My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, April 30, 2010

Wonderfully described definitions...........


POLITICIAN:
One who shakes your hand before elections and your Confidence Later


CRIMINAL:
A guy no different from the other, unless he gets caught




MISER:

A person who lives poor, so that he can die RICH!




PESSIMIST:
A person who says that O is the last letter in ZERO,Instead of the first letter in OPPORTUNITY


DIPLOMAT:
A person who tells you to go to hell in such a way that you actually look forward to the trip



PHILOSOPHER:

A fool who torments himself during life, to be spoken of when dead



ATOM BOMB:
An invention to bring an end to all inventions




YAWN:
The only time when some married men ever get to open their mouth




OFFICE:

A place where you can relax after your strenuous home life




SMILE:

A curve that can set a lot of things straight!




CLASSIC:

A book which people praise, but never read



ECSTASY:
A feeling when you feel you are going to feel a feeling you have never felt before


CONFERENCE ROOM:

A place where everybody talks, nobody listens and everybody disagrees later on .


DICTIONARY:
A place where divorce comes before marriage



TEARS:
The hydraulic force by which masculine will power is

defeated by feminine water-power!



COMPROMISE:
The art of dividing a cake in such a way that everybody believes he got the biggest piece



CONFERENCE:

The confusion of one man multiplied by the number present .



LECTURE:
An art of transmitting Information from the notes of the lecturer to the notes of students without passing through the minds of either .



CIGARETTE:
A pinch of tobacco rolled in paper with fire at one end and a fool at the other!

(An email forward)



(An email forward)
_______________________________

Labels:

స్వేదం శ్రీశ్రీ వేదం

- డాక్టర్‌ సశ్రీ

ఆధునికతకు విరాట్‌రూపం శ్రీశ్రీ. ఇంటిపేరు, ఒంటి పేరుల్ని క్లుప్తీకరించి అణువుల్లా పేర్చుకోవటంతో పేట్రేగిన ఆధునికత ఆపై కవిత్వమై పేలింది.
రెండక్షరాల శ్రీశ్రీ అంటే లోతు,
శ్రీశ్రీ అంటే ఎత్తు.
శ్రీశ్రీ కవిత్వం అగ్ని.
శ్రీశ్రీ సాహిత్యం మార్పు.
శ్రీశ్రీ ఓ నేత, ఓ దూత, ఓ భావి!
'తెలుగు సాహిత్యం'పై శ్రీశ్రీదే అసలైన 'ముద్ర'. తెలుగు కలాల్లో జడపదార్థాలూ, చైతన్య పదార్థాలూ సమంగానే ఉన్నాయి. శ్రీశ్రీ ఒక్కముక్కలో చోదకశక్తి. మరో ప్రపంచం కోసం పలవరించి తానే మరో ప్రపంచమై వెలుగు రేకలు విప్పారిన ఏకైక కవి. అక్షరంలోని అనంతశక్తిని లోకానికి చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. ప్రాచీన కవులూ, ప్రబంధ కవులూ శబ్ద వైచిత్రికీ, కల్పనా చాతుర్యానికీ పెట్టింది పేరు. మళ్లీ ఆ రెంటినీ ఆధునిక కవుల్లో ఒక్క శ్రీశ్రీలోనే చూస్తాం. ప్రబంధ కవుల తరవాత అంతటి శబ్ద మహేంద్రజాలం శ్రీశ్రీలోనే వెల్లువెత్తుతుంది. పద్యాన్ని తప్పిస్తే తెలుగు కవిత్వం లేనేలేదనిపించేంతలో- నేటికాలంలో 'మహాప్రస్థానం' మేరువై, జనాభ్యుదయానికి చేరువై ఆధునిక సాహిత్యాన్ని బతికిస్తూంటుంది. 1933-'47 నాటి నలభై ఒక్క కవితల స్తంభాలతో కట్టిన మేడ, అగ్నిమంటపం 'మహా ప్రస్థానం'. అది ఓ రకంగా శ్రీశ్రీ చేసిన అగ్నిసంతకం. ప్రజల చేతిలో కాగడా 'మహాప్రస్థానం'. ప్రాచీనమైనదంతా విశిష్టమనీ, ఆధునికమైందంతా అరిష్టమనీ అపోహలు రాజ్యం చేస్తూన్న కాలంలో ఆధునికతలోని ప్రామాణికతకు కొలబద్దగా శ్రీశ్రీ సాహిత్యం నిలుస్తుంది. కార్మిక, కర్షక అభ్యుదయమే శ్రీశ్రీ కవితామార్గం. సామాన్యుడే మహాకవి పాలిటి స్వర్గం. మానవుడే సందేశం... మనుష్యుడే సంగీతం. 'పురోగామి భావాలకు' పునరుత్తేజం కలిగించినదోపిడీకి తావులేనిది సామ్యవాద రాజ్యమేనని ఎలుగెత్తి చాటిన ఎర్రజెండా శ్రీశ్రీ అక్షరాక్షరం.
కర్షక వీరుల కాయం నిండా కాలువకట్టే ఘర్మజలానికి ఖరీదు లేదన్న శ్రీశ్రీకి స్వేదమే వేదం... శ్రామికుడే దేవుడు!! శ్రీశ్రీ చారిత్రక జ్ఞానం రాబోయేకాలంలో కాబోయే కవులకు పాఠమై ప్రవహిస్తుంది. నిజానికి కవిత్వం అన్నది వ్యక్తీకరణ కళ. ఎవరు ఏ మేరకు కవో శిల్పమే పట్టిస్తుంది. శ్రీశ్రీది ప్రత్యేక శైలి. శబ్ద విన్యాసంలో శక్తిమంతుడిగా పేరొందిన శ్రీశ్రీ ఆధునిక కవుల్ని అధిగమించాడు. ఇవాళ్టి వచన కవితతో శ్రీశ్రీ కవితను పోల్చలేం. నిరంతర పరిణామానికి అలవాటుపడ్డ వచన కవిత్వంలో శ్రీశ్రీది ఓ ప్రస్థానం... ఓ శుభారంభం... తొలకరివాన. తనలో తాను వర్షమై కురిసి కురిసి మహా ప్రస్థానమై వెలిసిన కవి శ్రీశ్రీ. తన అంతరాత్మను మండించి లావాగా పెల్లుబికిన కలం శ్రీశ్రీ. సాహిత్య స్పృహకు ఆలవాలం... సామాజిక స్పృహకు బలం శ్రీశ్రీ. ఆయనో సాహిత్య సంస్కర్త. 'ఇంటెలిజెంటిల్మన్‌' లాటి ప్రయోగాలకు శ్మశానాల నిఘంటులు దాటిన అక్షర బాటసారి శ్రీశ్రీ. వ్యధాసర్పదష్టులారా అనాల్సింది 'బాధాసర్పదష్టులార' అంటూ వ్యాకరణాల సంకెళ్లు విదిలించుకున్న కలం శ్రీశ్రీ.
పారశీక గజల్‌ నడకను మాత్రాగణాల్లో పరకాయ ప్రవేశం చేయించి ఛందస్సుల సర్పపరిష్వంగం వదిలించుకున్న అక్షర పారిజాతం శ్రీశ్రీ. ఆకలి, ఆవేదనలు తొడుక్కున్న బట్టలు శ్రీశ్రీ అక్షరాలు. ఆవేశపు ఇస్త్రీ మడత నలగని తెలుగుదనం వెల్లివిరిసే పట్టుపంచె శ్రీశ్రీ సృజన. అవ్యక్తానుభూతుల 'రసన' శ్రీశ్రీ సాహితి. అందరిలా శ్రీశ్రీ కావ్యకర్త మాత్రమే కాదు, అంతకు మించి కార్యకర్త కూడా. పౌరహక్కుల ప్రతినిధిగా పనిచేసిన ఉద్యమ కెరటం శ్రీశ్రీ. విప్లవోద్యమాల పురిటిగడ్డ ఆయన మస్తిష్కం. 1930 తరవాత నడిపించిన పెద్దదిక్కుగా, మార్గదర్శిగా విమర్శకుల మన్ననలందుకున్నాడు. ఏ కూలీ నాలీ జఉద్యమంగా ఉరకలెత్తబట్టే కవుల్లో శ్రీశ్రీ మాత్రమే మహాకవిగా నిలిచాడు, యుగకర్తగా జనహృదయం గెలిచాడు. తెలుగు సాహిత్యానం కోసం కలం పట్టానని శ్రీశ్రీ పలికాడో ఆ సామాన్యులకు శ్రీశ్రీ శబ్దభేరీ 'కవిత్వం' ఏమేరకు అర్థమవుతుందన్నది ఓ ప్రశ్న. ఉన్నంతలో తెలుగు సమాజం చుట్టూ పరిభ్రమించకుండా తక్కిన కవులకు భిన్నంగా ప్రపంచ బాధల్ని పల్లవించటం వరకూ మెచ్చుకోలు. వట్టి నినాదాలు కవితలు కావుకానీ, 'మినీ' కవిత్వాన్ని శ్రీశ్రీ ఆహ్వానించాడు.
'నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది తాజమహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు...' అంటూ శ్రీశ్రీ అక్షరీకరించిన సామాన్య వాక్యాలు సత్యాన్వేషణలో భాగం కనక గొప్పమాటలే అవుతాయి. కష్టజీవికి ఇరువైపులాఉన్నవాడు శ్రీశ్రీ. అక్షరానికి ఆవేశాన్ని నేర్పినవాడు. శ్రీశ్రీ వచ్చేదాకా తెలుగు అక్షరానికి ప్రణయార్చన తప్ప ప్రళయగర్జన తెలీదు. గుప్పెడు అక్షరాల అణువుల్ని ఎలా పోగేయాలో నేర్చిన శాస్త్రవేత్త శ్రీశ్రీ. కన్నీటికి ఉప్పెన రూపాన్ని ఇవ్వగల ప్రకృతి శ్రీశ్రీ. సామ్యవాదం జాబిలిని చూపి అక్షరాల గోరుముద్దలు తినిపించే అమ్మ శ్రీశ్రీ. ఓ అభ్యుదయ సంతకం... ఓ విప్లవ కెరటం... ఓ పోరాట రూపం. కవిత్వాన్ని ఆరాటంగా కాక పోరాటంగా మలచిన యోధుడు. శ్రీశ్రీ అక్షరాలు ఆశావాదానికి కళ్లు, పురోగామి భావాలకు కాళ్లు!
(ఈనాడు, ౩౦:౦౪:౨౦౧౦)
______________________________

Labels:

సినిమా పాట మీద శ్రీశ్రీ సంతకం

ఆయన - ఆకలి వాకిట కేకలు వేసిన సిరిసిరి పాపడు. శబ్దాన్ని శాసించి, శతాబ్దం తనదేనని ఘోషించిన యుగపురుషుడు. ఆయన అరిస్తే పద్యమైంది... స్మరిస్తే వాద్యమైంది. ఆ కలం ఖడ్డసృష్టిలో అక్షరాక్షరం అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యమైంది. 'సినిమాల చిట్టడవిలో చిక్కుకొన్న మహాకవి' అని కొందరు వాపోయినా ఆ చిట్టడవిలో దట్టమైన గీత వసంతాల్ని పూయించడం శ్రీశ్రీకి హక్కుభుక్తమైంది. మహాకవి శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంలో ఓ విహంగ వీక్షణ...
________________________________

దృశ్య కావ్యాల మీద శ్రీశ్రీకి ఉన్న మక్కువ సినీ రంగంలో స్థిరపడేలా చేసింది. అంత వరకూ జీవిక కోసం రకరకాల ఉద్యోగాలు చేస్తూ వచ్చిన శ్రీశ్రీ చివరి వరకూ సినిమాల్లోనే కొనసాగడానికి ఇదే కారణం. 1950లో 'నీర్‌ ఔర్‌ నందా' చిత్రాన్ని 'ఆహుతి' పేరుతో అనువదించిన శ్రీశ్రీ డబ్బింగ్‌ ప్రక్రియకు అంకురార్పణ చేశారు. అందులో 'ప్రేమయే జనన మరణ లీల' పాట శ్రీశ్రీకి మంచి పేరు తెచ్చింది. అనంతరం టాకీపులి హెచ్‌.ఎమ్‌.రెడ్డి, మునాఫ్‌ లాంటి వారి దగ్గర శ్రీశ్రీ నెల జీతానికి కుదురుకున్నారు. అనువాద చిత్రాల ద్వారా స్థిరపడ్డ తనకు డబ్బింగ్‌ రైటరు అనే ముద్రపడినా పట్టించుకోలేదు. అవకాశం వస్తే విజృంభించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో అన్నపూర్ణా వారి 'తోడికోడళ్లు', 'మాంగల్యబలం', 'వెలుగునీడలు', 'ఇద్దరు మిత్రులు', 'డాక్టర్‌ చక్రవర్తి' లాంటి చిత్రాలు - శ్రీశ్రీలోని విశ్వరూపాన్ని చూపెట్టాయి.పి.ఎ.పి.వారి 'భార్యాభర్తలు', 'కులగోత్రాలు', 'పునర్జన్మ', ఆత్రేయ 'వాగ్దానం', రాజ్యంవారి 'నర్తనశాల', రేఖా అండ్‌ మురళీ 'దేవత', జగపతివారి 'ఆరాధన', సురేష్‌ ప్రొడక్షన్స్‌ 'రాముడుభీముడు' చిత్రాల్లో శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన గీతాలు ఆల్‌టైమ్‌ హిట్స్‌గా నిలిచాయి.

హీనంగా చూడకుదేన్నీ:
నిజానికి డబ్బింగ్‌ గీతాల్లో సైతం శ్రీశ్రీ ప్రయోగాలు చేశారు. 'హీనంగా చూడకు దేన్నీ... కవితామయమేనోయి అన్నీ' అని పరోక్షంగా స్పష్టం చేశారు. తొలి చిత్రం 'ఆహుతి'లో సంగీత దర్శకులు ఎస్‌.రాజేశ్వరరావు సందర్భోచితంగా తాళం బిట్లు తీసుకొని, వేరే ట్యూన్స్‌ సమకూరిస్తే వాటికి తగ్గట్టుగా శ్రీశ్రీ రాసిన పాటల్ని ప్రయోగంగానే భావించాలి.

అలాగే 'గాంధారి గర్వభంగం' (డబ్బింగ్‌) చిత్రంలోని 'పదునాలుగు లోకముల ఎదురేలేదు' అనే పాట నేపథ్యగీతం కావడంతో, లిప్‌సింక్‌ ఇబ్బంది లేకపోవడంతో దాన్ని శ్రీశ్రీ స్వతంత్ర రచనలాగే రూపొందించారు. ఈ పాట తాలూకు స్ఫూర్తి 'బాలభారతం' చిత్రంలో ఆరుద్ర రాసిన 'మానవుడే మహనీయుడు' మీద స్పష్టంగా కనిపిస్తుంది.అనువాద ప్రక్రియకు మెలకువలు చెప్పిన ఘనత కూడా ఈయనదే. పరాయి పలుకులు తెలుగు మాటలుగా వినిపించాలంటే ఏం చెయ్యాలీ, ఎలా చెయ్యాలనే విషయానికో మార్గం వేశారాయన. ప, ఫ, బ, భ, మ అనే ఓష్ట్యాల విషయంలో జాగ్రత్త పాటించాలని సూచించింది శ్రీశ్రీయే.

వైవిధ్యం ఆయన సొంతం:
రాశిలో తక్కువే అయినా వాసిగల సినిమా పాటల్ని శ్రీశ్రీ రాశారు. నిప్పులురిమే ఉద్యమ గీతాలకో, ఉత్తేజాన్ని నింపే దేశభక్తి పాటలకో, జాతిని జాగృతపరచే ప్రబోధాత్మక రచనలకో ఆయన పేటెంట్‌ కావచ్చుగాక. స్వేచ్ఛ లభించిన సందర్భాల్లో ఆయన్నించి చిలిపి సినీగీతాలు వెలువడ్డాయి. గిలిగింతలు పెట్టే సాహిత్యం శ్రీశ్రీ కలం నుంచి వెలువడింది.

మీసాల మీద సీసం రాయడం శ్రీశ్రీకే చెల్లింది. 'సదమల మదగజ గమనము'తో తెలుగు సినిమాలో హరికథను చెప్పించడం ఆయన హక్కుభుక్తమైంది. వీణపాటలకు ప్రాచుర్యం శ్రీశ్రీతోనే మొదలైంది. పాడవోయి భారతీయుడా అని ప్రతి పౌరుడితోనూ పాడించినా, బతుకును కన్నీటిధారలకు బలిచేయవద్దని ప్రబోధించినా, బొమ్మను చేసి ప్రాణము పోసిన వాడిలోని ఆడుకొనే వేడుకను ప్రశ్నించినా, మనసున మనసైన తోడు కోసం సితార మీటినా, తెలుగువాడి పౌరుషాగ్నితో మన్యంలో మంటలు పుట్టించి తెలుగు సినిమా పాటను తొలిసారిగా జాతీయ పురస్కారంతో అలంకరించినా అది మహాకవి శ్రీశ్రీకే సాధ్యమైంది.

ఆశావహ దృక్పథం:
'చెవిలో రహస్యం' పేరుతో ఓ డబ్బింగ్‌ చిత్రాన్ని తీసి ఆర్థికంగా దెబ్బతిన్న శ్రీశ్రీ తన వ్యక్తిగత సమస్యల్ని సినిమా రచనపై ప్రసరించకుండా 'ప్రొఫెషనల్‌' స్థాయిని కనబరిచారు. ముందున్న మంచి కాలాన్ని తన గీతాల్లో ఉజ్వలంగా ప్రదర్శించారు. ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని ఎదురుచూడకుండా నిజం తెలుసుకొని నడుంబిగించమని ఉద్బోధించారు.

శ్రీశ్రీ పాటలకే పరిమితం కాలేదు. ఎన్నో చిత్రాలకు చిత్ర సంవిధానాన్ని సమకూర్చి పదునైన సంభాషణలు కూడా రాశారు. ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో తెలుగు సినిమాలు రావాలని, సొంతంగా తీయాలని శ్రీశ్రీ కన్న కలలు అలాగే మిగిలిపోయాయి. అలాంటి చిత్రాలు మనవాళ్లు తీయాలి.. అదే శ్రీశ్రీకి అసలైన నివాళి.

(ఈనాడు, సినిమా, ౩౦:౦౪:౨౦౧౦)
____________________________

Labels: ,

శత వసంతాల జ్వాలాశిశువు

-డాక్టర్‌ అద్దంకి శ్రీనివాస్‌

'పతితులార భ్రష్టులార! బాధాసర్పదష్టులార! ఏడవకండేడవకండి-'
ఈ ఓదార్పు 19వ శతాబ్ది తెలుగుజాతినే కాదు, యావత్‌ దేశాన్నీ ఉలిక్కిపడేటట్టు చేసింది. కవిత్వంలో అక్షరాల్నికాదు అశ్రువుల్ని నింపుకొని; భావోద్వేగాల్నికాదు వాస్తవదృశ్యాల్ని అల్లుకొని అత్యంత వేగవంతంగా చెప్పిన కవి శ్రీశ్రీ.శ్రీశ్రీ కవిత్వంలోని వేగాన్ని పట్టుకున్న కవి ఇంతవరకూ పుట్టలేదు. శ్రీశ్రీతో పోల్చదగిన కవీ తెలుగునాట లేడు. సాంప్రదాయిక శక్తిని అంతర్నిహిత విద్యుత్తుగా మార్చి, అభ్యుదయపథాల పరుగుపెట్టించిన భాషాభగీరథుడు ఆయన. శబ్దశక్తినీ, అర్థవ్యాప్తినీ అంచనావేసి వాడిన ప్రయోగశీలి. అందుకే యుగకవిగా శ్రీశ్రీ గుర్తింపు పొందాడు.

'వ్యక్తికి వింజామరలు విసరలేను/ సమూహం నా సరదా' అని ప్రకటించి, ప్రజలవైపు ముఖ్యంగా పీడిత, తాడిత వర్గాల అభ్యున్నతి కోసం నిలిచిన మానవతావాది శ్రీశ్రీ. విదేశాల్లోని పరిస్థితులపై దృష్టి కేంద్రీకరించి, దేశీయ అభ్యున్నతికోసం విదేశీ విజ్ఞానాన్ని వాడటంలో సిద్ధహస్తుడాయన. శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి ఎందుకు యుగకర్తగా నిలిచాడని ప్రశ్నించుకొని ఆలోచిస్తే- వ్యక్తిత్వంలో, కవిత్వంలో, జీవితంలో చిత్తశుద్ధిగా శ్రమసౌందర్యాన్ని ఆకాంక్షించిన వ్యక్తిగా, ఉద్యమమూర్తిగా కన్పిస్తాడు. అప్పటివరకు వూహాలోకాల్లో విహరిస్తున్న తెలుగు కవిత్వానికి వాస్తవిక స్పృహను, హేతువాద దృక్పథాన్ని, సామ్యవాదాన్ని కలగలిపి ప్రభంజనం సృష్టించాడు.

సమానత్వం కావాలంటే ముందుగా రాజకీయ స్వాతంత్య్రం, తరవాత ఆర్థిక స్వాతంత్య్రం కావాలనీ, వీటిలో రెండోది మనకింకా రాలేదని ఏనాడో చెప్పాడు. అలాగే ప్రపంచీకరణవల్ల జరిగే విధ్వంస చిత్రాన్ని నాడే తన కవిత్వంలో చూపాడు. 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను' అనడంలో వైయుక్తిక చైతన్యాన్ని సామాజిక చైతన్యంగా రూపుకట్టించడం కన్పిస్తుంది. శ్రీశ్రీ వ్యక్తిత్వం నుంచి, కవిత్వం నుంచి సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆర్థిక దృక్పథాలకెన్నో కొత్త దారులు దొరుకుతాయి. కార్మిక విజయావిష్కరణ, సామాజిక హృదయ స్పందన, వాస్తవ జీవనచిత్రణ సాహిత్యంలో శ్రీశ్రీతోనే పుట్టాయి. కళకి ఆధారం భ్రమ కాదనీ, సామాజిక సత్యాల్ని వాస్తవిక దృష్టితో కవిత్వంలో పొదగడమే కళ అనీ శ్రీశ్రీ నిర్వచనం. సామాజిక స్పృహ లేని కవిత్వంలో నాగరక లక్షణాలుండవు. అందుకే సామాజిక కవిత్వంలోని అనుభూతిని సామాజిక చైతన్యం, శ్రమజీవన సౌందర్య వర్ణనలవైపు నడిపిన కవి శ్రీశ్రీ. పెట్టుబడిదారీ విధానాన్ని అన్నివిధాలుగా ఖండించి కార్మికవర్గాల్లో తీవ్ర చైతన్యాన్ని మేల్కొల్పిన శాస్త్రీయ సామ్యవాదాన్ని పుణికిపుచ్చుకుంది శ్రీశ్రీ కవిత.

'ధనిక స్వామికి దాస్యంచేసే
యంత్రభూతముల కోరలు తోమే
కార్మిక వీరుల కన్నుల నిండా
కణకణమండే గలగల తొణికే
విలాపాగ్నులకు విషాదాశ్రులకు
ఖరీదుకట్టే షరాబులేడోయ్‌'
- ఈ మాటలు పారిశ్రామిక విప్లవం తెచ్చిన ఆర్థిక సంక్షోభానికి సాక్షీభూతాలు. ఏళ్ళతరబడి అభివృద్ధికి నోచుకోక గనుల్లో, కార్ఖానాల్లో మగ్గుతున్న కార్మిక సోదరుల వ్యథార్త దృశ్యాలు. ప్రపంచమంతటా అభివృద్ధి కాంక్షించే స్వభావం రావడానికి కారణం రష్యన్‌ విప్లవం. విప్లవం నుంచే శ్రామికలోకం పక్షాన నిలిచి కణకణమండే త్రేతాగ్నుల్లాంటి కవితల్ని శ్రీశ్రీ వెెలయించాడు. సామాజిక విప్లవానికి పురోగామిగా సాహిత్య విప్లవం సాగాలన్న దృఢసంకల్పాన్ని పొందాడు. దీనికి శ్రీశ్రీలోని ప్రయోగవాదశీలం దోహదం చేసింది. కవిత్వం, సమాజం రెండూ పరిణామశీలాలు. కాబట్టి ఈ రెంటిపై ప్రయోగాలు తప్పవు. ఈ ప్రయోగాలు సకలజన ప్రయోజనాలకు అనుకూలమైనప్పుడు మాత్రమే అది ఒక సంప్రదాయంగా ఘనీభవిస్తుంది. అందుకే నాడు శ్రీశ్రీ పూరించిన శంఖారావ ప్రతిధ్వనులే నేడూ సమాజంలోనూ, శ్రామికవర్గ చైతన్యంలోనూ, సాహిత్యంలోనూ విన్పిస్తున్నాయి.

కష్టించే కండల్ని పూజించని సమాజంలో జవసత్వాలు లేనట్లే. అది వృద్ధ ప్రపంచం. అందుకే ఆ వృద్ధ ప్రపంచానికి నెత్తురూ, కన్నీరు కలిపి శ్రీశ్రీ కొత్త టానిక్‌ తయారుచేశాడు. అక్షరాల్ని ఆ టానిక్‌లో ముంచి, ప్రతి పదాన్నీ కదం తొక్కించాడు. శ్రీశ్రీ కవిత్వంలో పదాలు, భావాలు, ప్రతీకలూ అన్నీ శ్రమసౌందర్యాన్ని ఆస్వాదించేవిగా, స్వేదానికి పట్టాభిషేకం చేసేవిగా కన్పిస్తాయి. మాట్లాడే మంటలు, శ్రామికలోకపు సౌభాగ్యాలు, వర్షుకాభ్రముల ప్రళయ ఘోషలు, అగ్నికిరీటపు ధగధగలు, ఎర్రబావుటా నిగనిగలూ... అన్నీ కార్మిక లోకకల్యాణం కోసమే.

శ్రీశ్రీ 1934-47 వరకూ రాసిన కవితల సంపుటి 'మహాప్రస్థానం'. మహాభారతంలో పాండవులు మహాప్రస్థానం చేసింది స్వర్గారోహణ కోసమే. సామ్యవాద సమాజాన్ని స్వర్గంగా కలలు కన్న శ్రీశ్రీ కూడా మహాప్రస్థానం రాశాడు. సాహిత్యంలో ప్రతిదీ ప్రతిఫలించాలనీ, అంతా కవితామయం చేశాడు. అందులోనూ శ్రమకు పట్టమే కట్టాడు.
కుక్కపిల్ల-ఆకలి, అగ్గిపుల్ల-పరిశ్రమ, సబ్బుబిళ్ల-ఫ్యాక్టరీ, రొట్టెముక్క- బేకరీ, అరటితొక్క-కర్షకుడు, బల్లచెక్క-శ్రామికుడు, తలుపుగొళ్లెం-బ్రిటిషువారి పాలన, హారతి పళ్ళెం-విజయం, గుర్రపుకళ్ళెం- వేగం.
వీటిలో మొదటి పదాల ద్వారా ప్రతీకలుగా రెండవ పదాల్ని స్ఫురింపజేశాడు. 'అల్పాక్షరంబుల అనల్పార్థ రచన' ఇదే. వీటిలో శ్రామిక వర్గాల బాధలు, ఆకలికేకలూ స్వాతంత్య్రం వచ్చినా తీరలేదని, తీర్చడానికి వేగవంతమైన తన కవిత్వం ద్వారా పాటుపడతాననే సందేశాన్నిచ్చాడు. దీనికి మద్దతుగా-
'చీనాలో రిక్షావాలా,
చెక్‌ దేశపు గని పనిమనిషీ,
ఐర్లాండున ఓడ కళాసీ,
అణగారిన ఆర్తులందరూ ఖండాంతర నానా జాతులు...'


'ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం'.

'ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా?! ఇకపై సాగదు'...

'నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది?',

'తాజమహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు'
వంటి లోతైన, గాఢమైన భావవాక్యాలు నిలుస్తాయి. విదేశీయులైన చెహోవ్‌, ఫ్రాంజ్‌కాంఫ్కా, కారల్‌ చాపెక్‌, విక్టర్‌ సాడన్‌, విలియం సోలోయార్‌, వాల్ట్‌ విట్‌మన్‌, ఇ.ఇ.- కమింగ్‌, మయకోవస్కీ, సాబ్లోనెరుడా, పుష్కిన్‌, వాసిల్వేవా, కోవ్‌సాంతిన్‌, అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌, రసా, షాన్‌ షెంకిస్‌ వంటి ప్రగతిశీలవాదులను తెలుగువారికి పరిచయం చేయడం కూడా సామ్యవాద ఆకాంక్షల్లో భాగమే. ఈ సామ్యవాదాన్ని ఆకాంక్షించిన కార్ల్‌మార్క్స్‌, ఏంగెల్స్‌, లెనిన్‌లను శ్రీశ్రీ కణకణమండే త్రేతాగ్నులుగా ఉత్ప్రేక్షించాడు. 'ధనంజయునిలా సాగండి...' అన్న మహాప్రస్థానంలోని పిలుపు, విజయునిలా విక్రమాన్ని చూపాలని ఉద్బోధిస్తుంది.

ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలి. శ్రమైక జీవన సౌందర్యాన్ని గుర్తించేటట్టు, సామ్యవాదాన్ని ఆకాంక్షించేటట్టూ చేయాలి. దీనికోసం దిగుమతి చేసుకున్న విదేశీ భావజాలాన్ని తెలుగునాట సంప్రదాయంలో విత్తాడు. అది అంకురించి, తదుపరి సాహిత్యంలోనూ, సమాజంలోనూ ఉద్యమాలుగా వికసించింది. శ్రీశ్రీ ఎంచుకొన్న ఈ ప్రణాళికలో భాగమే సంప్రదాయ పదజాలాన్ని కొత్త అర్థాలలో వాడటం.
సమిధ, భూతం (ప్రాణి), యజ్ఞోపవీతం, ముహూర్తం (12 క్షణాల కాలం) వంటివెన్నో ఉన్నాయి.
ఇంకా 'యముని మహిషపు లోహఘంటలు...'
'నరకలోకపు జాగిలమ్ములు,'
'ఉదయసూర్యుని సప్తహయములు...'

'కనకదుర్గా చండసింహం,'
'ఇంద్రదేవుని మదపుటేనుగు...' మొదలైన ప్రయోగాల్లోనూ శ్రామిక జీవన దృక్పథ వర్ణనమే కన్పిస్తుంది. సనాతనంగా సంప్రదాయంలో ఉన్నవాటినే ప్రతీకలుగా తీసుకొని, అందులో సామ్యవాదాన్నీ అభ్యుదయ కాంక్షను పలికించాడు శ్రీశ్రీ. శాంతికాముకత, సమసమాజ నిర్మాణం, వర్గసంఘర్షణ వంటి లక్షణాల పట్ల ఆకర్షితుడైన శ్రీశ్రీ-
'కదిలేదీ కదిలించేదీ,
మారేదీ మార్పించేదీ,
మునుముందుకు సాగించేదీ,
పెనునిద్దుర వదిలించేదీ' అభ్యుదయ పథమే
నని నమ్మారు. '1930 వరకూ కవిత్వం నన్ను నడిపించింది. 30ల తరవాత నేను కవిత్వాన్ని నడిపిస్తున్నాను' అన్న ఆత్మవిశ్వాసపూరిత వాక్యాలు అభ్యుదయ దృక్పథం హృదయం నుంచి వచ్చినవే. ఇదే శ్రీశ్రీని సమాజానికి, కవిత్వానికి నిబద్ధుణ్ణి చేసింది.

'కవికి సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది. దాన్ని విస్మరించడం అంటే సమాజానికే ద్రోహం. వెనుకటి కవులు నిరంకుశులేమో కానీ నేటి కవులు సమాజ శ్రేయస్సుకి నిబద్ధులు' అన్న ఆయన మాటలు, కవికీ సమాజానికీ ఉండవలసిన బంధాన్ని వివరిస్తాయి. కవిత్వం పట్ల కూడా లోతైన అవగాహన శ్రీశ్రీకి ఉంది. ప్రక్రియ, వస్తువు- రెండూ కలిస్తేనే కవిత్వమనీ, ప్రక్రియ శరీరమైతే వస్తువు ప్రాణమనీ, ఈ రెండూ పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని, ఈ లక్షణం కేవలం ఆధునిక కవిత్వానికే కాక, అన్ని కాలాల, అన్ని ప్రాంతాల కవిత్వాలకూ వర్తిస్తుందని నమ్మినవాడు శ్రీశ్రీ. అందుకే ప్రాచీన ఛందస్సులోని సంస్కృత పదాలను, విదేశీయుల భావాలను అన్నింటికీ అతీతంగా కొత్తకొత్త అర్థాలలో ప్రయోగించగలిగాడు. 'సమాజంలోని సంఘర్షణలనూ, సమస్యలనూ మార్క్సిస్ట్‌ దృక్పథంతో అవగాహన చేసుకోవాలి. ఈ అవగాహనే తల్లివేరు లాగా కవిత్వానికి పరిపుష్టినిస్తుంది. నేను కవిత్వం రాసేటప్పుడు ఇదే నా నిబద్ధత- సిద్ధాంతం' అని చెప్పుకొన్న శ్రీశ్రీ ప్రతి కవిత్వ చలనంలోనూ ఒక కొత్త చోదకశక్తిని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు.

శ్రీశ్రీ ఆలోచనలు, ఆశయాలు, అభ్యుదయం, శబ్దప్రయోగంలోని వేగం, తళుక్కున మెరిసే చమత్కారం ఎవరూ అందుకోలేనివి. కాలం కన్నా ముందు పరిగెత్తేదే కవిత్వమనీ, ఇది కేవలం జీవితానికి వ్యాఖ్యానం మాత్రమే కాదని, సమస్యలకు పరిష్కారం చూపించేదనీ శ్రీశ్రీ అభిప్రాయం. కవిత్వం ఒక భోగవస్తువుగా కాక ఉపయోగ వస్తువుగా మారినప్పుడే అది ప్రజా కవిత్వమవుతుంది. ఈ లక్షణం ఉండడం వల్లనే శ్రీశ్రీ రాసిన 'కవితా ఓ కవితా' గీతం- సంప్రదాయవాది విశ్వనాథ సత్యనారాయణ కూడా కంటతడి పెట్టించిందట! అంతటి వేగం, ఆవేగం శ్రీశ్రీ కవితకే సొంతం.

శ్రీశ్రీ జీవితానికి, కవిత్వానికి ప్రయోగం హృదయనాడి. భిన్నంగా చెప్పడం, ఉండటం శ్రీశ్రీకి నచ్చే గుణాలు. శ్రీశ్రీ- ఆలోచనల్లో లోతుల్నీ, ఆశయాల్లో ఉన్నతాల్నీ శ్వాసించే నిరంతర క్రియాశీలక జీవి. తెలుగు సాహిత్యాన్ని ఒక్కసారిగా జాగృతం చేసి నవీన పంథాలో దౌడు తీయించిన రౌతు. శ్రీశ్రీ కవిత ఒక మహాశక్తి. దాని ప్రభావం సమాజంపై నేటికీ ప్రసరిస్తోంది. శ్రీశ్రీ మరో ప్రపంచపు కణకణమండే త్రేతాగ్ని. న్నో దీపాలను వెలిగించిన సాహిత్య జ్యోతి. శ్రీశ్రీ మనస్సే ఒక కార్మికశాల. నిరంతరం కవితాక్షరాలు అచ్చుపోసినట్టు వస్తూ శ్రమజీవికి పట్టాభిషేకం చేస్తాయి. ఆధునిక కవిత్వానికి తొలి వేకువ శ్రీశ్రీ. ఫిరంగిలో సైతం జ్వరం ధ్వనింపజేసే మృదంగరావాలు శ్రీశ్రీ పిలుపులు. కవిత్వంతో కదం తొక్కిన ఏకైక కమాండో! కవిత్వంలో మెషిన్‌గన్‌లాంటివాడు. జీవితంలో నైట్రోజన్‌లాంటివాడు. కొడవటిగంటి కుటుంబరావు మాటల్లో చెప్పాలంటే 'శ్రీశ్రీ కన్నా మిన్న ఏదైనా ఉందంటే- అది శ్రీశ్రీ కవిత!'
(రచయిత హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులు)
(ఈనాడు, ౩౦:౦౪:౨౦౧౦)
_________________________________

Labels: