మునిమాపు వయసులో మధురోహలు

''జరదాడి వచ్చింది సుమా రుజముట్టడి వేయబోతున్నది జాగ్రత్త...'' అంటూ ఎన్ని హెచ్చరికలు చేసుకున్నా ఎంత జాగ్రత్త తీసుకున్నా వెంటాడుతూ వృద్ధాప్యం రానేవస్తుంది. బాల్యం తప్పటడుగుల మయం, యౌవనం పోరాటాల కాలం, వృద్ధాప్యం జ్ఞాపకాల నిట్టూర్పుల నిలయం- అంటూ జీవితంలోని మూడు దశలనూ విశ్లేషించాడో బుద్ధిమంతుడు. ముసలివారిని తేలికగా చూడటం, ఆటాడించటం మామూలుగా జరిగేదే. ముసలిదానికేలరా ముసిముసి నగవులు, ముసలాడికి దసరా పండుగ, వయసు తప్పినా వయ్యారం తప్పలేదు- వంటి ఎన్నో సామెతలు ఇటువంటి సందర్భాల్లోనుంచి పుట్టుకొచ్చినవే. అందుకే చాలామంది తమ వయస్సు ఎంతో చెప్పటానికి ఇష్టపడరు- ముఖ్యంగా స్త్రీలు. కోర్టులో కేసు నడుస్తోంది. వాద ప్రతివాదాలు జోరుగా సాగుతున్నాయి. బోనులో నుంచున్నది ఓ స్త్రీ. ఆమెను క్రాస్ పరీక్ష చేస్తూ ప్రశ్నలు వేస్తున్నదీ ఓ మహిళా న్యాయవాదే. ''మీ వయస్సెంతమ్మా?'' అని అడిగింది ప్లీడరమ్మ. ''ఎంతేముందమ్మా... మీ వయస్సెంతో నా వయస్సు కూడా అంతే ఇద్దరం ఒకీడు వాళ్లమే...'' అంది బోనులో ఉన్నావిడ. అంతే, ఆపై ఆ ప్రశ్నను పొడిగించటానికి ప్లీడరమ్మ సాహసించలేదు. ధోరణి మార్చి వాదనను మరో మలుపు తిప్పింది. పండుటాకు రాలుతుంటే పసరాకు నల్లబడుతుంటుందని సామెత. జీవితంలో ఇటువంటి మార్పు అనివార్యమే అయినప్పటికీ చాలామంది తమ వయస్సును దాచుకోవాలనే ప్రయత్నిస్తారు తప్ప పెద్దవారయినట్లు అంగీకరించరు. పుట్టిన రోజులు బ్రహ్మాండంగా జరిపించుకుంటారు కానీ ఆ వేడుక రోజునే తమ వయస్సు పెరిగి తమను వృద్ధాప్యంలోకి తీసుకువెళుతున్నదని గ్రహించరు. ఆ అమ్మకు ఊళ్లో ఆడవారందరి వయసూ కంఠోపాఠమే ఒక్క తన వయస్సు తప్ప అనే ఛలోక్తి ఎవరూ మరచిపోలేరు!
''యౌవనము భోగంబులకెల్ల నాస్పదంబు'' అన్నారో పూర్వకవి. వయసు పొంగులో ఉన్నప్పుడే మనిషిలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఉత్సాహం ఉరకలేస్తుంది. ఎంత క్లిష్ట కార్యాన్నయినా సవాలుగా తీసుకుని పరిష్కరించాలనే పట్టుదల ఉంటుంది. ఇదంతా చూస్తూ పడుచుదనం ప్రల్లదనం అని వయసు మళ్లినవారు సణుక్కోవటమూ జరుగుతుంటుంది. ఎవరేమనుకున్నా జీవితంలో యౌవనం ఆనందదాయకమైన, అనుభవయోగ్యమైన దశ. ప్రస్తుత ప్రపంచంలో యువతీయువకుల సందడే ఎక్కువగా ఉంది. విశ్వవ్యాప్తంగా 12 నుంచి 18 ఏళ్ల వయసున్న యువతీ యువకులు ముందెన్నడూ లేనంతగా వందకోట్లమంది ఉన్నారు. సంపన్న దేశాల్లోకంటే పేద దేశాల్లోనే యువత అధికం. పేదరికం విలయతాండవం చేస్తున్న ఆఫ్రికా ఖండంలో మిగతా దేశాల్లోకంటే యువత శాతం అధికంగా ఉంది. ఉగాండాలో 57శాతం యువతీ యువకులే ఉన్నారు. మన దేశ జనాభాలోను 45శాతం యువతే. సంపన్నదేశాలైన ఇటలీ, గ్రీస్, స్పెయిన్‌వంటి దేశాల్లో యువతీ యువకుల సంఖ్య 17శాతం మాత్రమే. వయసు వాటారినా మనసు మనుగుడుపుల్లోనే ఉందన్నట్లు షష్టిపూర్తి చేసుకున్నా ఇంకా వయసులోనే ఉన్నాం అని భావించేవారి సంఖ్యా ఎక్కువైపోయింది. ప్రస్తుతం 60 ఏళ్లు మధ్య వయసులోనే లెక్క అన్న భావం ప్రబలింది. ఓ సంస్థ ఇంటర్నెట్‌లో అంతర్జాతీయ స్థాయిలో జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 60 సంవత్సరాల వయసుకలవారు నడివయస్కులుగా, 40 ఏళ్లవారు 30 సంవత్సరాల వారిగా 30లో ఉన్నవారు 20 సంవత్సరాల వారిగా భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. వయసు పెరిగినా మనసు మాత్రం పదేళ్లు వెనక్కు వెళ్లినట్లుగా ఉందని సర్వేలో పాల్గొన్నవారిలో 70శాతం చెప్పడం విశేషం. పెరిగిన సౌకర్యాలు, ఆధునిక వైద్య సదుపాయాలు వ్యక్తుల్లో ఈ కొత్త దృక్పథానికి కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ''వెనకటి తరాలకంటే ఇప్పటి తరాలవారు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఆ కారణంగా వృద్ధుల సంఖ్యా పెరుగుతోంది. మానసికంగా తమను తాము చిన్నవారిగానే భావిస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఒకవిధంగా ఇది సంతోషించదగ్గ విషయమే'' అన్నారు సర్వే నిర్వాహకుల్లో ఒకరైన సారంగ్. ''పడుచుదనం రైలుబండి పోతున్నది వయసున్న వారికందులో చోటున్నది...'' అంటూ ఆరుద్ర ఓ పాట రాశారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి ''పడుచుదనం రైలుబండి పోతున్నది మనసున్న వారికందులో చోటున్నది...'' అంటూ ఆ పాటను మార్చుకోవాలేమో!
(Eenadu, Editorial, 10:12:2006)
-----------------------------------------------------
Labels: Life/telugu