కార్పొరేట్ కాలానికీ, ధర్మం సూక్ష్మమే!
మహాభారతమే మనకు అద్దం!
నైతిక సంస్కరణలూ అవసరం
దేశం ఆర్థికంగా అనూహ్య విజయాలు సాధిస్తోందిగానీ.. నైతికంగా మాత్రం మన పయనం ఏమంత తృప్తిగా లేదు. ఈ కార్పొరేట్ శకంలో ధర్మం విలవిల్లాడుతున్న సందర్భాలుఅనేకం! ఈర్ష్యతో రగులుతూ యుద్ధాలకు దిగుతున్నదుర్యోధనులు నిత్యం మనకు కనబడుతూనే ఉన్నారు. కొడుకులకు పట్టం కోసం ఆరాటపడే ధ్రుతరాష్ట్రులు కళ్లకు గంతలు కట్టుకుంటూనే ఉన్నారు. అందుకే మహాభారతాన్నిసమకాలీన దృక్కోణం నుంచి మళ్లీ చదవటం అవసరమంటున్నారు ప్రముఖ రచయిత, కాలమిస్ట్ గురుచరణ్ దాస్!
నాడూనేడూ కూడా మన సమాజంలో ఒక వ్యక్తి 'మంచి మనిషి'గా నిలబడం అంత తేలికేం కాదంటూ... దీనికి ధర్మాధర్మవిచేచన ఒక్కటే సరైన మార్గమని నొక్కి చెబుతున్నారాయన తాజా పుస్తకం - ద డిఫికల్టీ ఆఫ్ బీయింగ్ గుడ్లో.
గురుచరణ్ దాస్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒకవైపు తత్వశాస్త్రం, మరోవైపు బిజినెస్ మేనేజ్మెంట్.. రెండూఅధ్యయనం చేశారు. మేనేజ్మెంట్ రంగ నిపుణుడిగా లబ్ధప్రతిష్ఠులు. తొలి రచన 'ఇండియా అన్బౌండ్'తో యావత్ప్రపంచం దృష్టినీ ఆకర్షించారు. కొంతకాలంగా 'ఈనాడు'తో సహా పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో సమకాలీనఅంశాలపై లోతైన వ్యాసాలు రాస్తున్న ఆయన తాజా పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయనతో ముఖాముఖీ!
* మీ పుస్తకానికి 'డిఫికల్టీ ఆఫ్ బీయింగ్ గుడ్' అని పేరు పెట్టారు.. ఈరోజుల్లో 'మంచి మనిషి'గా ఉండటం నిజంగానే 'కష్టం' అంటారా?
అవునవును.. అదెంత కష్టమో.. మన చుట్టూనే.. మన జీవితాల్నేచూడండి.. మనం 'మంచివాళ్లం' అనుకుంటూ (అది పూర్తి నిజంకాకపోయినా).. నిరంతరం మనల్ని మనమే మోసగించుకుంటూఉంటాం. ఈ పరిస్థితుల్లో అసలు 'మనం మంచిగా ఎందుకుండాలి?' అన్నది మౌలికమైన ప్రశ్న! ఈ ప్రశ్ననే నేను 'మహాభారతం' వెలుగులో తరచిచూసే ప్రయత్నం చేశానీ పుస్తకంలో!
* మనకెన్నో పురాణాలున్నాయి కదా.. మహాభారత దృక్కోణం నుంచే ఎందుకీ విశ్లేషణ?
ఎందుకంటే మహాభారతం మన జీవితాలకు చాలా సన్నిహితంగా ఉంటుంది! రామాయణాన్నే తీసుకోండి.. అది మరీ ఆదర్శవంతమైనది. దానిలో హీరో ఉత్తముడు, భార్య ఉత్తమురాలు, తమ్ముడు ఉత్తముడు.. చివరికి అందులో విలన్ కూడా ఉత్తముడే! కానీ మహాభారతం అలా కాదు.. అందులో.. మనలాగానే.. అందరికీ ఏవో ఒక లోపాలుంటాయి, వాళ్లు సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు.. అందుకే భారతం మనకు మరింత దగ్గరగా ఉంటుంది. రెండోది- మహాభారతం రాజకీయ ప్రపంచంతోగాఢంగా పెనవేసుకుంది. రాజు అనుసరించాల్సిన ధర్మం ఏమిటి? మంచి మనిషిగా ఉండాలంటే ఏది ధర్మం? ఇవన్నీచర్చిస్తుంది. ముఖ్యంగా మహాభారతంలో ఏ ఒక్కరూ కూడా సమాధానం కోసం 'దేవుడా నీదే భారం' అనరు. ప్రతి పాత్రా కూడా తనకు తానుగా నిలబడాల్సిందే. తన మీద తాను ఆధారపడాల్సిందే. ఎప్పటికప్పుడు పరిస్థితిని ధర్మాధర్మ విచక్షణతో బేరీజు వేసుకుంటూ.. తర్కించుకుంటూ ముందుకు సాగాల్సిందే. అందుకే భారతం మన నైతిక విచక్షణా శక్తికి పదునుపెడుతూనే ఉంటుంది. అంతిమంగా మహాభారతం చెప్పేది- ధర్మమనేది 'సూక్ష్మ'ంలో ఉంటుందని!
* సమకాలీన జీవితానికి మహాభారతం ఎలా స్ఫూర్తినిస్తుందంటారు?
స్థూలంగా చూసినప్పుడు.. మహాభారతం మనకు సమాధానాలు చెప్పదు, మన మీద మనం ఆధారపడటంముఖ్యమన్నది నేర్పుతుంది. సాక్షాత్తూ దైవం వాళ్ల మధ్యనే ఉన్నా కూడా భారతంలో ఎవరూ పూర్తిగా దైవం మీదే భారమేసి ఉండిపోరు. ఇది చాలా సానుకూలమైన అంశం, నేను భారతాన్ని ఎంచుకోవటానికి ఇదీ ఒక కారణం. ధర్మమంటే మతం కాదు. ధర్మాన్ని మతంగా చూడటమన్నది 19వ శతాబ్దంలో క్రైస్తవం వచ్చిన తర్వాతే ఆరంభమైంది. లేకుంటే ధర్మమంటే- మంచి చేస్తున్నామా? చెడు చేస్తున్నామా? అనే.
అందుకే మహాభారత కథ చెబుతూనే.. మధ్యలో ఆపేసి.. ఇప్పుడేం జరుగుతోందన్న చర్చ చేశాను. ఉదాహరణకుదుర్యోధనుడ్ని విశ్లేషించేటప్పుడు నేను 'ఈర్ష్య' గురించి చర్చించా. దుర్యోధనుడికి ఎన్నో దుర్గుణాలుండి ఉండొచ్చు, కానీఇది అన్నింటిలోకీ అత్యంత ప్రమాదకరమైనది. పాండవుల విజయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు.చివరికి అదేయుద్ధానికి కారణమైంది. మరిప్పుడు అంబానీ సోదరుల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది కాదా? నాకు రిలయెన్స్లోషేర్స్ ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు.. ముఖేష్ విజయం పట్ల అనిల్కున్న ఈర్ష్య.. చివరికి దేనికి దారి తీస్తుందోననిఆలోచిస్తుంటాను.. అందుకే క్రీ.పూ.5 శతాబ్దంలోనే గ్రీకులు ఈర్ష్య గురించి ఆందోళన చెందేవారు. ఏథెన్స్లో ఎవరైనా అధికప్రాచుర్యం పొందుతుంటే.. ఈర్ష్య తగ్గే వరకూ వారిని ప్రవాసంలోకి పంపేసేవారు. 1930లలో బెర్లిన్, వియన్నాల్లో 65% డాక్టర్లు, 50 శాతం వృత్తి నిపుణులు యూదులే. అందుకే యూదులకు వ్యతిరేకంగా మధ్యతరగతి ప్రజలను రెచ్చగొట్టటంహిట్లర్కు చాలా తేలిక అయ్యింది. ఈర్ష్య అన్నది అంత ప్రమాదకరమైనది. దురాశనే తీసుకుందాం... చాలామంది 'సత్యం' అధినేత రామలింగరాజు విషయంలో.. అన్నీ ఉండి కూడా ఆయన ఎందుకిలా చేసిఉంటారని అనుకుంటూ ఉంటారు. ఓపక్క మనకు మహాభారతం చెబుతూనే ఉంది.. అతనేమీ దుర్యోధనుడి వంటివాడు కాదు.. చాలా వరకూ ధ్రుతరాష్ట్రుడివంటివాడు! ఎందుకంటే తన కొడుకులు ఒక్కొక్కరికీ కంపెనీలు ఇవ్వాలనుకోవటమే సమస్య అయ్యుండొచ్చు. కాబట్టిమనం మహాభారత కాలంలో లేమనుకోవటానికేం లేదు.
* ఏది ధర్మం, ఏది అధర్మం తేల్చటం తేలిక కాదుకదా..
ప్రపంచం ఉంటే మంచిగా, లేకుంటే చెడ్డగా ఉంటుందనేం లేదు. చాలాసార్లు ఈ 'మధ్య'లో ఉంటుంది. మనందరిలోనూ లోపాలుంటాయి. అయినా మనందరం మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. మనంనీతిమంతంగా ఉంటే సంతోషంగా ఉంటామన్నది ప్రాథమిక విశ్వాసం. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు- కటికి నేల మీద పడుకున్న ధర్మరాజును చూసి ద్రౌపది అనుకుంటుంది.. 'మంచి మనిషివైన మీరేమో ఇక్కడ కష్టాలుపడుతుంటే.. చెడ్డవాడు దుర్యోధనుడు అక్కడ హంసతూలికా తల్పాల్లో శయనిస్తున్నాడు, ఇదేం న్యాయమని!.' కౌరవులుఅన్యాయంగా చేజిక్కించుకున్న రాజ్యం కోసం యుద్ధం చేద్దామంటుంది, క్షత్రియులుగా అది 'మన ధర్మమనీ' అంటుంది. కానీ ధర్మరాజు తన ధర్మం యుధిష్టురుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంటాడు! ఇద్దరూ మాట్లాడేది ధర్మం గురించే. కానీ ఇద్దరూ వేర్వేరు ధర్మ సూక్ష్మాలను బయటకు తెస్తున్నారు. ఈ ధర్మ వివేచనే కథనాన్ని, జీవన గమనాన్నిముందుకు తీసుకువెళ్తుంటుంది.
* మీ తొలి పుస్తకం 'ఇండియా అన్బౌండ్'లో భారతదేశ ఆర్థిక పురోగమనం గురించి చర్చించారు.. దీనిలోకి వచ్చేసరికి దృష్టిని ధర్మం మీదకు మళ్లించారెందుకు?
ఆ పుస్తకం రాసిన తర్వాత పరిణామాలు చూసి మానసికంగా చాలా చింతలోకి వెళ్లాను. ఎందుకంటే దేశం ఆర్థికంగాసంపన్నవంతమవుతోందిగానీ.. ఇక్కడి నైతిక జీవనం మెరుగవ్వటం లేదు. ఇందుకు ప్రధానంగా మన ప్రభుత్వ వ్యవస్థనీ కారణంగా చెప్పుకోవాలి. ప్రతిచోటా లంచాలు. స్కూళ్లలో టీచర్లుండరు. ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులుండరు. ఆటోడ్రైవర్ల ఆదాయంలో 20% పోలీసులు గుంజుకుంటున్నారు. దైనందిన జీవితంలో ప్రతిచోటా అవినీతి. దేశం అభివృద్ధి చెందుతున్న మాట వాస్తవమేగానీ మరోవైపు మన నైతికత ఘోరంగా విఫలమవుతోంది. పేదరికం ఎలాగైనా పోతుంది... ఈ నైతిక పేదరికాన్ని వదిలించుకోవటం ముఖ్యం! అందుకే ఇప్పుడు నేను మనకు ఆర్థిక సంస్కరణల కంటే కంటే రాజ్య/ప్రభుత్వ సంస్కరణలు ముఖ్యమని భావిస్తున్నాను. పోలీసులు, కోర్టులు, ముఖ్యంగా రాజకీయాలు, పరిపాలన.. అన్నీ సంస్కరించుకోవాల్సిందే. ఇది అసాధ్యమేం కాదు! ఒకప్పుడు స్కాండినేవియా, బ్రిటన్ వంటి దేశాలన్నీ అవినీతిలో కూరుకున్నవే. ఇప్పుడు వాళ్లెంతగాసంస్కరించుకున్నారు? అందుకే ఈ పుస్తకంలో ధర్మం గురించి చర్చించాను. ఇదే అన్నింటికీ సమాధానం అనటం లేదు. మనలో ప్రతి ఒక్కరికీ ఇదొక అద్దంలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. దీనిలో మనల్ని మనం చూసుకుని.. మనల్ని మనం సరిదిద్దుకోవచ్చు. ఆ దిశగా ఇది మనకొక దివిటీలా దారి చూపుతుందని భావిస్తున్నా!
- న్యూస్టుడే ప్రత్యేక విభాగం
(ఈనాడు, ౦౪:౧౧:౨౦౦౯)
___________________________________
Labels: Books, Religion/personality/telugu