రాజకీయ 'క్రీడాభిరామం'
మనిషికి మనిషి తోడు లేకుండా రోజు గడవదు. ప్రతి మనిషీ తన అవసరాల నిమిత్తం మరో మనిషిపై ఆధారపడక తప్పదు. మనిషి సంఘజీవి- అనే తీర్మానానికి పునాది అదే! 'నా కొరకు చెమ్మగిలు నయనమ్ము లేదు' అనే కవి నిరాశలోంచి తొంగిచూసే అవసరం- మానసికమైనది. నలుగురినీ మంచి చేసుకోమని పెద్దలు చెప్పేది- మనిషి చివరిరోజు భౌతికమైన అవసరాలకు చెందినది. జీవన ప్రవాహంలో ఎక్కడెక్కడినుంచో నెట్టుకొచ్చిన వ్యక్తులతో సమూహాలు ఏర్పడతాయి. అవసరాలు నేపథ్యంగా వారి మధ్య ఒక కట్టుబాటు మొదలవుతుంది. వారిది ఒక సంఘం అవుతుంది. 'మానింది మందు, బతికింది ఊరు' అనే సామెత ఆ పాదులోంచే పుట్టింది. ప్రతి సంఘాన్నీ అవసరాలే నడిపిస్తాయనుకోవడం పొరపాటు. ఉద్యమాల నిర్వహణకోసం కొన్ని సంఘాలు రూపుదిద్దుకుంటాయి. ఉదాత్త లక్ష్యాలకోసం మరికొన్ని. సమాజమన్నాక, రకరకాల వారు ఉంటారు. కొందరిని ఆశయాలు నడిపిస్తాయి. మరికొందరిని ఆశలు నడిపిస్తాయి. చాలామందిని అవసరాలు పరుగెత్తిస్తాయి. స్వరాజ్య ఉద్యమాన్ని అప్పట్లో ఆశయం ఉత్తేజపరచింది. రాజకీయ నిరుద్యోగ సంఘాలను ఇప్పట్లో ఆశ ప్రేరేపిస్తున్నది. కడుపు నింపుకొనేందుకు కష్టజీవులు సైతం కలిసి సంఘాలుగా ఏర్పడతారు. 'కూలన్నల సంగమూ- కూడుతున్న సంగము... రైతన్నల సంగమూ- రగులుతున్న సంగము, పేదోళ్ళంతా పెడదామిక సంగం... సంగం... సంగం... రండిరో... లెండిరో... సంగం పెడదాం' అనే గీతం కష్టజీవులను ఉత్తేజపరచి సంఘటితం చేసే లక్ష్యంగా వెలువడింది. సభ్యుల బలాన్ని, ఆశయాలను బట్టి సంఘాలకు గుర్తింపు దొరుకుతుంది.
ఉదాత్త ఆశయాలకోసం ఉద్యమాలు నిర్మిస్తామని నినదించే నేతలు సైతం- తమ తమ కుల సంఘాలతో రహస్య సమావేశాలు జరపడం ఈ దేశంలో సహజం. అదొక చేదు నిజం! సూదికి కలపడం లక్ష్యం. కత్తెరకు విడదీయడం నైజం. వ్యక్తులను ఉద్యమాలు దగ్గర చేస్తాయి. కులాలు చీలుస్తాయి. పగలంతా పత్రికల్లో, ఛానెళ్లలో పడి తిట్టుకుని, రాత్రిళ్లు ఒకరినొకరు 'మనోడే' అంటూ కావలించుకోవడం చూసేవాళ్ళకు జుగుప్సగా తోచినా, అది నేతల నిత్యకృత్యమైపోయింది. 'మనోడే' అనే మాటకు అర్థమేమిటో ఈ దేశంలో పసిపిల్లవాడిని అడిగినా చెబుతాడు. అదే విషాదం! రాబోయే రోజుల్లో కులాల పేరుతోనే నేరుగా రాజకీయ పార్టీలు ఏర్పడినా ఏమీ ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కులం పేరు చెప్పి రహస్యంగా సీట్లు, ఓట్లు దేబిరిస్తున్న వారంతా అప్పుడు బాహాటంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటారు. భారతదేశ రాజకీయ ముఖచిత్రం ఇలా కులం పేరుతో దుర్వాసన కొడుతుంటే- అక్కడక్కడా సజ్జన సంఘాలు చక్కని పరిమళాలను వెదజల్లుతుంటాయి. 'మతం వేరయితేను ఏమోయి! మనసులొకటై మనుషులుంటే, జాతి అన్నది లేచి పెరిగి, లోకమున రాణించునోయి' అన్న మహాకవి ప్రబోధాన్ని మకుటంగా స్వీకరించిన సత్పురుషులు ఇంకా ఈ నేలమీద ఉన్నారు. వాళ్ళెవరూ మనకు కుల సంఘాల్లో తగలరు. మనం వెతికితే వాహ్యాళి బృందాల్లో, ఆధ్యాత్మిక సేవా సంఘాల్లో, గ్రంథాలయ పాఠక సమితుల్లో, సత్సంగాల్లో, కవుల వేదికల్లో, కళాకారుల సదస్సులలో కనబడతారు. వారిని గుర్తుపట్టడానికి సులువైన దారి ఏమంటే- వారు మనుషుల్లా జీవిస్తారు, మనుషుల్ని ప్రేమిస్తారు. ఆత్మీయత, ఆపేక్ష, బెంగ, కన్నీరు, జాలి, దయ... వంటి కొన్ని మానవ సహజమైన చిహ్నాలు వారిలో గోచరిస్తాయి.
దేవుడు ప్రత్యక్షమై 'ఏం కావాలో కోరుకో' అని అడిగితే '...నితాంత అపార భూతదయను ప్రసాదించు' అని కోరాడు సుదాముడు. భూతదయ అంటే కేవలం మానవులకే పరిమితమైనది కాదు. పశువూ పక్షీ చెట్టూ చేమా... అన్నింటినీ ప్రేమించగల లక్షణం అది. శ్రీరమణ 'బంగారు మురుగు' కథలో బామ్మ ఈ స్వభావాన్ని చాలా సరళంగా చెప్పింది. 'చెట్టుకు చెంబెడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకు నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్నవాడికి పట్టెడన్నం పెట్టడం...' అంది. ఈ తరహా భూతదయను మనం ఈవేళ పాశ్చాత్యుల నుంచి నేర్చుకోవలసి వస్తోంది. కుల సంఘాలతో మనం ఇక్కడ కొట్టుకు చస్తుంటే- పాశ్చాత్యులు మాత్రం ప్రకృతి ప్రేమికుల సమాజం, పర్యావరణ సంరక్షణ సమితి, జంతు ప్రేమికుల పార్టీ, మానవ హక్కుల పరిరక్షణ సంఘం... వంటి మానవీయ కోణంతో కూడిన సంక్షేమ సంఘాలతో ముందుకొస్తున్నారు. ఒకవేళ రాజకీయ పార్టీలు పెట్టదలచినా- అలాంటివారే మంచి పార్టీల స్థాపనకు అర్హులు. మన దేశానికీ జాలి, దయ కలిగి శీలంతో వ్యక్తిత్వంతో ఆకట్టుకోగలిగే సామాజిక నేతలు కావాలి, రాజకీయ నాయకులు కాదు. సూది, కత్తెరల్లాగ- కలిపి కుట్టే దిశగా కళా సంఘాలు, కలత పెట్టే దిశగా కుల సంఘాలతో మనం ఇక్కడ సతమతం అవుతుంటే- ఒక ఆస్ట్రేలియన్ పెద్దమనిషికి విలక్షణమైన ఆలోచన తోచింది. రసికులకోసం రాజకీయ పార్టీ స్థాపిస్తే తప్పేముందని ఫియోనా పాటెన్‌కు అనిపించింది. 'ద ఆస్ట్రేలియన్ సెక్స్ పార్టీ' పేరుతో ఈ మధ్యనే ఆయన రాజకీయ సంస్థను స్థాపించాడు. శృంగారంపట్ల ఆసక్తిగలవారంతా తమ సంఘంలో చేరతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. వారి మద్దతుతో ఎన్నికల్లో కొన్ని స్థానాలూ గెలవొచ్చని ఆయన నమ్మకం. దానికి తగ్గట్టే రసవత్తరమైన ఎన్నికల ప్రణాళికను సైతం ఆయన ప్రకటించాడు. ఆ పేరునుబట్టి మిగిలిన వివరాలన్నింటినీ మనం ఊహించుకోవడం తేలికే! మరి దానికి ఏపాటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.
(Eenadu, editorial, 23:11:2008)
_______________________________________
Labels: Life/telugu