మోక్ష ద్వారపాలురు
ముక్తిపై అత్యంత ఆసక్తి, ఆపేక్ష కలవారిని ముముక్షువులంటారు. మోక్షప్రవేశమే వీరి జీవితాశయం.
మోక్షప్రవేశ ద్వారం వద్ద నలుగురు ద్వారపాలురు కావలి కాస్తూ ఉంటారు. ఈ ద్వారపాలురు అర్హులను మాత్రమే లోనికి అనుమతిస్తారు.
ఎవరా నలుగురు?
శమం, విచారణ, సంతుష్టి, సాధుసాంగత్యం అనేవారే ఆ ద్వారపాలురని మహోపనిషత్తూ (4-2), వాసిష్ఠ రామాయణమూ ముక్తకంఠంతో ప్రకటించాయి. వీరిలో ఏ ఒక్కరిని లోబరచుకొన్నా, మిగతా ముగ్గురూ విచిత్రంగా వశమవుతారట! అంటే ముముక్షువులు ఆ సుగుణాల్లో ఏ ఒక్కటైనా అలవరచుకొంటే, మోక్ష ద్వారాలు తెరచుకోవడం తథ్యమని భావం.
[1]మొదటి సుగుణం శమం. మనోనిగ్రహమే శమం. శమదమాదులు మోక్షహేతువులుగా వివేక చూడామణి (71) ప్రకటించింది. ఆలోచనలు, కోరికలు, సంకల్పాల సముదాయమే మనస్సు. భావాలు నిరంతరం మారిపోతుంటాయి కనుక మనస్సు అస్థిరంగా, చంచలంగా తిరుగుతూ ఉంటుంది. ఇంద్రియాలతో కలిసి మనసు విషయ సుఖాలవెంట పరిభ్రమిస్తుంది. ఫలితంగా మనసు నిగ్రహాన్ని కోల్పోతుంది. దీన్ని అరికట్టడానికే విషయాల్లోని దోషాలను మనసుకు వివరించి ఆంతరంగిక ప్రశాంతతలో అచలంగా నిలపాలి. గాలిని గుప్పెట్లో పట్టుకోవడం ఎంత కష్టమో, మనస్సును నిగ్రహించడం అంత కష్టం! అయినా అభ్యాస, వైరాగ్యాలచేత మనస్సును నిగ్రహించాలన్నది గీతాచార్యుడి ఉపాయం. శమం అనే కవచంగల మనిషి సుఖాన్ని, శాంతిని పొందగలడని వసిష్ఠుని బోధ.
[2]రెండోది విచారణ. 'నేను ఎవరిని? ఈ జగత్తు ఎక్కడ నుంచి వచ్చింది? నాలోని అవిద్యను ఎలా నశింపజేయాలి?' మొదలైన అంశాలను మహాత్ముల సన్నిధిలో పరిశీలించాలి. వేదాంత మహావాక్యాలను (తత్వమసి మొదలైనవి) విచారిస్తే- సంసార దుఃఖాన్ని తొలగించే అపరోక్షజ్ఞానం కలుగుతుందని వివేకచూడామణి (47) చెబుతోంది. ఈ జ్ఞానమే శాంతిని ప్రసాదిస్తుంది.
[3]మూడోది సంతుష్టి. సంతోషం లేదా సంతృప్తి. ఇదే నిజమైన ధనమని శాస్త్రాలు చెబుతున్నాయి. ధర్మబద్ధ సంపాదనతో లేదా భగవంతుడు ప్రసాదించినదానితో మనసును సదా ఆనందంగా ఉంచుకోవాలని భజగోవిందం (2) ప్రబోధిస్తోంది. భిక్షచే లభించిన ఆహారంతో సంతృప్తి చెందేవారే భాగ్యవంతులని (భిక్షాన్నమాత్రేణ చ తుష్టిమన్తః... ఖలు భాగ్యవన్తః) శంకరులు కౌపీన పంచకంలో తెలిపారు. తృప్తికి మించిన సుఖం లేదని యోగశిఖోపనిషత్తు (2-20) ప్రవచించింది. ప్రాప్తించినదానితో తృప్తిగా జీవించేవారి దుఃఖాలన్నీ నశిస్తాయి, శాంతి దక్కుతుంది.
[4]నాలుగోది సత్సంగం. సత్సాంగత్యంవల్ల అజ్ఞానం నశించి, వివేకాదులు జనిస్తాయి. ముల్లోకాల్లో భవసాగరాన్ని దాటించగల ఏకైక నౌక సత్సంగం మాత్రమే (త్రిజగతి సజ్జన సంగతిరేకా భవతి భవార్ణవ నౌకా) అని శంకరులు తెలిపారు. సత్సంగత్వం జీవన్ముక్తికి ఎలా దారితీస్తుందో కూడా భజగోవిందం (9) తెలిపింది. సత్సంగం భగవంతుణ్ని సులువుగా ప్రసన్నం చేసినట్లుగా యోగం, సాంఖ్యం, తపస్సు మొదలైన అన్య సాధనలేవీ వశం చేయలేవని భాగవతం (11-12-1, 2) స్పష్టపరచింది. విభీషణుడు, హనుమంతుడు, ప్రహ్లాదుడు, కుబ్జ, వ్రజగోపికలు మొదలైనవారెందరో సత్సంగ ప్రభావంచేత పరమపదాన్ని పొందినట్లుగా కృష్ణుడు ఉద్ధవుడితో చెబుతాడు.
కాబట్టి మానవులు పైవాటిలో ఏ ఒక్క సుగుణం అలవరచుకున్నా, మోక్షమార్గం సుగమమవుతుంది.
- దువ్వూరి ప్రసాదరావు
(Eenadu, 27:06:2007)
_____________________________
Labels: Religion, Religion/telugu