My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, December 15, 2007

Nature smiles


__________________________________________________

Labels:

Wednesday, December 12, 2007

తల్లివేరు కోసం తపిస్తున్న పిల్లవేర్లు

ఆంధ్రకు వచ్చేస్తామంటున్న శ్రీలంక తెలుంగులు
తెలుగునేల మా అమ్మ వూరంటున్న గిరిపుత్రులు.
అలెక్స్‌ హెలీ 'ద రూట్స్‌'(తెలుగు అనువాదం 'ఏడుతరాలు') నవలలోలాగా- గాంబియా దేశం నుంచి నీగ్రో బానిసలుగా అమెరికాకు బలవంతంగా ఎగుమతిఅయిన కుంటాకిటేలు కారు వారు. ముస్లింల దండయాత్రలతో స్వదేశం పర్షియా(ప్రస్తుత ఇరాన్‌)ను వీడి భారత్‌కు పారిపోయి వచ్చిన పార్శీలూ కారు. బానిసత్వమో, దండయాత్రలో వీరిని తరిమేయలేదు. కానీ పురిటిగడ్డను వీడి దేశంకాని దేశం చేరారు. ఎలా వచ్చారో, ఎందుకు వచ్చారో వీరికే తెలియదు. తరాలు మారాయి కాబట్టి తాము ఏ ప్రాంతం నుంచి వచ్చామో నేటితరం ఎరుగదు. వారు గుర్తుంచుకున్నదల్లా... ఎన్నితరాలు మారినా, మారని వారి భాష. ఆంధ్రరాష్ట్రంతో పేగుబంధాన్ని గుర్తుకుతెచ్చే తేటతెనుగు భాష. వారు ఆంధ్రులు అనడానికి ఆ ఒక్క రుజువు చాలు. దాదాపు 400 పైచిలుకు ఏళ్లకిందట శ్రీలంకకు చేరిన తెలుగు బిడ్డల యథార్థ జీవనగాథ ఇది. ఆదరిస్తే ఆంధ్రకు వచ్చేస్తామంటున్న తెలుంగు గిరిపుత్రుల భావోద్వేగానికి అక్షర రూపమే ఈ కథనం. -చామర్తి మురళీధర్‌
రవాణా సౌకర్యాలు కూడా అభివృద్ధికాని రోజుల్లో శ్రీలంకకు చేరిన తెలుగు గిరిజనులు కారణాంతరాల వల్ల ఇక్కడే సిర్థపడ్డారు. శ్రీలంకలో వీరిని అహుకుంటికలుగా పిలుస్తారు. తాము మాట్లాడే భాష తెలుగునే తమ జాతి(తెలుంగు) పేరుగా పెట్టుకున్నారు. తమ భాషకు అక్షరాలున్నట్లు కూడా వీరికి తెలీదు. అంతేకాదు... తమలా మాట్లాడేవారు.. తామున్న చోటికి సుదూరంలో ఎనిమిది కోట్ల పైచిలుకు ప్రజలున్నారనీ సంగతీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో.. అనుకోకుండా అదే భాష మాట్లాడే ఆంధ్రుడు(న్యూస్‌టుడే ప్రతినిధి).. ఆ జాతి గురించి తెలిసి.. వారి దగ్గరకెళ్లి పలుకరిస్తే!! వాళ్లెలా స్పందించారంటే... ''ఇప్పుడు నీతో మేం మాట్లాడే నిమిషమే.. మాకు స్వర్గాన ఉన్నట్లుంది. ఆ సంతోషమే వేరు. మాతో మాట్లాడేదానికి ఇంద(ఇంత) దూరం వచ్చి.. మా ఆడోళ్లతో కింద కూర్చొని మరీ ఆడి(అక్కడి) కబుర్లు చెప్పావే... అదే మా పెద్ద సంతోసం. మీరే మాక్కావాలి. మేం ఆడికి(అక్కడికి... అంటే ఆంధ్రకు) వస్తామంటే అక్కడోళ్లు మమ్మల్ని రానిస్తారా? మీతో కలిసి ఉంటాం. మమ్మల్ని కలుపుకుంటారా?''


వీడని మమకారం

భావోద్వేగాలకు సరికొత్త అర్థం, వందల ఏళ్లు గడిచినా తల్లిగడ్డపై తెగని మమకారం వీళ్లలో కనిపిస్తాయి. తమ భాషలోనే మాట్లాడే వాళ్లు కోట్లాది మంది ఒక చోట ఉన్నారనగానే వారిలో ఏదో తెలీని పరవశం. మాతృజాతిపై అనురాగం.. అనురక్తి.. ఇసుమంతైనా తగ్గకపోవడమే కాదు.. 'మీ దగ్గరకు మేం వచ్చేస్తాం. మరి మీ మాటేంటి? మీ కోసం ఎదురుచూస్తుంటాం?' అంటూ ఆప్యాయతను చాటుకుంటారు.

పాములు, కోతులు ఆడిస్తూ...

శ్రీలంక జనజీవనంలో కలిసిపోయినప్పటికీ... వందల ఏళ్లుగా వీరు తెలుగే మాట్లాడతారన్న సమాచారాన్ని తెలుసుకున్న న్యూస్‌టుడే ప్రతినిధి వారిని కలిసేందుకు శ్రీలంకకు వచ్చారు. కొంత కష్టమ్మీదైనా వారిని కలువగలిగారు. వారి జీవనాన్ని పరిశీలిస్తే.. ఎన్నో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సంచార జీవనం గడిపే ఈ గిరిజనుల గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువే. పాములు, కోతులు ఆడిస్తూ, జోతిష్యం చెప్పే వీరు శ్రీలంకలో విలక్షణంగా కనిపిస్తారు. నిరుపేదలైన వీరు వారం రోజులకు మించి ఎక్కడా స్థిరంగా ఉండరు.


అక్కడక్కడ విసిరేసినట్లు..

ప్రస్తుతం శ్రీలంకలో సుమారు 410 తెలుగు జిప్సీ కుటుంబాలున్నాయి. ఉత్తర మధ్య రాష్ట్రంలోని అనురాధపురం జిల్లాలోని తముత్తేగమ, వాయువ్య రాష్ట్రంలోని పుత్తళం ప్రాంతాల్లో దాదాపు 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. శ్రీలంక రాజధాని కొలంబో తదితర చోట్ల కూడా అక్కడక్కడా కనిపిస్తారు. పాముల్ని ఆడిస్తూ శ్రీలంక రోడ్లపై కనిపించారంటే వారు వీరే. ఎక్కువగా దేవాలయాల వద్ద అహుకుంటికలు కనిపిస్తారు. వందల ఏళ్లుగా సంచార జీవనాన్ని గడిపిప్పటికీ.. పది, పదిహేనేళ్లగా స్థిరనివాసం వైపు మొగ్గుచూపుతూ, జీవన విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయం, వ్యాపారం, చేపలు పట్టడంలాంటి వృత్తుల్ని చేపట్టి వాటిల్లోనూ రాణిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వీరు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని శ్రీలంక అధికారులు తెలిపారు. 'సగటు గ్రామీణ సింహాళీ కన్నా అహుకుంటికలు చక్కగా జీవిస్తున్నారు' అని తముత్తేగమ బ్లాక్‌ మేనేజర్‌ ఎం.బి.దిశనాయక చెప్పారు. వీరు చెప్పే జ్యోతిష్యం అంటే శ్రీలంక సింహళీయులకు బాగా గురి. సంచార సమయాల్లోనూ ఎక్కువ మంది కలిసి ఉండటానికే ఇష్టపడతారు.

మాది తెలుంగ జాతి

కొలంబోకు 325 కిలోమీటర్ల దూరంలో ఉన్న తముత్తేగమలో 80కి పైగా తెలుగు జిప్సీ కుటుంబాలున్నాయి. 'మీ జాతి పేరేమిటి? అని ప్రశ్నించగా... 'మాది తెలుంగ జాతి' అని జిప్సీ నాయకుడు నటరాజ చెప్పారు. 'నువ్వు యాడ నుంచి వచ్చావ్‌. నీ భాష సక్కగా ఉంది? నీలా మాట్లాడేవాళ్లు ఎక్కడుంటారు? ఎంత మంది ఉంటారు?' అని అతను ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇళ్లల్లోని వారు పరుగున వచ్చి చుట్టుముడితే.. ఆడవాళ్లు సిగ్గుపడుతూ.. ఆసక్తిగా చూస్తుండిపోయారు. వీరు మాట్లాడే తెలుగులో అక్కడక్కడా సింహళీ మాటలు వినిపిస్తాయి. 'మనోళ్లు కలిసినప్పుడు.. ఇంట్లో తెలుంగు మాట్లాడతాం' అని ఆనంద్‌ అనే యువకుడు చెప్పుకొచ్చారు. వీరి పిల్లలకు పెట్టే పేర్లు చాలా వరకు తెలుగువే కనిపిస్తాయి. అక్కడక్కడా మాత్రం తమిళ పేర్లు ఉంటాయి. ఆచార వ్యవహారాలు దాదాపు తెలుగు వారిని పోలి ఉన్నా.. ఆరేళ్లు కిత్రం వీరిలో అధిక భాగం మతం మార్చుకోవడంతో వీరి సంప్రదాయాల్ని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నారు.

శ్రీలంక ఎందుకొచ్చారు?

వీరు ఆంధ్రదేశం నుంచి శ్రీలంకకు ఎందుకు వచ్చారన్నది పెద్ద ప్రశ్న. కొద్దిమంది సామాజిక శాస్త్రవేత్తలు ఈ తెగ శ్రీలంక రాకపై పరిశోధన చేసినా ప్రయోజనం లేకపోయింది. 'ఇప్పటికీ అహుకుంటికలు ఎప్పుడు.. ఎందుకు వచ్చారన్న దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. సుమారు 400 ఏళ్ల కిందట శ్రీలంకకు వచ్చి ఉండవచ్చు' అని యూనివర్సిటీ ఆఫ్‌ పేరాదెనియాకు చెందిన ప్రొఫెసర్‌ హెర్త్‌ చెప్పారు. ఈ జాతిపై తమిళనాడుకు చెందిన ఎం.డి.రాఘవన్‌ విస్తృతంగా పరిశోధనలు చేసినట్లు ఆయన తెలిపారు. బ్రిటీష్‌ కాలానికి ముందు వ్యవసాయం, చేపలు, గొర్రెల పెంచే వారిని శ్రీలంకకు తరలించారన్న కథనం కూడా ఉంది. 'అలా అయిన పక్షంలో పాములు ఆడించే వృత్తి ఎందుకు వచ్చింది?' అన్న ప్రశ్నకు ఆయన సరైన సమాధానం చెప్పలేకపోతారు.

సేతు దాటారా?
తెలుంగు జాతికి చెందిన నటరాజ్‌ మాత్రం తమ పూర్వీకుల రాకపై మరో కథనాన్ని వినిపించారు. తాను చెప్పే విషయాలన్నీ తన ముత్తాత చెప్పారంటూ... 'మా పూర్వీకులు గొర్రెల వ్యాపారం చేసేవారట. అలా సముద్రం దాటుకుంటూ ఇక్కడికి వచ్చారు. వాటిని అమ్మాక అనుకోకుండా ఏర్పడిన ప్రకృతి విపత్తుతో వాళ్లు చిక్కుకుపోయారు. మళ్లీ సముద్రం గుండా తిరిగి వెళ్లలేకపోయారు' అని తెలిపాడు. రామసేతు మీదుగా వచ్చారా? అని అడిగితే... అదేంటి? అని అతను ఎదురు ప్రశ్నవేశాడు.

ఆంధ్రలో ఎక్కడివారు?

వీరు ఆంధ్రప్రాంతంలో ఏ తెగకు చెందిన వారన్న దానిపై కూడా పరిశోధనలు జరిగాయి. అహుకుంటికలుగా పేర్కొనే వారిలో ముఖ్యంగా కురవ, వడ్డెర, ఎరుకల తెగకు చెందిన వారున్నారనిశ్రీలంకలోని సామాజిక శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ తెగలోని కొందరు తాము 'కురవ, వడ్డెర' అని చెబుతారు. ఆసక్తికర అంశమేమంటే.. ఈ రెండు వర్గాలు కలిసిఉండరు సరికదా... వీరుండే ప్రాంతాలు సైతం వేర్వేరుగా ఉంటాయి. విజయనగరం.. శ్రీకాకుళం ప్రాంతాల్లోని ప్రజల యాసకు దగ్గరగా వీరి భాష ఉంటుంది.

మేం రావచ్చా?
పుత్తళంలోని కొద్దిమంది మాత్రం- 'సముద్రం అవతల మనలాంటోళ్లే ఉన్నారు' అని తమ పెద్దవాళ్లు చెప్పేవారన్నారు. వీరెవరికీ చదువుకోకపోవడంతో బాహ్యప్రపంచానికి సంబంధించిన అంశాలపై పెద్దగా అవగాహన లేదు. 'అక్కడి వాళ్లు అంగీకరిస్తే మేమందరం అక్కడికి వచ్చేస్తాం' అని వారు ఆశగా కోరారు. మీరు పుట్టిన ఊరు ఇదేగా అని ప్రశ్నిస్తే... 'అది మా అమ్మ ఊరు కదా' అని బదులిచ్చారు. తమ పిల్లలు సింహళి నేర్చుకుంటున్నా... తెలుగు మాట్లాడటానికే ఇష్టపడతామని తల్లిదండ్రులు చెప్పారు. పై చదువులు చదివినా తెలుగును మాత్రం వదిలేది లేదని పిల్లలు చెప్పారు. ''అమ్మ భాషను వదిలేస్తే చెడు జరుగుతుంది'' అని అన్నారు. తెలుంగుల ఆనందం... ఉద్వేగాన్ని స్వయంగా చూసిన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి స్పందిస్తూ... ''దయచేసి మా వారిని మా నుంచి దూరం చేయరుగా'' అని ప్రశ్నించడం వింతగొలిపింది. ఆయనకు సహాయకురాలిగా పనిచేసే... అరవై రెండేళ్ల సరత్‌సీలీ అనే సింహళీ మహిళ... ''అహుకుంటికలు మా దేశ సంస్కృతిలో ఓ భాగం. మేం వాళ్లను విడిచి ఉండటానికి ఏ మాత్రం సిద్ధంగా లేం. అందుకు సమ్మతించం కూడా'' అంటూ ఉద్వేగంగా వ్యాఖ్యానించడం విశేషం.

కబడ్డీ బాగా ఆడతారు

తముత్తేగమలో అహుకుంటికల పిల్లల కోసం ప్రభుత్వం ఓ పాఠశాలను ఏర్పాటుచేసింది. ఆ స్కూల్‌కి కోచ్‌ లేరు. కానీ 2005లో దేశవ్యాప్తంగా జరిగిన అండర్‌ 16 స్కూల్‌ స్థాయి కబడ్డీ పోటీలో రన్నర్స్‌గా నిలిచారు. ప్రత్యేకత ఏమంటే... పోటీలకు ముందు ఈ జట్టులోని క్రీడాకారిణులు ఎవరూ పట్టుమని నాలుగు రోజులు కూడా సాధన చేయలేదు. ఎలాంటి సౌకర్యాలు లేకుండానే... దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న పాఠశాల అయిన తక్షశిలపై ఫైనల్స్‌లో ఆడారు.

మాటలన్నీ మనవే

ఇప్పటికీ మన గ్రామీణ ప్రాంతంల్లో వాడే చాలా మాటల్ని వీరు వాడుతుంటారు. కూడు, ఆడది...మొగుడు, అబ్బ, సారం, బొత్తాం, పురచేయి, మాను, టెంకాయ, అంగడి, తల్లితాయి, మెంచులు, ఎంటికతాళ్లు, రిబ్బన్‌, రోజా, ముక్కర, కాలిగొలుసు, పోయేసిరా(వెళ్లిరా) మొదలైన మాటల్ని వాడుతున్నారు..

అంతరించిపోతున్నారు!
చదువుకోవటం, మతం మారటం, సింహళీయుల్ని పెళ్లాడటంలాంటి కారణాల వల్ల రానున్న కొన్నేళ్లలో అహుకుంటికల జాతి అదృశ్యం అయ్యే అవకాశం ఉందని ఓ సామాజిక శాస్త్రవేత్త విశ్లేషించారు. ''అరుదైన ఓ జాతి అంతరించిపోవడానికి దాదాపు రంగం సిద్ధమైనట్లే. మారిన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, చదువు సంధ్యల అలవాట్లతో రాబోయే పాతికేళ్లలో ఈ జాతి ఉనికి పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుంది. గతంలో కొన్ని జాతుల విషయంలోనూ ఇలాగే జరిగింది'' అని ఆయన ముక్తాయించారు.
(Eenadu, 10:12:2007)
_______________________________

Labels:

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

* ప్రేమను 'రీఛార్జి' చేయించుకోవాలంటే?
'సెల్స్‌' (కణాలు) బాగుండాలి.
______________________
* వ్యాపార లావాదేవీల్లో 'లావా' రాకుండా ఏం చేయాలి?
'అంటుకు'పోయే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి.
______________________
* సినిమా టిక్కెట్ల వెనక ప్రకటనలు వేస్తే...?
'ఐడియా' కూడా అసూయపడేట్టు ఉంది. 'టిక్కెట్స్‌ చించుకుంటే కాల్స్‌ మీద పడేటట్టు.'
_________________________
* అసైన్డ్‌ భూమికి, సొంత భూమికి తేడా ఏమిటి?
అసైన్డ్‌ భూమి అంటే కొన్న భూమి. సొంత భూమి అంటే ఆక్రమించుకున్న భూమి!
____________________________
* తంతే బూరెల బుట్టలో పడ్డాడంటారు. ఎవరు తంతే అలా జరుగుతుంది సార్‌?
నేను తన్నితేనే కదా...
____________________________
* మీ టోపీ ఎవరైనా కొట్టేస్తే ఏంచేస్తారు?
అంత కంటే భాగ్యమా! ఒకళ్లకైనా 'టోపీ' పెట్టానని ఆనందపడతాను.
___________________________
* నన్నందరూ తిడుతున్నారెందుకు?
అంటే మీరు అంత పెద్ద స్థాయికి ఎదిగిపోయారన్న మాట.
____________________________
* కార్పొరేషన్‌కు, కార్పొరేట్‌కు తేడా ఏమిటి?
ప'రేషాన్‌' చేసేది కార్పొరేషన్‌. 'రేటు' పలికేది కార్పొరేట్‌.
_____________________________
(ఏఎనదు, 09:12:2007)
______________________________

Labels:

మనదేశం

ఎవరి దేశమంటే వారికి ఎంతో ఇష్టం, అది సహజం. దేశాభిమానం దోషం కాదు. ఇతర దేశాలపట్ల, ఆ ప్రజల పట్ల చులకన భావం ఏర్పడినా, తన దేశంపట్ల అభిమానం మితిమీరి దురభిమానంగా మారినా- ఎదుటివారికి వెగటు పుడుతుంది. వెనకటికోసారి ఇలాగే ఒక ఇంగ్లిషాయన ''బ్రిటిష్‌ మహాసామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించడు తెలుసా'' అంటూ అదే పనిగా గొప్పలు చెబుతున్నాడు. తాపీ ధర్మారావు ఆ పెద్దమనిషిని ఆపి ''సూర్యుడు మీ దేశంలో ఎందుకు అస్తమించడో తెలుసా?'' అని అడిగారు. ఆయన తెల్లబోయాడు. అప్పుడు ధర్మారావే తాపీగా చెప్పారు-''చీకట్లో వదిలేస్తే మీరు నమ్మదగినవారు కాదు... చీకటిపడితే మీ ప్రవర్తన సరయినది కాదని సూర్యుడికి బాగా తెలుసు. అందుకే ఇక్కడ ఆయన అస్తమించడానికి జంకుతాడు''! ''దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టిమాటలు కట్టిపెట్టోయ్‌. గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌''- అని గురజాడ ప్రబోధించడంలో ఉద్దేశమదే అనిపిస్తుంది. కేవలం మాటల్ని కోటలు దాటించడం కాదు, మేలు చేసే పని ఏదైనా తలపెట్టడమే దేశభక్తికి చిహ్నమని మహాకవి భావంగా తోస్తుంది. ''అత్యున్నతమైన ఆశయాలు, ఉదాత్తమైన లక్ష్యాలు, ఉత్తమమైన భావాలు కలిగిన ఒక వ్యక్తి కోరుకునేవన్నీ భారతదేశంలో ఉన్నాయి కనుక నాదేశం నాకు చాలా ఇష్టమైన దేశం'' అన్నారు మహాత్మాగాంధీ. ఈ తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నారు కనుక రాయప్రోలు ''విపుల తత్వము విస్తరించిన విమల తలమిది'' అంటూ మనదేశాన్ని కొనియాడారు. కృష్ణశాస్త్రి వంటి భావకవి కలంలో 'జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి'గా ఆవిష్కృతమైన ఈ పవిత్రదేశం, ఆంధ్రపురాణ కర్త మధునాపంతులకు 'మంగళక్షితి'గా దర్శనమిచ్చింది. ''ఇతర క్షోణిని లక్షలిచ్చినను గానీ పుట్టను... ఈ భారత క్షితిపై వేద పురాణ శాస్త్ర కృతి రాశి స్థానమీ మంగళక్షితిపై...'' పునర్జన్మ కావాలనుకోవడాన్ని 'దివ్యజ్జీవ సంస్కారం'గా భావన చేశారాయన.

కళాకారుల అభిప్రాయమూ అంతటిదే. మన మంగళ వాయిద్యం సన్నాయి మాదిరిగా ఉత్తరాదిలో భజంత్రీలకు పెళ్ళి పందిళ్ళకూ పరిమితమైన షెహనాయికి అంతర్జాతీయ సాంస్కృతిక వేదికలపై కనకాభిషేకాలు జరిపించిన రససిద్ధుడు ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌. అమెరికాలో స్థిరపడవలసిందిగానూ, ఈ 'పూర్‌ ఇండియా'లో లేని సకల సదుపాయాలను అందుకోవలసిందిగానూ ఆయనను ఆహ్వానిస్తే- ''నన్ను తీసుకెళతారు సరే, ఈ గంగామాయిని అమెరికా ఎలా రప్పించగలరు?'' అని అడిగారాయన. భిస్మిల్లాఖాన్‌కు వారణాసి అన్నా గంగానది అన్నా ప్రాణసమానం. 'ఇస్‌ దేశ్‌మే గంగా బెహతీహై'! అదొక్కటిచాలు- ప్రపంచదేశాల మధ్య భారతదేశం సగర్వంగా తలెగరేయడానికనేది ఖాన్‌ దృఢాభిప్రాయం. సరిగ్గా అలాగే ప్రకటించాడు జర్మనీ మేధావి మేక్స్‌ ముల్లర్‌ కూడా. 'పునర్జన్మంటూ ఉండి ప్రభువును ఏమని ప్రార్థిస్తావ'ని అడిగితే 'గంగానదీ తీరాన పుట్టించమంటా'నని స్పష్టంగా చెప్పాడాయన. ఆ మధ్య ఒక సర్వే నిర్వహిస్తే విదేశాల్లో స్థిరపడిన ఆధునిక యువతరంలో తొంభైశాతం తమ వృద్ధాప్య జీవితాన్ని మనదేశంలోనే గడపాలని ఉందని, మళ్ళీ ఈ దేశంలోనే పుట్టాలని ఉందని తమ నిశ్చితాభిప్రాయంగా ప్రకటించారు.

కవులు, కళాకారులు, ప్రాచీనులు, ఆధునికులు, భారతీయులు, పాశ్చాత్యులు, హిందువులు, ముస్లిములు, జానపదులు... అందరిదీ ఇదే ధోరణి! ఈ సాహిత్యం, ఈ జీవజలాలూ, ఈ గాలీ, ఈ నేలా... ఏమిటిదంతా? ఒకేరకమైన ఈ భావ పరంపర ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నది? మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఈ గాలి నుంచి ఈ మట్టి నుంచి ఈ జలాల నుంచి ఏ దివ్య భావనల్ని మన శరీరాల్లోని జీవాణువులు గాఢంగా పీల్చుకుంటున్నాయి? అమోఘమైన ఏ పవిత్ర చైతన్యపు సూక్ష్మాతి సూక్ష్మమైన అణురజం మన రక్తంలోకి ఇంకిపోతోంది? మహర్షులు, మహాపురుషుల ఉనికిలోని ఏ వైశిష్ట్యం మనదేశానికి ప్రపంచ దేశాలన్నింటా ఒక ప్రత్యేకతను, పూజార్హతను ఆపాదిస్తున్నది? మహర్షుల కవిత్వాల్లో ఒదిగిన, మహానుభావులు తమ తమ కళాస్వరూపాల్లో పొదిగిన మహోదాత్త జీవ సంస్కారాలను, ఆశయాలను, లక్ష్యాలను, భావాలను వేటిని ఆకళించుకున్నాక- మహాత్ముడు ఈ దేశంపట్ల పరమప్రీతిని పెంపొందించుకుని 'నేను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను' అని ప్రకటించాడు? ఈ దేశాన్ని ప్రేమించడమంటే దాని జీవలక్షణాన్ని గురించి తెలుసుకోవాలన్న తపన పెంచుకోవడమే. ప్రజల అభిరుచులు, ఆచార వ్యవహారాలు, అన్న పానీయాలు, వస్త్రాభరణాలు, కళాసంగీత సాహిత్య విజ్ఞాన విశేషాలు, భాషలు, జీవితంపట్ల ప్రజల విశిష్ట దృక్పథం... ప్రజల మనుగడలోంచి తొంగిచూసే ఎన్నో అంశాలను కలిపి పోగేస్తే అది ఆ దేశ సాంస్కృతిక స్వరూపం. ఒక జాతి నాగరికతను, ఔన్నత్యాన్ని అంచనా వేయాలంటే ఆ దేశంలో విలసిల్లిన సాంస్కృతిక వైభవాన్ని క్షుణ్నంగా అర్థంచేసుకోవాలి. అది ఉన్నతమైన స్థితిలో ఉంటే- ఆ జాతిని ఆ సంఘాన్ని మనం నాగరికంగా అభివృద్ధి చెందిన జాతిగా సంఘంగా కీర్తించాలే తప్ప వాటి జనాభా లెక్కల్ని బట్టికాదు. 'నాగరికత అనే పదార్థానికి రూపాన్నిచ్చేది సంస్కృతి' అని అరిస్టాటిల్‌ నిర్వచించడంలోని ఆంతర్యం అదే. ఆ రకమైన సమగ్ర స్వరూపాన్ని దర్శించాడు కాబట్టే మేక్స్‌ ముల్లర్‌- ''సమస్త విద్యలకు సర్వశాస్త్రాలకు సకల కళలకు స్థావరం భారతదేశం. ప్రపంచ దేశాలకు నాగరికతను భిక్షగా పెట్టిన దేశమది'' అని విస్పష్టంగా ప్రకటించాడు. అంతటి గొప్ప దేశం భారతదేశం! మనమంతా ఆ దేశం వారసులం!
(Eenadu, 09:12:2007)
______________________________________

Labels: