పదివేల గంటల కృషి.. పైపైకి...
గొప్పవారు కావాలని కలలు కనేది ఎందరో... అది నేరవేరేది కొందరికే ఎందుకు? ఆ రహస్యాన్ని ఛేదించారు జర్మన్ పరిశోధకులు. ఏదో ఒక రంగంలో గొప్ప అవ్వాలని ప్రతి మదిలో రగులుతుంటుంది. అసలు లోపం మాత్రం కష్టపడడంలోనే. ఎంచుకున్న రంగంలో దాదాపు 10,000 గంటలు కృషిచేస్తే అనుకున్న లక్ష్యం సాధించగలం. పరిశోధకుల పరిశీలన ప్రకారం 10,000 గంటలు శ్రమిస్తే విజయం ఎలాంటి వారినైనా వరించి తీరుతుంది. తెలివితేటలు, అదృష్టం అనేవి జీవితంలో చాలా ముఖ్యమైనవైనా సాధన మాత్రమే తెలివిని, మన సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియచేస్తుందని ఈ పరిశోధనల సారాంశం. దీన్ని రుజువు చేయడానికి పరిశోధకులు బెర్లిన్ సంగీత అకాడమీని తమ కేంద్రంగా ఎంచుకున్నారు. అక్కడ రోజూ ఎంతో మంది వయొలిన్ నేర్చుకుంటుంటారు. అయితే ఐదేళ్ల చిన్నారుల రోజువారీ సాధనను నమోదు చేసేవారు. మొదట్లో రెండు నుంచి మూడు గంటలు... వయసు పెరుగుతున్న కొద్దీ సాధన పెరిగింది. 20 సంవత్సరాలకు వచ్చేసరికి అత్యుత్తమ స్థాయి విద్యార్థుల సాధన 10,000 గంటలకు చేరింది. కొందరు 8,000 గంటల సాధనతో మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకున్నారు. ఇదంతా పరిశీలించి మెదడు తనకు కావాల్సిన విషయాలను నేర్చుకోడానికి, పరిపక్వత సాధించడానికి దీర్ఘకాలంలో ప్రయత్నిస్తుందని తేల్చారు. మాల్‌కోమ్ గ్లాడ్‌వెల్స్ తన పుస్తకం 'అవుట్‌లయర్స్: ద స్టోరీ ఆఫ్ సక్సెస్'లోను ఇలాంటి విషయాల్నే వెల్లడించాడు. ప్రఖ్యాత బీటిల్స్ గాయకుల విజయం వెనక సాధనే ప్రధాన పాత్ర అని రాశాడు. వారు మొదట్లో రాత్రిపూట ఎనిమిది గంటలు సాధన చేసేవారు. వారంలో ఏడు రోజులు సాధన చేస్తూనే ఉండేవారు. వారి సాధన దాదాపు 10,000 గంటలు దాటాకే వారికి ఎనలేని కీర్తిప్రతిష్ఠలు వచ్చాయి.
(Eenadu, 06:12:2008)
____________________________
Labels: Self development, Self development/Telugu