My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, August 06, 2007

Management


















(an email forward)
______________________________________

Labels:

Sunday, August 05, 2007

గిడుగు పిడుగు

గిడుగు వెంకట రామమూర్తి(23:08:1863- 22:01:1940)

ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త. శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చరపిడుగు 'గిడుగు '.గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందిరికి అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది.

గిడుగు వేంకట రామమూర్తి, 23:08:1863న శ్రీకాకుళం జిల్లాలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉండే పర్వతాలపేటలో జన్మించి, 1875 వరకు అక్కడే వారి బాల్య కౌమర దశలు గడిపారు.1875 మొదలు 1880 వరకు విజయనగరంలో గడిపారు;1880 లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై, గంజాం జిల్లాలోని పర్లాకిమిడిలో, ఉన్నతపాఠశాలలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంచేస్తూ, స్వతంత్ర విద్యార్థిగా చదువు సాగించి 1886 నాటికి ఎఫ్.ఏ,1890 నాటికి బి.ఏ పరీక్షల్లో ఇంగ్లీషు, సంస్కృత భాగాల్లో ఉత్తీర్ణులయ్యారు, కాని చరిత్ర భాగము పూర్తిచేయలేదు.

1880 నుండి 1895 వరకు బడిపనులు చూసుకొంటూ వారు చేసిన విద్యావ్యాసంగాలలో ముఖ్యమైనవి రెండు: శాసనాలు చదవడం, సవర భాషా కృషి. ముఖలింగ క్షేత్రంలోని దేవాలయపు గొడలపైనున్న శాసనాలు, పర్లాకిమిడి దగ్గరలోనే కొండలలోనివసించే సవరల భాషా, అచారవ్యవహారాలు వింతగా తోచి గిడుగువారిని ఆకర్షించాయి.

ఆయన సవర-తెలుగు, తెలుగు-సవర నిఘంటువులను, సవరకథలు, పాటలూ ప్రకటించడానికి కొంత కృషి సాగించారు, కాని అప్పట్లో ఆ పని ఆగి పొయ్యింది. వారు తమ అభిమాన వ్యాసంగాలను కట్టిపెట్టి చదువు సాగించి 1896లో బీ.ఏ చరిత్ర భాగానికి సంబంధించిన పరీక్షలో మొదటి తరగతిలో రెండవ వారుగా ఉత్తీర్ణులయ్యారు.

1896 మొదలుకొని 1911 వరకు పర్లాకిమిడి రాజా స్థాపించిన రెండవగ్రేడ్ పర్లాకిమిడి కాలేజిలో చరిత్రాధ్యాపకులుగ వారు పనిచేసారు. ఆ కాలంలోనే వారు రాసిన సవర-తెలుగు, తెలుగు-సవర నిఘంటువులున్ను, సవరకథలు, పాటలూ, సవర వాచకాలు మద్రాసు ప్రభుత్వం ముద్రించి ప్రకటించారు. అందుకు వారు ఏ పారితోషకమూ పుచ్చుకోలేదు.

1913లో ఆయనకు ప్రభుత్వం 'రావుసాహెబ్ ' బిరుదునిచ్చారు.

1906 నుండి 1940 వరకు వారి కృషి అంతా తెలుగు భాషా సేవకే.యేట్స్ అనే స్కూళ్ళ ఇన్స్పెక్టర్ యొక్క ప్రోత్సాహంతో శిష్టజన వ్యావహారిక తెలుగు భాషను గ్రంథరచనకు గ్రాహ్యమైందిగా చేయడానికి అత్యంత కృషి చేసి కృతకృత్యులయ్యారు.వీరేశలింగం పంతులు గారి ఊతం కూడా వీరికి లభించింది.1919-20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు 'తెలుగు ' అనే మాసపత్రిక నడిపారు. వ్యవహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో(1925, తణుకులో) నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేసారు 'గిడుగు '. సాహితీ సమితి, నవ్యసాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు కూడా ఆయన వాదాన్ని బలపరచాయి. 1934లో ప్రభుత్వం ఆయనకు 'కైజర్-ఇ-హింద్ ' అనే స్వర్ణపతకాన్నిచ్చి గౌరవించారు.

ఆయనకు చిన్నప్పటినుంచి విద్యాసక్తి, కార్యదీక్ష, సత్యాన్వేషణం ప్రధాన లక్షణాలు.
సవరలు, హరిజనులు అంటరాని జనాలని అప్పటి సంఘం అంటుండే ఆ కాలంలోనే, ఆయన సవర విద్యార్థులకు తన ఇంట్లోనే బస ఏర్పరచి,భోజనం పెట్టేవారు.
1930లలో ఒరిస్సా ఏర్పడనున్నప్పుడు, పర్లాకిమిడి రాజా తన పర్లాకిమిడి తాలూకా అంతటిని ఒరిస్సా రాష్ట్రంలో చేర్పించడానికి ప్రయత్నించినపుడు, తెలుగువారికి నాయకులుగా రామమూర్తి నిలిచి ప్రతిఘటించారు. ఆ తాలూకాలో చాలా భాగాన్ని, పర్లాఖిమిడి పట్టణాన్ని ప్రభుత్వం అక్రమంగా ఒరిస్సాలో చేర్చడంవల్ల, తెలుగువారికి అన్యాయం జరిగిందని తెలియజేస్తూ ఆయన 1936లో ఒరిస్సా రాష్ట్రప్రారంభోత్సవం జరిగే దినం ఉదయమే పర్లాఖిమిడిలో ఉండడానికి ఇష్టపడక, వెంటనే రాజమహేంద్రవరం వచ్చి అక్కడే తన శేషజీవితాన్ని గడిపారు. వారి పట్టుదలకు ఇది ఒక గొప్ప నిదర్శనం.

ఆ మహా మనీషి 22:01:1940న పరమపదించారు.

తండ్రికి తగ్గ తనయుడిగా గిడుగు సీతాపతి కీర్తి గడించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ' కళాప్రపూర్ణ ' బిరుదు పొందిన తండ్రీ కొడుకులు వీళ్ళిద్దరే!

(పుటలు:660-661, కీ.శే.గిడుగు వెంకట సీతాపతి,విజ్ఞాన సర్వస్వము,తెలుగు సంస్కృతి,రెండవ సంపుటి, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు-మార్చి-1985)
---------------------------------------

Labels: ,