My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, August 15, 2007

ఆరుపదుల జ్ఞాపకాలు...

'సంకెళ్లకు తలవంచి, బానిసలా యాచించి అందుకునే జీవితం అంత విలువైనదా? అహింస అంత మధురమైనదా? అదే నిజమైతే, భగవంతుడా, ఆ జీవితం నాకు అవసరమే లేదు. నాకు స్వేచ్ఛకావాలి లేదా చావు కావాలి'... ఉరిశిక్షకు ముందు విప్లవవీరుడు భగత్‌సింగ్‌ తన డైరీలో రాసుకున్న ప్యాట్రిక్‌ హెన్రీ వాక్యం. తనను ఉరికంబాన్నుంచి తప్పించాలని ఆరాటపడుతున్న కన్నతండ్రికి ఉటంకించిన స్వరాజ్య మంత్రం. అరవై ఏళ్లు పైబడిన వాళ్లను మినహాయిస్తే మనమెవ్వరమూ పరాధీన భారతంలో అస్వతంత్ర జీవితాన్ని అనుభవించలేదు. ఎంత అదృష్టవంతులం! ఆ స్వేచ్ఛను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? కొన్ని రంగాల్లో అద్వితీయంగా పురోగమిస్తూ కొన్ని సందర్భాల్లో మనుషులుగా తిరోగమిస్తున్న విచిత్ర పరిస్థితి. ఈ షష్టిపూర్తి వత్సరంలో భారతావని పరిణామాలను అవలోకనం చేసుకుంటే...

1947: దేశ విభజన
స్వాతంత్య్రం ఓ ఉదయాన్నీ ఓ చికటినీ వోసుకొచ్చింది. అఖండ భారతావని భారత్‌, పాకిస్థాన్‌గా విడిపోయిన చేదు ఘట్టంలో 7 నుంచి 20 లక్షల మంది హతమయ్యారు, లక్షమంది స్త్రీలు అత్యాచారానికి గురయ్యారు. ఇళ్లు, ఆస్తులను వదిలి వలస పోవడం వల్ల సుమారు కోటిమంది నిరాశ్రయులయ్యారు.

1947: కాశ్మీర్‌ విలీనం
పాకిస్థాన్‌ ప్రోద్బలంతో తమపైకి ఆటవికమూకలు దండెత్తిన నేపథ్యంలో అక్టోబర్‌ 27న కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌, గవర్నర్‌ జనరల్‌ మౌంట్‌బాటన్‌ భారత్‌లో కాశ్మీర్‌ విలీన ఒప్పందంపై సంతకాలు చేశారు. ద్విజాతి సిద్ధాంతం ప్రకారం ముస్లింలు అధికంగా ఉన్న కాశ్మీర్‌ తమదేనని పాక్‌ వాదిస్తోంది. ఇది నాలుగు యుద్ధాలకు దారి తీసింది.

1948: గాంధీజీ అస్తమయం
ప్రపంచానికి అహింసా పాఠాన్ని బోధించిన మహాత్ముడు జనవరి 30వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నేలకొరిగాడు. తన చర్య ఎలా హేతుబద్ధమైందో, ఎందుకు కాల్చాల్సి వచ్చిందో నాథూరామ్‌ వినాయక్‌ గాడ్సే కోర్టులో ఎంతగా సమర్థించుకున్నా భారతీయులెవరూ జీర్ణించుకోలేని దారుణం అది.

1948: హైదరాబాద్‌ వివోచన
నేటి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్న హైదరాబాద్‌ సంస్థానం సెప్టెంబరు 17న భారత్‌లో అంతర్భాగమైంది. కోటిన్నర జనాభాకు రాజు, అత్యంత ధనవంతుడు నిజాం ఐదురోజుల సైనికచర్య తర్వాత తలొగ్గాడు. ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణా సాయుధ పోరాటం దీనికి పూర్వరంగం.

1949: రాజ్యాంగ సమర్పణ
సుమారు మూడేళ్ల మేధోమథనంతో ఆవిర్భవించిన రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సమర్పించారు. ప్రపంచంలోనే సుదీర్ఘ లిఖిత రాజ్యాంగమైన దీన్లో 1,17,369 పదాలున్నాయి(ఆంగ్లంలో). ఇది నవంబరు 26న ఆవోదం పొందింది.

1950: జాతీయగీతం
రవీంద్రనాథ్‌ టాగూర్‌ రాసి, స్వరపరిచిన 'జనగణమన' జనవరి 24న జాతీయగీతంగా ఆవోదం పొందింది. తర్వాత రెండు రోజులకు సారనాథ్‌లోని అశోకుడి నాలుగు సింహాలను జాతీయచిహ్నంగా స్వీకరించాం.

1950: గణతంత్ర రాజ్యం
రాజ్యాంగం జనవరి 26న అమల్లోకి వచ్చింది. అదే రోజు భారత్‌ సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది.

1951: పంచవర్ష ప్రణాళికలు
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధించే లక్ష్యంతో తొలి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది. ప్రస్తుతం పదో ప్రణాళిక ముగుస్తున్నా మన ఆశయాలు నెరవేరలేదు. వైఫల్యాలే పాఠ్యాంశాలుగా చదువుతున్నాం.

1952: తొలి సాధారణ ఎన్నికలు
నభై ఐదు శాతం నిరక్షరాస్యులున్న భారతదేశం తొలి సాధారణ ఎన్నికలకు సిద్ధపడింది. 1951 అక్టోబరులో ప్రారంభమై 1952 ఫిబ్రవరిలో ముగిసిన ఈ ఎన్నికల్లో 14 జాతీయపార్టీలతో సహా 74 పార్టీలు 4,500 స్థానాలకు పోటీచేశాయి.

1952: కుటుంబ నియంత్రణ
నాభా 37 కోట్లను చేరుతున్న దశలో 'కుటుంబ నియంత్రణ' ప్రారంభమైంది. ప్రపంచంలోనే ఈ తరహా కార్యక్రమం వెుదటిది. తిరగేసిన ఎర్ర త్రికోణం గుర్తు బాగా ప్రాచుర్యం పొందింది.

1952: శ్రీరాములు త్యాగం
ఆంధ్రరాష్ట్రావతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు 58 రోజుల తర్వాత డిసెంబరు 16న మరణించారు. మరుసటి ఏడాది అక్టోబరు 1న ప్రకాశంపంతులు ముఖ్యమంత్రిగా, కర్నూలు రాజధానిగా మద్రాసు నుంచి విడిపోయి, ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.

1954: భారతరత్న
దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ప్రారంభమైంది. తొలుత అందుకున్నవారు సర్వేపల్లి రాధాకృష్ణన్‌, రాజగోపాలాచారి, సీవీ రామన్‌.

1955: ఆధునిక దేవాలయం
డిసెంబరు 10న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తూ 'ఆధునిక దేవాలయం' అని అభివర్ణించారు ప్రధాని నెహ్రూ. ప్రపంచంలోనే పొడవైన ఈ ఆనకట్ట పదమూడేళ్లకు నిర్మాణం పూర్తిచేసుకుని 1967 ఆగస్టు 4న ప్రారంభమైంది.

1956: భాషాప్రయుక్త రాష్ట్రాలు
భాషల ప్రాతిపదికన జరిగిన పునర్వ్యవస్థీకరణలో నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలు అవతరించాయి. కుల, మతాలకంటే భాష ప్రజలను ఐక్యంగా ఉంచుతుందని నిరూపించిన ఈ విధానం మన్ననలందుకుంది.

1959: దూరదర్శన్‌
టీవీ ప్రవేశం. వారానికి రెండు రోజులు, గంట చొప్పున సాయంత్రాలు కార్యక్రమాలు ప్రసారమైనాయి.

1961: గోవా విముక్తి
అందరికంటే ముందు దేశంలో ప్రవేశించిన పోర్చుగీసువారు 450 ఏళ్ల తర్వాత భారత్‌(గోవా) విడిచిపెట్టి వెళ్లారు. శాంతిచర్చలతో ఫలితం లేకపోవడంతో యుద్ధానికి దిగిన మన సైన్యానికి పోర్చుగీసు సేనలు లొంగిపోయాయి. అదే రాత్రి డయ్యూ, డామన్‌ మన వశమైనాయి.

1962: చైనాతో యుద్ధం
'హిందీ-చినీ భాయ్‌ భాయ్‌' అనుకున్న భావావేశాన్నీ పంచశీల సూత్రాలనూ అపహాస్యం చేస్తూ చైనా మన సరిహద్దుల్లోకి చొరబడేందుకు తెగించింది. నెహ్రూను తీవ్రంగా చలింపజేసిన ఆ ఓటమి మన రక్షణబడ్జెట్‌ పెరగడానికీ ఆయుధశక్తి పెంచుకునేందుకూ కారణమైంది.

1966: క్షీరవిప్లవం
'ఆపరేషన్‌ ఫ్లడ్‌'కు బీజం. గుజరాత్‌లో ఆరంభమైన 'అమూల్‌' విజయం 23 రాష్ట్రాల్లో తొంభై వేల గ్రామాల్లో సహకార సంఘాలు ఏర్పడేందుకు బలమిచ్చింది. అత్యధిక పాలను ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారత్‌ నిలబడింది.

1967: హరితవిప్లవం
తిండికోసం ఆహారధాన్యాలను దిగుమతి చేసుకున్న గడ్డుకాలంలో హరితవిప్లవానికి శ్రీకారం. మేలుజాతి వంగడాలు, రెండు పంటలు, సులభ రుణాలు... దిగుబడులను ఇబ్బడిముబ్బడిగా పెంచాయి. దశాబ్దంలో దేశాన్ని స్వయంసమృద్ధి గావించాయి.
1967: నక్సల్‌బరీ
శ్చిమబెంగాల్‌లోని నక్సల్‌బరీ గ్రామంలో పుట్టిన నక్సలైట్‌ ఉద్యమం 'ఇంతింతై..', శాఖోపశాఖలుగా దేశవ్యాప్తంగా విస్తరించింది.

1969: బ్యాంకుల జాతీయీకరణ
సామాన్యులకు రుణాలు అందించే లక్ష్యంతో యాభై కోట్ల రూపాయల డిపాజిట్లుగల 14 బ్యాంకులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, జాతీయం చేసింది.

1971: మట్టికరిచిన పాక్‌
బంగ్లాదేశ్‌ విముక్తికోసం పాకిస్థాన్‌తో జరిపిన యుద్ధంలో అపూర్వమైన విజయం లభించింది. బందీలుగా చిక్కిన 91,401 మంది పాక్‌ సైన్యాన్ని సిమ్లా ఒప్పందం ప్రకారం విడిచిపెట్టాం. కాశ్మీర్‌ సమస్యను పరిష్కరించుకోవడంలో మాత్రం విఫలమైనాం.

1972: రాజభరణాల రద్దు
ఉపప్రధాని వల్లభాయ్‌పటేల్‌ చొరవతో విలీనమైన 565 సంస్థానాలను రద్దు చేసినప్పుడు, ఆయా పాలకులకు ఇచ్చిన ప్రత్యేకమైన గుర్తింపునూ వారి రాజ్యాల ఆదాయాల నిష్పత్తికి అనుగుణంగా చెల్లిస్తూ వచ్చిన రాజభరణాలనూ జనవరి నుంచి నిలిపేశారు. 26వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధాని ఇందిర ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.

1974: పోఖ్రాన్‌ అణుపరీక్ష
రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఎడారి ప్రాంతంలో మే 18న జరిపిన మహావిస్ఫోటనం భారత్‌ను అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాల సరసన నిలబెట్టింది. తిరిగి రెండు దశాబ్దాల అనంతరం 1998 మేలో జరిపిన ఇదే ప్రయోగంతో అణ్వాయుధాలు కలిగిన దేశంగా సత్తా చాటుకున్నాం.

1975: చికటి అధ్యాయం
అంతర్గత కల్లోలాలు ప్రజాస్వామ్యానికే ముప్పు కలిగించేట్టున్నాయన్న సాకుతో ప్రధాని ఇందిరాగాంధీ సలహా మేరకు రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ జూన్‌ 25న విధించిన అత్యవసర పరిస్థితి రెండేళ్లపాటు కొనసాగింది. జయప్రకాశ్‌ నారాయణ్‌తో సహా ఎందరో నాయకులు జైళ్లపాలయ్యారు.

1977: జనతా సర్కార్‌
వెురార్జీదేశాయ్‌ ప్రధానిగా కేంద్రంలో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. సంకీర్ణాలకు నాందీ కూడా అదే. అదే ఏడాది అక్టోబరు 4న విదేశాంగ మంత్రిగా అటల్‌బిహారీ వాజ్‌పేయి ఐక్యరాజ్యసమితి సాధారణసభలో మన జాతీయభాష హిందీలో ప్రసంగించారు.

1980: ప్రయోగం సక్సెస్‌
జులై 18 శాస్త్రీయవిజ్ఞాన పరంగా గుర్తుంచుకోదగ్గది. ఉపగ్రహ వాహక నౌక ఎస్‌ఎల్‌వి-3 ముప్ఫై కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 300కి.మీ. దూరం అంతరిక్షంలోకి వోసుకెళ్లింది. ఇప్పుడు 200 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 36000 కిలోమీటర్ల దూరాన ప్రవేశపెట్టే సామర్థ్యం సాధించాం.

1982: రంగులబొమ్మ
దేశమంతటికీ కలర్‌ టీవీ విస్తరించింది. అప్పట్నుంచి సామాన్యజనానికి కాలక్షేపం అదే. పూర్తిస్థాయిలో రంగుల్లో ప్రసారమైనవి ఆ యేటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.

1982: ఎన్టీఆర్‌ ప్రభంజనం
మార్చి 21న తెలుగునాట ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ మరుసటి ఏడాది జనవరి 9న అధికారంలోకి వచ్చింది. నటుడిగా ఎన్టీఆర్‌కున్న అమితమైన జనాదరణవల్లే తొమ్మిది నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగారు.

1983: క్రికెట్‌ ప్రపంచకప్‌
పిల్‌ నాయకత్వంలోని భారత క్రికెట్‌ జట్టు వెస్టిండీస్‌ను ఓడించి, ప్రపంచకప్‌ కైవసం చేసుకుంది. క్రికెట్‌ 'పిచ్చి'ని వీధివీధికీ పాకించిన మహత్తర విజయమది. ముందే టీవీ, అందులో క్రికెట్‌...

1984: ఆపరేషన్‌ విషాదం
స్వర్ణదేవాలయంలో తిష్ఠవేసిన సిక్కు తీవ్రవాదులను ఏరివేయడానికి తలపెట్టిన 'ఆపరేషన్‌ బ్లూస్టార్‌'(జూన్‌) చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. సైన్యం అప్పటికి విజయం సాధించినా తర్వాత అది ప్రధాని ఇందిరాగాంధీ హత్య(అక్టోబర్‌ 31)కూ తదనంతరం ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో వేలాది అమాయక సిక్కుల ఊచకోతకూ కారణమైంది.

1984: నిర్లక్ష్యానికి పరాకాష్ఠ
డిసెంబరు మూడో తేదీ రాత్రి మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ కర్మాగారం నుంచి వెలువడిన విషవాయువులు రెండువేల మందిని బలిగొన్నాయి. మూడు లక్షల మంది ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. తర్వాత జన్మించిన శిశువుల్లోనూ జన్యుపరమైన ఇబ్బందులు తలెత్తాయి. భద్రతా నిబంధనలను ఆ బహుళజాతి సంస్థ పూర్తిగా గాలికి వదిలేసిందనేది తర్వాత దర్యాప్తులో తేలిన విషయం.

1986: అందరూ వాటాదారులే
నదేశంలో ఈక్విటీ సంస్కృతిని ప్రవేశపెట్టిన ఘనత రిలయన్స్‌ వ్యవస్థాపకుడు ధీరూభాయ్‌ అంబానీకే దక్కుతుంది. కోటీ ఇరవై లక్షలమంది వాటాదారులను ఆయన సమీకరించారు. ఇక ఫిబ్రవరి 11న ఈ విధానం తారస్థాయికి చేరుకుంది. ఆరోజు 110 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లాయి.

1990: రిజర్వేషన్‌ చిచ్చు
ండల్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు, సామాజిక న్యాయం పేరిట మరిన్ని కులాలను రిజర్వేషన్ల పరిధిలోకి తెస్తూ ప్రధాని వి.పి.సింగ్‌ తీసుకున్న నిర్ణయం హింసాత్మక ఘటనలకు దారితీసింది. ప్రతిభకు మన్నన దక్కాలంటూ ఆందోళనలు జరిగాయి.

1990: అయోధ్య రథయాత్ర
యోధ్యలో రామాలయానికి మద్దతు కూడగడుతూ బీజేపీ అధ్యక్షుడు ఎల్‌.కె.అద్వానీ సోమనాథ్‌ నుంచి రథయాత్ర ప్రారంభించి పదివేల కిలోమీటర్లు చుట్టివచ్చారు. ఆ పార్టీని బలోపేతం చేయడానికి ఇది తోడ్పడింది.

1991: రాజీవ్‌ హత్య
శ్రీలంక 'పులులను' నిరోధించడానికి శాంతి పరిరక్షక దళాన్ని పంపిన ప్రధాని రాజీవ్‌గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. మే 21న చెన్నై సమీపాన గల శ్రీపెరంబుదూరులో పేలిన మానవబాంబు రాజీవ్‌తో సహా ఇరవై మందిని బలిగొంది.

1991: ఛానళ్ల దశాబ్దం
భారత్‌లో ప్రవేశించిన తొలి ఉపగ్రహ ఛానల్‌ సీఎన్‌ఎన్‌. తర్వాత నాలుగు ఛానళ్లతో స్టార్‌ టీవీ ప్రవేశించింది. 1992లో జీ ప్రారంభమైంది. 1995లో కేబుల్‌ టీవీ నెట్‌వర్క్స్‌ (నియంత్రణ) చట్టం ఆవోదం పొందింది.

1991: సరళ మంత్రం
ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థికమంత్రి మన్మోహన్‌సింగ్‌ ప్రారంభించిన సంస్కరణలు దేశ ముఖచిత్రాన్ని మార్చేశాయి. కేంద్ర పన్నులు తగ్గాయి. కంపెనీల మీద ప్రభుత్వ గుత్తాధిపత్యం పోయింది. అయితే ఈ విధాన మంచిచెడ్డల మీద భిన్నాభిప్రాయాలున్నాయి.

1992: బాబ్రీ విధ్వంసం
డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు నేలకూల్చారు. పదో తారీఖున ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌లను నిషేధించింది. తర్వాత ముంబయి, గుజరాతుల్లో చెలరేగిన అల్లర్లలో 250 మంది మరణించారు. వెయ్యిమందికిపైగా గాయపడ్డారు.

1994: అందాలపోటీలు
తొలిసారి విశ్వసుందరి కిరీటాన్ని సుస్మితాసేన్‌ దక్కించుకుంది. ప్రపంచసుందరిగా ఐశ్వర్యారాయ్‌ గెలుపొందింది. ఈ ఇరువురి విజయం సౌందర్య సాధనాల వ్యాపారాన్ని అనూహ్యంగా పెంచింది. ఈ పోటీలను మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

1998: సెల్‌ఫోన్‌ విప్లవం
దశకంలోనే టెలికాం రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం అనుమతించింది. 1998లో భారతి టెలీనెట్‌ మధ్యప్రదేశ్‌లో తన సేవలు ప్రారంభించింది. మరుసటి ఏడాది ప్రభుత్వానికీ టెలికాం ఆపరేటర్లకూ ఆదాయ పంపిణీ ఒప్పందం కుదరడంతో సెల్‌ఫోన్‌ ఛార్జీలు తగ్గాయి. సెల్‌ఫోన్ల సంఖ్య పదమూడు కోట్లకు చేరింది. సామాన్యులకు అతి వేగంగా చేరువైన సాంకేతిక పరిజ్ఞానం ఇదేనేవో!

1999: ఆపరేషన్‌ విజయ్‌
వాస్తవాధీన రేఖలోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాక్‌ సైనికులను మన సైన్యం తిప్పికొట్టింది. మూడు నెలలు కొనసాగిన ఈ యుద్ధంలో 413 మంది భారత సైనికులు అమరులైనారు, 584 మంది గాయపడ్డారు.

2000: వందకోట్ల జనాభా
కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా జనవిస్ఫోటనం జరుగుతూనే ఉంది. మే నెలలో మన జనసంఖ్య మ్యాజిక్‌ మార్కు బిలియన్‌కు చేరింది.

2002: గుజరాత్‌ అల్లర్లు
గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు తగలబడడంతో వెుదలైన మతఘర్షణలు గుజరాత్‌ను అట్టుడికించాయి. వందల మంది మాన, ప్రాణాలను హరించాయి.

2004: సునామీ బీభత్సం
డిసెంబరు 26న హిందూమహాసముద్రంలో సంభవించిన భూకంపం పదివేల మంది భారతీయులను పొట్టనపెట్టుకుంది.

2005: సామాన్యుడి అస్త్రం
ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) వేయగలిగే అవకాశం 1986లో వచ్చింది. అంతటి శస్త్రం ఆర్‌టీఐఏ. ప్రభుత్వాన్ని ఏ సమాచారం కోసమైనా నిలదీయగలిగే సమాచారహక్కు చట్టం అక్టోబరు 13 నుంచి అమల్లోకి వచ్చింది.

2007: రాష్ట్రపతిగా మహిళ
రవై ఏళ్ల స్వతంత్ర భారతంలో రాష్ట్రపతి పీఠం మీద ఓ మహిళ కూర్చోగలిగే అవకాశాన్ని ప్రతిభాపాటిల్‌ దక్కించుకున్నారు.

(Eenadu, 12:08:2007)

__________________________

Labels:

Sunday, August 12, 2007

బోనాల సంబరం

జాతరలు, ఉత్సవాలు, వేడుకలు, పర్వాలు... ఇలా పేర్లేవైనా వీటన్నింటి పరమార్థం- సామాజిక ఐక్యత, సామూహికంగా దైవానుగ్రహాన్ని అందుకోవడం. ఆ పరంపరలోదే తెలంగాణ ప్రాంతంలో నిర్వహించుకునే బోనాల సంబరం. ఆషాఢ మాసంలో బోనాల వేడుకలతో తెలంగాణ ప్రాంతమంతా ఎంతో సందడిగా ఉంటుంది. పొలిమేరల్లోని గ్రామ దేవతల్ని శాంతింపజేయడానికి ఆషాఢంలో వారికి బోనాల్ని సమర్పించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. బోనాల పండుగకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. 15వ శతాబ్దంలో భాగ్యనగరంలో ప్రతిఏటా భారీవర్షాల కారణంగా కలరా బారిన పడి ఎక్కువమంది చనిపోతుండేవారు. వైద్య విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో గ్రామ దేవతలకు బోనాలు (ప్రసాదాలు) సమర్పించడంవల్ల రోగాలు నయమవుతాయని ప్రజలు విశ్వసించేవారు. అంటురోగాలు ప్రబలకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని ఊరంతా చల్లుకుంటూ బోనాలతో ఊరేగింపుగా వెళ్లేవారు. అమ్మతల్లికి అభిషేకాలు చేసి, బోనాల్ని నైవేద్యంగా పెట్టేవారు. అప్పటినుంచి ఇదొక సంప్రదాయంగా స్థిరపడింది.
బోనాల పండుగకు సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. 18వ శతాబ్దంలో, సికింద్రాబాద్‌ వాసి అయిన అప్పయ్య సైనికాధికారిగా ఉజ్జయినిలో ఉండేవారు. అక్కడ కూడా ఓ సందర్భంలో కలరా వ్యాధి ప్రబలింది. ఆ వ్యాధి తగ్గుముఖం పడితే, తన స్వస్థలమైన సికింద్రాబాద్‌లో అమ్మవారికి గుడి కట్టిస్తానని ఉజ్జయినీ మహాకాళిని ప్రార్థించారు. వ్యాధి తగ్గడంతో ఉజ్జయినీ ఆలయం నమూనాలోనే ఆ భక్తుడు సికింద్రాబాద్‌లో అమ్మవారికి 1815లో గుడి కట్టించాడని చెబుతారు. 1864లో ఆలయ ప్రాంగణంలోని ఓ బావికి మరమ్మతు చేస్తున్నప్పుడు తవ్వకాల్లో 'శ్రీమాణిక్యాలదేవి' విగ్రహం లభించింది. ఆ విగ్రహంతోపాటు, అప్పటివరకు కొయ్య విగ్రహంగా ఉన్న ఉజ్జయినీ మహాకాళీ స్థానంలో కూడా ఓ రాతి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఆలయంలో మహాకాళి, ఆమెకు కుడివైపున మాణిక్యాల దేవి శిలామూర్తులుగా దర్శనమిస్తున్నారు. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి ఆలయంలో ఆషాఢ జాతర జరిగిన తరవాత, మరుసటి ఆదివారాల్లో ఇతర ప్రాంతాల్లో బోనాల వేడుకల్ని నిర్వహించుకుంటారు.
బోనాల వేడుకలు ఘటం ఎదుర్కోళ్ల ఉత్సవంతో ఆరంభమవుతాయి. భక్తులు తమ మొక్కుబడులను అనుసరించి, అమ్మవారికోసం నైవేద్యాల్ని సిద్ధం చేస్తారు. వాటిని ఓ పాత్రలో ఉంచి, ఆ పాత్రపై జ్యోతిని వెలిగించి, ఆ బోనాన్ని ఆలయంలో సమర్పిస్తారు. పసుపునీరు, వేపాకుల్ని అమ్మవారికి అభిషేకిస్తారు. దీనిని 'సాకబెట్టుట' అంటారు. ఈ పర్వదినాల్లో అమ్మవారికి ఇష్టమైన పదార్థాల్ని తయారుచేసుకుని ఓ బండిలో ఆలయాలకు తీసుకొస్తారు. గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసి, ప్రసాదాన్ని అమ్మవారికి కొంత నివేదించి, మిగిలింది మహాప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు. బండ్లపై ప్రసాదాలు తెచ్చి, అమ్మతల్లికి సమర్పించే ఘట్టాన్ని 'ఫలహారపు బండ్లు' అని వ్యవహరిస్తారు. పోతరాజులు బాజా భజంత్రీలతో ప్రదర్శించే నృత్యాలు, విచిత్ర వేషధారుల విన్యాసాలు, ఆటపాటలతో బోనాల పండుగ ఉత్సాహంతో పోటెత్తుతుంది. భవిష్యవాణిని వివరించే 'రంగం' వేడుక, అమ్మవారు పూనిన పోతరాజులకు సొరకాయ, గుమ్మడికాయలతో దిష్టితీసే 'గావు పట్టు' ఈ సంబరంలో ప్రధాన అంశాలు. అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించే 'సాగనంపు' ఘట్టంతో ఆషాఢ బోనాల వేడుకలు పరిసమాప్తమవుతాయి. సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనానికి ప్రతీకగా బోనాల సంబరాలు కొనసాగుతున్నాయి.
- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌
(Eenaadu, 05:08:2007)

-----------------------------------------

Labels:

వడ్డించేది తనవాడైతే...

'గోమూత్రం, మంగళ సూత్రం; సున్నిపిండీ, ఉగాది పచ్చడీ కాదేదీ పేటెంటు కనర్హం; ఔనౌను యోగమనర్ఘం' అనుకుంటూ అమెరికన్లు అడ్డగోలుగానైనా గోల్‌ సాధించడానికి శీర్షాసనాలు వేస్తున్నారు. పేటెంటు రావడమే ఒక యోగమనుకుంటూ యోగా సంబంధమైన 134 పేటెంట్లు, 150 కాపీరైట్లు, 2315 ట్రేడ్‌ మార్కులు ఎడాపెడాగా తమ అకౌంటులో వేసుకున్నారు. అమెరికాలో యోగ పరిశ్రమ 27 బిలియన్‌ డాలర్లకు పడగలెత్తింది. ఆ దేశంలో 28 మిలియన్ల మంది 'ఓ! దిస్‌ యోగా ఈజె జాలీ గుడ్‌ థింగ్‌' అనుకుంటూ యోగాభ్యాసానికి రెడీ అయిపోతున్నారు. బిక్రమ్‌ చౌదరి అనే యోగాచార్యుడు యోగ బోధించి 2002లో 3 మిలియన్‌ డాలర్లను జేబులో వేసుకున్నాడు. 26 యోగాసనాల మీద పేటెంటు 'దేవో'భవ... అని ఆయన అనేసరికి బిత్తరపోయే పరిస్థితి ఏర్పడింది. అన్నట్లు బిక్రమ్‌ చౌదరిది హీట్‌ యోగా. ఈ దెబ్బకు'యుగయుగమ్ముల నుంచి యోగమున్నా మనకు పేటెంటు యోగమ్ము పట్టుజారేనా?' అన్న కంగారుతో కేంద్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఆసనాలకు సంబంధించి అత్యవసర కార్యాచరణకు దిగవలసిన సమయం ఆసన్నమయిందని గ్రహించింది. ఏమాత్రం లేట్‌ చేయకుండా యోగా శ్లోకాల్ని ట్రాన్స్‌లేట్‌ చేయించి పేటెంటు ఆఫీసులకు పంపించడానికి శ్రీకారం చుట్టింది. 2010 నాటికి ఇండియాలో ఏడాదికి లక్ష పైగా పేటెంట్‌ దరఖాస్తులు దాఖలవుతాయని అంచనా. పేటెంట్ల కోసం కిందటేడాది 25వేల దరఖాస్తులు వచ్చాయి. రానున్న మూడేళ్లలో ఈ సంఖ్య లక్షకు చేరుకుంటుందన్న అంచనాలూ వినవస్తున్నాయి.
ప్రపంచంలో ఏటా మంజూరవుతున్న పేటెంట్లలో 90% అమెరికా, ఐరోపా, జపాన్‌లవి. పేటెంట్లు సాధించగలిగిన ఆ 'మెరిక'లంతా అమెరికా లాంటి దేశాల్లోనే ఉంటారన్న ప్రచారానికి అడ్డుకట్ట వేయక తప్పదు. అమెరికా వరుస చూస్తుంటే 'పేటెంట్ల మీద మాకే పేటెంటు ఇవ్వండి' అని ఓ దరఖాస్తు పడేసేటట్టుంది! మన చాదస్తం గానీ పేటెంట్ల సాధనకు విజ్ఞానులు ఎందుకు? వారు ఏం చూసినా పూర్వం ఎవరో దీనిని సాధించారు అనిపిస్తోంది. అజ్ఞానులకు అలాంటి 'బాధ'రబందీ ల్లేవు. కళ్ల ముందు ఏమి కనిపించినా 'ఇదే ఇదే! నేను కనుక్కున్నదీ...'అంటూ రాగాలు తీస్తారు.
'చరిత్ర అడక్కు- చెప్పేది విను' అని ఓ పంచ్‌ డైలాగు ఉంది. వడ్డించేవాడు తన వాడయితే 'చరిత్ర మీద కూడా పేటెంట్‌ మాకే ఇవ్వాలి' అని అర్జీ పెడతారు. గుడ్లప్పగించి చూస్తున్నంత కాలం చెవిలో రకరకాల పువ్వులు పెడుతూనే ఉంటారు! ఏమంటారు...?
- ఫన్‌కర్‌
(Eenadu, 12:08:2007)

Labels:

ఒంటరితనం ఒంటికి చేటు

మానవుడు సంఘ జీవి. నలుగురితో నారాయణా అన్నట్లుగా అందరితో కలిసిమెలిసి జీవించాలనే కోరుకుంటాడు. ఏకో నారాయణా అన్నట్లుగా ఒంటికాయ శొంఠికొమ్ములాగ బతికే ప్రబుద్ధులు అక్కడక్కడా ఉండొచ్చు. అటువంటివారి సంఖ్య స్వల్పం. నలుగురు పలికిందేమాట నలుగురు నడిచిందే బాట, నలుగురితో చావు పెళ్ళితో సమానం- వంటి సామెతలు సంఘజీవనం పట్ల మనుషులు చూపే మక్కువ నుంచి ఉద్భవించినవే. పూర్వం మునులు, ముముక్షువులు ఇతరులతో సంపర్కంలేకుండా ఏకాంతంగా ఏ కొండల్లోనో కోనల్లోనో ముక్కుమూసుకొని ఏళ్ళతరబడి తపస్సు చేస్తూ కాలం గడిపినట్లు చెప్పే పురాణ గాథలున్నాయి. వారూ ఏదో ప్రయోజనం ఆశించి, ఏ దేవుడో ప్రత్యక్షమై తమకు వరాలు ప్రసాదిస్తాడనీ తద్వారా నలుగురిలో గుర్తింపు లభిస్తుందనే ఆశతోనే అటువంటి తపస్సు చేశారేమో! నిర్జనంగా ఉన్న మంచుకొండల్లో ఒక్కతే కూర్చుని వీణ వాయించుకుంటున్న అద్భుత సౌందర్యరాశి వరూధినిని చూసి ప్రవరాఖ్యుడు ఆశ్చర్యపోతాడు. ''ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ, యొంటి జరించె దోటలేకివ్వన భూమి'' అని ప్రశ్నిస్తాడు. మనుష్య సంచారం లేని ఆ హిమనగంలో అనుకోకుండా ఓ వ్యక్తి తారసపడినందుకు ఉబ్బితబ్బిబ్బై పోయిన ఆ గంధర్వాంగన వయ్యారాలు పోతుంది. ఎవరూలేని ఆ చోట భయంలేకుండా ఒక్కదానివీ ఏం చేస్తున్నావు అన్న ప్రవరుని ప్రశ్నకు తిన్నగా జవాబు చెప్పదు. ఆ సమయంలో అనుకోకుండా ఓ తోడు దొరికినందుకే ఆమె మురిసిపోయి ఉండాలి!
సంపద ఎంత ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా మానవుడు ఒక తోడు కోరుకుంటాడు. ''చీకటి మూసిన ఏకాంతములో తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము...'' అన్నారు శ్రీశ్రీ ఒక సినిమా పాటలో. వివాహంతో ఎవరికైనా తోడు దొరుకుతుంది. కొంతమంది పెళ్ళంటేనే జంకుతారు. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరావంటారు. ఆ సోగ్గాడు ముదిరిన బెండకాయలా అయినా పెళ్ళిమాటమాత్రం తలపెట్టడంలేదు. ''పెళ్ళెందుకు చేసుకోవోయి...'' అని అడిగాడు మిత్రుడు. ''ఆఫీసులో నా పీకలమీద సవారి చేస్తూ ఓ బాస్‌ ఉండనే ఉన్నాడు. ఇంట్లోకి కూడా మరో బాస్‌ను తెచ్చుకోమంటావా ప్రాణాలమీదికి'' అంటూ విసుక్కున్నాడు సోగ్గాడు. అటువంటివారు కొందరు ఉన్నప్పటికీ సహజంగా ఎక్కువమంది జీవితంలో ఒకతోడు కావాలనే కోరుకుంటారు. వెన్నెలరేయి ఒంటరితనాన్ని భరించలేక, ''నాకూ తోడెవ్వారు లేరు, కోడికూతా జాముదాకా తోడు రారా వన్నెకాడా'' అని ఓ పల్లెపడుచు సాక్షాత్తు ఆ చందమామనే తోడురమ్మని కోరుతుంది. కాలం మారి ఇప్పుడు భార్యాభర్తలిద్దరు మాత్రమే ఉండే కంప్యూటర్‌ కాపురాలు ఎక్కువైనప్పటికీ వెనకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాల హడావుడే అధికం. కష్టసుఖాలు నలుగురితో పంచుకోవటంలోనే ఆనందం ఉందని నమ్మేవారు. ''నలుగురు కూచుని నవ్వే వేళల నా పేరొకపరి తలవండి...'' అంటుంది పూర్ణమ్మ. ఒంటరితనాన్ని, ఏకాంతాన్ని కోరుకొనేకంటె నలుగురితో కలిసిమెలిసి ఉన్నప్పుడే జీవితం ఆనందంగా గడుస్తుంది.
ఏకాంతాన్నే కోరుకుంటూ ఒంటరిగా ఏవో ఆలోచనల్లో మునిగిపోతూ కాలక్షేపం చేయటానికి ఇష్టపడే మగవారు గుండెపోటుతో మరణించే ప్రమాదం ఎక్కువని ఓ అధ్యయన బృందం నిర్ధారించింది. షికాగోలోని నార్త్‌వెస్టర్న్‌ విశ్వవిద్యాలయ అధ్యయన బృందం 30 సంవత్సరాలపాటు విస్తృతంగా పరిశోధించి కడకీ నిర్ణయానికి వచ్చింది. ఒకే వయస్సు, ఒకే సామాజిక హోదా కలిగిన 2100మంది పురుషులను మనస్తత్వాన్నిబట్టీ ప్రవర్తన తీరునుబట్టీ నాలుగు గ్రూపులుగా వేరు చేశారు. అసహనం ప్రదర్శిస్తూ ఒక్కక్షణం కూడా స్థిమితంగా ఉండలేని పురుషవరేణ్యులను మొదటి బృందంగా వర్గీకరించారు. ఈ బాపతు పురుషపుంగవులకు గుండెపోటు వచ్చే అవకాశం అధికం. జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యనైనా తేలికగా తీసుకుంటూ స్థిమితంగా, ప్రశాంతంగా ఉండేవారికి ఆరోగ్య సమస్యలు ఏర్పడటం అరుదు. ఇటువంటి మగవారిని రెండో బృందంగా గుర్తించారు. ఇక మూడో బృందానికి చెందినవారు ఎంతసేపటికీ ఇతరుల మెప్పును పొందాలనే తాపత్రయపడుతుంటారు. స్వీయనియంత్రణ తక్కువ కావటంతో మనసులో అనవసరమైన ఒత్తిడికి గురవుతుంటారు. ఆ కారణంగా వీరికీ గుండెపోటు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎప్పుడూ ఆందోళనతో ఉంటూ అన్నిటికీ మొహమాటపడుతూ తమ భావాలను పైకి వెల్లడించకుండా తమలోనే అణచేసుకొనే అయ్యలు నాలుగో బృందం కిందికి వస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం తక్కువ. ఇలాంటివారికీ తరచూ గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఇతరులతో పోలిస్తే ఒంటరిగా కాలం గడిపేవారు గుండెజబ్బుతో చనిపోయే ప్రమాదం 40శాతం అధికంగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ఎక్కువమంది స్నేహితులుండి, వారితో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొంటూ కాలక్షేపం చేసే నిత్య సంతోషులకు, పెళ్ళి చేసుకొని పిల్లాపాపలతో హాయిగా కాలక్షేపంచేసే పుణ్యపురుషులకు గుండెపై ఒత్తిడితగ్గి ఆరోగ్య సమస్యలు చాలావరకు నెమ్మదిస్తాయి. అందుకే పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని హాయిగ కాలం గడపండి మీ గుండెకేం ఢోకా ఉండదు- అని ఆ అధ్యయన బృందంవారు పురుషపుంగవులకు అడగకుండానే సలహా ఇస్తున్నారు!

(Eenadu, 12:08:2007)
_____________________

Labels: