టీనేజీ ............ గెలుపు ఈజీ....
పదహారేళ్ల వయసంటే... అయస్కాంతాల మధ్య ఇనుపరజం. చౌరస్తాలో బాటసారి. సరికొత్త అనుభవాల అన్వేషి. బోలెడన్ని ఆకర్షణలు. బోలెడన్ని భ్రమలు. బోలెడన్ని సందేహాలు. బోలెడన్ని అపోహలు. ఎలా
నిలవాలి? ఎలా గెలవాలి?
ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిత్వవికాస రచయిత స్టీఫెన్‌కోవె తనయుడు సీన్‌కోవె తన కౌమార అనుభవాల్ని రంగరించి రాసిన సప్తసోపానాల వికాస సూత్రాలివి...
ఓ శిల్పి తదేకదీక్షతో రాతిని రమణీయమైన శిల్పంగా తీర్చిదిద్దుతున్నాడు... అదే ప్రపంచమైనట్టు, అదే జీవిత లక్ష్యమన్నట్టు. సరిగ్గా అలాంటి శిల్పమే ఓ మూలనపడుంది. అటుగా వెళ్తున్న యాత్రికుడు దాన్ని చూశాడు. అద్భుతంగా ఉంది. జీవకళ ఉట్టిపడుతోంది. అంత గొప్ప శిల్పం ఉండగా, మరొకటి చెక్కాల్సిన పనేముంది? లేదంటే, రెండూ అవసరమై ఉండాలి. శిల్పి సేదదీరుతున్న సమయంలో, యాత్రికుడు మాటలు కలిపాడు. సందేహం వెలిబుచ్చాడు.
శిల్పి ఓ నవ్వు నవ్వి, ఇలా చెప్పాడు... 'వెుదటి శిల్పం పూర్తికావస్తున్న సమయంలో ఒక పొరపాటు జరిగింది. అందుకే దాన్ని పక్కనపెట్టి, మరొకటి చెక్కుతున్నాను'.
'ఎంత జాగ్రత్తగా గమనించినా, ఒక్కటంటే ఒక్క లోపం కూడా కనబడటంలేదే'... మరోసారి శిల్పాన్ని తదేకంగా చూస్తూ చెప్పాడు యాత్రికుడు.
'విగ్రహం వెుహం మీద చిన్న గాటు పడింది' చూపించాడు శిల్పి. అమరశిల్పి అనవసరంగా కష్టపడుతున్నాడేవో అనిపించింది యాత్రికుడికి. 'అయినా దాన్ని పది అడుగుల గద్దె మీద కదా ప్రతిష్ఠించేది? అంత చిన్న లోపం ఎవరికి తెలుస్తుంది?...' సలహా ఇవ్వబోయాడు.
'నాకు తెలుస్తుంది' స్థిరంగా జవాబిచ్చాడు శిల్పి.
ఎవరో గుర్తించాల్సిన పన్లేదు. ఎవరో వేలెత్తిచూపించాల్సిన పన్లేదు. ఎవరో సరిదిద్దాల్సిన పన్లేదు. మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. మనతప్పుల్ని మనమే సరిచేసుకోవాలి. మన లోపాల్ని మనమే అధిగమించాలి.ఎందుకంటే, ఈ జీవితం మనది!
ఆ ప్రయత్నంలో టీనేజీ పిల్లలకు ఉపకరించే లక్ష్యంతో 'సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ టీనేజర్స్'
రచయిత సీన్‌కోవె ఈ ఏడు సూత్రాల్నీ రూపొందించారు.
విజేతలు రెండు దశల్లో ప్రాణం పోసుకుంటారు.
తొలి దశలో... తమను తాము గెలుస్తారు. రెండో దశలో... ప్రపంచాన్ని గెలుస్తారు.
తొలి విజయం లేకుండా, మలి విజయం అసాధ్యం. తమనుతాము గెలిచే ప్రక్రియ టీనేజీలోనే ప్రారంభం కావాలి. ఆ లక్ష్యసాధనలో ఈ ఏడుమెట్ల నిచ్చెన ఉపయోగపడుతుంది.
1 డ్రైవరు మీరే!
సోషలిస్టు నేత థామస్‌మూర్ ఉరికంబం ముందు నిలబడ్డాడు. ఆ మహానేత ప్రాణాలు తీయలేక తలారి వణికిపోతున్నాడు. 'నా మెడ కాస్త పొట్టి. సరిగ్గా చూసి తాడు బిగించు. నీ వృత్తికి కళంకం తెచ్చుకోవద్దు' అతన్ని హెచ్చరించాడు మూర్. 'ఏంటోయ్! మరీ విడ్డూరం కాకపోతే, నా గెడ్డానికి కూడా ఉరేస్తావా? అదేం తప్పుచేసింది పాపం!'... అని జోకేశాడు కూడా. ఉరితాడు మెల్లమెల్లగా బిగుసుకుంటోంది. మరు నిమిషంలో మరణం తప్పదు. ఆ పరిస్థితుల్లోనూ మూర్ నవ్వుతూనే ఉన్నాడు.
ఆయనతో పోల్చుకుంటే మీ కష్టాలు ఏపాటి? పరీక్షలో ఫెయిల్ అయితే, మళ్లీ రాసుకోవచ్చు. ఇంజినీరింగ్‌లో సీటు రాకపోతే, ఇంకేదైనా మంచి కోర్సులో చేరిపోవచ్చు. ప్రేమించిన అమ్మాయో, అబ్బాయో కాదన్నంత మాత్రాన జీవితం ముగిసిపోదు. ఆమాత్రం దానికే వణికిపోతారెందుకు? కొందరైతే అతిగా స్పందించి, చావులో పరిష్కారం వెతుక్కుంటారు. ఎంత మూర్ఖత్వం! ఈ జీవితం మీది. మీ బండికి మీరే చోదకులు. ఎవరో స్టీరింగ్ తీసేసుకుంటే, ఇంకెవరో తాళాలు లాగేసుకుంటే బిక్కవెుహం వేసుకుంటారా? ముక్కున వేలేసుకుని చూస్తారా?
అనగనగా ఓ అమ్మాయి. ఏదో కాలేజీలో చదువుతోంది. బస్‌స్టాప్‌లో రోమియో పిచ్చిచూపులతో గుచ్చిగుచ్చి చూస్తాడు. బస్సులో కండక్టరు కావాలనే చేయి తగిలిస్తాడు. క్లాసులో ఎవరో నల్లగా ఉన్నావనో తెల్లగా ఉన్నావనో, పొట్టిగా ఉన్నావనో పొడుగ్గా ఉన్నావనో కామెంట్ చేస్తారు. రికార్డు దాఖలుచేయలేదని ప్రొఫెసరు చివాట్లు పెడతాడు. పరధ్యానంగా రోడ్డు దాటుతుంటే బైక్‌వాలా 'కళ్లు దొబ్బేశాయా?'అని నోటికొచ్చినట్టు తిట్టేశాడు. ఆలోచిస్తూ కూర్చుంటే ప్రతీదీ సమస్యే! అయినా, మనం సమస్యల్ని నియంత్రించలేం. అది మన చేతుల్లో లేదు. కానీ, ఎలా స్పందించాలన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది.
హిమాలయ యాత్రకు బయల్దేరాం. దార్లో పొరపాటున బురదలో కాలేశాం. లేదంటే, పక్కనుంచి వెళ్తున్న వాహనం మన మీద బురదనీళ్లు చిందించి వెళ్లింది. ఆమాత్రం దానికి ప్రయాణమే ఆపేస్తామా? లేదు. శుభ్రంగా కడుక్కుని ముందుకెళ్తాం. జీవితమూ అంతే. అవరోధాల్ని దాటుకుని గమ్యాన్ని చేరుకోవాలి.
మీ ప్రయాణాన్ని మీరే నిర్ణయించుకున్నట్టు... మీ జీవితాన్ని కూడా మీరే నిర్ణయించుకోండి... ప్రేమికుడో, పరిచయస్థుడో, దారినపోయే దానయ్యో మీమీద పెత్తనం చెలాయించడం ఏమిటి?
2 మీ దారి... రహదారి!
మన బండికి మనమే డ్రైవర్లమన్నది వెుదటి పాఠం. ఆ బండిని ఏవైపు నడిపించాలన్నది రెండో పాఠం.
నీ లక్ష్యం ఏమిటి? నువ్వేం కావాలనుకుంటున్నావు? ఐదేళ్ల తర్వాత, పదేళ్ల తర్వాత, పాతికేళ్ల తర్వాత... నిన్ను నీవు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు?
బొమ్మ వేసేముందు చిత్రకారుడు ఓ చిత్తుప్రతిని గీసుకుంటాడు. తన చిత్రానికి ఏ రంగులు వాడాలో, ఏ మిశ్రమాలు సరిపోతాయో, ఏ భావాలు పలికించాలో, ఏ ధరకు అమ్ముకోవాలో ముందే
నిర్ణయించుకుంటాడు.
కథ రాసేముందు రచయిత ప్లాట్ సిద్ధంచేసుకుంటాడు. ఏ పాత్ర స్వభావం ఎలా ఉండాలో, కథని ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో, ఏ ప్రచురణ సంస్థకు ఇవ్వాలో కచ్చితంగా ఆలోచించుకుంటాడు.
ఓ సివిల్స్ విజేత... ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల నుంచే తన పేరు పక్కన 'ఐఏఎస్' అని రాసుకునేవాడు. ఏ సమస్య వచ్చినా కలెక్టరులానే ఆలోచించేవాడు. అంతే బాధ్యతగా వ్యవహరించేవాడు. దీంతో నాయకత్వ అవకాశాలు వాటంతట అవే వచ్చాయి. ఆ చురుకుదనం సివిల్స్ ఇంటర్వ్యూలో మంచిమార్కులు తెచ్చిపెట్టింది. ఎప్పటి నుంచో తను ఐఏఎస్ అధికారిలా ఆలోచిస్తున్నాడు కాబట్టి, ఉద్యోగం కూడా మరీ కొత్తగా అనిపించలేదు. కొద్దికాలంలోనే మంచిపేరు తెచ్చుకున్నాడు.
'1980 నాటికంతా నేను గొప్ప నటుడిని అవుతాను. ఒక్కో సినిమాకు పది మిలియన్ల పారితోషికం తీసుకుంటాను. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సంతృప్తి పరుస్తాను. హాయిగా ఆనందంగా జీవితం సాగిస్తాను'... 1970లో బ్రూస్‌లీ పదేళ్ల ప్రణాళికతో తనకుతాను రాసుకున్న లేఖ ఇది.
ప్రారంభంలోనే... ముగింపు గురించి ఆలోచించడం అంటే ఇదే!
టీనేజీకి వచ్చారు. ఐదారేళ్లలో చదువు ఓ దారికి వచ్చేస్తుంది. ఆతర్వాత..సమాజంలో మీ పాత్ర ఏమిటి? నటుడా, గాయకుడా, ఇంజినీరా, రాజకీయనాయకుడా? వ్యాపారవేత్తా? దీన్నే వ్యక్తిత్వవికాస నిపుణులు 'కోర్‌కాంపిటెన్సీ' అంటారు. ఆ స్పష్టత మీకుందా? ఈ విషయంలో ఒకటే గీటురాయి. ఏపని చేస్తున్నప్పుడు మీకు, అదసలు పనే అనిపించదో, ఏ పనిలో మిమ్మల్ని మీరు మరచిపోతారో... అదే మీ కోర్‌కాంపిటెన్సీ. ఆవైపుగా అడుగులు వేయండి.
బ్లాట్‌నిక్ అనే నిపుణుడు ఇరవై ఏళ్లపాటు పదిహేనువందల మంది యువతీయువకుల కెరీర్ ఎదుగుదలను పరిశీలించాడు. అందులో రెండురకాల వారున్నారు.
సంపాదనతో సంబంధం లేకుండా తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకున్నవారు(ఎ).
అభిరుచిని పట్టించుకోకుండా సంపాదనే ధ్యేయంగా వృత్తి, ఉద్యోగాల్ని ఎంచుకున్నవారు (బి).
ఇరవై ఒకటో సంవత్సరం నాటికి ఆ జాబితాలో ఉన్నవారిలో దాదాపు వందమంది కోటీశ్వరులయ్యారు. వారిలో 99మంది ఎ గ్రూపువారే!
మీరిప్పుడు సరిగ్గా చౌరస్తాలో ఉన్నారు. చుట్టూ నాలుగు దార్లున్నాయి. ఏవేవో ప్రభావాలు ఆకర్షిస్తున్నాయి. ఇంకేవో భ్రమలు ఊరిస్తున్నాయి. ఇదీ అని తెలియని పిచ్చి ఆవేశం పదపదమని తొందరపెడుతోంది. జాగ్రత్త. అడుగు వేసేముందే బాగా ఆలోచించుకోండి. జారేది కాలు కాదు... బంగారు భవిష్యత్!
'నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. ఇంగ్లిష్ గడగడా మాట్లాడలేను. సివిల్స్ రాయడం కష్టమేవో'
'నాకు కాస్త నత్తి. కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ. క్యాంపస్ ఇంటర్వ్యూలో నెగ్గుకురాలేనేవో'
'ఎంబీయే చదివినా, వ్యాపారంలో విజయం సాధించలేనేవో. మా కుటుంబంలో ఎవరికీ వ్యాపారం అచ్చిరాలేదు'
... మీ కారు రివ్వున దూసుకుపోతుంది. ఇంజిన్ మంచి కండిషన్‌లో ఉంది. పెట్రోలు కూడా దండిగానే ఉంది. అద్దాలు మాత్రం దుమ్ముపట్టిపోయాయి. వాటి గుండా చూస్తే దారి మసకమసగ్గా కనిపిస్తుంది. అలానే, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం వల్లే లేనిపోని సందేహాలు పుట్టుకొస్తాయి. అద్దాన్ని శుభ్రంగా తుడుచుకుంటే దారి స్పష్టమైనట్టు, అపోహల్ని తొలగించుకుంటే లక్ష్యసాధన సులభమైపోతుంది.
3 ఆరోగ్యం జాగ్రత్త!
టీనేజీలో స్నేహితులు పెరుగుతారు. తిరుగుళ్లు పెరుగుతాయి. చిరుతిళ్లు ఎక్కువవుతాయి. కొత్త అలవాట్లు వూరిస్తుంటాయి. అర్ధరాత్రిదాకా టీవీలూ ఇంటర్నెట్ వ్యసనాలు. సెల్‌ఫోన్ కబుర్లకైతే అంతే ఉండదు. నిద్ర కరవైపోతుంది. ఆరోగ్యం సంగతే పట్టించుకోం. మన మీద మనకు నియంత్రణ తగ్గుతుంది. ఇవన్నీ శరీరానికీ మనసుకూ హానికలిగించేవే. ఆ ప్రభావాల నుంచి బయటపడాలి. శక్తినిచ్చే భోజనం చేయాలి. కంటినిండా నిద్రపోవాలి. రోజూ కాసేపైనా వ్యాయామం చేయాలి. మెదడుకు ఓ రకమైన వ్యాయామం అవసరం. హృదయానికి ఓ రకమైన వ్యాయామం అవసరం. ఆత్మకు ఓ రకమైన వ్యాయామం అవసరం. ఆరోగ్యవంతులం అనిపించుకోవాలంటే, ఈ నాలుగూ ముఖ్యమే.
ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. అందులోనూ, మానసిక ఆరోగ్యానికి... విజేతల ఆత్మకథలు, మహావ్యక్తుల జీవిత చరిత్రలు, ప్రపంచ సాహిత్యం చదవాలి. ఆలోచనలకూ భావాలకూ అక్షర రూపం ఇవ్వాలి. ఆత్మీయ స్నేహితులతో మనసు విప్పి మాట్లాడుకోవడం, వారాంతాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం... ఇవన్నీ హృదయాన్ని తేలిగ్గా ఉంచే వ్యాపకాలు. ధ్యానం, ప్రార్థన, యోగా... ఎనలేని ఆధ్యాత్మిక శక్తినిస్తాయి.
చదువంటే పాఠ్య పుస్తకాలొక్కటే కాదు. ర్యాంకులే సర్వస్వం కాదు. మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోండి. అందులో కొత్తకొత్త విషయాలు తెలుసుకోండి. ఇంటర్నెట్‌లో మరింత సమాచారం వెతకండి. నిపుణులతో మాట్లాడండి. ఆలోచనలు విస్తరిస్తున్నకొద్దీ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. మూడేళ్లో నాలుగేళ్లో చదువుకున్నాక పట్టా ఇస్తారే, అంతకంటే వేయిరెట్లు విలువైంది ఈ అనుభవం.
4. ముందు... వెనుక
పొద్దున్నే క్లాసులు. మధ్యాహ్నం క్రికెట్. సాయంత్రం ఐఐటీ కోసవో, ఎంసెట్ కోసవో కోచింగ్ సెంటర్‌కు పరుగులు. అర్ధరాత్రి దాకా ప్రాజెక్టు పనులు. మధ్యమధ్యలో స్నేహితులతో కబుర్లు, ఇంటర్నెట్ ఛాటింగులు, సినిమాలు, షికార్లు. నిజమే, కౌమారం మునుపెన్నడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మీరంతా వయసుకు మించిన బరువు వోస్తున్నారు. ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉంది. అది మీ సూట్‌కేసులోనే ఉంది! ఎక్కడికో ప్రయాణం అవుతున్నారు. సూట్‌కేస్ సర్దుకుంటున్నారు. ముందుగా ఏం చేస్తారు... బట్టలు పెట్టుకుంటారు. ఆతర్వాత టూత్‌బ్రష్, పేస్టు, సబ్బులు గట్రా. అన్నీ అయ్యాక ఖాళీ ఉంటే, ఒకట్రెండు పత్రికలు!
అలానే, లక్ష్యాలకూ ఓ ప్రాధాన్యతా క్రమం ఉండాలి. ముందేది వెనకేది... అన్నది నిర్ణయించుకోవాలి.
ఏది అవసరవో, ఏది అనవసరవో తేల్చుకోవాలి.
అ. అతి ముఖ్యమైన పనులు:
వీటికే తొలి ప్రాధాన్యం. ఇవి జీవితానికీ లక్ష్యాలకూ సంబంధించినవి. ఉదా: పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడం, ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావడం.
ఆ. ముఖ్యమైన పనులు:
వీటి ప్రభావం వెంటనే కనిపించదు. కానీ జీవితానికి చాలా అవసరం. ఉదా: విశ్రాంతి, అనుబంధాలు, వ్యాయామం, భవిష్యత్ ప్రణాళిక.
ఇ. అత్యవసరమైన పనులు:
తక్షణం చేయకపోతే ఇబ్బంది కలిగించే పనులు. ఉదా: కాలేజీలో రికార్డులు ఇచ్చేయడం. అనారోగ్యం కలిగినప్పుడు డాక్టరుకు చూపించుకోవడం.
ఈ. అత్యవసరమూ అతిముఖ్యమూ కాని పనులు.
ఉదా: స్నేహితులతో సినిమాకు వెళ్లడం, టీవీ చూడటం, నెట్ ఛాటింగ్, బ్లాగింగ్ వగైరా.
ఒక్కసారి పరిశీలించుకుంటే, మన సమయాన్ని మనం ఏ విభాగానికి ఎక్కువగా కేటాయిస్తున్నావో అర్థమైపోతుంది. 'ఈ' విభాగమే ఎక్కువ తినేస్తుంటే మాత్రం, తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఆ ప్రయత్నంలో తొలిదశలో కొన్ని వైఫల్యాలు ఉండొచ్చు. ఎదురుదెబ్బలు తగలొచ్చు. సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ ముందుకెళ్లడమే? మీరెప్పుడూ ఓడిపోలేదంటే, మీరెప్పుడూ ప్రయత్నించలేదనే అర్థం!
5 కలసికట్టుగా
ఆకాశంలో పక్షులు ఎగురుతున్న దృశ్యం చూశారా? ఒకటీరెండూ కాదు, గుంపులుగుంపులుగా 'వి' ఆకారంలో వెళ్తుంటాయి. ఆ సపరివార యాత్రను అధ్యయనం చేస్తే, చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. వాటిలో ఒకటి లీడర్‌గా వ్యవహరిస్తుంది. మిగిలినవి అనుచర పక్షులు. అవి నాయకుడ్ని అనుసరిస్తాయి. దీనివల్ల దారి వెతుక్కోవాల్సిన ఒత్తిడి తగ్గుతుంది. ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి కాబట్టి, గాలి తీవ్రత పెద్దగా ఉండదు. ప్రయాణవేగం పెరుగుతుంది. లీడరు అలసిపోతే, ఆ బాధ్యత ఇంకో పక్షి తీసుకుంటుంది. దార్లో ఏ పక్షికైనా అనారోగ్యంగా అనిపిస్తే, తోడుగా మరో పక్షి ఆగిపోతుంది. ఒకదానికి
ఎక్కడైనా ఆహారం కనిపిస్తే, ఆ సంగతి మిగిలినవాటికి చెబుతుంది. కలసి ప్రయాణించడంలో హాయి ఉంది. భద్రత ఉంది. భరోసా ఉంది.
మీ క్యాంపస్‌లో రాక్‌బ్యాండ్ ఉందా? సాయంత్రం క్లాసులైపోయాక, ఓసారి జామింగ్ సెషన్‌కు వెళ్లిచూడండి. ఒకరు డ్రమ్ వాయిస్తుంటారు. ఒకరు గిటారు మీటుతుంటారు. ఒకరు తన్మయంగా పాడుతుంటారు. ఆ స్వరాలన్నీ కలిస్తే అద్భుతమైన సంగీతం అవుతుంది. విడివిడిగా విన్నామంటే... చెవులు మూసుకోవాల్సిందే! ఆ సమన్వయం జీవితానికీ అవసరం.
భారతంలో పాండవుల సంగతే తీసుకోండి. ఒకరు నీతిశాస్త్రంలో నిపుణులు. ఒకరు గదాయుద్ధంలో ఉద్ధండులు. ఒకరికి ధనుర్విద్యలో తిరుగులేదు. ఒకరు భవిష్యత్‌ను బేరీజువేయగలరు. ఒకరు వైద్యంలో నిష్ణాతులు. అలా అని అందరూ పరిపూర్ణులేం కాదు. ఎవరి బలహీనతలు వారికున్నాయి. కృష్ణుడు వాటిని అధిగమించేలా చేసి, ఆ నైపుణ్యాలను చక్కగా సమన్వయం చేశాడు. ఫలితం... వందమంది కౌరవులు కుప్పకూలారు!
మీ చుట్టూ రకరకాల మనస్తత్వాల వారుంటారు. కొందరు అతిగా మాట్లాడతారు. కొందరు మితంగా మాట్లాడతారు. రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. కొందరు ప్రేమ కురిపిస్తారు. కొందరు అకారణంగా ద్వేషం ప్రదర్శిస్తారు. అందర్నీ కలుపుకుపోవాలి. ఎదుటి వ్యక్తిని యథాతథంగా ఆవోదించాలి. మనలో లేని నైపుణ్యాలు ఎదుటి వ్యక్తిలో ఉండొచ్చు. మనకు తెలియని విషయాలు మరొకరికి బాగా తెలిసుండవచ్చు. ఎదుటి వ్యక్తి మన అభిప్రాయాలతో విభేదించాడంటే... సమస్యను మనం రెండో కోణంలోంచి అర్థంచేసుకునే అవకాశం వచ్చినట్టే. ఎవరైనా మనల్ని విమర్శించారంటే మనలోని లోపాల్ని తెలుసుకునే అదృష్టం దక్కినట్టే. పాజిటివ్ ఆలోచనా ధోరణి పెంచుకుంటే... మనకు బాగా పరిచయమున్న మనుషులే సరికొత్తగా కనిపిస్తారు, రోజూ ఎదురయ్యే సమస్యలే పాఠాల్లా అనిపిస్తాయి.
6 బంధాలు-అనుబంధాలు
స్నేహితులతో ఎలా ఉంటారు?
లెక్చరర్లతో ఎలా ఉంటారు?
అమ్మానాన్నలతో ఎలా ఉంటారు?
తోబుట్టువులతో ఎలా ఉంటారు?
మానవ సంబంధాలన్నీ ఈ నాలుగు ప్రశ్నల చుట్టూ తిరుగుతాయి. బయటి ప్రపంచంతో మన అనుబంధాలు బ్యాంకు ఖాతా లాంటివి. డిపాజిట్ చేస్తున్నకొద్దీ బలపడతాయి. విత్‌డ్రా చేసుకుంటూపోతే తరిగిపోతాయి. ఇక్కడ, ఖాతా తెరవడం చాలా సులభం. ఓ చిరునవ్వు చాలు. 'హలిో' అన్న పలకరింపు చాలు. 'బావున్నారా' అన్న మాట చాలు. అయితే రికరింగ్ డిపాజిట్‌లా ఎప్పుడూ ఎంతోకొంత జమచేస్తూ ఉండాలి. చక్కని ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఇవ్వొచ్చు. అప్పుడప్పుడూ కాల్‌చేసి కబుర్లు చెప్పవచ్చు. ఓ పూట ఇంటికి పిలవొచ్చు. 'నీ డ్రస్ బావుంది', 'ప్రిన్సిపల్‌గారు మెచ్చుకున్నారటగా! కంగ్రాట్స్', 'నీ చేతిరాత బావుంటుంది', 'మమ్మీ! వంట అదుర్స్', 'మీ ఆరోగ్యం ఎలా ఉంది డాడీ!'... నిజాయతీగా ఇచ్చే ప్రశంస, అందించే ఓదార్పు నెలసరి వడ్డీల్లాంటివి. డిపాజిట్ వెుత్తాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే ఒక్క విషయం. స్నేహితుల ఖాతాలో అమాంతంగా డిపాజిట్లు పెరగడం, అమ్మానాన్నల ఖాతాలో కనీస వెుత్తం కూడా లేకపోవడం... మంచి లక్షణం కాదు. అన్ని ఖాతాల్లోనూ సరిసమానంగా పెరుగుదల కనిపించాలి.
హాస్యానికీ అపహాస్యానికీ మధ్య సున్నితమైన తేడా ఉంది. ఆ సంగతి తెలుసుకుని మాట్లాడాలి. అర్థంలేని వ్యాఖ్యానాలు, పరోక్షంలో చేసే విమర్శల వల్లే చాలా స్నేహాలు ప్రారంభంలోనే వీగిపోతాయి. 'గాసిప్స్' క్యాంపస్ స్నేహాలకు ప్రధాన శత్రువులు. ఆత్మన్యూనతలోంచే గాసిప్స్‌రాయుళ్లు పుట్టుకొస్తారు. స్నేహానికి నమ్మకం పునాది. మిత్రుడి రహస్యం గుండెల్లో దాచుకోవాలి. మిత్రుడి సమస్యల్ని హృదయంతో ఆలోచించాలి. కొన్నిసార్లు పొరపాట్లు జరగొచ్చు. మిత్రుడిని బాధపెట్టాల్సిరావచ్చు. అలాంటి సమయంలో మనస్ఫూర్తిగా 'సారీ' చెప్పాలి. బంధాన్ని నిలుపుకోడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.
7 అర్థంచేసుకోండి!
డాడీ అర్థంచేసుకోడు. మమ్మీ అర్థంచేసుకోదు. ఫ్రెండ్స్ అర్థంచేసుకోరు. లెక్చరర్స్ అర్థంచేసుకోరు.
ఏదో ఒక సందర్భంలో వినిపించే ఫిర్యాదే ఇది. నిజమే, ఎవరూ అర్థంచేసుకోవడం లేదనే అనుకుందాం. మీ సంగతి ఏమిటి? ఏ మార్పు అయినా మననుంచే వెుదలు కావాలంటాడు మహాత్ముడు. ముందు మీరు అర్థంచేసుకోండి. ఆతర్వాతే మిమ్మల్ని అర్థంచేసుకోవాలని ఆశించండి.
మాట్లాడనివ్వండి... ఆపైన, మాట్లాడండి.
మమ్మీని ఎప్పుడైనా మాట్లాడనిచ్చారా? తను ఏదైనా చెప్పబోతుంటే, వెంటనే తుంచేస్తారు. అన్నీ మీకే తెలిసినట్టు. ఆమె ఆలోచనలతో మీకేం పనిలేనట్టు. బైక్ కావాలి, లాప్‌టాప్ కావాలి, వెుబైల్ కావాలి... అని సతాయించడమే కానీ, ఎప్పుడైనా నాన్న మాటలు విన్నారా? నెల జీతంతో కుటుంబ ఖర్చులు, చదువులు, తాతయ్య నానమ్మలకి మందుల ఖర్చులు, సమీప బంధువుల అవసరాలు ...అన్నీ ఎలా తీరుస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన్ని అడిగారా? ఫ్రెండ్స్‌తోనూ అంతే. అభిప్రాయాలూ ఆలోచనలూ అనుభవాలూ కష్టాలూ మనసు విప్పి చెప్పనివ్వండి. ఇదంతా అర్థంచేసుకునే ప్రక్రియలో భాగమే.
ఏ అనారోగ్యంతోనో డాక్టరు దగ్గరికి వెళ్లినప్పుడు... మనం చెప్పేది ఆయన ఆసాంతం వినాలని కోరుకుంటాం. మన మనసులో ఉన్నదంతా చెప్పేయగానే, సగం రోగం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అదే ఆ డాక్టరుగారు... మన మాటలతో ప్రమేయం లేకుండా, మనం చెప్పేది పట్టించుకోకుండా తన మానాన తాను సూదిమందు సిద్ధంచేసుకుంటూ ఉంటే, మహాచిరాకేస్తుంది. ఆ మందులు పనిచేసినట్టే అనిపించదు. మాటలకున్న శక్తి అలాంటిది. ఎదుటి మనిషి మనసులోకి తొంగిచూడటానికి మాటలు కిటికీల్లా పనిచేస్తాయి.
స్నేహితుడో బంధువో మనసు విప్పి మాట్లాడుతున్నప్పుడు... ఓ అద్దంలా స్పందించాలి. అద్దాలు అర్థంలేని వ్యాఖ్యానాలు చేయవు. ఉచిత సలహాలు అంటగట్టవు. అకారణంగా జాలిచూపవు. ఒక సత్యాన్ని యథాతథంగా ఆవోదిస్తాయంతే. మనం చేయాల్సిందీ అదే.
ఏం ఆలోచిస్తావో, అదే చేస్తాం. ఏం చేస్తావో, అదే మన 'అలవాటు' అవుతుంది. ఆ అలవాట్లే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. ఆ వ్యక్తిత్వమే మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. అంటే ఆలోచనతో వెుదలుపెట్టి, గమ్యానికి చేరుకునేదాకా... అంతా మన చేతుల్లోనే ఉంది. ఒక మంచి అలవాటు మన జీవితంలో భాగమైపోవడానికి ముపైశ్పరోజులు చాలు. ఆ తర్వాత ఓ గొప్ప మార్పు వెుదలవుతుంది. మనమీద మనకు నియంత్రణ వస్తుంది. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. జీవితమంటే స్పష్టత వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* * *
టీనేజీ పిల్లలకు నా సలహా...
జీవితంలో అన్నిటికంటే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ఒక్కసారి కూడా సర్వశక్తులూ ఒడ్డి పోరాడకపోవడం. ఒక్కసారి కూడా నలుగురి ముందూ సగర్వంగా, నిటారుగా నిలబడలేకపోవడం. ఆ పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోకండి!
- అర్నాల్డ్ బెన్నెట్
_____________________________
(ఈనాడు, సండే స్పెషల్, ౧౨:౦౯:౨౦౧౦)
_____________________________