My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, July 20, 2009

పేగుబంధం


వత్సం అంటే ఆవుదూడ. అది పుట్టినప్పుడు దాని ఒంటినిండా మావి అలముకుని జుగుప్సావహంగా ఉంటుంది. అప్పుడు వత్సల(గోమాత) బిడ్డ దేహంమీద మకిలి అంతటినీ స్వయంగా తన నాలుకతో శుభ్రం చేస్తుంది. ప్రేమగా, ఆత్మీయంగా, శ్రద్ధగా తల్లిగోవు ఆ పని చేస్తున్నప్పుడు వ్యక్తమయ్యే గొప్ప భావాన్నే వాత్సల్యం అంటారు. వాత్సల్యం తల్లుల సొత్తు. మాతృత్వం అనేది సృష్టిలోని ఒకానొక మహత్వపూర్ణమైన అనుభూతి. అది బిడ్డకు జన్మ, తల్లికి పునర్జన్మ! తల్లి అనిపించుకోవడానికి స్త్రీ ప్రాణాల్ని సైతం పణంగా పెడుతుంది. అమితమైన బాధను ఓర్చుకుంటుంది. ప్రసవ వేదన ఎంతటిదో అనుభవిస్తేనే తెలుస్తుంది. రైలు పట్టాలమీద పెట్టిన నాణెం చక్రాలకింద నలిగి వెడల్పవుతుంది చూశారా! కాన్పులో బాధను దానితో పోల్చి చెప్పిందొక కవయిత్రి. దుర్భరమైన నొప్పులను ఓర్చుకున్న అమ్మ నలుసును చూడగానే సంతోషంగా నవ్వుతుంది. అమ్మనొప్పులకు కారణమైన ఆ బిడ్డ మాత్రం ఏడుస్తాడు. అదే సృష్టిలోని చిత్రం! కన్నాక కూడా కొన్నాళ్ళపాటు తన నోటిని కట్టేసుకుని తల్లి పథ్యంచేస్తూ బిడ్డకు మాత్రం తియ్యని పాలిచ్చి పెంచుతుంది. సంతానాన్ని పెంచి పెద్దచేసే క్రమంలో ముఖ్యభూమిక వహిస్తుంది. తల్లి పెంపకంలో గొప్పగొప్ప యోధులైనవారు చరిత్రలో మనకు చాలామంది కనిపిస్తారు. పురాణ కాలంలో పాండవులు మొదలు, ఆధునిక యుగంలో శివాజీ దాకా మహాయోధులైన వారెందరిపైనో తల్లి ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. దాన్ని గుర్తించాడు కాబట్టే 'ప్రపంచంలో గొప్పవారంతా తమ తల్లుల లక్షణాలను అధికంగా పుణికిపుచ్చుకున్నవారే' అని నిర్ధారించాడొక తత్వవేత్త. 'ఒడిలో కూర్చొనియుండ, నీవు మమతాయోగమ్ము పాటించి ప్రేముడిమై దేహమునెల్ల తాకునపుడేమో గాఢసంరక్షలో గుడిలో దీపము వోలెనుంటి...' అన్న ఒక మహాసహస్రావధాని మాట- అమ్మ ఒడిలోని భద్రస్థితికి కవితాకర్పూర నీరాజనం.

అమ్మ జన్మదాత అనుకుంటే- నాన్న జీవదాత! దేహం తండ్రి ప్రసాదం అని వేదం స్పష్టంగా చెప్పింది. పురుషేహవా... అనే ఐతరేయమంత్రం- తండ్రి శుక్రం ద్వారా తల్లి గర్భంలో దేహాన్ని పొందడం జీవుడికి మొదటి జన్మగా చెప్పింది. శిశువు రూపంలో భూమిమీద పడటం రెండో జన్మ. అక్కడినుంచి తండ్రి సంరక్షణ మొదలవుతుంది. తల్లీతండ్రీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అపురూపంగా పెంచుకుంటారు. వాళ్ళకోసం అవసరమైతే, తాము పస్తులుండటానికి సిద్ధపడతారు. తమ పిల్లలు తమకన్నా అన్నివిధాలా పెద్దస్థాయిలో జీవించాలని కోరుకుంటారు. తపనపడతారు. త్యాగాలు చేస్తారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడం, పెద్దవాళ్ళను చెయ్యడం తమ బాధ్యతగా భావిస్తారు. ఇష్టంగా నిర్వహిస్తారు. ఊహ తెలియగానే పిల్లవాణ్ని 'నీ బతుకు నువ్వు చూసుకో' అనడానికి భారతీయ తల్లిదండ్రులకు మనసొప్పదు. 'భార్య భర్త అనే రెండు తాళ్ళు ముడివేస్తే- ఆ ముడి సంతానం' అన్నాడు భర్తృహరి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఆ పేగుముడే- మనిషి అసలైన జీవ లక్షణం. చమురు ఆవిరైతే దీపం ఏమవుతుంది? బంధం శిథిలమైతే బతుకులో ఇక ఏముంటుంది? భార్యాభర్తలు విడిపోవచ్చు, చెడిపోవచ్చు గాని- తల్లిదండ్రులుగా మారాక బాధ్యతగా జీవించవలసిందేనని మన పెద్దల తీర్మానం. భార్యాభర్తల మధ్య ముందు ఏర్పడ్డ దూరం పిల్లలనే ముడితో తరిగిపోతుందంటారు వేటూరి ప్రభాకరశాస్త్రి. 'సంతానం కలగడంతో ఎన్నో సమస్యలు సమసిపోయి భార్యాభర్తలు దగ్గరకావడం మనం చూస్తున్నాం. అలాగే ప్రేమపెళ్ళిళ్లను ఆమోదించలేక విడిపోయిన కుటుంబాలు సైతం కొత్త జంటకు పిల్లలు కలిగేసరికి తిరిగి కలగలసిపోవడం మనం ఎరుగుదుం. అదే 'సుతాకారపు ముడి' అంటే! దాని ప్రభావం తియ్యనిదేకాదు, బలమైనది కూడా!

అనుబంధాలూ ఆత్మీయతలూ లేకుంటే జీవితానికి అర్థమే ఉండదు. తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమానురాగాలు పంచి ఇవ్వాలి. పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని సాదరంగా, ఆత్మీయంగా చూసుకోవాలి. ఆ సంప్రదాయ పరంపర తరవాతి తరానికి ఆదర్శం కావాలి. గడపడానికీ, జీవించడానికీ మధ్య తేడా అదే! తన తల్లిదండ్రుల పాదపద్మాలను ప్రీతిగా 'ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూములకన్నను విమల తరము...' అని స్తుతించాడు పాండురంగడు. స్వతహాగా చదువూసంధ్యా అబ్బకపోయినా- కౌశికుడంతటివానికి జ్ఞానబోధ చేయగలిగే స్థాయి వివేకం తనకు దక్కడానికి కారణం తల్లిదండ్రులకు చేసిన సేవలే అన్నాడు- భారతంలో ధర్మవ్యాధుడు. ఆడపిల్లలు తండ్రిమీద, మగపిల్లలు తల్లిపైన ప్రేమ అధికంగా కలిగిఉంటారని చెబుతారు. మనమూ పిల్లల్ని 'నువ్వు అమ్మ పార్టీయా, నాన్న పార్టీయా' అని ఆరా తీస్తుంటాం. 'వాడు అమ్మ కూచి... ఆమె నాన్న కూచి' అంటూ ముద్రలు వేస్తుంటాం. ఏ రకంగా ముద్రలు వేసినా, ఎటువైపు మొగ్గుచూపినా పిల్లలందరూ తమ తల్లిదండ్రులు ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలనే కోరుకుంటారు. అమ్మానాన్నా ఒకరినొకరు మనసారా ప్రేమించడం, గౌరవించడమే పిల్లలకు ఇష్టంగా ఉంటుంది. ఇటీవల హైకోర్టు ధర్మాసనం సైతం ఇదే విషయాన్ని ఒక జంటకు వివరించింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక కాపురంలో కలతలు మొదలై ఆ జంట విడిపోయింది. పిల్లలిద్దరూ చెరో చోటా ఉండిపోయారు. అయిదేళ్ళు గడిచాక విడాకుల కేసు కోర్టుకు వచ్చినప్పుడు చిన్నపాపను న్యాయమూర్తి పిలిచి 'నీకు అమ్మానాన్నల్లో ఎవరు కావాలి?' అని అడిగారు. ఆ పిల్ల చేతులు జోడించి 'నాకు అమ్మ, నాన్న, అక్క ముగ్గురూ కావాలి' అని దీనంగా అడిగింది. దాంతో న్యాయమూర్తి చలించిపోయారు. జనం కరిగిపోయారు. తల్లీతండ్రీ కన్నీటితో సతమతమయ్యారు. కరుణ రసాత్మకమైన ఆ ఘటనతో వారిద్దరూ పశ్చాత్తాపానికి లోనయ్యారు. తిరిగి ఒకటవుతామని కోర్టుకు విజ్ఞప్తిచేశారు. పేగుబంధం తన ప్రభావాన్ని చూపించింది. ఆ కుటుంబం ఆనందాశ్రువులతో ఒక్కటైంది. సమాజంలో వస్తున్న గొప్ప మార్పునకు సంకేతంగా నిలిచింది.

( ఈనాడు, సంపాదకీయం, ౦౩:౦౫:౨౦౦౯)
--------------------------------------------------

Labels:

సరసతే అర్హత


ద్రాక్షాపాకం, కదళీపాకం, నారికేళపాకం అంటూ రచనాశైలిని మూడురకాలుగా చెబుతారు. ఠక్కున నోట్లో వేసుకునే ద్రాక్షపండులా- రచన తేలిగ్గా నాజూగ్గా ఉంటే, దాన్ని ద్రాక్షాపాకం అంటారు. వలిస్తేగాని తినడానికి రాని అరటిపండులా- కాస్తంత ప్రయత్నంతో బోధపడే రచన కదళీపాకంలోకి వస్తుంది. ఎంతో శ్రమపడితేగాని నోటికి దక్కదు కొబ్బరి. అలా ఆస్వాదించడానికి కష్టతరంగా అనిపించే శైలిని నారికేళపాకం అని పిలుస్తారు. స్త్రీ మనసు నారికేళపాకమని చాలామంది అభిప్రాయం. '...సత్యము కనుగొన్న! ఎంత రసికాగ్రణికైనను నారికేళపాకము కదా... కామినీ హృదయ కావ్యరసగ్రహణమ్ము!' అని ముత్తరాజువారి శ్రీకృష్ణ తులాభారం నాటకంలో కృష్ణుడు గట్టిగా తేల్చిచెప్పాడు. కృష్ణుడి స్వానుభవాన్ని బట్టిచూస్తే ఆ మాట ఒప్పుకోక తప్పదు. అర్థం చేసుకోవడమే అంత కష్టమైతే, ఇక స్త్రీ మనసును రంజింపజేయడమనేది ఎంత క్లిష్టమైనదో ఎవరికి వారే ఆలోచించుకోవాలి. '...రసజ్ఞత ఇంచుక చాలకున్న (ఆ) చదువు నిరర్థకంబు' అని భాస్కర శతకకారుడు చెప్పినట్లుగా- సహనం ఓపిక లేకున్నా, సరసత తెలియకపోయినా రెండు నిండు జీవితాలు వృథా అవుతాయి. 'అర్ధరాత్రి రెండింటిదాకా మా ఆవిడ నిద్రపోకుండా కూర్చుంటోంది, ఏదైనా వైద్యం చెయ్యండి' అంటూ వచ్చాడొకాయన. డాక్టర్‌ ఆశ్చర్యపడ్డాడు. 'అంతదాకా మేలుకుని ఆవిడ ఏం చేస్తుంది?' అని అడిగాడు. 'నేను బార్‌నుంచి వచ్చేదాకా కాచుకుని, కలిసి భోంచేద్దామంటుంది. రోజూ అలా అర్ధరాత్రిదాకా మేలుకుని కూర్చుంటే, ఆవిడ ఆరోగ్యం ఏంగాను?' అని ఆదుర్దాపడ్డాడు పతిదేవుడు. వైద్యం ఎవరికో తేల్చలేక డాక్టర్‌ సందేహంలో పడ్డాడు. కష్టమైనా ఓపికగా స్త్రీ మనసును అర్థంచేసుకోవడానికి, మెప్పించడానికి పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తేనే- పురుషులకు దాంపత్యంలో రుచి తెలుస్తుంది.

స్త్రీ మనసును రంజింపజేయాలని పురుషుడు, పురుషుడి హృదయాన్ని ఆకట్టుకోవాలని స్త్రీ పరస్పరం తహతహలాడటంలోనే దాంపత్య జీవన మకరందం దాగి ఉంది. ఈ రహస్యం గ్రహించిన జంట తమ జీవితంలో అంతులేని మాధుర్యాన్ని చవిచూస్తుంది. అలా పూనికతో జీవన మధురిమలను చవిచూసిన జంటలోని స్త్రీ స్పందన ఎలా ఉంటుందో చెబుతూ ఓ కవయిత్రి '...ఒక్కోసారి నీ స్పర్శలో నాకు మాత్రమే తెలిసే సంకేతాలుంటాయి... ఏ యుగాలనాటివో తెలియని లిపి సముదాయాలుంటాయి... నీ స్పర్శ... అడవిపూల సువాసనలతో తేలివచ్చే గుర్తు తెలియని పక్షిపాటలా ఉంటుంది' అని వర్ణించారు. తృప్తిచెందిన స్త్రీ పరమ సుకుమార భావానికి ఇది సరసమైన వ్యాఖ్యానం. సున్నితమైన ఈ విషయాన్ని గ్రహించగల పురుషుడికి స్త్రీ తన గుండెల్లో స్థిరమైన చోటిస్తుంది. ఆ పురుషుడి స్పర్శకు స్త్రీ దేహం శ్రుతిచేసిన వీణలా ఝమ్మని స్పందిస్తుంది. కమనీయమైన కల్యాణి రాగాలాపన చేస్తుంది. ఆకాశంలో విహరిస్తుంది. '...ఒంటరిగా రమ్మంటే వసంతాన్ని వెంట తెచ్చాడు' అని మురిసిపోతుంది. '...తనువంతటా మనసైన, మనసంతటా తనువైన... నేనైన తనలో పరిపూర్ణమై మేము...' అంటూ అపూర్వ ప్రణయ అద్వైత రాగాన్ని ఆలపిస్తుంది. '...కాంక్షా సౌందర్య తాండవ కీలల్లో దగ్ధమై ప్రభవించి, ప్రభవించి దగ్ధమై రమిస్తే శమిస్తే దమిస్తే శాంతి శాంతి శాంతి' అంటూ అద్వైత సిద్ధిని పారవశ్యంతో స్మరిస్తుంది. భజిస్తుంది. అలా శారీరకంగాను, మానసికంగాను స్త్రీని రంజింపజేయగలగడమే పురుషుడి ఘనత. 'ఏం కావాలన్నా వెంటనే కొని పడేస్తున్నాం' అనుకోవడం పురుషులకు సహజం. శ్రమను తగ్గించే ఎన్నో గృహోపకరణాలకన్నా తన మాట వినే భర్తవల్ల స్త్రీ ఎక్కువ సుఖపడుతుందన్నది నిజం. అందుకే లోకంలో స్త్రీలు పురుషుణ్ని తమ కొంగున ముడేసుకోవాలని చాలా ఆశపడతారు.

స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యతకు ప్రేమానురాగాలే ఆధారభూమిక. మగవారిలో చిలిపితనం హాస్యప్రియత్వం సరసత రసజ్ఞత వంటివి స్త్రీలను ఆకర్షించే గుణాలు. అది తెలియని కొందరు గోసాయి చిట్కాలకు, తాయెత్తులకు ఎగబడతారు. అంబాలా నుంచి జలంధర్‌ నుంచి పోస్టులో విడిపించుకునే వశీకరణ ఉంగరాలకు డబ్బు తగలేస్తారు. మంత్రాలకు తంత్రాలకు ప్రయత్నిస్తారు. సత్యభామసైతం ద్రౌపదిని అదే అడిగింది. '...నీకు ఏవురు అనురక్తులగుట అత్యద్భుతంబు... వ్రతము పెంపొ! మంత్ర ఔషధ వైభవమ్మొ! వెలది! నీ విశేష సౌభాగ్య హేతువు(ఏమిటో) సెపుమ నాకు!' అని కోరింది. దానికి ద్రౌపది కోపించి 'మగువ యొనర్చు వశ్యవిధి మందులు మాకులు... మగనికి తెచ్చు రోగములు...' అని తిట్టిపోసింది. భర్త మనసు తెలుసుకుని అనురాగంతో దగ్గరకావడం ఒక్కటే మార్గమని బోధించింది. ఇదేమాట పురుషులకు సైతం వర్తిస్తుంది. స్త్రీలను ఆకట్టుకోవడానికి మందులు మాకులు ఏమీ ఉండవు. బోలెడు డబ్బుపోసి అంబాలా నుంచి తెప్పించిన మంత్రపూతమైన అంగుళీయకానికి, అంతర్వేది తీర్థంలో అర్ధరూపాయికి అమ్మే ఉంగరానికి తేడా ఏమాత్రమూ ఉండదు. స్త్రీని బాగా చూసుకోవడం ఒక్కటే, ఆమె మనసును గెలుచుకునే మార్గం! ఈ మాటను బ్రిటన్‌లోని నార్త్‌ ఉంబ్రియా విశ్వవిద్యాలయ పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. తమను సంతోషంలో ఓలలాడించే పురుషులపట్ల స్త్రీలు మక్కువ పెంచుకుంటారని వారి అధ్యయనంలో తేలింది. క్రిస్టఫర్‌ మెకార్డీ పర్యవేక్షణలో జరిగిన పరిశోధన ప్రకారం సరసులూ హాస్యప్రియులూ అయిన పురుషుల సాంగత్యంలో స్త్రీలు సంతోషంగా జీవిస్తారని తేలింది. వరుడికోసం ఇచ్చే పత్రికా ప్రకటనల్లో- పురుషుల్లో హాస్యచతురతను ప్రధాన అర్హతగా స్త్రీలు కోరుకోవడాన్ని ఆయన ఉదాహరిస్తున్నారు. 'స్త్రీలను నవ్విస్తే- వాళ్లు లవ్విస్తారు' అని ఆయన సరసంగా చెబుతున్నాడు.

(ఈనాడు, సంపాదకీయం ,౨౬:౦౪:౨౦౦౯)
___________________________________

Labels:

ఎవరిని ధ్యానించాలి?

- ఆచార్య మసన చెన్నప్ప

కర్మ చేయడంలో మనం స్వతంత్రులం. కాని, కర్మఫలాన్ని అనుభవించడంలో అస్వతంత్రులం. దీన్నిబట్టి కర్మఫలాలు ఇచ్చేవాడు ఒకడున్నాడని తెలుస్తుంది. అతనికే పరమాత్మ అని పేరు.

ఎవరు ఈ మానవజన్మతో పాటు, సమస్త శక్తుల్ని మనకు ప్రసాదిస్తున్నారో, ఎవరిని ఈ విశ్వమంతా ఎల్లవేళల ఉపాసిస్తుందో, ఎవరి ఆజ్ఞను సమస్త దేవతలు శిరసా వహిస్తున్నారో, ఎవరిని ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుందో, ఎవరిని ఆశ్రయించకపోతే మళ్లీమళ్లీ జన్మలెత్తవలసి వస్తుందో- అట్టి
దేవుణ్నే మొక్కాలని వేదం చెబుతుంది.

అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని; చీకటిని విడిచిపెట్టి ప్రకాశాన్ని; మృత్యువును విడిచిపెట్టి అమృతాన్ని చేరుకోవాలని ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నాయి.

'సత్‌', 'జ్యోతి', 'అమృత' శబ్దాలు పరమాత్మకే వర్తిస్తాయి. ప్రపంచం అసత్తు. అనగా సత్యం కానిది. పరమాత్మ సత్యం. కనుక అతడు సత్యస్వరూపుడు. అజ్ఞానమే చీకటి. పరమాత్మ పూర్ణజ్ఞానం కలిగినవాడు. అతని జ్ఞానమనే వెలుగులో మన అజ్ఞానమనే చీకటి పటాపంచలమవుతుంది. కనుక పరమాత్మ 'చిత్‌' స్వరూపుడు. మనం మర్త్యులం. అనగా మృత్యు ముఖంలో ఉన్నవారం. ఎప్పుడేమవుతుందో తెలియదు. ఇలాంటి మృత్యువు నుంచి మనం బయటపడాలి. కనుక అమృతసిద్ధి పొందాలి. అమృతం అంటే శాశ్వతానందం. అది పరమాత్మలోనే ఉంది. కనుకనే ఆయన ఆనందస్వరూపుడు. అందుకే మనం ఎల్లవేళలా సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మనే ధ్యానించాలి.

కనిపించే ఈ స్థూల ప్రపంచానికి మూలకారణమైన
ప్రకృతి కూడా సత్‌ పదార్థమేకాని, అది జ్ఞానరహితమైనది. అనగా దానికి తెలివిలేదు. కనుక పరమాత్మకు బదులుగా ఈ జడ ప్రకృతిని ఎవరు ధ్యానిస్తారో వారు దుఃఖరూపమైన అంధకారంలో పడిపోతారని వేదం చెబుతుంది.

సర్వజ్ఞుడైన పరమాత్మ జడప్రకృతి కంటే భిన్నమైనవాడు.
ప్రకృతి కారణంగా కలిగిన విశ్వానికి ఆకారం ఉంది. కాని అతనికి లేదు.

పరమాత్మ సర్వాంతర్యామి కనుక అతనిని పిలువలేం. సర్వాధారుడు కనుక అతనికెలాంటి ఆసనం ఇవ్వజాలం. ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాడు కనుక అర్ఘ్య పాద్యాదులు సమర్పించలేమని శంకర భగవత్పాదులు 'పరాపూజా' అనే గ్రంథంలో శ్లోక రూపేణా రాశారు.

జడానికి బదులు జ్ఞానాన్ని ఆశ్రయించడం వల్లనే ముక్తి లభిస్తుందని సాంఖ్య దర్శనం చెబుతుంది.

ఈ దర్శనంలోనే ధ్యానమంటే ఏమిటో స్పష్టంగా ఉంది.

విషయరహితమైన మనస్సుకే ధ్యానం అని పేరు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే అయిదూ విషయాలు. వీటి నుంచి మనస్సు పూర్తిగా వైదొలగినప్పుడే ధ్యానానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆత్మ మనస్సు నుంచి కూడా విడివడి పరమాత్మ ధ్యానంలో మునిగిపోవాలి.

మనం ఎవరిని లక్ష్యంగా చేసుకొని ధ్యానిస్తున్నామో, ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానమే ప్రవాహరూపంలో ఉండాలి.
పరమాత్మ సర్వ వ్యాపకుడైనప్పటికీ కేవలం మన హృదయంలో ఉన్న ఆత్మలోనే ఆయన దర్శనమివ్వగలడు. దీన్నే ఈశ్వర సాక్షాత్కారమని మన పెద్దలు చెప్పినారు. పరమాత్మ జడపదార్థం కాడు కనుక కనిపించడు. కాని, మన అనుభవంలోకి వస్తాడు. ఇదే ఈశ్వర సాక్షాత్కారం. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అందుకు మనం చేయవలసిందల్లా ఆత్మకు పాపపంకిలాన్ని అంటకుండా జాగ్రత్తపడటమే.

నీటిమీద చెత్తాచెదారం ఉంటే చంద్రుణ్ని ఎలా చూడలేమో, అలాగే
ఆత్మకు పాపం అంటుకుంటే పరమాత్మను కూడా అనుభవంలోకి తెచ్చుకోలేం.
(ఈనాడు, అంతర్యామి, ౨౦:౦౭:౨౦౦౯)
___________________________________________

Labels: