My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, June 20, 2010

కని పెంచే విధాతలు

జన్మప్రదాతలను దైవపీఠంపై ప్రతిష్ఠించిన మహోన్నత సంస్కృతి మనది. తమకు దేహాన్నిచ్చి, రూపందిద్ది, ప్రాణం పోసి, చలనాన్ని కల్పించిన తల్లిదండ్రులను 'మాతృదేవోభవ... పితృదేవోభవ' అన్న మూలమంత్రంతో అర్చించే మహత్తర సంప్రదాయానికి వారసులు ఇక్కడి పిల్లలు! బిడ్డలు అమ్మానాన్నల అనురాగ ఫలాలు. ఆశాదీపాలు. కంటివెలుగులు. పసితనాన 'అంగరక్ష, ఆదిరక్ష, దీపరక్ష, చిన్ని నా బుజ్జాయికి శ్రీరామరక్ష'- అంటూ కన్నతల్లి నోట జాలువారిన జోలపాట... చిరుతప్రాయానేకాదు, జీవనపర్యంతమూ వ్యక్తిని ఆశీర్వదించే ఆరో వేదమే. నాన్నారు అదిలించే వేళ, ధీమాగా దాక్కోవడానికి అమ్మ అందించే చీరకొంగుచాటు పాపడికి చిలిపి రక్ష! అమ్మ గసిరే సమయాన, లెక్కలేనట్లుగా లేడిపిల్లలా చెంగున వచ్చి వాలేందుకు గుడిగా మలచిన నాన్నారి ఒడి చిన్నారికి గడుసు రక్ష! ఇతరుల పిల్లలకంటే తమ కలల పంటలే జనమెచ్చు బిడ్డలని ప్రతి తల్లీ తండ్రీ గర్వించడం లోకసహజం. 'వీధినెందరు వున్న విసరదే గాలి- రచ్చనెందరు వున్న రాదమ్మ వాన/ చిన్న నా అబ్బాయి వీధి నిలుచుంటె- మొగిలిపువ్వుల గాలి, ముత్యాల వాన' అని మురిసిపోయే అమ్మ గళంతో అబ్బాయి తండ్రీ శ్రుతి కలపడం తెలుగింటి మురిపెం. బుగ్గలు సొట్టపడేలా తమ అమ్మణ్ని 'కిలకిలా నవ్వితే కలువల్లు పూసె- కలువరేకులేమొ కలికి చూపుల్లు' అనీ అయ్య, అమ్మ పరవశించడం తెలుగు లోగిళ్ల ముచ్చట. తల్లిదండ్రులు తమ పిల్లల్ని మణిమాణిక్యాలతో అభిషేకించలేకపోవచ్చుకానీ, వాటి కాంతుల్ని ధిక్కరించేలా మిలమిలమెరిసే మల్లెపువ్వుల్లాగా వారిని చూసుకుంటారు. బిడ్డలకు వారు పట్టుపరుపుల్ని అమర్చలేకపోతే మాత్రమేం, వాటి మెత్తదనం దిగదుడుపనిపించే తమ రెక్కల్నే వారికి పక్కలుగా పరుస్తారు. పసికూనలుగా తమ చిన్నారులు బుడిబుడి అడుగులు వేసే వేళ, వారికి ఆసరాగా తమ చేతుల్నే అందించేటప్పుడు అమ్మానాన్నలది అనిర్వచనీయమైన ఆనందమే. చేతికి అందివచ్చేదాకా, పిల్లల వడివడి నడకలకు ఆలంబనగా తమ భుజాల్నే దండెలుగా కూర్చేదీ అమ్మానాన్నలు కాక ఇంకెవ్వరీలోకంలో?

పొత్తిళ్లనాడే కాదు, ఎంత ఈడు వచ్చినా తమ సంతానం కన్నవారి కళ్లకు పసివాళ్లే. పెరిగి పెద్దయి పెళ్లిళ్త్లె మనవల్ని మనవరాళ్లను తమకు కానుక చేసిన వయసులోనూ తమ బిడ్డలు తల్లిదండ్రులకు చిన్నపిల్లలే. అందుకే- పెద్దవాళ్లయ్యాకా వాళ్లు కట్టెదుటే కనబడుతుంటే వారికో తృప్తి. కార్యార్థులై వెళ్లిన పిల్లలు గూటికి తిరిగి వచ్చిన క్షణాన వారికో సంతుష్టి. అలా రానివేళ వారి మదిని తొలుస్తూ ఏదో వెలితి. తాను ఒక్క నిమిషం కనబడకపోతేనే, ఊరంతా వెదికే తండ్రి, ఏ వేళా తనను ఇల్లు కదలనీయకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లి- హిమాలయాల్లో చిక్కుబడిన తన జాడ తెలియక ఎంత దిగులు పడుతున్నారోనని ప్రవరుడు తల్లడిల్లుతాడు. ఇంటికి వెళ్లే దారి చూపమని వరూథినిని అభ్యర్థిస్తూ- 'జననీజనకుల్‌ కడువృద్ధులు/ ఆకటన్‌ సోలుచునెదురు సూచుచునుండెదరు' అని మొరపెట్టుకుంటాడు 'మనుచరిత్ర' కావ్యంలో. ప్రవరుడి తల్లిదండ్రుల ఆ ఆర్తి- బిడ్డల క్షేమాన్నే అనుక్షణం కాంక్షించే ప్రతి అమ్మ, అయ్య తపనలోనూ సాక్షాత్కరిస్తుంది. ఏ బిడ్డలకైనా అంతలా తపించేవారి కడుపుపంటగా పుట్టడంకంటే మరో భాగ్యం ఉంటుందా? మనిషి చేసే పుణ్యాల జాబితా ఎంత పొడవున్నా, ఆత్రేయలా- 'భువిని మా అమ్మ కడుపున పుట్టుటొకటె/నేను చేసిన పుణ్యము నేటివరకు' అని పలవరించడంకన్నా మహాపుణ్యం మరొకటి ఉంటుందా? 'సకల దురితహరము, సర్వసంపత్కరము/మాతృ పాదపద్మ మకరంద మాధుర్య సేవనమ్ము, దివ్యజీవనమ్ము' అన్నది మనసు కవి సూక్తి.

అలసిన రెక్కలతో జీవిత చరమాంకంలో ఉన్న అమ్మానాన్నల్ని కడుపున దాచుకుని కాపాడుకుంటున్న బిడ్డలున్నట్లే- ఆఖరి మజిలీలో విశ్రమించి 'అటు'వైపు ఒత్తిగిలే రోజుల్ని లెక్కపెట్టుకొంటున్న కన్నవారిని కాలదన్నుతున్న సుపుత్రులూ ఉన్నారు! బాల్యంలో తమ ఆకలి ఎరిగి, ఆయుష్యవర్ధనంలాంటి అన్నప్రసాదమిడిన అమ్మకు, అయ్యకు పచ్చడి మెతుకులైౖనా ప్రేమానురాగాలతో పెడుతున్న పిల్లలున్నట్లే- ఆస్తులతోపాటు అమ్మానాన్నల్నీ పంచుకుని వారి కడుపుకింత రాల్చడంతోనే తమ బాధ్యత తీరిపోయినట్లుగా చేతులు దులిపేసుకుంటున్న 'పుత్రరత్నాలూ' ఉన్నారు! ఓ కవయిత్రి అన్నట్లు 'కడుపున కన్నవాళ్లు కసురుకున్నందుకు/ పేగుచించుకు పుట్టినవాళ్లు ప్రేమభిక్ష రాల్చనందుకు/ ఎదిగిన బిడ్డల మధ్య ఏకాకి అయినందుకు...' ఎందరో అమ్మా నాన్నలు దిగులుచెందుతూ, దీనులవుతూ కుమిలిపోతున్న దుర్భర దృశ్యాలెన్నో ఈ సమాజంలో! గర్భస్థ శిశువులుగా ఉన్నప్పుడు తాము కాలదన్నినా ప్రాణరక్తాన్ని పణంగా పెట్టి తమకు జన్మనిచ్చిన తల్లి ముదుసలి అయినవేళ- కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన తనయులే ఆమెను బతికి ఉండగానే కాటికి చేర్చారు ఆమధ్య! మొన్నటికి మొన్న- వేరుపడిన ఇద్దరు కొడుకులూ తనను నిరాదరించడాన్ని ఓ నాన్న మనసు తట్టుకోలేకపోయింది. 'మీరైనా కలిసిమెలిసి ఉండండర్రా' అన్న తన మొరను- ఎదిగిన బిడ్డలు తూష్ణీకరించారన్న వేదనతో ఆ తండ్రి తన మంచాన్నే చితిగా పేర్చుకున్నాడు. తనకు తానే నిప్పంటించుకొని సజీవంగా దహనమయ్యాడు. ఇటువంటి సంఘటనలను తలచుకుంటుంటే- కుటుంబ అనుబంధాల్ని, పేగుబంధాల్ని, రక్తపాశాల్ని ఆర్థిక అంశాలే శాసిస్తూ- తల్లిదండ్రులు, బిడ్డల నడుమ చెక్కుచెదరకుండా ఉండాల్సిన సంబంధాలకు, ప్రేమలకు మరణశాసనం రాస్తున్న రోజులు దాపురించాయేమోననిపిస్తుంది. గుండెల్ని కలుక్కుమనిపిస్తుంది. తడి ఆరని గుండెల్లో ఎంత విషాద వృష్టి!
(ఈనాడు, సంపాదకీయం, ౧౬:౦౫:౨౦౧౦)
______________________________

Labels:

సాధించకే మనసా...

'ఎంత నేర్చిన, ఎంత జూచిన, ఎంత వారలైన కాంతదాసులే'నన్నాడు త్యాగరాజస్వామి. బ్రహ్మవాక్కులా నాదబ్రహ్మవాక్కూ తిరుగులేనిది. అందుకు దృష్టాంతాలు బోలెడు. సాక్షాత్తు దేవుళ్లూ తమ దేవేరుల్ని ఆ స్థాయిలో అందలాలెక్కించి గౌరవించినవారే. సుర గంగను శివయ్య తలమీద ధరించాడు. సిరితల్లి శ్రీమహాలక్ష్మిని విష్ణువు తన వక్షస్థలంలో దాచుకున్నాడు. సంగీత సాహిత్య సమలంకృతమూర్తి సరస్వతిని బ్రహ్మ రసనాగ్రంపై నిలుపుకొన్నాడు. తమ దారలు ముగురమ్మలను అలా తమ తనువుల్లో పొదువుకున్న ఆ అయ్యలపై వేమన- 'స్త్రీ నెత్తిన రుద్రునకు/ స్త్రీ నోటను బ్రహ్మకెపుడు/ సిరి గుల్కంగా స్త్రీ నెరిరొమ్మున హరికిని' అంటూ చెణుకు విసిరాడు. బహుశా దాన్ని అందిపుచ్చుకునే కాబోలు ఓ కవి- 'మొగలాయి దర్బారులో వలెనే, మా దేవతల స్వర్గంలోనూ శిరస్దదార్‌, ఉరస్దదార్‌, ముఖస్దదార్‌లు ఉన్నా'రని చమత్కరించాడు. భగవంతుణ్ని చేరుకోవడానికి పెద్దలు చూపిన నవవిధ భక్తిమార్గాల్లో సఖ్యం, దాసత్వం కూడా ఉన్నాయి. అనురక్తితో భామకు చేరువ కావడానికీ ఆ రెండు దారులు అనుసరణీయాలే. పరమేశ్వరుడంతటివాడికే వాటిని ఆశ్రయించక తప్పలేదు. తాను కొత్తగా పెళ్లాడిన గంగను జటాజూటంలో దాచుకుని, అత్తారింటినుంచి కైలాసానికి తిరిగి వచ్చిన ఆయనను భార్య పార్వతీదేవి గుమ్మంలోనే నిలువరించి పరిపరి విధాల నిలదీసింది. 'ఇడుముల బెట్టు జనులెందరైనా గలరు/ అలరు సఖ్యత జూడనొందజాలరుగా' అంటూ... పరులు చెప్పే చాడీలు నమ్మవద్దని శివయ్య ఎంత వేడుకున్నా ఆమె వినిపించుకోలేదు. ఆఖరికి- 'పదివేల నేరములు భామరో నావల్ల- పదివేల దండములు భామరో నీకు' అని శివుడు ప్రాధేయపడ్డాకే శివాని శాంతించింది. దాసుని తప్పులు దండముతో సరి అన్న సామెతను నిజం చేస్తూ, ఆయనను లోనికి రానిచ్చింది. ఆ తరవాత, తన వంతుగా అలిగిన గంగ శంకరుని నిష్ఠురాలాడి పుట్టింటి దారిపట్టింది. పోతూపోతూ పార్వతితో- 'నీలకంఠుడు, నీవు నిఖిల సంతోషమున/ కేళీవినోదముల ఓలలాడండి/ ఇంతపని కలిగిన ఇంతి నీ వద్దకు రాను/ వస్తే ఒట్టు పూనుకుంటాను' అని పంతగించి మరీ పుట్టింటికి వెళ్లడం- జానపదుల శివానందలహరిలో ఓ రసమయ వీచిక!

'కాచి వడపోశాం, కొంగున కట్టేసుకున్నామని మనం అనుకోవడమేకానీ, ఈ మగవాళ్లు ఎంతకైనా తగుదు'రని ఆడవాళ్లు రూఢి పరచుకునేలానే ఉంటాయి ఒక్కోసారి మగవారి చేతలు! అటువంటి సందర్భాల్లో ఇంటావిడ అలనాటి రాధ మాదిరో, అపర సత్యభామ వలెనో ఇంటాయనను సాధించడంలో అబ్బురమేముంటుంది? 'నిన్ను ప్రేమించి సహనమ్ము నేర్చినాను/ అలిగి నన్నేమి సాధించగలవు నీవు?' అని అతగాడు అన్నా, అవి మెరమెచ్చు మాటలుగానే మిగిలిపోతాయి తప్ప మురిపించవు, మరిపించవు. తనపై కినిసిన రాధికను ప్రసన్నం చేసుకోవడానికి కృష్ణుడు ఎన్నిపాట్లు పడ్డాడని! కోపం మాని తనతో మళ్ళీ చెలిమి చేయమని అర్థించాడు. మనవి వినమని వేడుకున్నాడు. మొగమెత్తి చూడవె అని ప్రార్థించాడు. తన ప్రేమను గుర్తించమంటూ చేతులు జోడించాడు. 'నిలువ దరంబుగాదు, కరుణింపవె నన్నిక భామినీమణీ!' అని ఆమె పాదాలకు ప్రణమిల్లాడు. అంత చేసినా ఆ నల్లనయ్యను రాధిక తొలుత కరుణించిందా, లేదు. అసలు నిన్ను 'ఎవ్వరు పిల్చిరిచ్చటికి? ఎందుకు వచ్చితివి?... నే నెవ్వతె, నీవెవండవు? ఇక ఎవ్వరికెవ్వరు? దేనికేది' అంటూ గోపాలుణ్ని దులిపి పారేసింది! తన మందిరానికి వచ్చినట్లు 'మీ జవ్వని విన్న రవ్వలిడు' అని రుసరుసలాడుతూ, ఆ ఇళాదేవి ఇంటికే పొమ్మని ఆయనను గసిరింది. ఇక- కృష్ణయ్యపై 'సత్యా'గ్రహం గురించి చెప్పనే అక్కర్లేదు. ఆయన అనునయ వాక్యాలు కేవలం మొగమెచ్చు మాటలే పొమ్మంది సాత్రాజితి. ప్రణయకలహాల వేళల్లోనే ప్రియవిభుణ్ని అంత పరుషోక్తులతో ఆ కథానాయికలు సాధించడం- ఎంతకైనా తగుదురనిపించేలా వ్యవహరించే నేటి కాలపు జతగాళ్లకు కనువిప్పు కావాలి.

భర్త తోడిదే తన లోకమని భార్య పరవశించడం సహజం. తనవాడనుకున్న మనిషి తనను చులకన చేయడం హృదయశల్యమై ఆమెను బాధిస్తుంది. ఏ విషయంలోనూ తన మాట చెలికాడు వినిపించుకోకపోవడం ఆమె మనసును గాయపరుస్తుంది. అతడు తనను ఏమాత్రం పట్టించుకోకపోతే ఆమె వేదన ఇంక వర్ణనాతీతమే. సమాజంలో అటువంటి భర్తలూ లేకపోలేదు. అలా తనను విస్మరిస్తూ, తనమాట పెడచెవిన పెడుతున్న భర్తను దారికి తెచ్చుకోవడానికి భార్య నడుం బిగించక తప్పదన్నది మారియా గార్సియా-కాబ్‌ ఉవాచ! అందుకు దిక్సూచిగా- 'మీ భర్తను వేధించడానికి నూటొక్క మార్గాలు (101 వేస్‌ టు టార్చర్‌ యువర్‌ హజ్బెండ్‌)' పేరిట ఏకంగా ఓ పుస్తకం రాసిందామె. మాట వినని భర్తకు సంక్లిష్టభరితమైన నృత్యాలు చేసేలా శిక్షణ ఇప్పించడం, ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకని వస్తువుల జాబితా ఇచ్చి వాటిని తెచ్చి తీరాలని కోరడం- ఆమె పేర్కొన్న చిట్కాల్లో కొన్ని. 'తన మాటను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసే భర్త చేత భార్య ఈ పనులు మాత్రం ఎలా చేయించగలుగుతుంది చెప్మా!' అన్నది ధర్మసందేహం. 'భర్తను వేధించడానికి నూటిపైఒక్క చిట్కాయేం ఖర్మ, మాకు రెండొందలపైన మరో రెండు కిటుకులు తెలుసు'నంటూ కొంగుబిగించి మరీ ధీమాగా చాటగల ధీరవనితలూ ఉండవచ్చు. అయినా, భర్తను దారికి తెచ్చుకోవడానికి గుప్పెడు మనసు, పిడికెడు మమత చాలవూ? 'నీవు లేవనునట్టి కాలమే నాకు లేదు/ నా దారినుండి నిన్ను విడదీయు వేరు మార్గమే లేదు/ నీవు లేనిచోటున నాకు చోటులేదు, సుఖము లేదు, లేదు ఉనికి' అన్న తిలక్‌ అనువాద కవిత దారిదీపమై- జీవితపథాన పరస్పర అనురాగంతో జీవనయాత్ర సాగిపోతే ఏ దంపతుల మధ్యనైనా పొరపొచ్చాలూ రావు, వేధింపుల ప్రసక్తీ ఉండదు!
(ఈనాడు, సంపాదకీయం, ౦౯:౦౨:౨౦౧౦)
______________________________

Labels:

భక్తి ప్రపత్తులు


- కాలిపు వీరభద్రుడు
మనసులో ఉన్నదొకటి, చెప్పేదింకొకటి, చేసేది వేరొకటి కాకుండా త్రికరణశుద్ధిగా (మనసా వాచా కర్మణా) సర్వాత్ముడైన శ్రీహరిని నమ్మి ఆరాధించిన సజ్జనుడు భగవంతునికి చేరువవుతాడు. ఈ ఆరాధనలో తొమ్మిది విధాలైన భక్తిపద్ధతులున్నాయి- అని భక్తశిఖామణి ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునితో చెప్పినట్లు భాగవత కథనం. ఆ భక్తిమార్గాలు శ్రవణం, కీర్తనం, స్మరణం (చింతనం), పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేవి. శ్రీహరి భక్తుల్లో అగ్రగణ్యుడైన ప్రహ్లాదుడు చెప్పిన ఈ నవవిధ భక్తి పద్ధతులు రామభద్రుని అనుజుడైన భరతునిలోనూ ఉన్నట్లు రామాయణం చెబుతున్నది. భరతునికి రాముడే తల్లి, తండ్రి, గురువు, దైవం.

శ్రవణం: శ్రీమన్నారాయణుని నామరూప గుణాదులకు సంబంధించిన మహిమాన్విత దివ్యగాథల్ని ప్రేమపారవశ్యంతో వినడాన్ని శ్రవణభక్తి అంటారు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే నారదమహర్షి చెప్పగా శ్రీహరి మహిమను తెలుసుకున్నాడు. అందుకే విష్ణునాకర్ణించు వీనులే వీనులంటూ పులకించే శరీరంతో శ్రీహరి నామాన్ని పలుమార్లు అంటాడు. అంటూ వింటూ ఉంటాడు. రామచంద్రుడు అయోధ్యకు వస్తున్న శుభసందేశాన్ని నందిగ్రామంలో ఉన్న భరతునికి నివేదిస్తాడు హనుమంతుడు. ఈ మాటలు వినగానే దాహంతో ఉన్నవాడు అమృతాన్ని తాగినంతగా ఆనందిస్తాడు భరతుడు.

కీర్తనం: ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ శ్రీహరి నామాన్నే జపిస్తూ ఉంటాడు. శ్రీహరిని తన మనస్సులో ప్రతిష్ఠించుకొని ఉన్మత్తుడై పాడుతూ ఉంటాడని భాగవతంలో ఉంది. రామచంద్రునిపైగల ప్రేమలో లీనమై రామనామాన్ని జపిస్తున్న భరతుని హనుమంతుడు దర్శించినట్లు రామాయణం చెబుతోంది.

స్మరణం: ఈ భక్తిపద్ధతిని చింతనమనీ అంటారు. శ్రీహరిగాథల్ని, సదా స్మరణకు తెచ్చుకొంటూ మననం చేసుకోవడాన్ని చింతన భక్తి మార్గమంటారు. అంబుజోదరుడైన శ్రీహరి పాదారవిందాలను ధ్యానిస్తూ ఆ చింతనామృతాన్ని పానంచేస్తూ మైమరచిన చిత్తం ప్రహ్లాదుడిది. భరతుడు సైతం నందిగ్రామంలో ఉంటూ శ్రీరాముని చింతనతోనే కాలం వెళ్లదీస్తాడు.

పాదసేవనం: భక్తుడెల్లప్పుడూ భగవంతుని దివ్యచరణాలను తన మనోనేత్రంతో చూస్తూ వాటినే పూజిస్తూ ఉంటాడు. ఈ భక్తిపద్ధతిని పాదసేవనమంటారు. ప్రహ్లాదుడు పులకించిన శరీరంతో అరవిచ్చిన కన్నులతో శ్రీహరి పాదాలను సేవిస్తూ ఉంటాడని భాగవతం చెబుతోంది. రామచంద్రుని పాదుకలనే అతని దివ్యచరణాలుగా భావించి వాటిని పూజిస్తూ సేవిస్తూ నందిగ్రామంలో గడుపుతూ ఉంటాడు భరతుడు.

అర్చనం: పత్రం, పుష్పం, ఫలం, తోయం (జలం) ఇత్యాది పూజాద్రవ్యాలతో తనను తాను మరచిపోయి భగవంతుని పూజించడాన్ని అర్చనభక్తి అంటారు. కమలాక్షునర్చించు చేతులే చేతులని భావిస్తూ ప్రహ్లాదుడు శ్రీహరి పాదపద్మాలను అర్చిస్తూ ఉంటాడు. శ్రీరామచంద్రుడే సింహాసనంపై కూర్చున్నట్టుగా భావించి ఆయన పాదుకలకు భరతుడు ఛత్రం(గొడుగు) పడతాడు.చామరం(వీవన)తో వీస్తాడు.

వందనం: భగవంతుని పాదాలముందు మోకరిల్లి భక్తిశ్రద్ధలతో రెండు చేతులూ జోడించి నమస్కరించడాన్ని వందన భక్తి అంటారు. శ్రీహరిని పూజించి వందనం చేయని చేతులను, కూరల్ని కలియబెట్టే కర్రతెడ్డులతో పోలుస్తాడు ప్రహ్లాదుడు. పుష్పకవిమానం నుంచి కిందికి దిగుతున్న రామచంద్రుని చూడగానే పులకితగాత్రుడైన భరతుడు ఆనందబాష్పాలు రాలుస్తూ రాముని పాదాలమీదపడి వందనమాచరిస్తాడు.

దాస్యం: మనల్ని మనం భగవంతుని సేవకులుగా భావించుకొని ఆ స్వామిని భక్తితో సేవించడాన్ని దాస్యభక్తి అంటారు. ప్రహ్లాదుడు చరాచర ప్రపంచాన్నంతటినీ విష్ణుమయంగా భావిస్తాడు. ఎల్లవేళలా శ్రీహరి ధ్యానంలోనే ఉంటాడు. భరతుడు కూడా 'నేను రామచంద్రుడి దాసుడిని'అంటాడు. ఆ ప్రభువు ఆజ్ఞానుసారం అతని సేవచేస్తానని అంటాడు.

సఖ్యభక్తి: భగవంతుణ్ని మిత్రుడిగా భావించి అతని మహిమను, ఔన్నత్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో మెలగడాన్ని సఖ్యభావభక్తి అంటారు. ప్రహ్లాదుడు తన తోటి బాలురిలో శ్రీహరినే చూస్తాడు. భరతుడాడిన భ్రాత, బంధు అనే మాటల్లో సఖ్యభావం ఇమిడిఉందని పెద్దలంటారు.

ఆత్మనివేదనం: మనం చేసే పనులు, పూజాదికర్మలు మొదలైనవాటి ఫలితాన్ని భగవంతునికి సమర్పించుకోవడమే ఆత్మనివేదన భక్తి. కామ క్రోధ మద మాత్సర్యాలను గెలిచి నిష్కామభావంతో శ్రీహరిని భజించాలనీ, భక్తికి చిక్కినట్టుగా ఇతరాలైన క్రతు, వ్రత, దానాదులకు చక్రి (శ్రీహరి) చిక్కడని ప్రహ్లాదుడంటాడు. 'తమ రాజ్యాన్ని తమకు అప్పగించేస్తున్నాను. నా జన్మ ధన్యమైంది' అని- రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చాక అతని పాదాలకు పాదుకలు తొడుగుతూ భరతుడంటాడు.

ఈ తొమ్మిది విధాలైన భక్తి పద్ధతుల్లో శ్రవణ కీర్తన స్మరణాలనే వాటిని భగవంతుడు మనకు ఎదురుగా లేనప్పుడూ ఆచరించవచ్చు. వందనం, పాదసేవనం, అర్చనలను భగవంతుని సన్నిధానంలో చేస్తాం. దాస్య, సఖ్య, ఆత్మనివేదన పద్ధతులను భావప్రధానాలుగా భావిస్తారు. ఈ నవవిధ భక్తి పద్ధతుల్లో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా మన జన్మ ధన్యమవుతుంది.
(ఈనాడు, అంతర్యామి, ౧౩:౦౬:౨౦౧౦)
________________________

Labels:

ఉత్తమ సందేశం

- డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా
ఎవరి హృదయంలో బాధాగ్ని రగిలినా, ఆర్పగలిగే తపన, ఉదార సానుభూతి ఉత్తమ ప్రవర్తనకు నిదర్శనాలని ఉద్గ్రంథాలెన్నో ఘోషిస్తున్నాయి. ఆర్తులను చేరదీసే ఆత్మీయత ఒంటినిండా మనం నింపుకోలేకపోవడం ఆ పరాత్పరుని దృష్టిలో తీరని లోపం. పొరుగువారి ఆకలిని అర్థం చేసుకోగల మనో పరిపక్వత మనకవసరం. పేదలు, బలహీనులు, కదలలేని వృద్ధులు, రోగులు- వీళ్ల సేవ చేయడంలోనే దేవుని మహోన్నత సేవ ఉందని గ్రహించిననాడే నిజమైన దైవభక్తులం కాగలం. అంతరంగాల్ని కలిపేది ఆరాధన. మనిషి మనిషి మధ్య మైత్రిని విరబూసేలా చేసేది భక్తి. నిరంతరం సద్గుణాలవైపు మనసును మరల్చగలిగితే- నవజీవన మాధుర్యం.

ఆ జగదీశ్వరుడు తనను ఆరాధించేవాళ్లకంటే, స్తుతించేవాళ్లకంటే విపత్తుల్లో ఉన్నవారిని చేరదీసి కన్నీరు తుడిచేవాళ్లను అధికంగా ఇష్టపడతాడన్నది అక్షర సత్యమని విజ్ఞుల అభిప్రాయం. సాటి మానవుల్ని ప్రేమించాలని, మంచిని మంచివాళ్ల ప్రేమను పొందాలని నిరతం మనం కోరుకోవాలి. మనం ఎంత పవిత్ర జీవితం గడిపినా, ఎంత నిష్ఠాగరిమను పాటించినా ఒక పేదవాడి మనసుకు బాధ కలిగిస్తే మనం చేసిందంతా నిష్ప్రయోజనమే.

అదొక ఎడారి. చీకటి దట్టంగా అలముకొంది. దాదాపు అంతా నిర్మానుష్యం. హఠాత్తుగా తుపాను చెలరేగింది. ఎముకలగూడులా ఉన్న డెబ్భై ఐదేళ్ల వృద్ధుడొకడు తుపానులో చిక్కుకొన్నాడు. బాగా అలసి ఉన్నాడు. అడుగులో అడుగు వేసుకొంటూ సహాయం కోసం అలమటిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఒకే ఒక చిన్న ఇల్లు కనిపించింది. తలదాచుకోవడానికి ఆ ఇంట్లోకి ప్రవేశించాడా వృద్ధుడు. ఆ సమయంలో ఆ ఇంటి యజమాని భోజనానికి లేవబోతున్నాడు. ఆకలిగొన్న అతిథి ఇంటికి రావడం గమనించాడు. అతిథిని ఆదరించాలని అన్ని మతాలూ చెబుతాయి. ఆ గృహస్థుడు తన మతవిధానాల్ని సునిశితంగా అధ్యయనం చేశాడు. 'బాగా ఆకలిగొని ఉన్నావు. దేవుడు ప్రసాదించిన ఈ భోజనాన్ని నాతో కలిసి భుజించి ఆకలి తీర్చుకొందువుగాని రా సోదరా!' అన్నాడాయన అతిథితో. ఆప్యాయత అనురాగం కలగలిసిన చల్లని మాటవిని వృద్ధునికి ప్రాణం లేచివచ్చింది. గృహస్థు దస్తరుఖాన్‌ (భోంచేయడానికి ముస్లిములు పరచుకొనే వస్త్రం) పరిచాడు. భోజనం వడ్డించాడు. ఇరువురూ భోజనానికి కూర్చున్నారు. వృద్ధుడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నాడు. 'ఆగు' అని కోపోద్రిక్తుడై ఇంటి యజమాని హుంకరించాడు. 'ఈ ఆహారం ఎలా లభించిందనుకొన్నావు? దేవుని దయవల్ల. ఆ దేవునికి మొదట కృతజ్ఞత తెలుపుకోవాలని నీకు తెలీదా? బిస్మిల్లా (అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్‌ పేరుతో) అని దేవుని స్మరించుకోవాలి'- గృహస్థుని మండిపాటుకు వృద్ధుడు భయంతో కంపించి వినయంగా 'అయ్యా! అదంతా నాకు తెలీదు. బిస్మిల్లా అనే మాటే ఇంతవరకూ నేను వినలేదు అన్నాడు. అయితే నువ్వు దేవుణ్ని విశ్వసించేవాడివి కావు. మత విధులకు దూరంగా ఉన్నవాడివి. ఇక్కడ భోంచేసే అర్హత నీకు లేదు. వెళ్లిపో. నా ఇంటి నుంచి వెళ్లిపో' అని ఉరిమాడు గృహస్థు. వృద్ధుని ఆశ కుప్పకూలింది. భోజనంవైపు ఆశగా చూస్తూ బయటికెళ్లాడు. అంతా గాఢాంధకారం. పెను తుపాను. ఎటు వెళ్లిపోయాడో! ఏమైపోయాడో... ఇంటి యజమాని శాంతించి, తనకు ఆహారం సమకూర్చినందుకు దేవునికి కృతజ్ఞత తెలియజేసుకొన్నాడు. కడుపునిండా తిన్నాడు. హాయిగా నిద్రించాడు. అర్ధరాత్రి సమయం. ఎవరో నిద్ర లేపినట్లు మేల్కొన్నాడు. దివ్యకాంతి పుంజం గోచరించింది- 'ఆకలితో నీ ఇంటికి వచ్చిన పండుటాకును కాస్తంతైనా కరుణచూపక వెళ్లగొట్టావు. అతని అంతర్వేదనల భీతిని గ్రహించలేని, నీ ఆలోచనా విధానం నాకెంతమాత్రం నచ్చలేదు. ధర్మం విలపించేలా ప్రవర్తించావు'- దేవదూత ద్వారా దేవుని మాటలు వినిపించాయి.

'ప్రభూ! అతడు నిన్ను విశ్వసించేవాడు కాడు. అతనికెలా ఆహారం పెట్టగలను?'- అన్నాడు ఇంటి యజమాని.

'ఏదీ నీది కాదు. సర్వమూ నాదే. నీ ఆధిపత్యం అనవసరం. డెబ్భైఐదేళ్లుగా నేను వృద్ధుణ్ని పోషిస్తున్నాను. ఒక్కపూట అన్నం పెట్టలేకపోయావు నువ్వు. హృదయమాలిన్యం తొలగించలేని నీ మతానుష్ఠానమెందుకు? ప్రార్థనలెందుకు?- దైవ వాక్కులు మళ్లీ దేవదూత వినిపించాడు.

ఇంటి యజమాని స్తంభించిపోయాడు. తేరుకొని తప్పు గ్రహించాడు. పశ్చాత్తాపంతో వలవలా విలపించాడు.

ఈ కథ కల్పితమా, వాస్తవమా? ప్రశ్నలు ప్రధానం కాదు. దుఃఖభూయిష్ఠమైన వదనాల వెనుక ఎంత విషాదం పొంచి ఉందో గమనించగలవాడే నిజమైన భక్తుడు. కష్టాల్లో సాటి మనిషికి సహాయం అందించని నరునికి దైవత్వం దూరంగా ఉంటుంది- అనే ఉత్కృష్టమైన సందేశం లోకం గమనించగలుగుతుంది.
(ఈనాడు, అంతర్యామి, ౧౧:౦౬:౨౦౧౦)
____________________________

Labels:

త్యాగయాగం

- చిమ్మపూడి శ్రీరామమూర్తి
ఈ లోకంలో త్యాగభావంకన్నా మహత్తరమైన గుణం మరొకటి లేదు. ఈ మానవజాతి జన్మసార్థకతకు మూలం 'త్యాగం'. త్యాగం ప్రేమవల్ల పుడుతుంది. ప్రేమ స్నేహంవల్ల పుడుతుంది. స్నేహం విశ్వాసంనుంచి ఆవిర్భవిస్తుంది. విశ్వాసం అవగాహన నుంచి జనిస్తుంది. అవగాహనకు మూలం ఆధ్యాత్మిక పరిజ్ఞానం. కనుక ఆధ్యాత్మికతకు త్యాగానికీ అవినాభావ సంబంధం ఉంది.

మానవుడు సహజంగా సుఖం కోరుకుంటాడు. ఎంతో శ్రమిస్తాడు. సంపద పోగుచేస్తాడు. ఆ సంపదలో కొంతభాగాన్నైనా దానరూపంలో త్యాగం చేయాలి. ఈ దానం త్యాగంలోని ఒక భాగం. ఏ సంపదనైనా త్యాగభావంతో అనుభవించాలని వేదం చెబుతోంది. మన సంపద ఏ రూపంలో ఉన్నా అందులోని కొంతభాగాన్ని తప్పకుండా ఇతరుల శ్రేయంకోసం వినియోగించాలి. ధనం, ధాన్యం, భూమి, జలం యిలాంటివేవైనా మనం శ్రమించి కూడబెట్టుకుంటే అర్హులయినవారికి వీటిలోని ఎంతో కొంత భాగాన్ని వితరణ చేసి ఉదారవంతులం కావాలి.

జీవించినంతకాలం లోకహితకర్మలే ఆచరించాలి. ఈ లోక హితకర్మలన్నింటిలో త్యాగలక్షణం ప్రథమశ్రేణికి చెందినది. స్వార్థమున్నచోట త్యాగానికి తావే ఉండదు. మానవుడు తనలోని స్వార్థబుద్ధిని క్రమక్రమంగా దూరం చేసేకొద్దీ త్యాగబుద్ధికి హృదయంలో చోటు దక్కుతుంది. 'కర్మలను త్యజించడం సన్యాసం కాదు, కర్మఫలాలను త్యజించడం సన్యాసమనిపించుకుంటుంది' అని గీతావాక్యం. ఒంటరిగా తినటంకన్నా నలుగురితో కలిసి భోజనం చేస్తే కలిగే సంతృప్తి అనిర్వచనీయమైనది. మనకేది లభించినా అది భగవత్ప్రసాదం. దాన్ని వితరణ చేయాలి.

ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే పరోపకారం త్యాగమే అవుతుంది. ప్రకృతిలోని ప్రతి వస్తువూ సజీవమైనా, నిర్జీవమైనా- మననుంచి ఏమీ ఆశించకుండానే... ఎంతటి మహోత్కృష్ట ఫలితాలు, సౌఖ్యాలు ప్రసాదిస్తున్నాయో చూడండి. మేఘం, చెట్టు, గాలి, నీరు, గగనం, నేల... ఏదైనా ప్రాణికోటిని సేవిస్తోందేతప్ప బదులుగా ఏదీ తీసుకోవడంలేదు. ఇంతకన్న మించిన త్యాగం ఏముంటుంది? అదే నేర్చుకోవాలి మనం. అందుకే 'ప్రకృతి మానవుడి మొదటిబడి' అంటారు విజ్ఞులు.

మనదేశం అనాదిగా త్యాగానికి సాకారంగా పరిఢవిల్లుతోంది. మన ఆర్షవాఞ్మయమే అందుకు సాక్షి. తన శరణుకోరిన పావురాన్ని కాపాడటంకోసం శిబిచక్రవర్తి డేగకు తన తొడకోసి మాంసాన్నిచ్చి దాని ఆకలి తీర్చాడు. బ్రాహ్మణవేషంలో వచ్చిన ఇంద్రుడు కోరగానే పుట్టుకతోనే దేహంతో వచ్చిన సహజ కవచకుండలాలను త్యాగం చేశాడు కర్ణుడు. రాక్షస సంహారం కోసం ఇంద్రుడు కోరగానే తన వెన్నెముకను ఆయుధంగా ఇచ్చేశాడు దధీచి మహర్షి. రంతిదేవుడు అడవుల్లో తన ఆలుబిడ్డలతో తిరుగుతుంటే- చాలా రోజులకు దొరికిన అన్నం ఒక భిక్షుడికిచ్చివేసి ముంతలోని నీటితో దాహం తీర్చుకొనేందుకు సిద్ధమవుతాడు. అంతలో మరో యాచకుడు దాహార్తితో యాచించగానే ఆ నీరు అతనికి ఇచ్చేస్తాడు. సత్యంకోసం హరిశ్చంద్రుడు రాజ్యాన్నే త్యాగం చేస్తాడు. శ్రీరాముడు తండ్రి మాటను నిలబెట్టేందుకు అరణ్యవాసం చేసి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ధర్మరాజు, నలుడు, బలిచక్రవర్తి ఇలా ఎందరో ఎన్నో త్యాగాలు చేశారు. అహింసామూర్తి బాపూజీ భారత స్వాతంత్య్రం కోసం తన జీవితమంతా త్యాగం చేశాడు. అల్లూరి, ఆంధ్రకేసరి, తిలక్‌, గోఖలే, భగత్‌సింగ్‌ల త్యాగనిరతిని జాతి మరువగలదా?

నూరు మందిలో ఒకడు శూరుడై ఉంటాడు. వెయ్యిమందిలో ఒకడు పండితుడై ఉంటాడు. పదివేల మందిలో ఒకడు వక్తయి ఉంటాడు. లక్షల్లోనైనా ఒకడు దాత అయి ఉండటం అరుదు. దాత అంటే త్యాగశీలి అయినవాడు. త్యాగానికి రెండు పంక్తుల్లో ఎంతటి మహత్తరమైన అర్థం చెప్పాడు గురజాడ! 'సొంతలాభం కొంత మానుక పొరుగువారికి తోడు పడవోయ్‌!' అన్నారాయన. త్యాగంవల్ల మానవుడిలో తృప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పరమపురుషార్థం వైపు తీసుకువెళ్లేదే త్యాగం. యజ్ఞప్రక్రియను త్యాగానికి ప్రతీకగా అభివర్ణించారు సనాతనులు. అందుకే త్యాగమొక యాగం. 'కొట్టితినకు, పెట్టితిను' అనే వేదమే సామాన్యుడికి అవగతమయ్యేలా చెప్పింది. సత్పాత్ర దానంవల్లనే సంపాదన సార్థకమవుతుంది. అధములు 'నాదీ నాదే, నీదీ నాదే' అంటారు. మధ్యములు 'నీది నీదే నాది నాదే' అంటారు. ఉత్తములు 'నీది నీదే, నాదీ నీదే' అంటారు. ఈ ఉత్తమగుణం అలవరచుకుంటే లోకకల్యాణమే! ప్రతిఫలాపేక్షతో చేసే త్యాగం త్యాగమే కాదు. దేశం కోసం, లోకం కోసం చేసే త్యాగానికెవరూ విలువకట్టలేరు. త్యాగంవల్ల కలిగే ఆనందానికీ తృప్తికీ అవధులే లేవు, హద్దులే లేవు. మేరుపర్వతమంత ధనం సంపాదించాలనీ, త్యాగం చేసేటప్పుడు దాన్ని గడ్డిపరకలా భావించాలనీ శాస్త్రోక్తి. ఇదే మన జీవన పరమార్థం.
(eenaaDu, aMtaryaami, 10:06:2010)
_____________________________

Labels: ,

ARAB JOKES

1

Arab student sends an e-mail to his Dad saying:

Dear Dad:
Berlin is wonderful, people are nice and I really like it here; but Dad, I am bit ashamed to arrive to my college with my Gold Mercedes, when all my Teachers travel by train.

Your Son,
Nasser
.


Sometime later Nasser gets reply to his e-mail from his Dad:

Loving son:

Twenty Million Dollars transferred to your account, please stop
embarrassing us; go and get yourself a train too.

Your Dad

________________

2

An Arab trader met the Director overseas operations. In the course of their conversation the Director inquired about the purpose of his visit.

The sheik told him, “I want a Coca -cola.”

The smart attendant immediately opened a bottle of Coca-cola and handed over to the Sheik on a golden platter. The sheik was bewildered.


Immediately the Director overseas operations, became furious, stood up and slapped the attendant and told him, “When a sheik asks for Coca-Cola, he means Coca-Cola Plant to be installed in his country. Know the business secrets and be careful.

(An email forward)
_______________________

Labels: