ్యంలో యువరాణిగా పెరిగిన ఆడపిల్లను అల్లుడికి ధారపోసి, అత్తారింటికి పంపించేవేళ ప్రతి అయ్యలోనూ మనకు ఆ శివయ్య కనిపిస్తాడు. కూతుర్ని పెనిమిటి సరిగా చూసుకుంటాడో, లేదోనని ఆడపిల్లల తల్లిదండ్రులు దిగులుపడినట్లే- అప్పటిదాకా తమ చాటున పెరిగిన తనయుణ్ని కొత్తగా వచ్చిన కోడలుపిల్ల తన కొంగున కట్టేసుకుంటుందేమోనని మగపిల్లడి అమ్మానాన్నలు ఆందోళన చెందడమూ లోకసహజమే. 'విభుడు మన్నించెనని విర్రవీగకుమీ/ అత్తమామలకెల్ల అడుగుదాటకుమీ...' అన్న పుట్టింటివారి హితబోధే- మగడింటిలో తన నడవడికకు దిక్సూచి అయినప్పుడు ఆ ఆడపిల్లకు అత్తామామలూ అమ్మానాన్నలవుతారు.

ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి జోరుగా సాగుతోంది. కాబోయే జంటలను ఆహ్వానిస్తూ పీటలు పరుస్తోంది. చెట్టపట్టాలుగా వారు జీవనప్రస్థానాన్ని ప్రారంభించడానికి నాంది పలుకుతోంది. ఒంటరితనానికి వారిచేత వీడ్కోలు చెప్పించడానికి సూత్రధారిత్వం వహిస్తోంది. ధర్మార్థ కామ మోక్షాల సాధనలో కలసిమెలసి మనుగడ సాగిస్తామంటూ ప్రమాణపూర్వకంగా వారు ప్రవేశించబోయే గృహస్థాశ్రమానికి స్వాగత తోరణాలు కడుతోంది. మంచిరోజును ఎంచుకుని, సుముహూర్తాన్ని చూసుకుని శుభకార్యాలను నిర్వహించడం భారతీయుల జీవన విధానంలో ఓ భాగం. వివాహాల విషయంలో వారు మరీ కచ్చితంగా పాటించేది ఆ సంప్రదాయాన్నే. తమ పిల్లలను ఒకింటివారిని చేయడానికి వారు మంచి ముహూర్తం కోసం తహతహలాడుతుంటారు.
మంటపాల అలంకరణ నుంచి, విందు భోజనాల వడ్డనల దాకా ఇప్పుడు అన్నింటా కాంట్రాక్టు పద్ధతులే. కాలమాన పరిస్థితులతో పాటు అనూచానంగా వస్తున్న ఆచార వ్యవహారాలూ మారిపోతున్న ఈ రోజుల్లో అటువంటి ఏర్పాట్లను తప్పు పట్టలేం. వాటివల్ల పెళ్లి కళకు వచ్చే లోటేమీ ఉండదు. రంగురంగుల కాగితపు గోలీలెన్ని కలగలిపినా, వన్నె తగ్గని పసుపు పచ్చని తలంబ్రాల మిసిమిలా- వివాహ సంప్రదాయాలు కాంతులీనుతూనే ఉంటాయి.
(ఈనాడు, సంపాదకీయం, ౧౧:౦౪:౨౦౧౦)
_____________________________

Labels:

రాధామాధవం


ఎనిమిదిమంది దేవేరులకు నల్లనయ్య శ్రీవారు. పదహారువేలమంది గోపకాంతలకూ ప్రియవిభుడు. ఆ చల్లని దేవర నామం స్మరించగానే దాని సరసన చప్పున స్ఫురించే పేరు మాత్రం రాధమ్మదే తప్ప- ముజ్జగాలనూ తన బొజ్జలో ఇముడ్చుకున్న ఆ అయ్య బరువును భక్తితో ఒకేఒక్క తులసిదళాన్ని తక్కెడలో ఉంచి తూచిన రుక్మిణిదీ కాదు; ముద్దుమురిపాల్లో, ముచ్చట్లలో తేలించి రక్తితో ఆయనను తన కొంగున కట్టుకున్న సత్యభామామణిదీ కాదు! కృష్ణస్వామి ఇంటిపేరే రాధ అన్నట్లుగా- తనను, తన సైదోడును ఈలోకం నిత్యం రాధాకృష్ణులుగానే కీర్తించేంత ఖ్యాతీ రాధాదేవి సొంతమే. 'గోపజనములందు, గోపికలందును/ సకల జంతువులందు సంచరించు...' ఆ సర్వాంతర్యామి పేరుతో తన పేరు అలా పెనవేసుకుపోవడానికి ఆమె ఏ నోము నోచెనో, తపమేమి చేసెనో అనిపిస్తుంది. రాధామాధవీయం ఎప్పటికీ రమణీయమే, స్మరణీయమే. మధురానగరిలో యమునా తీరాన ఇసుకతిన్నెల మీద వెన్నెల రాత్రుల్లోన గోపికలతో నల్లని దేవుడు సాగించిన రసరమ్య రాసలీలలపై కతలెన్నో, కవితలెన్నో, కావ్యాలెన్నో, చిత్రాలెన్నో. 'నారీ నారీ నడుమ మురారి/ హరికీ హరికీ నడుమ వయారి' వలయాలు వలయాలుగా తిరుగుతూ సాగిన కేళీగోపాలం- మహనీయుల కృతుల్లో కృష్ణలీలాతరంగిణియైు ఓలలాడించింది. గీతగోవిందమై అలరించింది. వర్ణరంజిత చిత్రమై ఎదఎదలో రంగవల్లులద్దింది. స్వరలహరియైు గుండెగుండెపై పన్నీటి జల్లులు చిలకరించింది. గోవిందుడు అందరివాడే. కానీ, 'గోపాలునకెంతమంది గోపికలున్నా/ గుండెలోన నెలకొన్న రాధ ఒక్కతే'ననిపించేంతగా తన అనురాగాన్ని ఆయన రాధమ్మపైనే కురిపించాడట. ఇక రాధ- మాధవ నిలయమైన తన హృదయమే కృష్ణ ప్రేమాలయం అనిపించేంత ప్రణయరాగ సుధ!

నవరసాలలో శిఖరస్థానం శృంగారానిదే. అలాగే, భారతీయ సాహిత్యంలో- శృంగార రసాధిదేవతలైన నాయికా నాయకులుగా కవుల అగ్రతాంబూలం అందుకున్నదీ రాధాకృష్ణులే. వారి అనురాగ రాగాలే పదాలై పల్లవించి ప్రవహించిన ప్రణయభావనలు, ప్రభవించిన ప్రేమగీతాలు ఎన్నో! కృష్ణుడికి రాధ మేనత్త అనీ అంటారు. 'అల్లుడికి అత్తాశ' అనే సామెతను నిజం చేయడానికా అన్నట్లు- నోరూరించే వెన్నముద్దలు రాధత్త బుగ్గల్లా ఉన్నాయని మురిసిపోయేవాడట అల్లరి బాలకృష్ణుడు ఆ పిన్న వయసులోనే! చిన్ననాటినుంచే వారిరువురి నడుమ మరుగుగా మరుని ముచ్చట్లు చాలానే నడిచాయని ప్రతీతి. అది నిజమో, కల్పనో కానీ- రమ్యాక్షర రూపాన్ని సంతరించుకున్న ఆ మురిపాలన్నీ రసజ్ఞులకు మనోజ్ఞమైనవే. 'పచ్చకప్పురపు వాసనల తాంబూలపు మోవి రాధ మోవిపయి మోపి'న గోపాలుణ్ని శ్రీనాథ మహాకవి ప్రస్తుతిస్తే- కృష్ణుడి చెక్కిలి నొక్కి ముద్దిడిన మిటారి రాధను కవయిత్రి ముద్దుపళని తన ప్రబంధం 'రాధికా సాంత్వనం'లో చిత్రించింది. ఆ 'ముద్దు' ముచ్చట వెనక నడిచిన గ్రంథం ఎంతో ఉంది. ఇళాదేవికి, కృష్ణుడికి స్వయంగా దగ్గరుండి పెళ్లి జరిపించినది రాధాదేవే. ఆ తరవాత ఆమే- 'సొమ్ములియ్యవచ్చు, సమ్మందమియవచ్చు/ ఇయ్యరాని ప్రాణమియ్యవచ్చు/ తనదు విభుని వేరు తరుణి చేతికినిచ్చి/ తాళవశమె యెట్టిదానికైన...' అని కృష్ణుని ఎడబాటుకు ఎంతో పరితపించింది. ఇళ మోజులో పడి ఆయన తనను పట్టించుకోలేదని కోపించింది. చాలా రోజులు అత్తవారింట్లో గడిపి తిరిగివచ్చిన కృష్ణుడు- పరిపరివిధాల అనునయించి, ఆఖరికి పాదాల మీద పడిన తరవాతనే రాధిక కినుక వీడింది. కనికరించింది. అలక మానింది. ఆయనకు ముద్దును అనుగ్రహించింది. అదీ, ఆ రసవత్కావ్య ఇతివృత్తం!
భారతీయుల దృష్టిలో- అవధుల్లేని ఆరాధనకూ, అవ్యాజమైన అనురాగానికీ, అలౌకిక ప్రణయానికీ, మధుర భక్తికీ, మాధుర్యమైన రక్తికీ రాధాకృష్ణులు ప్రతీకలు. వారి అనుబంధంపై భిన్న వాదనలూ ఉన్నాయి. భాగవతం ప్రకారం- చిన్నతనాన కృష్ణుడితో ఆడుతూ, పాడుతూ గడిపిన గోపకాంతల్లో రాధ కూడా ఒక గోపిక, అంతే. ఆ తరవాతి కాలంలో జయదేవుడు రూపకల్పన చేసిన గీతగోవిందం- రాధాకృష్ణుల్ని భక్తహృదయపీఠంపై ప్రతిష్ఠించింది. కృష్ణభగవానుని ఆత్మశక్తి రాధేనన్నది వైష్ణవ మతానుయాయుల నమ్మిక. వారివురూ సహజీవనం సాగించారన్నది సత్యదూరమని కొందరి విశ్వాసం. రాధను స్వయంవరంలో కృష్ణుడు పెళ్లాడటం- చింతలపూడి ఎల్లన్న కావ్య కథావస్తువు! పురాణాల్లో ప్రక్షిప్తాలుండటం పాతకథే. స్వకపోల కల్పనా చాతుర్యం చాటుకోవడానికి కవులు పౌరాణిక పాత్రల చుట్టూ కల్పిత కథలు, గాథలు అల్లడమూ కొత్త కాదు. సహజీవనంపైనో, జీవన సాహచర్యంపైనో వాటినే ప్రామాణికంగా తీసుకోవడం తగదు. రాధాకృష్ణులు భార్యాభర్తలై మనుగడ సాగించారా, లేక పెళ్లి చేసుకోకుండా సహజీవన యాత్రను తమ జీవితపంథాగా ఎంచుకున్నారా అనే సంగతిని పక్కనపెడితే- వారూ సీతారాముల వలె, శివపార్వతుల వలె భారతీయులకు పూజనీయులే. పెళ్లికిముందు శృంగారకేళి తప్పు కాదని తీర్పునిస్తూ, ఆ సందర్భంగా 'రాధాకృష్ణులదీ సహజీవనమే కదా' అని సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇక్కడి ప్రజానీకంలో అత్యధికులకు రుచించకపోవడానికి కారణం అదే.
(
ఈనాడు, సంపాదకీయం, ౦౪:౦౪:౨౦౧౦)
____________________________

Labels: , ,

Sunday, May 16, 2010

What God wants ?





















(An email forward)
________________________________

Labels: ,