కాంతారావు కన్నుమూత
హైదరాబాద్, న్యూస్టుడే: కత్తి యుద్ధమనగానే తెలుగు ప్రేక్షకుల మదిలోకదలాడే జానపద కళాబ్రహ్మ, కత్తుల కాంతారావు(86) ఆదివారం రాత్రికన్నుమూశారు. ఆయన అసలు పేరు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. కొంతకాలంగా ఆయన వూపిరితిత్తుల కేన్సర్తో బాధపడుతున్నారు. నాలుగురోజుల క్రితం ఉన్నట్టుండి బీపీ తగ్గడంతో కింద పడిపోయారు. దీంతోఆయన్ను హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆదివారంరాత్రి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకునలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాంతారావు మృతికిముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు, తెరాసఅధ్యక్షుడు కేసీఆర్, ప్రరాపా అధినేత చిరంజీవి తదితరులు సంతాపంప్రకటించారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్నిసందర్శించి నివాళులర్పించారు. జానపద కళాబ్రహ్మగా పేరుగాంచినకాంతారావు 1923, నవంబరు 16న నల్గొండ జిల్లా కోదాడ మండలంగుడిబండలో జన్మించారు. పాఠశాలలో చదువుతున్న సమయంలోనేనాటక రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలోనినిర్దోషి' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రంలో చిన్న పాత్రపోషించిన కాంతారావు 'ప్రతిజ్ఞ' చిత్రంలో కథానాయకుడిగా ప్రేక్షకులమన్నన పొందారు. విఠలాచార్య, కాంతారావు కలయికలో వచ్చిన జానపదచిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 'లవకుశ' చిత్రంలోని పాత్రకు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 2000 సంవత్సరంలో రాష్ట్రసర్కారు ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డును అందించింది. నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించిన ' కాంతారావు చివరి దశలో ఆర్థిక ఇబ్బందుల పాలయ్యారు.
కత్తి తిప్పడంలో ధాటి
నారద పాత్ర పోషణలో మేటి
జానపద కథానాయకుడిగా ఖ్యాతి
కష్టసుఖాల కలబోత కాంతారావు జీవితం
హీరో దొరికాడు: నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించిన కత్తుల కాంతారావు స్వగ్రామం నల్గొండ జిల్లా కోదాడమండలం గుడిబండ. 1923 నవంబరు 16న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సీతారావమ్మ, తాడేపల్లి కోటేశ్వరరావు. చిన్నప్పటి నుంచీ నాటకాలంటే ఇష్టం. స్కూలు ఎగ్గొట్టి మరీ పౌరాణిక నాటకాలు చూసేవారు. దీన్ని అదుపు చేయాలనిఇంట్లోవాళ్లు తమకు వారసత్వంగా వచ్చే మాలీ పటేల్(గ్రామ మునసుబు) పదవిలో కాంతారావును కూర్చోబెట్టారు. ఆతర్వాత సురభి నాటక సమాజంతో పరిచయం పెంచుకొని కొన్నాళ్లపాటు వారి బృందంతో కలిసి ప్రదర్శనలిచ్చారు. 1950లో మద్రాసు వెళ్లారు. తొలి తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన హెచ్.ఎమ్.రెడ్డి ఆశీస్సులు కాంతారావుకిలభించాయి. ఆయన దర్శకత్వం వహించిన 'నిర్దోషి'లో చిన్న పాత్ర పోషించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలోనేకాంతారావు నటన చూసి ''నా తర్వాతి చిత్రానికి హీరో దొరికాడు'' అని హెచ్.ఎం.రెడ్డి ప్రకటించారట. వెంటనే ఒప్పందంరాయించుకొని నెలకు రూ.250 జీతం ఇచ్చేలా తమ సంస్థలో నటుడిగా కాంతారావుని తీసుకున్నారాయన. మహానటిసావిత్రి సరసన నటింపజేస్తూ 1953లో 'ప్రతిజ్ఞ' చిత్రం తీశారు. 1950లో వివాహం చేసుకున్న కాంతారావు 'ప్రతిజ్ఞ' చిత్రంలోని తన పాత్ర పేరు ప్రతాప్నే.. తన పెద్ద కుమారుడికి పెట్టుకున్నారు.
విఠలాచార్యతో కలిసి: 1955లో బి.విఠలాచార్య 'కన్యాదానం' చిత్రం తీశారు. ఇందులో హీరో కాంతారావు. ఈ సినిమాద్వారా ఆయనకు నటుడిగా పూర్తిస్థాయి గుర్తింపు లభించింది. అప్పట్నుంచి వీరి కలయికలో వచ్చే చిత్రాలకు ప్రేక్షకుల్లోమంచి ఆదరణ ఉండేది. విఠలాచార్య తీసిన 'జయ విజయ'తో జానపద కథానాయకుడిగా, కత్తుల కాంతారావుగాగుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఎన్టీఆర్తో ఉన్న స్నేహం కూడా ఆయనకు లాభించింది. నాటకానుభవం, పద్యాలుపాడటంలోని నైపుణ్యం ఎన్టీఆర్ను ఆకర్షించాయి. 'శ్రీగౌరీమహత్యం'లో శివుడిగా నటించిన తీరు యావత్ దక్షిణ భారతచిత్ర వర్గాల్ని ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత 'భక్త మార్కండేయ', 'శ్రీరామాంజనేయ యుద్ధం' చిత్రాల్లో శివుడిగాకనిపించారు. కాంతారావు అనేసరికి నారదుడి పాత్రలు గుర్తుకు రావడం సహజం. 1958లో వచ్చిన 'గంగాగౌరీ సంవాదం' చిత్రంలో ఆయన తొలిసారి నారద పాత్రను పోషించారు. 'సీతారామ కళ్యాణం' చిత్రంలో నారదుడిగా నటించి, ఎన్టీఆర్ మెప్పుపొందారు. 'దీపావళి' చిత్ర షూటింగ్ సమయంలో కాంతారావు నటన చూసి ''నేను రాముడు, కృష్ణుడు, శివుడు పాత్రలుధరిస్తాను. నారద పాత్ర మాత్రం మీ కోసమే ఎప్పటికీ రిజర్వు చేసి ఉంచుతాను'' అన్నారట రామారావు. ఆ మాటప్రకారమే పలు చిత్రాల్లో నారద పాత్రకు ఆయన పేరు సూచించారు.
చివరి దశలో: కాంతారావు ఎక్కువగా సాత్వికమైన పాత్రలే పోషించారు. ఎన్టీఆర్‌తో కలిసి 'లవకుశ'లో లక్ష్మణుడిగా నటించారు. ఈ సినిమా ఆయనకు జాతీయస్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది. ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందించింది. తొలినాళ్లలో కథానాయకుడిగా చేసిన కాంతారావు 1973 నుంచీ సహాయ పాత్రలు పోషించారు. ఆయన చివరి చిత్రం చిరంజీవి 'శంకర్‌దాదా జిందాబాద్'. దాదాపు 50 టీవీ ధారావాహికల్లో నటించారు. నిర్మాతగా అయిదు చిత్రాలు నిర్మించారు. ఈ సినిమాలు కాంతారావుని ఆర్థికంగా దెబ్బతీశాయి. ఒకప్పుడు చెన్నైలోని ఖరీదైన ప్రాంతం టి.నగర్‌లో రాజప్రాసాదంలాంటి సువిశాలమైన ఇల్లు, రెండు కార్లు ఆయన సొంతం. చనిపోయేనాటికి ఆయనకు సొంత ఇల్లు కూడా లేకపోవడం విధి విచిత్రం. కష్టసుఖాల కలబోతైన తన ఆత్మకథను 'అనగనగా ఒక రాకుమారుడు' పేరుతో రాశారు. ఈ పుస్తకానికి 2007కిగానూ నంది పురస్కారం దక్కింది.
(ఈనాడు,౨౩:౦౩:౨౦౦౯)
_______________________________
Labels: Cinima/ Telugu, Personality