ఎగనామాలకు విరుగుడు
ఒకప్పుడు ఆడపిల్లలకు పెద్ద చదువులు అక్కరలేదనీ, కాస్త అక్షరజ్ఞానం ఉంటే చాలనీ భావించేవారు. కాలంతోపాటు అభిప్రాయాలూ మారిపోయాయి. మగపిల్లలైనా ఆడపిల్లలైనా అందరికీ విద్య అవసరమే అన్న అవగాహన అందరికీ కలిగింది. అందుకే తల్లిదండ్రులు పిల్లలందరికీ మంచి చదువులు చెప్పించాలనే ప్రయత్నిస్తున్నారు. ''విద్య అనేది సముద్రం లాంటిది... తరిచినకొద్దీ లోతులు స్ఫురిస్తుంటాయి... అంతు మాత్రం దొరకదు'' అన్నారు రాహుల్ సాంకృత్యాయన్. మిగతా హంగులెన్ని ఉన్నా, ఎంత సంపద ఉన్నా- విద్య లేకపోతే అవేమీ రాణించవు. ''విద్య లేనట్టి విభవమ్ము రోత...'' అన్నారు. (చదువుకున్నవారికి లభించేటంత గౌరవం సమాజంలో మిగతావారికి లభించదు. ఎంత చదువుకున్నా ఎన్ని విద్యలు నేర్చినా వినయ వివేకాలు తోడుంటేనే ఏ విద్య అయినా రాణిస్తుంది. ''విద్యయొసగును వినయంబు వినయమునను బడయు పాత్రత, పాత్రత వలన ధనము...'' అంటూ ప్రారంభించిన కవి- ''ధనమువలనను ధర్మంబు దానివలన నైహికాముష్మిక సుఖములందు నరుడు...'' అంటూ పద్యాన్ని ముగించారు. సరైన చదువువలన ఇన్ని లాభాలున్నాయని ఇటువంటి హితోక్తుల వల్ల అర్థమవుతుంది. ఆరోజే అబ్బాయిని స్కూల్లో చేర్పించారు. సాయంకాలానికి స్కూలునుంచి ఇంటికొచ్చిన కొడుకును- ''ఎలా ఉంది బుజ్జీ స్కూలు? టీచరు పాఠాలు బాగా చెబుతోందా?'' అని అడిగింది తల్లి. ''ఏం బాగో... వరస చూస్తే రేపు కూడా స్కూలుకు వెళ్ళాల్సి వచ్చేట్లే ఉంది...'' అన్నాడు సుపుత్రుడు గంభీరంగా.
''స్కూల్లో చదవటం నేర్పేమాట నిజమేకాని ఏ పుస్తకం చదవాలో ఏ పుస్తకం చదవకూడదో మాత్రం నేర్పరు...'' అంటూ విద్యా విధానంపై చిన్నచురక వేశారో రచయిత. వెనకటి చదువులకు, ఆ పద్ధతులకు నేటి విద్యకు ఇప్పటి విధానానికి చాలా తేడా ఉంది. ''వేదమూ, శ్రౌతమూ, స్మార్తమూ, జ్యోతిశ్శాస్త్రమూ, మంత్రశాస్త్రమూ, వీటి సమ్యగ్బోధకు సాహిత్య విద్యా- మా కుల విద్యలివి'' అని రాశారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తన ''అనుభవాలూ జ్ఞాపకాలూను'' పుస్తకంలో. ఇంగ్లిష్ చదువుల ప్రాభవం పెరిగాక పూర్వ విద్యలన్నీ పక్కకు తప్పుకొన్నాయి. ''నాతో మాట్లాడ్డవే ఒక ఎడ్యుకేషన్...'' అని డాంబికాలు పలికే గిరీశం- ''తెల్లవాళ్ళ స్కూళ్ళల్లో మన చదువులంటే ఖాతరీ లేదండీ... ఎంతసేపూ జాగర్ఫీ, గీగర్ఫీ, అర్ధిమెటిక్, ఆల్జీబ్రా, మాథమాటిక్స్- యివన్నీ హడలేసి చెప్తారండీ...'' అని కోతలు కోస్తాడు. గీగర్ఫీ అంటే జాగర్ఫీకి అన్నగారు కాబోలు అనుకొని అమాయకులు తెల్లమొహాలు పెడతారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటే ఇదే. ఆ చెప్పేవాడు గిరీశంలాంటి అతి తెలివితేటలు కలవాడైతే ఇహ చెప్పనే అక్కరలేదు. గిరీశంలాంటి పంతుళ్ళు ఉంటే పిల్లలకు వినోద కాలక్షేపాలకు కొదవ ఉండదుకాని అటువంటి పంతుళ్ళుకాక చదువే పరమార్థంగా చెప్పే ఉపాధ్యాయులే ఎక్కువగా ఉండటంతో పిల్లలు స్కూలుకు వెళ్ళాలంటే ఇష్టపడక బద్దకిస్తుంటారు. ఈ పద్ధతికి స్వస్తి చెప్పించి పిల్లలు స్కూలుకు రోజూ క్రమం తప్పకుండా వచ్చేటట్లు చేయటానికో కొత్త పద్ధతి కనిపెట్టారు మధ్యప్రదేశ్‌లో.
తలనొప్పి కడుపునొప్పి కళ్ళమంటలు అంటూ రకరకాల కారణాలు వల్లెవేసి స్కూళ్ళకు ఎగనామం పెట్టే పిల్లల ఆటలు మధ్యప్రదేశ్‌లో ఇక సాగవు. నెలకోసారి పిల్లల ఇళ్ళకు వెళ్ళి వారి చదువు సంధ్యల గురించి, ప్రవర్తన గురించి తల్లిదండ్రులతో చర్చించి రావాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ ఉపాధ్యాయులందర్నీ ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లో విద్యాప్రమాణాల స్థాయి నానాటికీ దిగజారుతోందని నిరక్షరాస్యతా ఎక్కువగానే ఉందని విమర్శలు చెలరేగుతుండటంతో విద్యాశాఖవారీ కొత్త పద్ధతి తలపెట్టారు. ''టీచర్లందరూ నెలకోసారి తమ క్లాసులోని విద్యార్థుల ఇళ్ళకు వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడతారు... విద్యార్థులు చదువుపట్ల చూపుతున్న శ్రద్ధను, పరీక్షల్లో తెచ్చుకుంటున్న మార్కులను గురించి చర్చిస్తారు... స్కూల్లో వారికి ఎదురవుతున్న ఇబ్బందులనూ తెలుసుకొని వాటి నివారణకు తగు చర్యలు తీసుకుంటారు. దీని వల్ల పిల్లలు చదువులో మరింత శ్రద్ధ వహించి మంచి మార్కులు తెచ్చుకోవటానికి వీలుపడుతుంది'' అని చెబుతున్నారు అక్కడి విద్యాశాఖ అధికారి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్కూళ్ళన్నిటిలో ఈ విధానాన్ని అమలుపరుస్తారు. ఆ రాష్ట్రంలో విద్యాప్రమాణాలను మెరుగుపరచాలనే ప్రయత్నాలు రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభమయ్యాయి. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంటికే నేరుగా వెళ్ళి పరామర్శించే పద్ధతి ప్రవేశపెట్టారు. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే మధ్యప్రదేశ్‌లో అక్షరాస్యుల సంఖ్య తక్కువ. జాతీయ స్థాయిలో అక్షరాస్యత 64.8శాతమైతే, మధ్యప్రదేశ్‌లో 63.7శాతం మాత్రమే. తల్లిదండ్రులూ పిల్లలూ చదువుపట్ల శ్రద్ధ చూపి అక్షరాస్యతను పెంచేందుకు అయ్యవార్లు ఇంటింటికీ తిరిగి ఆరా తీసే పద్ధతి ఉపయోగపడగలదని అధికారులు ఆశపడుతున్నారు!
(http://www.eenadu.net/archives/archive-27-8-2006/homelink.asp?qry=Editorial)
-----------------------------------------------------------------------------
Labels: Life/telugu