My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, October 06, 2010

వైరాగ్యం

.........'స్వామీ! ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు?'

'ఏమీ వద్దనుకుంటే అంతా ఆనందమే. అన్నీ కావాలనుకుంటే అనుక్షణం దుఃఖమే. ఈ శరీరం కోసమేగా మన కోరికలన్నీ? శ్మశాన0లో రోజూ ఎన్నో శవాలు కాలిపోతుంటాయి. వాటితోపాటు కోరికలూ కాలిపోతుంటాయి. వాటి బూడిదలోనే వైరాగ్య సందేశం ఉంది. స్థిర వైరాగ్యానికి శ్మశానమే నిత్యపాఠశాల. ' ................
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌
(ఈనాడు, అంతర్యామి, ౨౯:౦౯:౨౦౧౦)
______________________________

Labels: ,

తాబేటి పాఠాలు

"...............[౧]తాబేలు తన మూపుమీద ఎంత బరువైనా మోస్తుంది. స్వామి కూర్మావతారంలో మందరపర్వతాన్ని మోయలేదూ? అంచేత బరువు బాధ్యతలు నెత్తికెత్తుకొని లోకవృత్తంలో ప్రవర్తించు- అన్నది మొదటి పాఠం.
[౨]శీతోష్ణాల్లో, సుఖదుఃఖాల్లో మెలకువగా ప్రవర్తిస్తూ అవసరం వచ్చినప్పుడు అంతర్ముఖంగా ఉండాలి... తనప్పుడు ప్రవృత్తిలో ఉండాలి అని చూపడానికి... కొన్ని సందర్భాల్లో తాబేలు కాళ్లను లోపలికి ముడుచుకుని చైతన్యం లేనట్లు పడి ఉంటుంది... అది రెండో పాఠం.
[౩]అది వయస్సు మీరి మరణించాక తాబేటిచిప్ప జలపాత్రగా లోకానికి దానం చేస్తుంది. అది మూడో పాఠం.

కష్టపడి పనిచేయాలి-
సందర్భానుసారం జాగ్రత్తగా వ్యవహరించాలి.
మనవల్ల లోకానికి ఏదైనా మేలు చేకూరాలి................................"


- డాక్టర్‌ ధారా రామనాథశాస్త్రి
_________________________
(ఈనాడు, అంతర్యామి, ౨౭:౦౯:౨౦౧౦)
_______________________

Labels: ,

సాధనే సాఫల్యం

- అయ్యగారి శ్రీనివాసరావు
చేతినిండా పని, మనసునిండా తగిన ఆలోచనలు... ఈ రెండూ మనిషి ప్రగతి రథానికి రెండు చక్రాలు. పనిలేకపోవడం వలన నిరాసక్తత ఏర్పడుతుంది. అలాంటివారిలో నిర్లిప్తత చోటు చేసుకుంటుంది. ఆ నిర్లిప్తత వల్ల ఎన్నో అనర్థాలు. అందుకే 'పనిలేనివాడి బుర్ర దయ్యాల నిలయం' అనే నానుడి పుట్టింది.

ఎల్లప్పుడూ పని చెయ్యడానికి అలవాటు పడిన శరీరం చురుకుగా ఉంటుంది. మెదడూ ఉత్సాహం పుంజుకొంటుంది. శరీరాన్ని శ్రమ పెట్టకుండా సుఖాలు కల్పిద్దామని విశ్రాంతినిచ్చామో... శరీరం, మనసు రెండూ రోగగ్రస్తం కావడం మొదలు పెడతాయి.

చైతన్యపురంలో కృషీవలుడు అనే రైతు ఉండేవాడు. అతడికి ఉన్నది కొద్దిపాటి భూమి. అందులోనే నిరంతర కృషితో అత్యధిక ఫలసాయం పొందుతూ ఉండేవాడు. అతడు విశ్రాంతిగా ఒక్కరోజైనా కూర్చునేవాడు కాదు.

ఒకసారి అతడు పొలం దున్నుతూ ఉండగా అటు వెళుతున్న ఆ ప్రాంత జమీందారు చూశాడు.

అది నడివేసవి కాలం. కృషీవలుడి గురించి, అతడి విజయాల గురించి అంతకుముందే విన్నాడతను. ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఎన్నాళ్ళనుంచో అనుకుంటున్నాడు. ఇన్నాళ్ళకు ఇలా అవకాశం దొరికింది అనుకుంటూ- బండి ఆపించి దిగి అతడి దగ్గరకు వెళ్ళాడు.

పరస్పర పరిచయాలు అయ్యాక 'ఇంత ఎండలో పనిచెయ్యకపోతేనేం?... ఇది పంట పండే కాలం కూడా కాదాయె. ఇప్పుడెందు కింత శ్రమపడి పనిచెయ్యడం?' అన్నాడు జమీందారు.

ఆ మాటకు జవాబుగా కృషీవలుడు 'పండే కాలం కాదని మనం అనుకుంటున్నాం. భూమికి మాత్రం ఖాళీగా ఉండటం తెలియదు... దానికి తెలిసిందల్లా ఏదో ఒక మొక్కను తనలో నుంచి మొలిపించి పెంచడమే... నేను ఈ రోజు దున్నకపోయినా, విత్తులు వేయకపోయినా భూమి మాత్రం తనపని తాను చేసుకుపోతుంది. తన గర్భంలోనే ఇదివరకటి నుంచి ఉన్న ఏ రకమైన విత్తులనైనా మొలిపిస్తుంది. అలా జరిగితే నేను నిజంగా పంట వేసేవేళకు ఆ కలుపు మొక్కలతో ఎన్నో అవస్థలు పడవలసి వస్తుంది. ఆ పొలంలాంటిదే ఈ శరీరమూ... దీనికి పని చెప్పకుండా ఖాళీగా ఉంచితే ఏవో సుఖాలు కోరుతుంది. ఆలోచనలు చెయ్యడమే సహజ గుణమైన మెదడు సైతం అనేకమైన ఇతర ఆలోచనలు చేస్తుంది. ఫలితంగా పనిచెయ్యకుండా వదిలిన పొలంలో కలుపు మొక్కలు పెరిగినట్లే నా మనోక్షేత్రంలోనూ అనవసరమైన ఆలోచనలు సాగవుతాయి. శరీరానికీ, మనసుకూ హాని చేసే ఆలోచనలు నన్ను ఎటు తీసుకెళతాయో తెలియదు. అందుకే ఈ పొలానికి కలుపు మొక్కలు పెరిగే ఆస్కారం, మనసుకు చెడు తలపులు కలిగే ఆస్కారం ఇవ్వకుండా ఈ భూమిని మెత్తగా దున్నుతున్నాను. దీనివల్ల రాబోయే వర్షకాలంలో నా పనులు అతి సులువుగా జరగడానికి ఆస్కారం ఉంటుంది' అన్నాడు. కాబట్టి- ఏ రంగంలోనైనా నైపుణ్యం సాధించాలంటే నిరంతర కృషి, పరిశ్రమ ఉండాలి. ఉన్నత స్థానానికి ఎదిగేవారి విజయరహస్యం ఇదే.

అందరికీ బయటకు కనిపించేది- ఎదుటివారి విజయపరంపరే. బయటకు కనబడని అంశాలు- వారి నిరంతర శ్రమ, సాధన.
పియానో వాద్యంలో ప్రపంచ ప్రసిధ్ధి పొందినవాడు పడెర్విస్కీ. అతడు కచేరీ ముగిశాక విశ్రాంతి తీసుకోకుండా మళ్ళీ కనీసం అయిదు గంటలు సాధన చేస్తూండేవాడు. అది చూసిన మిత్రుడొకడు 'నువ్వు ఇంత చక్కగా కచేరీ చేస్తున్నావు. అదీ కాక ఇంచుమించు ప్రతిరోజూ కచేరీ ఉంటూనే ఉంది. అయినా ఇంకా సాధన ఎందుకు?' అని అడిగాడు.

ఆ మాట విన్న పడెర్విస్కీ 'నేను ఒక్కరోజు సాధన చెయ్యకపోతే నా సంగీత సామర్థ్యం తగ్గిపోయిందని నాకు తెలిసిపోతుంది. రెండు రోజులు సాధన చెయ్యకపోతే తోటి విద్వాంసులు గుర్తించేస్తారు. వరసగా మూడు రోజులు సాధన చెయ్యకపోతే, నా సంగీత అభిమానులంతా నా సామర్థ్యం తగ్గినట్లు గుర్తిస్తారు. కళ పట్టుబడటం ఒకెత్తు. దాన్ని నిలబెట్టుకోవడం మరొకెత్తు. ఈ రెండింటికీ నిరంతర పరిశ్రమే ప్రధానం. అది లేకపోతే మనసు ఖాళీగా కూర్చోదు. మరొక పనిలో పడుతుంది. అప్పుడు అసలు పని సరిగ్గా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి మనం కోరి తెచ్చుకోకూడదు. దానికోసం నిరంతరం సాధన, కృషి చేస్తూనే ఉండాలి. సాధనతోనే సాఫల్యం కలుగుతుంది' అన్నాడు.
(ఈనాడు, అంతర్యామి, ౨౪:౦౯:౨౦౧౦)
______________________________

Labels:

మానవతా మహాపతాకం


'ప్రకృతిలో మానవుడే పరమాద్భుత పరాకాష్ఠ-' అంటూ మనిషి ఔన్నత్యానికి అక్షరాభిషేకం చేశాడు హరీన్‌ చట్టో. తన మనుగడను శాసించజూసే సవాళ్లను తిప్పికొడుతూ, ప్రతిబంధకాలను అధిగమిస్తూ- జీవన యవనికపై మనిషి నిత్యం ఆవిష్కరించవలసిన మనోజ్ఞదృశ్యం ఆ సార్వకాలీన సత్యమే. 'కాలమా! నీకు బానిస కాను/నీవు ఎంత ఎదురొడ్డినను నేను ఎదుగగలను' అన్నంత ధీమా అడుగడుగునా సాక్షాత్కరించే మానవ జీవితం ఒక మహా సాహసికయాత్ర. కాలప్రవాహంలోని ఆటుపోట్లకు వెరవకుండా సంకల్పబలంతో కడవరకు సాగాల్సిన ప్రయాణమది. ఆ ప్రస్థానంలో- 'రానీ, రానీ, వస్తే రానీ! కష్టాల్‌, నష్టాల్‌... రాట్లూ, పాట్లూ రానీ రానీ' అన్న శ్రీశ్రీ మహితోక్తి మనిషి మీటే జీవన గానానికి పల్లవియైు రవళించాలి. కష్టాల్ని ధిక్కరిస్తూ, నష్టాల్ని వెక్కిరిస్తూ, విజయహాసం చిందిస్తూ- జీవనపథంలో గమ్యం వైపు నిర్నిరోధంగా పురోగమించేవారే కార్యసాధకులవుతారు. మొక్కవోని ధైర్యంతో, సడలిపోని స్త్థెర్యంతో ముందడుగు వేసే మనిషి- లక్ష్యం చేరుకోవడానికి ఏదీ అడ్డంకి కాదు, అంగవైకల్యంతో సహా! తునకలుగా ఉన్నా, మెలికలు తిరిగిన రూపంలో ఉన్నా బంగారం జిగి ఎప్పటికీ తగ్గనిదే. దాని విలువా ఎన్నటికీ తరగనిదే. అలాగే- శారీరకంగా అంగ వైకల్యమున్నా, జ్ఞానేంద్రియాల్లో లోపమున్నా మనిషి గుండె దిటవు, ఆత్మధృతి ఏనాటికీ చెక్కుచెదరనివే. సమున్నతమైన ఆ లక్షణాలే దిక్సూచిగా... 'బాధల్లో మునుగుతాను- సంతోషాల్లో ఉదయిస్తాను/నేను మానవ సూర్యుణ్ని' అన్న శేషేన్‌ వాక్కును సాకారం చేస్తున్నట్లు జీవన రస్తాపై పయనిస్తున్న ధీరత్వం అంగవికలురది!

మూగతనం, బధిరత్వం, అవిటితనం, అంధత్వం వంటి వైకల్యాలు మనిషి దేహానికే తప్ప, మనోధైర్యానికి ఉండవు. తెలుగు కవిత్వానికి గంధర్వగాన సొబగులద్దిన కృష్ణశాస్త్రి దాదాపు ఏడు పదుల వయసులో తన గొంతుక మూగవోయిన తరవాత కూడా 'ఐన నేమాయె- మూగవోయిన నా గళమ్మునను గూడ/ నిదురవోయిన సెలయేటి రొదలు గలవు' అనిపించేలా రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. శ్రవణేంద్రియాలు పనిచేయకపోతే మాత్రమేం, బధిరులు- ఎదుటివారి పెదవులపై కదలాడే మాటల్లోని మంత్రలిపిని చదివి, వారి మనసును అర్థం చేసుకోగలరు. పాశ్చాత్య సంగీతలోకంలో ధ్రువతార బీతోవెన్‌ బధిరుడు. తాను వినికిడి శక్తి పూర్తిగా కోల్పోయినా- సంగీత సాధనను విడనాడకుండా, సమాజానికి సంగీత మధురిమలను పంచిపెట్టిన కళాకారుడతడు. తడబడుతూనే కాదు, ప్రయత్నబలంతో వడివడిగా అడుగులు వేయడానికీ అవిటితనం అడ్డుకాదు. పరుగు పందేలకు వికలాంగులూ 'సై' అనడం అందుకు ఓ నిదర్శనం. పోటీ మొదలైంది.... అవిటితనంతో లెక్కేమిటన్నట్లు పోలియోగ్రస్త పిల్లలు వూతకర్రల సాయంతో పరుగులాంటి నడకతో కదులుతుంటే మైదానంలో మిన్నుముట్టేలా హర్షధ్వానాల హోరు... పరుగు పందెంలో గెలుపురేఖకు ఒకేఒక్క అడుగు దూరంలో ఉన్న బాలుడు హఠాత్తుగా ఆగిపోయి వెనకడుగు వేశాడు. తనతో పాటు పోటీలో పాల్గొంటూ ఉన్నట్టుండి పడిపోయిన మరో బాలుడి వద్దకు చేరుకున్నాడు... అతణ్ని లేవనెత్తి మైదానం వెలుపలికి తీసుకెళ్లాడు... మిగిలిన పోటీదారులూ అతణ్ని అనుసరించారు... పందెంలో విజయం కాదు, కింద పడిపోయిన సాటి వికలాంగుడికి చేయూతనిచ్చి నిలబెట్టడమే ముఖ్యమని చాటిన పెద్దమనసు ఆ చిన్నపిల్లవాడిది. అందరిలోనూ మారాకు తొడగవలసింది- మానవత్వ పరిమళాల్ని వెదజల్లిన ఆ స్ఫూర్తే! ఫిడేలు నాయుడుగారుగా సుప్రసిద్ధులైన ద్వారం వెంకటస్వామి పాక్షికంగా అంధులు. అయితేనేం, కవి నారాయణబాబు అన్నట్లు- వాయులీనంమీద తన వేళ్ల విన్యాసంతో ఆయన 'నిశ్శబ్దపు నీలి నీలి అంచులనే మ్రోగించి' సంగీత వర్ణమయ జగత్తును రసజ్ఞుల కళ్లకు సాక్షాత్కరింపజేశారు.

ఏడాదిన్నర పసిపాపగా ఉన్నప్పుడే సోకిన వ్యాధి వల్ల అమెరికన్‌ మహిళ హెలెన్‌ కెల్లెర్‌ కంటి వెలుగులు ఆరిపోయాయి. వినికిడి శక్తినీ పూర్తిగా కోల్పోయిందామె. లోకమంతా చీకటైపోయిన ఆమె- మూడేమూడు రోజులు భగవంతుడు తనకు మళ్లీ చూపును ప్రసాదిస్తే, ఆ వెలుగుల్ని ఎలా ప్రసరింపజేయాలన్న వూహలకు రెక్కలు తొడిగింది. ఆ డెబ్భైరెండు గంటల్లో తొలుత- అప్పటివరకు తాను స్పర్శ సాయంతోనే గుర్తించిన బంధువుల్ని, నేస్తాల్ని, తనకు అన్నిటా చేయూతనిచ్చి జీవిత పాఠాలను నేర్పిన టీచర్ని చూడాలన్నది ఆమె ఆకాంక్ష. పొలాల్లో నడుస్తూ ప్రకృతి శోభను తిలకించాలని, అడవులు, కొండలు, నదులు, ద్వీపాలను వీక్షించాలని ఆమె అభిలాష. జనసమ్మర్దంతో కలకలలాడుతున్న న్యూయార్క్‌ నగర వీధుల్ని, పార్కుల్లో ఆడుతూపాడుతూ కేరింతలు కొడుతున్న చిన్నారుల్ని, శ్రమజీవన సౌందర్యాన్ని కళ్లకు కడుతూ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికుల్ని చూడాలని ఆమె కోరిక. ఈ లోకంలోని అందాలను చూడటానికి కనీసం మూడురోజులైనా దృష్టిభాగ్యం లభిస్తే చాలనుకున్న కెల్లెర్‌ ఆర్తి- కనుచూపు కరవైనవారందరిలోనూ ఉంటుంది. అటువంటివారి కంటివెలుగుపై కమ్ముకున్న కారుమబ్బుల్ని తొలగించి, వారికి శాశ్వతంగా చూపు ప్రసాదించేందుకు- తమ మరణానంతరం నేత్రదానం చేయడానికి పలువురు ముందుకు వస్తుండటం శుభపరిణామం. ఆ మహత్కార్యంలో రంగారెడ్డి జిల్లాలోని దేవుని ఎర్రవెల్లి గ్రామం అందరికీ మార్గదర్శకమై నిలిచింది. ఆ పల్లె ప్రజలందరూ తమ మరణానంతరం నేత్రదానం చేయడానికి సంసిద్ధత వ్యక్తంచేశారు. ఆ మేరకు తొలి విడతగా వెయ్యిమంది- తమ కళ్లను దానం చేయడానికి అంగీకారం తెలుపుతూ ఇటీవల వాగ్దాన పత్రాలపై సంతకాలు చేసి మానవీయవిలువల మహాపతాకాన్ని ఆవిష్కరించారు. బెడ్డ దెబ్బకు గాయపడి నీటిబొట్టు కదలాడితే, చెరువులోని నీరంతా చలించిపోయినట్లు- విధి చిన్నచూపు చూసిన సాటివారిని ఆదుకోవడానికి ఒక్కుమ్మడిగా తరలివచ్చిన ఊరు దేవుని ఎర్రవెల్లి దైవత్వానికి జేజేలు!
(ఈనాడు, సంపాదకీయం, ౧౨:౦౯:౨౦౧౦)
______________________________

Labels:

చక్కని నడుముకు చాంగుభళా!

ప్రకృతిలోని అణువణువూ స్త్రీమూర్తుల సౌందర్యానికి ప్రతిబింబమే. మలయమారుతాల వీవనకు నర్తించే ధాన్యపు కంకుల రవళుల్లో- చిట్టితల్లుల కాలి అందెల్లోని గజ్జెల ఘలంఘలల పలకరింత. సన్నగాలి తరగలు మీటే రాగ మాధుర్యానికి శిరసులూగిస్తున్నట్లు చేలు అలలు అలలుగా కదలుతుంటే- ఆకుపచ్చని పరికిణీ కుచ్చిళ్లు ముంగాళ్ల మీదుగా జీరాడుతున్న ఆడపిల్లలు వడివడిగా నడిచివస్తున్న అనుభూతి. నక్షత్రాల సముచ్ఛయంలా పుష్పాలు విరబూసిన ప్రతి తరువులో- కొప్పునిండా పూలు తురుముకున్న పెద్ద ముత్తయిదువుల ప్రతిరూపం. కొలనులోని అలల గలగలలు- పడుచుపిల్ల సనసన్నని నవ్వులకు ప్రతిధ్వనులనిపిస్తూ... 'జీవితం దేవతల దరస్మితం/ చిన్నారీ, పెదవిపై సింగారించు' అన్న కవివాక్కుకు ధన్యత చేకూరుస్తుంటాయి. కవితా గంధర్వుడు కృష్ణశాస్త్రి దృష్టిలో ప్రతి పురుగూ ఎగిరే దైవం. అలాగే, ప్రతి పువ్వులో ఒక దేవత ఉంటుందనీ ప్రతీతి. ఆ మాటే చెబుతూ- 'ఏటివొడ్డున కొంచెం రాత్రి కాగానే, మిణుగురు పురుగులు కాంతి తీగెలుగా చెట్ల ఆకుల్లో అల్లుకుంటో, అలంకరిస్తాయి. పుష్పదేవతలు దీపావళి చేసుకుంటున్నారనిపిస్తుంది' అన్నాడు మహారచయిత చలం. రంగుల్లో తేడాలున్నా మల్లె, గులాబీ, చంపకవల్లి వంటి పూచే ప్రతి పువ్వూ- చెట్లు చిగురింతలను సింగారించుకునే వసంతాగమనానికి సూచిక. 'చిన్న మొగమున కుంకుమిడినా, కన్నె పేరంటాలిమల్లే/ చెలువుగా అడివంత క్రొత్తగా చివురు తొడిగింది' అంటూ- ఆ రుతువులో ముస్తాబయ్యే వనిలో సాక్షాత్కరించే స్త్రీ సోయగాన్ని మన కళ్లకు కట్టారు కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ.

వెన్నెల వెండిదారాలల్లినట్లుగా, గుబురులు కట్టిన తెల్లని నీటి నురుగులతో పరుగులిడే నీలి కెరటాల హొయల్లో- జలదేవతల నృత్య విన్యాసాలు! వికసించిన విరులతోటల తళతళలలో- వనలక్ష్మీకళ. ప్రకృతికి స్త్రీమూర్తి మారుపేరు కనుకనే- 'పచ్చనీ సేలోకి, పండు యెన్నెల్లోన/ నీలి సీరాకట్టి నీటుగొస్తావుంటె/ వొయ్యారమొలికించు నా యెంకీ, వొనలచ్చిమనిపించు నా యెంకీ' అని మురిసిపోతాడు ఆ పల్లెపడుచు జతగాడు నాయుడుబావ. మబ్బును అంటిపెట్టుకున్న మెరుపులా ఆడపిల్లలు, అందచందాలు జంట వీడని సైదోడులు. తమ వన్నెలను చిన్నబుచ్చినట్లు వీసమెత్తు అనుమానమొచ్చినా, రుసరుసలాడే భామినీమణులు పురాణకాలంలోనూ ఎందరో! అనునయ కళలో ఆరితేరిన కృష్ణయ్య కూడా సతుల సాధింపుల బాధిత పతిదేవుడే. దేవేరి రుక్మిణితో పాచికలాడుతున్న వేళ ఏదో గుర్తుకొచ్చి నల్లనయ్య నవ్వాడు. ఆట రసపట్టులో ఉన్న సమయాన ఆయన అలా నవ్వడం తనపై చిన్నచూపుతోనేనన్న అనుమానంతో రుక్మిణీదేవి కినిసింది. 'నీరజనాభుడ నవ్విన విధము నీతి తోడుత నెరిగించు/ నాతిరూపు నల్లనిదని నాకు తగదని నవ్వితిరా!/ పదహార్వేల భామలలోపల పడతి తగదని నవ్వితిరా!'- సమాధానం చెప్పమంటూ ఆమె నిలదీసిందని మన జానపదులు కట్టిన పాట తమ అందచందాలపై మహిళల మక్కువకు నిదర్శనం. 'సొగసు కీల్జడదాన, సోగకన్నులదాన, ముత్యాలవంటి పల్వరుసదాన/ బంగారుజిగిదాన, పటువు గుబ్బలదాన... పిడికిట నడుగు నెన్నడుముదాన' అంటూ శ్రీనాథుడు అక్షర రూపమిచ్చినంత అందంగా ఉండాలని కోరుకోని ఆడపిల్లలుంటారా ఈ జగతిలో?! అటువంటి సౌందర్యరాసుల సాహచర్యంలో బతుకు పండించుకోవాలని ఆకాంక్షించని అబ్బాయిలుంటారా ఈ లోకంలో!

మన అక్షరశిల్పుల రచనల్లో- నీలికురుల నుంచి అరికాలి మెరుపుల వరకు దృశ్యమానమయ్యే స్త్రీమూర్తుల సౌందర్యం చిందించిన వగలు, సంతరించుకున్న సొబగులు ఎన్నో. పలికించిన సరాగాలు, ఒలికించిన వయ్యారాలు మరెన్నో! చంద్రబింబాన్ని పోలు నెమ్మోములు, కాముని బాణాలవంటి కన్నులు, చెరకువింటి వంపులను మరపించే కనుబొమలు, మీటిన విచ్చు చనుగుబ్బలు, ఇలాతలాన్ని తలపించే జఘనపీఠాలు- ఇలా తమ కావ్యకథానాయికల సౌందర్య లహరులకు మనోహరమైన అక్షరరూపమిచ్చిన కవులు... నడుమును ఆకాశంతో- అంటే, శూన్యంతో పోల్చడం ముచ్చటగొలుపుతుంది. నడుము ఎంత సన్నగా ఉంటే ఆడవాళ్ల అందం అంతగా ఇనుమడిస్తుందన్నది లోకోక్తి. ఉన్నట్టులేదే, లేనట్టుందే అనిపించేలా కనిపించేంత సన్నని నడుమున్న అందగత్తెలు సింహమధ్య, అణుమధ్య అన్న ప్రశంసలకు పాత్రులు కావడం అందువల్లనే. 'కడు హెచ్చు కొప్పు, దానిన్‌ గడవన్‌ జనుదోయి హెచ్చు/ కటియన్నిటికిన్‌ హెచ్చు... నడుమే పసలేదు నారీమణికిన్‌' అంటూ- 'విజయవిలాస'కర్త చేమకూర వేంకటకవి వర్ణించిన సుభద్ర అందం ఆ కోవలోనిదే. ఏడుకొండలస్వామి ఏకాంతసేవలో ఉన్న అలమేల్మంగను కీర్తిస్తూ 'ఉన్నతి పతిపై నొరగి నిలుచు/ తన సన్నపు నడిమికి చాంగుభళా' అంటూ- ఆ చక్కనితల్లి నడుముకు జోతలర్పించాడు అన్నమయ్య. ప్రియాన్వేషణలో మగపిల్లల్ని అమితంగా ఆకట్టుకుంటున్నదేమిటన్న అంశంపై అధ్యయనం చేసిన పరిశోధకులూ- ఆడపిల్లల అందానికి మరింత శోభ చేకూర్చేది వారి సన్నని నడుమేనని చెబుతున్నారు. జఘనం చుట్టుకొలత పరిమాణంలో డెబ్బై శాతానికి పరిమితమైన నడుముగల అమ్మాయిల్నే తమకు సరిజోడుగా ఎంచుకోవాలని మగపిల్లలు అభిలషిస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడి కావడం- 'నడుము సొంపులే కంటికింపులు' అనిపించేదే. అలాంటి అమ్మాయిల బాంధవ్య భాగ్యం లభించిన అబ్బాయిలు- 'ఒకరి నడుం ఒకరు చుట్టి ఉల్లాసంగా తిరుగుదాం/ సరుగుడు చెట్ల నీడలలో సరదాగా తిరుగుదాం' అంటూ చెట్టపట్టాలుగా సాగిపోతుంటే ఎంత చూడముచ్చట!
(ఈనాడు, సంపాదకీయం, ౦౫:౦౯:౨౦౦౧౦)
_____________________________


Labels: