My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, March 28, 2007

స్వప్నాంధ్ర ప్రదేశ్

- శంకరనారాయణ

''కలయో, వై.ఎస్ మాయయో, ఇతర సంకల్పార్థమో, ఏదియో తెలియం జాలము'' అని ఇన్నాళ్లూ జుట్టు పీక్కుంటున్న తెలుగువాళ్లకు ఒక్కసారిగా చిక్కుముడి విడిపోయింది, 'కల అయినది నిజమైనది' అని తేలిపోయింది! సాక్షాత్తూ ముఖ్యమంత్రి తనయుడు 'మా నాన్న రాత్రి కలకంటే, తెల్లారే సరికల్లా జీవోలు వెలువడతాయని' చెప్పేశారు. ఆ నిజం ఇప్పటికయినా తెలియడం మంచిదయింది. అపార్ధాలు తొలగిపోయాయి.
ప్రభుత్వానికి జవజీవాలు, జవ'జీవోలు' కలలే అని రుజువు కావడంతో 'కల'లు మొదలయాయి. పత్రికాస్వేచ్ఛ కొంపముంచే 938 లాంటి జీవోలవెనక తన హస్తంలేదని ఏలినవారు అంటుంటే జనం ఇంతకు ముందు నమ్మలేదు. మారాజుకు వచ్చిన పీడకలల ప్రభావం వల్లనే అవి వచ్చాయి తప్ప వాటి జారీలో ఆయన తప్పేమీలేదని ఇప్పుడు నమ్మక తప్పదు! ఇలలో జరిగింది ఎవరికయినా తెలుస్తుందిగానీ కలలో జరిగినదానికి ఎవరు బాధ్యులు? ఇందుకు అప్పీలు లేదు. ఎంత పారదర్శకత ఉన్నా ఇసుమంతకూడా ఇబ్బందిలేదు.

స్వర్ణాంధ్ర ప్రదేశ్, హరితాంధ్ర ప్రదేశ్ సంగతి ఏమయినా స్వప్నాంధ్ర ప్రదేశ్ మాత్రం అలవోకగా, కలవోకగా వచ్చేసింది. కాంగ్రెస్ రాజాలకు కలలమీద ఎందుకంత మమకారం కలిగిందంటే దానికీ చరిత్రే కారణం. ఒక సినిమా పాటలో 'ఇందిరమ్మ కలలు కన్న మరోప్రపంచం' అన్నమాట విన్నప్పటినుంచీ వై.ఎస్.లో అలజడి, 'కల'జడి మొదలయ్యాయి. పాదయాత్ర కన్నా ముందే కలల యాత్ర మొదలయింది. ఇందిరమ్మ ఏ కల కనడంవల్ల ఎమర్జన్సీ, యమర్జన్సీ వచ్చింది అన్న మాటలు ప్రెస్ సెన్సార్ కింద మాయమై పోయాయి. ఫ్రెష్ సెన్సార్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ 'ఇందిరమ్మ రాజ్యం తెస్తాం' అనేసరికి 'కలవరమాయె మదిలో, మా గదిలో' అన్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, టాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపించింది. 'కలలో ఎవడైనా కావచ్చు కలక్టర్' అన్న పఠాభి మాట గుర్తొచ్చి ఆశ మొదలయింది.

కలలు కనక పోతే నెహ్రూ కుటుంబం మీద భక్తిలో ఏమయినా లోపం వచ్చినట్టు అవుతుందోమోనన్న అనుమానంతో, కనుమానంతో బలవంతంగా, కలవంతంగా ఏలినవారు నిద్రను కొనితెచ్చుకుంటున్నారు. అయినా ఇందిరమ్మ రాజ్యం సంగతి వారికి మాత్రం తెలియదా? ఇది సోనియా గాంధీ రాజ్యం కాబట్టి సరిపోయిందిగానీ, నిజంగా ఇందిరా గాంధీ రాజ్యమై ఉంటే ఇప్పటికి ఎప్పుడో కలచెదిరిపోయి ఉండేది, క్యాలండర్ తిరిగేటప్పటికి కళ తప్పి ఉండేది. అది జరిగేది కాదులే అని ప్రభువులు తమను తాము సముదాయించుకున్నా అర్ధంతరంగా ముఖ్యమంత్రి పదవులు పోగొట్టుకున్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, అంజయ్య వంటివారు కలలోకి వచ్చి 'జర, జాగ్రత్త' అని పాలక రాజాలను, 'బాలక రాజా'లను హెచ్చరించేవారు. అప్పటినుంచి ఇందిరమ్మ రాజ్యం జనానికి రావాలి తప్ప తమకు రాకూడదని ఏలినవారు ఎన్నిసార్లు మొక్కుకున్నారో ఇడుపులపాయకు తెలుసు!

ఉన్న పదవికి జరగరానిది ఏదైనా జరిగితే ఆత్మగౌరవ పాదయాత్ర జరపడానికి ఒంట్లో ఓపిక ఉండొద్దూ? ఏరికోరి తెచ్చుకున్న శాసనమండలికి జరిగిన ఎన్నికలే గుణపాఠాలు, గణపాఠాలు నేర్పుతుంటే ఇటువంటి పీడకలలు రావటం సహజమే. అయినా మేకపోతు గాంభీర్యం, మైకుపోతు గాంభీర్యం తప్పని సరి! ఈ రెండూ లేకపోతే మనిషి అవుతాడోమోగానీ నాయకుడు కాలేడు.

కాంగ్రెస్ వాళ్లు సహజసిద్ధంగా 'కలా'కారులు. నడపడానికి మోపెడ్, ఉండడానికి పెంకుటిళ్లు కూడా లేనివాళ్లు కన్ను తెరిచేలోగా మెర్సిడెజ్ బెంజ్‌లు, ఆకాశహర్మ్యాలు సమకుర్చుకోవాడానికి వాళ్ల కలలు, కల్లలు కారణమని తెలుగుదేశంవాళ్లు వేలెత్తి చూపినా కాంగ్రెస్‌వాళ్లు (ఆస్తులు) లెక్కపెట్టరు. 'డ్రీమాతురాణం నభయం నలజ్జ' అన్నా వినిపించుకోరు.

కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షంతో ప్రధానమైన పేచీ కలల విషయంలోనే. తెలుగుదేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ''నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను'' అని ఎప్పుడూ అంటుండేవారు. కంటికి కునుకే రానివ్వక పోతే కలలు ఎలా వస్తాయి? కాంగ్రెస్‌వాళ్లు సరిగ్గా ఈ పాయింటునే పట్టుకుని జాయింటు చేసుకున్నారు. 'కలలు కంటేనే ప్రగతి. లోకకల్యాణానికి తలంబ్రాలు, కలంబ్రాలు వస్తాయి. కలలు కనాలంటే నిద్రపోవాలి' అనేది కాంగ్రెస్ వారి సిద్ధాంతం, యుద్ధాంతం. అందువల్ల- ఓట్ల పండుగ కాగానే జనాన్ని నిద్రపుచ్చడానికి జోలపాట, ఖజానా సాక్షిగా జోలెపాట పాడడానికి కూడా వారు సిద్ధపడతారు. కరెంటు ఉంటే జనానికి నిద్రాభంగం అవుతుంది, అది కాకూడదన్న సదుద్దేశంతోనే విద్యుత్ కోత 'విధి'స్తున్నారు. అది 'విధి'లేని పరిస్థితుల్లో చేసిందని అర్ధం చేసుకోక ఏమా గొడవలు? 'కంటినిండా నిద్ర, కడుపు నిండే కల' అని కాంగ్రెస్‌వాళ్లు గత ఎన్నికల మేనిఫోస్టోలో నినాదం ఇచ్చిఉంటే ప్రతిపక్షానికి ఈ మాత్రం సీట్లు కూడా వచ్చి ఉండేవికావు. కలల రహస్యం కాంగ్రెస్‌వాళ్లకు తెలిసినంతగా ఇతరులకు తెలియదు. అదే వారి విజయ రహస్యం. 'కలలో ఎవరు ఎవర్ని హత్య చేసినా, నిలువునా ముంచినా ఏవరినీ కేసు పాశాలు బంధించవు. కళ్లు తెరిస్తే చాలు, కలల అడ్రస్ ఉండదు. తుపాకీ గుండుకు కూడా సాక్ష్యం దొరకదు! ప్రపంచ సుందరి మెడలో తాళికట్టినా, ఎవరు ఎంత ఘోరం చేసినా, ఎంత నేరం చేసినా అది కలలో జరిగిందని కలగాపులగంగా నిరూపిస్తే చాలు, ఏ చట్టమూ ఏమీ చేయలేదు!

కలలతో కాంగ్రెస్‌వాళ్లు విశ్వరూపమూ, అశ్వరూపమూ ప్రదర్శించగలరు. అదే వారి 'చిదంబర' రహస్యం కూడా. డబ్బులో లోటు బడ్జట్‌లయినా, మొట్టికాయల్లో మాత్రం ఎప్పుడూ మిగులు బడ్జెట్లే. అయితేనేం, వాటిని 'కలల బడ్జెట్టు'గా చిత్రించగలరు! ఢిల్లీనుంచి హైదరాబాద్ గల్లీదాకా ఒకటే కలల హోరు. ఏం జరిగినా కాలమహిమ, కల మహిమే!

'ముందు దగా, వెనక దగా
కుడి ఎడమల దగాదగా'- అనుకుంటూ సమస్యలతో సతమతం, శతమతం అవుతూ నిద్రపట్టని అభాగ్యులంతా, అనాధలంతా 'భగవంతుడా' ఈ ఏలికల కలలనుంచి మమ్మల్ని కాపాడు! 'అని సామూహిక ప్రార్ధనలు చేస్తున్నారు. వారి కోరిక తీరాలని కలలు కనక తప్పదు!
(Eenadu,28:03:2007)
----------------------------------------------------

Labels: